డైలీ సీరియల్

దూతికా విజయం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి ప్రభువులవారు చిన్నరాణి శయనాగారంలో వున్నమాట వాస్తవమే! ఆయన ఎప్పుడు తిరిగి తన మందిరానికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఐతే అంతమాత్రాన మాధవీదేవిలో ఇంత అలసట వచ్చి ఉంటుందంటే ఎవ్వరూ నమ్మలేకుండా ఉన్నారు.
కారణాలు ఇవి: ఇదివరకు అనేక రాత్రులు రాజుగారు చిన్నరాణిని పరామర్శించే ఉన్నారు. కాని ఎన్నడూ రాణి అలసినట్లు కాదు కదా, కనీసం నలిగినట్లయినా కనిపించలేదు! నలభయ్యోపడిలో పదహారేళ్ళ నవజవ్వనిని వివాహమాడిన పురుష పుంగవుడు- మహారాజు ఐనప్పటికీ, వయోభేదం వల్ల స్ర్తిని శ్రమపెట్టగల సామర్థ్యాన్ని ప్రదర్శించగలడనేది స్ర్తిలై జన్మించిన పరివారానికంతకూ తెలిసిన విషయమే! ప్రకృతి స్ర్తిత్వానికిచ్చిన రక్ష తమకు తెలియంది కాదు. చిన్నరాణి ముఖంలో అసంతృప్తీ, చికాకూ తాము ఎన్ని ప్రాతఃకాలలలో గమనించలేదు కనుక!
పోతే రాజుగారు ఏవైనా అద్భుత శక్తుల్ని సాధించి ఉండొచ్చు. లేదా దివ్యౌషధాలను సేవించి మదపుటేనుగు వలె మారి ఉండొచ్చు. కాయకల్ప చికిత్సతో నూతన యవ్వన మదాలను పొంది ఉండొచ్చు. ఇలాంటి సావకాశాలు చాలా తక్కువైనప్పటికీ, నిజం నిలకడమీద తెలియదు. అంతవరకూ ఊహలకూ, సత్యానికీ వున్న వ్యత్యాసం పెరుగుతోందో, తరుగుతోందో ఆ తరుణలకు అంతుబట్టదు.
‘‘ఇవాళ నవరాత్రీ ఉత్సవారంభం చిన్నరాణీ!’’ అని సరస్వతీ హెచ్చరించింది.
చిన్నరాణి కళ్ళు తెరవకుండానే ఒక చిరునవ్వు ప్రయోగించి ‘‘గుర్తున్నదే!’’ అన్నది.
‘‘అస్వస్తతగా ఉన్నదా? రాజవైద్యునికి కబురు చేయనా?’’ అన్నది సరస్వతి.
‘‘అవసరం లేదు, వచ్చేస్తున్నాను’’.
ఆ మాటల్తో చల్లారిన ఉత్సాహమంతా పొంగి పొరలింది ఆ చుట్టుపట్ల. చిన్నరాణి శయ్యను విడుస్తూ, ఒక్కసారి వెనక్కి తిరిగి గాఢమైన వేడి నిట్టూర్పు విడిచింది. ఆమెను తేరిపార చూసే సాహసం వారిలో ఎవరికీ లేనప్పటికీ ఒక్కసారి దృష్టి సారించి సాధ్యమైనంత వరకూ పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలని వారిలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు.
అసంతృప్తీ, చిరాకూ, బద్ధకంతప్ప వాళ్ళకు మరేమీ అర్థమవలేదు. తామందరికీ నాయకురాలూ, ఎంతో తెలివితేటలున్నదీ ముఖ్యంగా చిన్నరాణికి ఆంతరంగిక కార్యదర్శిని అయిన సరస్వతి నోటి నుంచి విశేషాలు వినవలసిందేకాని, తమ బుద్ధికి తోచిందాన్ని నమ్మటమంత బుద్ధితక్కువ లేదని దాస దాసీ జనానికి పూర్వానుభవంవల్ల బాగా తెలుసు.
ఐతే ఈ పరిస్థితికి కారణమేమిటో సరస్వతి కూడా రుూ సమయంలో తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.
చిన్నరాణి ధోరణి మారుతే, తాను అడగకుండానే ఆమె తనతో అంతా చెబుతుందని సరస్వతికి తెలుసు. చిన్నరాణి తన హృదయాన్నీ, తన అంతరంగికురాలైన సరస్వతిని మాత్రమే నమ్మగలదు. తన బాధలు అదృశ్యుడుగా ఉండే ఆ భగవానునికీ, ఎదురుగా తనను అర్థం చేసుకోగల సరస్వతికి మాత్రమే చెప్పుకోగల చిన్నరాణి- ఉలకక, పలకక వౌనం వహించే భగవానుని కన్న సమస్యా పరిష్కారానికి సాయశక్తులా ప్రయత్నించగల, సమర్థురాలై తనే నయమనే అభిప్రాయాన్ని అనేకసార్లు వెలిబుచ్చటం తెలిసిన సరస్వతి సమయం కోసం వేచి ఉంటే సరిపోతుందని సరిపెట్టుకుంది.
సమయం మించితే ధర్మపాలునికి కోపమూ రావచ్చు. ఆలస్యానికి సరైన సంజాయిషీలు చెప్పుకోలేకపోతే తామందరికీ దండనా ప్రాప్తించవచ్చు. అందుకని ముందు ఈ ప్రస్తుత సమస్యను పరిష్కరించటం వివేకవంతురాలిగా తన బాధ్యతనే విషయం సరస్వతి గ్రహించింది.
‘‘రాణీ! వ్యవధి చాలా తక్కువ’’ అని సరస్వతి మరో హెచ్చరిక చేసింది.
‘ఔను’ అన్నట్లు చిన్న రాణి తల ఆడించింది.
కాలకృత్యాలు తీర్చుకోవడం, జలకాలాడటం, సకలాభరణ భూషితరాలవడం, అలంకరణలూ, చీని చీనాంబరధారణలూ, విందులారగింపు మొదలైనవన్నీ మెరుపులు మెరిసే వేగంతో పరివార సహాయంతో పూర్తిఐనవి. చిన్నరాణి తన బృందంతో పోటీలు చూసేందుకు ఇంకా రాలేదని ధర్మపాలుని కనుబొమలు చిన్నరాణికీ, ఆమె బృందానికీ కేటాయించబడిన వేదిక వైపు తిరిగి, ముడివడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ముసలి కనుబొమలకు ఆ శ్రమను తప్పించే నిమిత్తమై సకాలంలో చిన్నరాణి తన బృందంతో సహా వేదికను అలంకరించింది.
రంగస్థలానికి చుట్టూ దాపులో మంత్రి, సామంతులూ, తదితర ప్రభుత్వోద్యోగులూ ఉచితాసనాలను ఆక్రమించి ఉన్నారు. అటువైపు జనం కోలాహలంగా ఇసుక వేస్తే రాలనట్లున్నారు.
రాజవేదికకు కుడి పక్కన పట్టమహిషి, ఇందిరాదేవి వేదిక అమర్చబడి ఉన్నది. ఆమె ఇంతకుముందే వేంచేసింది. ‘ఏం పట్టమహిషిలెమ్మ’ని ప్రజలు అనుకుంటారు. ఇప్పుడామెకూ అదే అభిప్రాయం ఏర్పడిపోయింది. పేరుకు మాత్రమే పట్టపుదేవి ఆమె. ఎవరికీ ఆమెమీద ఆదరణ కానీ, గౌరవం కానీ లేవు. రాజుకే లేనప్పుడు భృత్యులకెందుకుంటుంది? ఆమె నేరమల్లా రాజవంశాన్ని ఉద్ధరించే వంశాంకురాన్ని ఇవ్వలేకపోవడమే!
ఆ కొరత తీర్చేందుకే ఈడు జోడు కాకపోయినా, అధికారం చేతుల్లో ఉండటం వల్ల తన సామంతుని కూతురైన మాధవీదేవిని రాజు తన చిన్నరాణిగా స్వీకరించాడు. ఆమె కాపరానికి వచ్చాక మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు జరుపబడింది. ఫలితం శూన్యం. గతి తప్పని చంద్రకళలను అనుసరిస్తూ మాధవీదేవి మైలపడుతూనే వున్నది.
ఇంతకుముందు రాజు ఆశలన్నీ ఆమెమీదనే ఉండేవి ఇప్పుడు క్రమంగా సన్నగిల్లి గడువు సమీపిస్తున్న ఉరిశిక్ష విధించబడిన ఖైదీ మనస్తత్వానికి దరిదాపుల్లో వస్తున్నది మాధవీదేవి. ఇంతకుపూర్వం పట్టమహిషి చూపులూ, మాధవీదేవి చూపులూ కలవటమంటే ఇద్దరు మహాయోధులైన విరోధుల పదునైన కత్తులు కదనంలో కలిసినట్లే వుండేవి.
మాధవీదేవి చప్పున తల కుడివైపునకు తిప్పి పట్టమహిషి వేదికవైపు దృష్టి సారించింది. ఆమెతోపాటే సరస్వతి చూపులు కూడా అటు తిరిగినవి. పట్టమహిషి తీక్షణ వీక్షణాలను ఉభయులూ గమనించారు.
సరస్వతి తన రాణి భావం గ్రహించే నిమిత్తం మాధవీదేవి ముఖంలోకి చూసి ఆశ్చర్యపడింది. ఆమె చూపులు తీక్షణంగా లేవు సరికదా ఎంతో సాధువైన జంతువు కసాయివాడిని చూసే దీనదృక్కులు ప్రత్యక్షమైనవి. బహుశా తాను కూడా పట్టపురాణి మట్టానికి దిగిపోతూన్నందుకు చిన్నరాణి దిగులుపడి ఉండొచ్చని సరస్వతి భావించింది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు