డైలీ సీరియల్

దూతికా విజయం-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతి తాను చాలా ఉద్రేకంగా మాట్లాడినట్లు గ్రహించింది. ప్రభు దూషణ రాణిలో ఎలాంటి మార్పు తెచ్చిందో గమనించకుండా ముందుకు సాగటం, మెడలో వేసుకున్న ఉరితాటిని తనకు తానై బిగించుకోవటమే అవుతుందని ఆమెకు తెలియకపోలేదు.
రాణి నిర్లిప్తంగా వున్నది. తాను మాట్లాడిన మాటల్లో సత్యమే వున్నది కనుక దాన్ని గ్రహించే రాణి అంగీకార సూచికంగా వౌనం వహించి ఉండాలి. ఐతే తాను పొరబడి ముందుకు సాగితే ఏం ప్రమాదమో? ప్రభువుల ఆగ్రహానుగ్రహాలు ఎప్పుడు, ఎందుకు ఏ విధంగా విరుచుకొని పడతవో ఎవరికి తెలుసు? అందుని సరస్వతి మరికొద్దిసేపు మెదలకుండా ఊరుకున్నది.
‘‘ఆగావేం సరూ! ప్రేమా, అభిమానమూ ఉన్నచోటనే కదా ఏ లోపాలైనా కనిపించనిది? నీకు తెలియదా- విధివశాన రుూ రాజుకు రాణిని ఐనప్పటికీ జీవితానందాన్ని దూరం చేసుకున్నానని? మన యిష్టాయిష్టాలతో జీవితానికి నిమిత్తం లేనప్పుడు, జీవితం తన్నిన వైపుకూ, లాగినవైపుకూ పోతున్నాం. దీనికి విరుగుడు ఏమైనా ఉన్నదా, ఇంతకన్నా పై మెట్టుమీదికి వెళ్ళగలమా అనీ, జీవితం చేసిన రుూ గాయాలను మాన్పుకోగలమా అనే తీవ్రంగా ఆలోచిస్తున్నాను!’’
రాణి మనసులో ఆవేదనంతా వెల్లడయింది. ఐదేళ్ళుగా తాను లోపోపలే కుళ్ళిపోతూ, బైటపెట్టుకునేందుకు సరైన సమయ సందర్భాలు లభ్యమవక, శక్తినంతా ఉపయోగించి రగిలే జ్వాలల్ని కక్కేందుకు ఇదే మంచి సమయమని గ్రహించింది.
‘‘రాణీ!’’ అన్నది సరస్వతి ఆవేదనాపూరిత స్వరంతో. ‘‘బుద్ధి తెలిసినప్పటినుంచీ చూస్తున్నాను మగవాళ్ళ ఆగడాలూ, అన్యాయాలు, అక్రమాలు, స్ర్తి జాతిమీద ఎంత తీవ్రంగా ప్రయోగించబడి, వారిని అధోగతిపాలు చేస్తున్నవో! నీ జీవితం ఇందుకు విరుద్దంగా లేదు. తనకు మనసైన మగువ నీవని రాజు అభిప్రాయపడిన విధంగానే, నీకు మనసైన మగవాడు తనేనా, కాదా అని క్షణం ఆలోచించి ఉండరు.
ఆలోచిస్తే అర్థం కానిదేమీ ఇందులో లేదు. తనపట్ల నీకు ప్రేమ ఏర్పడే అవకాశమే లేదని ఆయనకు తెలుసు. తరిచినకొద్దీ రుూ సత్యమే కాలసర్పంవలె చుట్టలు చుట్టుకుంటుంది. బాధను అనుభవించవలసి వచ్చినపుడు ఆ బాధ తానుగాక ఇతరులే అనుభవించేట్లు చేయగల అధికారం చేతుల్లో ఉండనే ఉన్నది కనుక ప్రయోగించారు. ఇతరులకు న్యాయం చెప్పటంలో న్యాయశీలే ఆయన. కాని తనకు ఆ న్యాయాలు అన్వయింపజేయలేరు. ఇతరుల మొహాలన్నీ తనకు స్పష్టంగా కనిపించినా దర్పణం లేనిదే తన మొహం తనకు కనిపించదనే న్యాయసూత్రాన్ని అనుసరించే ఆయన ప్రవర్తన సాగుతూన్నది. ఆ అద్దంలో తనను తాను చూసుకోవటమంటే భయం మరి!’’
ఈ ఉపోద్ఘాతాన్ని రాణి ఆకళింపు చేసుకునేందుకు సరస్వతి కాస్త పస్తాయించింది. తాను ప్రతి అక్షరాన్ని ఆమోదించినట్లు రాణి సూచించగానే సరస్వతి ముందుకు సాగింది.
‘‘ఒక సుఖానికి మరొక కష్టం కలసే వుంటుందనే న్యాయాన్ని అనుసరించి మనసులేని మనువుకు బలయినప్పటికీ, మహారాజ భోగాలు లభించినవి కదా మీకని నేను తృప్పిడ్డాను. ఆ విధంగా సరిపెట్టుకోక చేసేదీ లేదు కనుక సమాధానపడటమే మిగిలింది. ఐతే ఆ వైభోగాలు కూడా ఇంత త్వరలోనే మనసు విడనాడుతవని కలలో కూడా అనుకోలేదు కదా!’’
‘‘నా ఏ స్వప్నాలు సత్యాలైనవి!’’ అని స్వగతంలోవలె రాణి అన్నప్పటికీ, నిట్టూర్పుతో సహా సరస్వతి కర్ణపుటాలను జేరినవా మాటలు.
‘‘కలలు నిజమవలేదని విచారపడటం కేవలం వ్ఢ్యౌమే అవుతుంది రాణీ!’’ ఎందుకంటే నీ కమ్మని కలలు నిజమవకపోవటం అదృష్టమే అనుకోవాలి కదా!’’
‘‘అదీ నిజమే!’’
‘‘నేను ఆలోచించేది అది కాదు రాణీ! మగవారి దురాగతాలు! పెద్దరాణిని గొడ్రాలు అన్నారు, సరే! రూపలావణ్యాలూ, యవ్వనమూ ఉండి, సంతానవతి అయ్యేందుకు తగిన పురుషుడు మాత్రమే అవసరమైన తమకు కూడా గొడ్రాలు ముద్ర వేసేందుకు ముందువెనుకలు ఆలోచించని రాజు కుతర్కమేమిటి? రాజ వైద్యుడు రహస్యంగానే అవుగాక సంతానాన్ని కనే విషయంలో తమలో ఎలాంటి లోపమూ లేదని తేల్చాడు కదా! మరి ఆ రాజవైద్యుడే రాజులో లోపమున్నదని ఎందుకు బహిరంగంగా అనడు? తనకు తెలిసిన విషయమే ఐనా, శాస్త్ర సమ్మతమైన పరమసత్యమే ఐనా రాజాగ్రహానికి గురికావడం ఇష్టంలేని వైద్యుడు కూడా నింద మీ నెత్తినే వేసేందుకు సాహసిస్తున్నాడు!’’
‘‘మానవులే కాదు సరూ! సంతాన గోపాలస్వామిని నేను కాపురానికి వచ్చినప్పటినుంచీ ఎంతో భక్తిప్రపత్తులతో ఆరాధిస్తూనే ఉన్నానే! ఆయనకూ దయ కలగలేదు కదా!’’ అన్నది రాణి నిరాశ ధ్వనించే కంఠస్వరంతో.
తెరలు తెరలుగా వచ్చే నవ్వును ఆపుకునేందుకు సరస్వతి వ్యర్థ ప్రయత్నం చేసింది.
‘‘అంత నవ్వొచ్చే విషయమేమిటో?’’ అన్నది రాణి.
‘‘ఎంత పిచ్చి రాణిని నీవు!’’ అన్నది సరస్వతి. ‘‘మానవుడికి సాధ్యమైన వాటిల్లో కూడా దైవ ప్రమేయం దేనికి? తన ప్రయత్నాలు ఫలించలేదని, తన అసమర్థత బైటపడకుండా ‘దైవనిర్ణయం’ అనే తెరవెనుక దాక్కునేందుకు మానవుడు కనిపెట్టిన గొప్ప కవచమది! అదీగాక మానవుడు సాధించేందుకు తగిన శక్తి సామర్థ్యాలను ఇచ్చిన దైవం అతని అసమర్థత బైటపడకుండా కాపాడే భారాన్ని కూడా వహిస్తుంటాడా? మానవ శక్తులకు అసాధ్యమైనవన్నీ దైవమే సాధించి ఇచ్చాడంటే ఒప్పుకోవచ్చు. ఉదాహరణకు ప్రపంచమంతా వెనె్నలతో ముంచెత్తగల ఆ చందమామ! గతి తప్పకుండా ఎంతో వెలుగునూ, వేడినీ ఇవ్వగల సూర్యబింబం! భూమిమీద నీటిలో అధిక భాగాన్ని ఆకాశంలోకి తోడి మేఘాలలో దాచి, వర్షరూపాన కురిపించి, మహానదులు ప్రవహించేటట్లు చేయడం మానవునికి సాధ్యంకానివి కనుకనే దేవుడే ఆ పనులు చేస్తున్నాడు. మహానదులకు ఆనకట్టలు కట్టి, కాలువలు తీసుకొని తనకు అనుకూలంగా ఉండే చోటికి నీటిని తెచ్చుకోగల తెలివితేటలూ, సామర్థ్యమూ మానవునికి ఉన్నది కనుక, ఆ పని కూడా దేవుడే చేయలేదని ఫిర్యాదు చేయడం ఎంత అవివేకమో ఆలోచించు రాణీ! వంశాభివృద్ధి కార్యక్రమం ధారాళంగా సాగిపొయ్యేందుకుగాను స్ర్తి పురుషుల మధ్య అత్యంత ఆకర్షణనూ, భరించలేక విడుదలై తీరవలసిన తీవ్ర కామవాంఛనూ ప్రకృతే శాసించింది. ఏ మానవ నిర్మిత చట్టాలూ, ప్రకృతి చట్టాలకన్నా బలవత్తరమైనవి కానేరవు కదా!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు