డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడా ఇంట్లోకి ప్రవేశించిన అరగంటలోగా అతడి బయోడేటా మొత్తం సేకరించిందామె. మరో మూడు నెలల్లో అతడి ప్రవర్తన, మనస్తత్వం వగైరాల గురించి పూర్తి అవగాహనకు వచ్చేసిందామె.
అతడా ఇంట్లోకి ప్రవేశించిన తొంభయ్యవ రోజు రాత్రి తన పక్కనే పడుకుని నిద్రకు ఉపక్రమించబోతున్న మొగుణ్ణి చేత్తో పొడిచి కర్తవ్యం బోధించింది. మర్నాడు.. భార్య అతి జాగ్రత్తగా అల్లిన వలను భద్రంగా తీసుకెళ్లి దాన్ని సామ్రాట్ తల్లిమీద విసరగా ఆమె అందులో చిక్కుకుని తనను అందులోంచి బయటపడేసే మార్గం కోసం కొడుకు నాశ్రయించింది.
ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకోవాలనే కోరిక లేనప్పటికీ తనకు భార్య కాబోయే స్ర్తిలో కొన్ని కనీస లక్షణాలుండాలనే కోరిక మాత్రం మెండుగా ఉంది సామ్రాట్‌కి. కానీ చదువు పూర్తిచేయడమే లక్ష్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సామ్రాట్ తనకు నచ్చే లక్షణలున్న స్ర్తికోసం చేసే అనే్వషణను వాయిదా వేస్తూ వచ్చాడు విద్యార్థిగా గడిపినంతకాలమూ.
చదువు పూర్తయ్యాక ఉద్యోగంతోపాటు అమ్మాయినీ వెదుక్కుందామనే ఆలోచనకతడు ప్రాధాన్యమిచ్చే సమయంలో సామ్రాజ్ఞి తండ్రి విసిరిన వలలో చిక్కుకున్న అతడి తల్లి సామ్రాజ్ఞి గురించి అతడి దగ్గర ప్రస్తావించింది. ఆ అమ్మాయి అందచందాలతోపాటు ఆమె తల్లిదండ్రుల గురించీ, వాటన్నింటికంటే ఎక్కువగా అతడు సామ్రాజ్ఞిని చేసుకుంటే లభించబోయే ఉద్యోగం గురించీ నొక్కి వక్కాణించి, ‘‘ఇక నీదే ఆలస్యం’’ అని అతణ్ణి తొందరపెట్టింది.
అతడి ఇరవై అయిదేళ్ల జీవితానుభవమూ, ‘‘మనుషులెప్పుడూ మంచివాళ్లే. కానీ పరిస్థితులే చెడ్డవి’’ అనే అభిప్రాయాన్ని సామ్రాట్ చాలాసార్లు పునశ్చరణ చేసుకునేలా చేసింది. కానీ ప్రస్తుతం తన ముందున్న పరిస్థితి మంచిదో, కాదో మాత్రం తెలుసుకోలేకపోయిందతడి మనసు.
అతడి మనసలా సందిగ్ధంలో ఓవైపు కొట్టుమిట్టాడుతోంటే, మరోవైపు సామ్రాజ్ఞి రకరకాల నాట్య భంగిమల్లో తరచూ అతడికి కనిపించసాగింది. ఆమె వివిధ రకాల నాట్య భంగిమల్లో కనిపించిందనడం కంటే అతడి మనసుకలా అనిపించిందనుకోవడం మరింత సమబుగా ఉంటుంది.
వయసులో వున్న చూడచక్కని ఆడపిల్ల వంగినా, లేచినా మరింత అందంగా కనబడటంలో ఆశ్చర్యమేముంది! అందునా వయసులో ఉన్న మగాడికి!
అందుకే అచిరకాలంలోనే ‘అప్పుడే నాకు పెళ్లేమిటమ్మా!’ అని ఖచ్చితంగా చెప్పిన సామ్రాట్, ‘ముందా ఉద్యోగమేదో రానీ..’ అనే స్థితికి జారుకుని, ‘నువ్వతిగా నా మంచి కోరి చెప్తున్నపుడు ఇక నేను వేరేగా చెప్పేదేవుందీ?’ అనే స్థాయికి చేరుకున్నాడు.
విషయం తెలిసిన సామ్రాజ్ఞి తల్లి ఇక ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా కార్యరంగంలోకి దిగి, ఆ శుభకార్యం కాస్తా జరిపించి కూతుర్నీ, అల్లుణ్ణీ కార్యం గదిలోకి పంపించి వియ్యపురాలితో ముచ్చట్లకు దిగింది.
