డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వం నవ్వి, ‘‘సేట్‌గారూ! పులి కడుపున చలిచీమ పుట్టదు. మీ కొడుకు మీలాగే ప్రయోజకుడవుతాడే కాని జులాయిగా ఎందుకు తిరుగుతాడు?’’ అన్నాడు.
‘‘అది కాదయ్యా! వాడు తిరుగక పోయినా వాతావరణం అలా చేస్తుంది. నేను రాణా ప్రతాప్ వంశానికి చెందినవాడిని. కాని ఇవ్వాళ నాలో క్షత్రియధర్మం లేదు. మా మార్వాడీలంతా వడ్డీ వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నారు. దేశ కాల పరిస్థితులు మారాయి. వీడికి క్రికెట్ పిచ్చి. బెట్టింగులు పెడతాడు. సినిమా షూటింగులకు చెన్నై, బొంబాయి వెళ్తాడు. ఇవి కూడు పెడతాయా? గుడ్డనిస్తాయా? ఈ వ్యామోహాల నుండి వీడు బయటపడేమార్గం చూడాలి’’
‘‘సేట్ గారూ! నేను చిరుద్యోగిని. మీ కుమారునిపై ఆజమాయిషీ చేసే ధైర్యం నాకు లేదు. ఇక మీరు రాణా ప్రతాప్ వంశంలో జన్మించాము అని చెప్పటం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఐతే మా మహారాష్టల్రో పరిస్థితి కూడా ఇంతకన్నా మెరుగ్గా లేదు. అక్కడ లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేల వారసులు ఎవరూ లేరు. అంతా క్రికెట్, సినిమా రంగాలకు వెళ్ళిపోయారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారు. వెనుకటి వినాయక దామోదర్ సావర్కర్ లాంటి వీరులు ఇవ్వాళ మహారాష్టల్రో మాత్రం ఎవరున్నారు?’’
దీపక్‌చంద్ తల ఊపి, ‘‘చేవెళ్ళ దగ్గర ఒక ఫాంహవుస్ తీసుకుంటున్నాము. దానికి ఈ పార్థును యజమానిగా చేద్దాము. అక్కడ మామిడి తోట, ఉద్యానపంటలు అభివృద్ధి చేసే బాధ్యత అప్పగిద్దాము. నీవెలాగైనా వాడిని సక్రమ మార్గంలో పెట్టాలి’’ అన్నాడు.
విశ్వం ‘‘అలాగే! మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను. కాని నా మేథోశక్తి పరిమితమైనది. తలకు మించిన బాధ్యతలు నిర్వహించలేదు. ఏదో గోడౌన్‌లో లెక్కలు వ్రాసే పాండిత్యం మాత్రమే ఉంది’’
‘‘అది సరేనయ్యా! ఎవ్వడూ సర్వజ్ఞుడుగా పుట్టడు. పరిస్థితుల ప్రభావంలో మనిషి ఎదుగుతాడు. నీ వెంట వీడిని రోజూ హనుమాన్ దేవాలయానికి తీసుకొనిపో. అక్కడ చాలీసా పారాయణం చేయించు. బడేచావుడిలో హనుమాన్ వ్యాయాయశాల ఉంది. అందులో ఇతడికి వ్యాయామం నేర్పించు. లేకంటే నాలాగే పొట్ట పెంచుకొని రసగుల్లాలు, కళాఖండ్‌లు తింటూ కూర్చుంటాడు’’
విశ్వనాథ్ గోడ్బోలే నవ్వాడు.
ఆ తర్వాత న్యూఢిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నైలకు ట్రాన్స్‌పోర్ట్ చేసిన సరుకుల వివరాలు వచ్చిన ఆదాయం లెక్కలు చూపించాడు.
దీపక్‌చంద్ ఇలా అన్నాడు.
‘‘బాగుంది. డబ్బును ఏరోజుకారోజు బేగంబజార్‌లో బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో జమచేస్తూ ఉండు. లెక్కల దగ్గర తేడా రాకూడదు. నేను చిన్నప్పటి నుండి మహాత్మా గాంధీ, స్వామి దయానంద సరస్వతుల ప్రభావంతో ఉద్యోగంలో ఎదిగి వచ్చాను. అన్ని పవిత్రతల కన్నా ఆర్థిక పవిత్రత ముఖ్యమైనది. విశ్వనాథ్ గోడ్బోలే నిశ్శబ్ద్దంగా వింటున్నాడు.
