డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే..5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సేటూ! చీకటి పడుతున్నది. త్వరగా సిటీ చేరుదాం. ఈ సంగతులన్నీ నాన్నగారికి చెప్పుదాం. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేద్దాం’’
‘‘గోడ్బోలే! తోట అగ్గువ (తక్కువ) ధరకు వస్తుందని అనుకున్నాము కాని దాని వెనుక ఏదో కథ ఉందని ఇప్పుడు తెలిసింది’’
బండి మరికొంచెం ముందుకు వెళ్లింది.
‘‘గోడ్బోలే! బండిని వెనుకకు తిప్పు. ఈ రాత్రి మనం ఇక్కడే ఉందాం’’ అన్నాడు పార్థు.
‘‘నాన్నగారు ఏమంటారో?’’
‘‘అది నేను చూసుకుంటాను’’
‘‘కాని మనకు పర్మిషన్ లేదు కదా!’’
‘‘పిచ్చి గోడ్బోలే! నీవు పిరికివాడివి. నేను బాలీవుడ్ హీరో లాంటివాడిని. సాహసమే నా ఊపిరి. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు. పద! దయ్యాల దిబ్బ దగ్గరికి పోదాం’’ అన్నాడు పార్థు.
గోడ్బోలే ఏమీ మాట్లాడకుండా బండిని వెనుకకు తిప్పి తాము కొనదలచిన వ్యవసాయ క్షేత్రం సమీపానికి వెళ్ళారు. అప్పటికే చీకటి పడింది.
‘‘గోడ్బోలే! బండిని ఇక్కడే ఆపుదాం’’
‘‘సరే!’’
‘‘మనం బండిలో కూర్చుందాం. నిద్రపోవద్దు.
‘‘అలాగే! కావాలంటే నీవు వెనుక సీటులో నడుము వాల్చు. దయ్యం రాగానే నిన్ను పిలుస్తాను’’
‘‘ఏం జోక్ చేస్తున్నావా?’’
‘‘లేదు సేటుగారూ! నిజమే చెబుతున్నాను’’
‘‘గోడ్బోలే! నీవు పిరికివాడివి. బండిలో కూర్చో. నేను కాసేపు అయిన తర్వాత వాతావరణం పర్యవేక్షిస్తాను’’
‘‘ఒకవేళ దయ్యం వస్తే దానిని పట్టుకుంటారా? మన దగ్గర ఏమీ ఆయుధాలు లేవు కదా!’’
‘‘గోడ్బోలే! నీవు మాట్లాడకుండా కూర్చో. ఏమవుతుందో చూద్దాం’’
ఆ తర్వాత ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. క్రమంగా చీకటి ముంచుకొచ్చింది.
అటువైపు ఎటువంటి వెహికల్స్ రావటం లేదు.
కారులోనే ఉన్న నీళ్ళు తాగారు,
బ్రెడ్ తిన్నారు.
చీకట్లో అక్కడ కారు ఆగినట్లు కూడా ఎవరికీ తెలియడం లేదు.
పొద్దుపోతున్నకొద్దీ వారిద్దరూ మరీ నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. వారు పీలుస్తున్న శ్వాస వారికే వినబడుతున్నంత నిశ్శబ్దం.
చూస్తుండగానే మొదటి జాము దాటిపోయింది.
గగనసుందరి చుక్కల ముత్యాలహారం ధరించింది. అంతరిక్షం నీలిరంగు చీరె కట్టుకుంది. ఎక్కడో దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం.
‘‘దయ్యాలు వస్తేనే కుక్కలు మొరుగుతాయి’’ అన్నాడు గోడ్బోలే.
కీచురాళ్ళ ధ్వనులు.
ఎక్కడో పాము బుసకొడుతున్న భ్రాంతి.
చెట్ల ఆకులు కొరివి దయ్యాల్లా ఊగుతున్నాయి.
గోడ్బోలే భయంతో పార్థును పట్టుకున్నాడు.
ఎవరో కారు డోర్ తీసినట్లున్నారు.
కిర్‌ర్‌ర్‌ర్....
‘‘ఎవరో మన కారు డోర్ తీసినట్లున్నారు’’ అన్నాడు గోడ్బోలే.
‘‘ఎవరూ లేరు అంతా భ్రాంతి’’
‘‘అంతేనంటావా?’’
పార్థు కారు తలుపులు తాకి చూచాడు. అవి మూసే ఉన్నాయి. దూరంగా చెట్టుకొమ్మలు గలగలా కదిలాయి. అని పాము బుసకొట్టినట్లు ధ్వనించాయి.
‘‘పార్థూ!’’
ఔను చెట్టుకొమ్మలను కదలించింది ఎవరు? కోతులు కావచ్చు. కిచికిచకిచ - అవతల గుంటలో నుండి కప్పల బెకబెకలు.
అర్ధరాత్రి దాటింది.
‘‘గోడ్బోలే! కొరివి దయ్యాలు రాలేదే?’’
‘‘సేటూ! దయ్యాలు కళ్ళకు కన్పడవు. బహుశా వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి’’
‘‘అంతేనంటావా?’’
‘‘అంతే!’’
‘‘ఇప్పుడేం చేద్దాం?’’
‘‘మాట్లాడకుండా ఇంటికి పోదాం. నాకు హనుమాన్ చాలీసా బాగా వచ్చు. అందుకే భయపడి దయ్యాలు రాలేదు’’
***
గోడ్బోలే వచ్చి దీపక్‌చంద్‌ను కలిశాడు. జరిగినదంతా చెప్పాడు.
‘‘నిరీక్షణానంద స్వామివారి సెక్రటరీ ఆ ఫాంహవుస్ వద్దని సలహా ఇచ్చాడు’’ అని చెప్పాడు.
‘‘చాలా చౌకగా వస్తుంటే ఆశపడ్డాను. ఐనా గురువుగారి ఆఫీసు వారు అలా చెపుతుంటే ఏం చేయాలి?’’
‘‘పెద్ద సేటూ! నిజంగా అది యోగ్యమైన స్థలమే అయి ఉంటే అంత తక్కువ ధరకు అమ్మడానికి ఎవరూ ప్రయత్నించరు కదా! కాబట్టి తప్పనిసరిగా అక్కడ దయ్యాలు ఉండే ఉంటాయి. ఆ చుట్టుపక్కల సమాధులు కూడా ఉన్నాయి. మరికొంత దూరంలో ఓ శ్మశానం కూడా ఉంది’’
‘‘గోడ్బోలే! ఇదంతా మానవ విజ్ఞానానికి అందని విషయం. ఆధునికయుగంలో ఇలాంటి నమ్మకా లను శాస్తవ్రేత్తలు పట్టించు కోరు. ఆ సమాధుల మీదనే ఇప్పుడు కొంతకాలం క్రితం హైదరాబాదులో ప్లేగు వచ్చి ఎందరో చనిపోయారు.
‘‘కావచ్చు కానీ పార్థు పెళ్ళికాని చిన్నపిల్లవాడు. అతనికి దయ్యాల భూమి యాజమాన్యం ఇస్తే ఇబ్బందులు రావచ్చు’’
‘‘దయ్యాలకు పెళ్లి అయినవారికంటే పెళ్లికాని వారంటే ఎక్కువ ఇష్టం అంటారు’’
గోడ్బోలే నవ్వాడు.
‘‘సరే! ఆ విషయం మళ్లీ ఆలోచిద్దాం’’
గోడ్బోలే లేచాడు.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్