***
తెల్లచీరలో కాళ్లకు మువ్వల వెండిపట్టాలూ, ముక్కున పుడకా, చేతులకు అరవంకీలు, మెడలో చంద్రహారం, కాసుల పేరూ, నడినెత్తిన పాపిట పట్టీ వగైరా సాంప్రదాయక నగల్ని నిలువెల్లా ధరించి ప్పుడే గర్భగుడిలోంచి సరాసరి నడిచొచ్చిన అమ్మవారిలా శోభనం గదిలోకి అడుగుపెట్టిన సామ్రాజ్ఞిని చూసి రాబోయిన నవ్వును కష్టంమీద ఆపుకున్నాడు సామ్రాట్.
కాటుక దిద్దిన కళ్లనోసారి అటూ ఇటూ ఓసారి తిప్పి అతడిని పరీక్షగా చూసి, ‘‘ఆపుకోవడమెందుకూ! నవ్వొస్తే నవ్వొచ్చుకదా!’’ అందామె.
ఆమె ధోరణి అతడికెందుకో శుభసూచకంగా అనిపించలేదు. ‘‘అబ్బే.. అదేం లేదు.. ఈ అలంకరణలో నువ్వెంతో అందంగా ఉన్నావు!’’ అన్నాడు.
ఒక్కక్షణం కళ్ళు చిట్లించి, ‘‘ఉంటే ఈ అలంకరణ లేకపోతే నేనందంగా ఉండననేగా!’’ అందామె నిష్ఠూరంగా.
‘‘ఎవరన్నారు అలా అని!’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు సామ్రాట్.
‘‘లైటుండగా నన్ను ముట్టుకోవద్దన్నానా!’’ అందామె అరచినట్లుగా.
‘‘సరే.. సరే.. నీ ఇష్టప్రకారమే చేద్దాం..’’ అంటూ ట్యూబ్‌లైట్ స్విచ్ ఆఫ్ చేసి, ‘‘ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా?’’ అన్నాడు సామ్రాట్ మనసునదుపుచేసుకుంటూ.
‘‘ఊ..’’ అందామె, తప్పదన్నట్టుగా రెండు చేతులతోనూ కళ్లు మూసుకుంటూ.
ఓ చేత్తో ఆమె భుజం పట్టుకుని రెండో చేత్తో ఆమెను పొదవి పట్టుకుని మంచంవైపు నడిపించాడు సామ్రాట్. ఆ గదిలో బెడ్‌లాంప్ లేకపోయినా మంచం పక్కనే ఉన్న కిటికీలోంచి పడుతున్న వెనె్నల మంచమంతా పరచుకుని ఉండడంతో కొంతలో కొంత ఊరటగా అనిపించిందతడికి.
మంచంమీద కూర్చున్నాక, ‘ఇవ్వాళ దశమి అనుకుంటాను కదూ! వెనె్నల చూడు ఎంత దివ్యంగా ఉందో!’’ అన్నాడు సామ్రాట్.
అంతవరకూ కళ్లు మూసుకునే ఉన్న ఆమె కళ్లు తెరిచి, ‘‘్ఛ.. లైటార్పినా ఈ వెలుగేమిటీ అసహ్యంగా!’’ అంటూ మరోవైపు తిరిగింది.
ఛెళ్లున చెంపమీద కొట్టినట్టయిందతడికి. ‘‘నాకు వెలుతురుంటే నిద్రపట్టదు. ముందా కిటికీ తలుపు వేసేయండి!’’ అందామె చిరాకును కంఠంలో ధ్వనింపచేస్తూ.
‘‘ఈ మనిషిలో అసలు భావుకత అనేది లేదా? లేక తొలి రాత్రి సిగ్గా?!’’ ఎందుకో మొదటిదే నిజమనిపించిందతడికి.
తనను తాను తమాయించుకుంటూ, ‘‘మనిద్దర్ని గదిలోకి పంపించింది లైటార్పేసి నిద్రపోయేందుకా?’’ అన్నాడు సాధ్యమైనంత అనునయంగా.
‘‘ఏమో నాకదేం తెలియదు. ముందా కిటికీ తలుపులు వేసేయండి’’ అతడికి మరో మాట మాట్లాడే అవకాశమీయకుండా అందామె.
‘‘సామ్రాజ్ఞితో పెళ్లికి ఒప్పుకుని జీవితంలో దిద్దుకోలేని పెద్ద తప్పు చేశానా?’’ అనుకున్నాడు సామ్రాట్ తొలిసారిగా.

-ఇంకా ఉంది

సీతాసత్య