డైలీ సీరియల్

పరమాత్మ తలంపు.. ప్రాణి ఆశ ( గజేంద్రమోక్షం - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు తల్చుకుంటే వానపాముకూడా త్రాచువలె బలమైన సర్పంగామారుతుంది. ఆ భగవంతుడిచ్చిన బలాన్ని తన శక్తియుక్తులతో తెచ్చుకున్నదని విర్రవీగితే ఏవౌతుంది? కొన్నాళ్లకు ఆ భగవంతుడే నీ శక్తి ఏపాటిదో చూద్దాం అని మిన్నకుంటాడు. అంతే అపుడు నాగజాతిలో ఆదిశేషుయైనా పడగ కాదుకదా తోకను కూడా ఎత్తలేడు. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదను సామెత పుట్టింది.
ఒకానొక సమయంలో త్రికూట పర్వతం దివ్యధాతువులతో సమృద్ధిగా ఉండేది. ఆ త్రికూట పర్వతానికి పేరుకు తగ్గట్టుగానే మూడు శిఖరాలుండేవి. ఆ శిఖర ఛాయల్లో కినె్నరులు నివసించేవారు. గంధర్వులు సైతం వచ్చి ఆ త్రికూటపర్వత సౌందర్యాన్ని వీక్షిస్తుండేవారు.
ఆ త్రికూట పర్వతం పైన మాదీఫలం, లవంగం,మామిడి, మొగలి, జీడి, పనస, రేగు, పొగడ, మఱ్ఱి, కొండమల్లె, ఎఱ్ఱగోరింట, కోవిదారం, తుమ్మ, ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, ఇప్ప, తాడి, తక్కోలం, తమాలం, రసాలం, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గనే్నరు,. వెలగ, ఉమ్మెత్త, కల జువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువకం, మంచి మల్లె ఇట్లా పూలచెట్లు, పండ్ల చెట్లు ఆకులే మానులుగా ఎదిగిన చెట్లు , చిరుమొక్కలు, పైకి ఎగబాకే తీగలు ఇలా అడవి అంతా అల్లుకుపోయి పచ్చదనంతో నిండిపోయిందా ఈ శిఖరం అన్నట్టుండేది. ఈ పూల మకరందాన్ని త్రాగడానికి తుమ్మెదలు ఝంమ్మని రాగం తీస్తూ గుమికూడి ఉండేవి. ఇక్కడ ఉండే సరస్సుల్లో చల్లని నీటికి మైమరిచి హంసలు, కారండవ పక్షులు, చక్రవాకాలు, శకుంత పక్షులూ, కొంగలు, కొక్కెరలూ తిరుగుతూ ఉండేవి.
అందుకే ఈ పర్వతం నిండా ఎప్పుడూ చారణులూ, గరుడులూ,దేవతలు, కింపురుషులూ కూడా జంటజంటలుగా వచ్చి క్రీడిస్తూ ఉండేవారు. ఈ కొండల్లో సౌకర్యాల వల్ల మదపుటేనుగులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులూ, ముండ్ల పందులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, తోడేళ్లు వీటితోపాటు కోతులు, కుందేళ్లు, చిన్ని చిన్ని జంతువులు, పెద్ద పెద్ద పాములు సైతం ఇక్కడ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవి.
ఇక్కడి ఏనుగులు దిగ్గజాలను పోలి ఉండేవి. అడవి సంపదను తమ జీవనోపాధిగా మలుచుకుని ఇక్కడ చెంచులు, చెంచతలూ తిరిగేవారు.
సాయంసంధ్యాసమయంలో ఏనుగుల గుం పులు సరస్సుల దగ్గరకు వస్తుంటే దూరం నుంచి అవి కారుమేఘాలు కిందికి దిగి వచ్చేయోమన్న సంశయాన్ని కలిగిస్తుండేవి ఇక్కడ ఏనుగులు. ఇక్కడ ఉన్న మడుగుల్లో, సరస్సుల్లో తటాకాల్లో ఉన్న నీరు వాటిలో ఉన్న జలచరాలు కూడా చాలా బలిష్ఠంగా ఉండేవి. ఏనుగులు, సింహాలు రెండూ పౌరుషంలో పోటిపడేవి ఇక్కడ.
అట్లాంటి ఆ త్రికూట పర్వతశిఖరాల్లో ఒక ఏనుగుల గుంపు ఉండేది. ఆ ఏనుగుల గుంపు అడవిలో తిరుగుతూ ఘీంకారాలు చేస్తుంటే ఎలుగుబంట్లు బొరియల్లో దాక్కునే్నవి. సింహాలు గుహల్లో దూరిపోయేవి. ఇక జింకలు, కుందేళ్లు లాంటి చిన్న చిన్న జంతువులు కంటికి కనిపించకుండా వేగంగా పారిపోయేవి. అడవి దున్నలు సైతం మడుగుల్లో దూరి నిక్కి నిక్కి చూస్తుండేవి. నెమళ్లు క్రేంకారాలను మాని ఆకసానికి ఎగిరి వెళ్లడానికే ఉత్సాహం చూపేవి.
ఆ ఏనుగుల గుంపుతోపాటు గున్న ఏనుగులు కూడా నిర్భయంగా తిరుగుతూ ఉండేవి. ఆ గున్నలు పచ్చిక బయళ్లను వాసన చూస్తూ , పండిన పండ్లు చెట్లనుండి రాలుస్తూ వడివడిగా నాలుగుమూలలా పరుగెత్తుతూ తిరుగుతుండేవి.
ఒకసారి
ఆ ఏనుగుల గుంపులోని గజరాజు విధిరాత వల్ల గుంపు నుంచి తప్పిపోయాడు. ఆ గజరాజు కున్న ఆడ ఏనుగులు కూడా ఆ గజరాజు వెంట నడిచాయి. పెద్ద గుంపునుంచి విడిపోయిన గజరాజు తన ప్రియురాండ్రు తనతోనే ఉన్నారన్న ఉత్సాహంతో దారి వెతుకుతూ మథ్య మధ్యన లే చివుళ్లను, వెలగపండ్లను తన భార్యలకిస్తూ , తాను తింటూ రోజం తా తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ గజరాజుకు విపరీతమైన దాహం వేసింది. ఆడ ఏనుగులు కూడా అలసటతో దప్పిక గొన్నాయి. అన్నీ కలసి ఎక్కడైనా సరోవరం కానీ, మడుగు కానీ ఉందేమో దాహం తీర్చుకోవడానికి అని నలువైపులా వెతుకుతున్నాయి. వాటికి దూరంగా ఓ మడుగు నిండు జలాలతో ఉన్నట్లు కనిపించింది.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804