‘‘ఇవ్వాళ భావావేశంలో నీతులు చెపుతూ గోతులు తీసే వారు ఎక్కువైనారు. ఖద్దరు వేసుకొని గద్దరు పనులు చేస్తున్నారు. ఇవ్వాల్టి ఆర్యసమాజం స్వామి దయానంద సరస్వతినాటి ఆర్య సమాజం కాదు. సంస్థాగతంగా ఈ వ్యవస్థ చాలా బలహీనమైంది. వెనుకటి ఉత్సాహం లేదు. వేద భక్తి లేదు. గోపూజ లేదు. ఆ* గోపూజ అంటే గుర్తుకు వచ్చింది. ఘోష్‌మండిలో గోశాలకు విరాళాలు వెళ్తున్నాయా?’’
‘‘వెళ్తున్నాయండీ! మొన్ననే ఘనశ్యాందాస్ వచ్చి డబ్బు తీసుకొనిపోయాడు’’
‘‘విశ్వం! ఎవరికీ కాష్ ఇవ్వవద్దు. చెక్కులే ఇస్తూ ఉండదు. దీని వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి ఇన్‌కంట్యాక్స్ వారి నుండి మనం వేలెత్తి చూపించు కోకూడదు. రెండవది డబ్బు పాపిష్టిది. కాష్ విరాళంగా ఇస్తే తీసుకున్నవాడు స్వంత ఖర్చులకు వాడుకోవచ్చు. ఎకౌంట్‌లోకి పోతే వాడు జవాబుదారీగా ఉంటాడు’’
విశ్వనాథ్ గోడ్బోలే ఇలా అన్నాడు -
‘‘నేనొక ఇనుపముక్క లాంటి వాణ్ణి. మీరు అయస్కాంతం లాంటివారు. మీ పాదస్పర్శతో నేను మనిషిగా మారుతున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను’’
‘‘పొగడ్తలు అగడ్తలు దాటవద్దులే. నీవు నమ్మకస్థుడవని తెలిసే నీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను. పార్థు సంగతి చూడు.’’
‘‘అలాగే కర్తార్ సింగ్‌కు బస్తాకు హమాలీ పావలా పెంచాలని అడుగుతున్నాడు’’
‘‘శ్రమ జీవులు, పెంచితే తప్పు లేదు. లేకుంటే వీళ్ళంతా ట్రేడ్ యూనియన్‌గా మారి మొదటికే మోసం తెస్తారు. లేబర్ పాలసీ అని ఒకటి ఉంది. శ్రమజీవులను మనం దోచుకోకూడదు. అట్లని వాళ్ళను పెట్రేగి పోనివ్వకూడదు. ప్రస్తుతానికి పదిపైసలు పెంచుదాం’’
‘‘సరే’’ అన్నాడు గోడ్బోలే.
*****
పార్థు వచ్చి విశ్వనాథ్ గోడ్బోలేను కలిశాడు.
‘‘కూర్చోండి చిన్నసేటు గారు’’ అంటూ గోడ్బోలే యజమానిని ఆహ్వానించాడు.
‘‘కూర్చునే సమయం లేదు. లాల్ బహదూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది. త్వరగా వెళ్ళాలి. ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి’’
‘‘కూర్చోండి సేట్‌గారూ’’ అన్నాడు విశ్వనాథ్ మళ్ళీ.
పార్థు కూర్చున్నాడు.
‘‘సేట్‌గారూ! అంత డబ్బు ఏం చేస్తారు?’’
‘‘నెత్తికేసి రుద్దుకుంటాను. డబ్బును ఏం చేస్తారయ్యా? ఖర్చు పెట్టుకుంటారు’’
‘‘నిజమే కాని నాన్నగారు కోప్పడతారు’’
‘‘ఇదుగో గోడ్బోలే! నాకు గడ్డివాము దగ్గర కుక్కలాంటి మనుషులంటే అసహ్యం. ఈ డబ్బుంది చూచావ్! ఇది అనుభవించడం కోసం. అంతేకాని బ్యాంకుల్లో దాచి పెట్టడం కోసం కాదు.’’
గోడ్బోలే ప్రశాంతంగా ఇలా అన్నాడు-

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి