డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్జి సభను వాయదా వేశాడు.
పత్రికా విలేఖరులు శర్మిలా ముఖర్జీని చుట్టుముట్టారు. వీరిలో చాలామంది ఆమెకు చిరపరిచితులే!
‘కోర్టులో మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నావా శర్మిలా!’ ఒకామె ప్రశ్నించింది.
‘‘న్యాయం ఎక్కడ ఉందమ్మా? మనం న్యాయం చేస్తున్నామా! నిరంతరం సెనే్సషనల్ న్యూస్ కోసం వేటాడుతున్నామా?
జాతి బ్రతుకు ఒక పథేర్ పాంచాలీ (దారి పొడుగునా ఓ బెంగాలీ జానపదగీతం).
ఎంతో మంది అయోగ్యులను మనం మహానాయకులం చేశాము. మన నెత్తిమీదికి మనమే ఓల్డ్‌మాన్ ఆఫ్ ది సీని ఎక్కించుకున్నాము.
ఈ కార్పొరేటు హాస్పిటల్స్, కార్పొరేట్ హాటల్స్, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ జర్నలిజం’ కార్పొరేట్ జుడీషియరీ- ఈ వ్యవస్థలు ‘అర్థం’ అనే పదార్థానికే అర్థం వుంది.
రండి మృణాళ్ సేన్, మాసన్యాల్ మహాశే్వత అంటూ భజన చేద్దాం. మనకున్నదొకేదారి చారు మజుందారి అంటూ పతాక శీర్షికలు పెట్టింది మనం కాదా? నా సోదరుణ్ణి మనమే - మన భావజాలమే సృష్టించింది.
‘శర్మిలా! నీవు ఆవేశంలో ఉన్నావు?’’
‘‘ఔను - మిమ్మల్ని ఆవేశపడవలసిందిగా కోరు తున్నాను. విక్టోరియా రాణి జయం తులు జరిపి విక్టోరియా టర్మినస్‌లు నిర్మించిన దేశం మనది. మనకు స్వాతంత్య్రం అవసరమా? అసలు ఉందా? మనం పుట్టు బానిసలం’’
‘‘శర్మిలా! సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నీ తమ్ముణ్ణి నీ తల్లి చంపితే అందుకు సమాజానిది బాధ్యతా?’’
‘‘ముమ్మాటికీ! ఒక కుక్క పస్తు పడుకున్నా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు భావించ కూడదు అన్నాడు నరేంద్రుడు (స్వామి వివేకానంద). అలాంటి సొసైటీ లేనప్పుడు ప్రజలల్లో తిరుగుబాట్లు వస్తాయ. ఎదురుగా క్వింటాళ్ళకొద్దీ బియ్యం బస్తాలు - పక్కకే బారులుతీరి అడుక్కొంటున్న బిచ్చగాళ్ళు - ఈ వ్యవస్థయే నా తమ్ముణ్ణి సృష్టించింది’’
ఒక విలేఖరి సూటిగా అడిగాడు. ‘‘నీ తమ్ముడు తాగుబోతు వ్యభిచారి, హంతకుడు. అతనికి ఈ సమ సమాజం నిర్మాణం ఒక ముసుగు మాత్రమే. అతనికి చైనా నుండి డబ్బు అందుతుంది. ఇండియాలో విధ్వంసం అంతర్గత యుద్ధం సృష్టించేందుకు నీ తమ్ముణ్ణి, విశ్వనాథ్ గోడ్బోలేను శత్రువులు మానవ ఆయుధాలుగా ప్రయోగించారు. మానవబాంబులు సృష్టిస్తున్నారు’’.
శర్మిల ఆక్రోశించింది.
‘‘శర్మిలా! నీ తల్లి నిజంగా భారతమాత. ఆమె చేసిన త్యాగం మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది’’
‘‘కాదు రక్తాక్షరాలతో’’ అన్నది శర్మిల.
ఫోటోగ్రాఫర్లు ఆమె ఫోటోలు తీసుకున్నారు. వీడియో కెమెరాలలో శర్మిల ప్రసంగం నిక్షిప్తమయంది. శర్మిల చెప్పిందేమిటి? శంఖపుష్పి చేసిందేమిటి? ఒకటి వాక్కు రెండవది క్రియ ఈ రెండూ సత్యాలే! స్వామి వివేకానంద, అరవింద యోగి, సుభాష్‌బాబు చైతన్య మహాప్రభు పుట్టిన గడ్డమీద అజయ్ ముఖర్జీలు, దేవదాసులు పుట్టడం యాదృచ్ఛికమా? కాకతాళీయమా? విధిలిఖితమా??
ఒకవేళ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దబడినంత మాత్రాన మానవాళి సుఖశాంతులతో జీవిస్తుందా? మానవుణ్ణి ‘ఆర్థిక పశువు’’ అని నిర్వచించడం దుర్మార్గం కాదా?? గోచీలు గుడిసెలు ఒకవైపు, రేవ్ పార్టీలల్లో నగ్న నృత్యాలు, మరోవైపు డబ్బు లేక ఒకడు, అర్ధనగ్నంగా ఉంటే డబ్బు ఎక్కువై మరొకరు నగ్ననృత్యం చేస్తున్నారు క్లబ్బులో.
విలేఖరులు వెళ్లిపోయారు. శర్మిల మాత్రం కోర్టు ఆవరణలోనే కూర్చున్నది. శంఖపుష్పిని పోలీసు వ్యాన్‌లో జైలుకు తరలించారు. శర్మిలలాగే ఎందరో న్యాయం కోసం కోర్టు ఆవరణలో నిరీక్షిస్తూ ఉంటారు. న్యాయం జరుగుతుందనే ఆశలో... దశాబ్దాలు ! ముప్ఫైఏళ్ళు.... నలభై ఏళ్ళు..
‘‘మానవుడే మహనీయుడు’’ అంటూ ఓ తాగుబోతు మత్తులో పాట వ్రాశాడు కదా!
***
న్యాయమూర్తి మేడమీద అవిశ్రాంతంగా తిరుగుతున్నాడు.
ఆయన పేరు ఋతుపర్ణ చటర్జీ. ఆయన భార్య ఇంద్రాణి వచ్చి ‘‘ఎందుకో ఆందోళనగా ఉన్నట్లున్నారు? ఏదైనా క్రిటికల్ కేసు వచ్చిందా?’’ అని ప్రశ్నించింది.
‘ఔను’ ఇంద్రా! నేను రెండు కథలు విన్నాను. ఒకడు పాకిస్తానీయుడు, అతడి పేరు వాహిబ్ అబ్దుల్లా, రెండవాడు అజయ్ అలియాస్ కర్తార్‌సింగ్. వీరిరువురిలో ఎవరు దోషి? ఎవరు నిజమైన భారతీయుడు? భారతీయత జన్మసిద్ధమా? కర్మ సిద్ధమా?? అని ఆలోచిస్తున్నాను’’ శుభమ్
‘‘హిరణ్యయేన పాత్రేణ సత్యస్యా పిహితమ్ ముఖమ్’’ (బంగారు తెర వెనుక సత్యం దాగి ఉంది)
అయపోయంది
================================================

ఈ కథ పూర్తిగా కల్పితం. ఎవరినీ ఉద్దేశించింది కాదు - రచయత

శృంగారమే బంగారమనుకొనే,
బంధం బలం తెలీని కుర్రకారు
పెడతోవ పడితే...
శృంగభంగం కాకుండా
శిఖరారోహణ చేయించే
దోవ చూపిన
తనదైన భావనాపటిమ ఉన్న
ధనికొండ హనుమంతరావు
కలం నుంచి వెలువడిన
ఆంధ్రభూమి డైలీ సీరియల్ మీ కోసం దూతికా విజయం

రేపట్నుంచే

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి