డైలీ సీరియల్

దూతికా విజయం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాణీ! ఎంత చలి చలిగా ఉన్నా చూస్తూ చూస్తూ అగ్నిగుండంలోకి దూకవచ్చునా?
‘‘ఇప్పుడున్నది అగ్నిగుండం కాదా సరూ! ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తామా, గండం గడిచినట్లే! లేక పరాజయం పొంది పట్టుబడతామా సంవత్సరం తరువాత మనకు రాసిపెట్టి వున్న అధోగతి రెక్కలు కట్టుకుని ముందుగా వచ్చిపడుంది. ఈ సాహసం చేయతగిందే అని అనిపిస్తోంది’’.
‘‘సాహసమా ఇది? మెడకు ఉరితాటిని తగిలించుకుని మనను గమనించని మృత్యుదేవతను పేరు పెట్టి పిలవటం కాదా?’’ అన్నది సరస్వతి.
రాణి నిస్సారంగా నవ్వింది.
‘‘సరూ! మృత్యువు ఇంతకన్నా దారుణంగా హింసిస్తుందని నేను అనుకోను!’’ అన్నది రాణి.
రాణి పొందే ఆవేదన సరస్వతికి అవగాహనమైంది. ఐనప్పటికీ తప్పుదార్లకు మళ్లే మగువ మనసును మంచి మార్గానికి తిప్పవలసిన తన బాధ్యతను ఆమె విస్మరించలేకపోయింది.
‘‘రాణీ! క్షణికోద్రేకాలు దారుణమైన అపాయాలకు దారితీస్తవి. కాలమే పరిష్కరించవలసిన విషమ సమస్యలను తగుదునని ఉద్రేకమే ఉత్సాహమనుకొని తొందరపడి ముందుకు సాగితే, చిక్కుపడిన దారాన్ని విడదీసేందుకు ముక్కలు ముక్కలు చేసుకోవటంగా పరిణమిస్తుంది. రుూ ముక్కల్ని అతికి తిరిగి దారంగా చేసుకోలేము కదా! ఆ తరువాత విచారపడి ప్రయోజనం ఉండదు రాణీ!’’
‘‘సరూ! మంచి సలహా చెప్పటం నీ విధి కనుక అదే చెపుతూన్నావు. కాని ఒక జీవితం తాడో పేడో తేలవలసిన పరిస్థితుల్లో కాస్త సాహసమన్నా చేయలేకపోవటంవల్ల ఎంత గొప్ప అవకాశం చేయి జారిపోయి, ఆ తరువాత విచారపడవలసి వుంటుందో నీవు ఆలోచించటంలేదు’’.
రాణి అభిప్రాయం స్ఫటికమంత స్పష్టంగా తెలిశాక, ఎదురాడి తాను నిలవలేనని సరస్వతికి తెలుసు. ఐనప్పటికీ మరికొంత ప్రయత్నంవల్ల ఆమె నిర్ణయంలో మరికొంత మార్పునకు అవకాశం ఉండొచ్చు.
‘‘రాణీ! జీవితాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే సకల సద్గుణాలూ ఒకే తావులో లేదా ఒక వ్యక్తిలో ఉండేందుకు వీల్లేదనే స్వల్ప విషయం అర్థం కాకపోదు. సకల సంపదలూ, సౌందర్యమూ, తెలివితేటలూ వున్న వ్యక్తికి ఏదో ఒక గొప్ప లోపం ఉండి తీరుతుంది. తినేందుకు కావలసినంత వున్నవాడికి తిన్నది అరగదు. తిన్నా అరిగేవాడికి అన్నమే కరువౌతుంది’’
‘‘నీవు చెప్పదలచుకున్నదేమిటి?’’
‘‘వీరభద్రుని చూసినప్పుడే మీలాటి సౌందర్యరాశికి తగినవాడనే అభిప్రాయం నాకు కలిగింది’’.
రాణి చిరునవ్వు వెనె్నల వెలుగును వెక్కిరించింది.
‘‘యువకుడు, స్ఫురద్రూపి, బలసంపన్నుడు, తేజోరాశి. అంతవరకూ బాగానే ఉన్నది. ఇవి మనకు పైకి కనిపించే లక్షణాలు. వీటిని అనుసరించే మనం వ్యక్తిత్వాన్ని నిర్థారణగా తేల్చలేము. ప్రవరుని వంటి అరసికుడు కావొచ్చు, పరమ మూర్ఖుడు అయి ఉండొచ్చు. చదువు సంధ్యలూ, సంస్కారమూ లేని మోటువాడు కావొచ్చు. అదేమీ తెలుసుకోకుండా దీపశిఖను చూసి పొరబడిన శలభంవలె ప్రవర్తించటం అవివేకమనిపిస్తోంది రాణీ!’’
‘‘నన్ను నిరుత్సాహపరిచేందుకు ఎన్ని సామ్యాలను ఏకరువు పెడుతున్నావు సరూ!’’ అన్నది రాణి.
‘‘రాణీ! ప్రాపంచిక ధర్మాలూ, సత్యాలూ చెప్పాను. సువర్ణానికి సువాసనా లేదు; గులాబికి ముళ్ళుండకుండానూ లేదు. ఎక్కడో నూటికి కోటికి ఒక వ్యక్తిలో సకల సద్గుణాలూ ఉండొచ్చు. కాదనను. కానీ ఇతని సంగతి మనమింకా వేచి వుండి చూడాలి కదా!’’
‘‘ఔనులే సరూ! నాలో కలిగిన ఈ విపరీతమైన కోర్కె- నా సంగతి ఎలా వున్నా, నీకు రెండు విధాల నష్టం!’’ అన్నది రాణి.
‘‘నాకా? నేనా విషయమే ఆలోచించటంలేదు. ఐనా నాకొచ్చిన నష్టమేమిటి రాణీ!’’
మొదటిది రాజద్రోహాన్ని తలపెట్టడం-
‘‘రాణీ! నాకు రాజు మీరే! మీకు ద్రోహం తలపెడుతున్నాననే అభిప్రాయం మీకు కలిగితే నాకు ఆత్మహత్యే శరణ్యం!’’అన్నది సరస్వతి ఉద్విగ్న స్వరంతో.
‘‘నా అభిప్రాయం అది కాదు సరూ!’’
‘‘సరే.. రెండో కారణం ఏమిటి?’’
‘‘‘అపాయకరమైన రుూ సాలెగూటిని నీ చాకచక్యంతో భేదించవలసి వుంటుంది. విచ్చుకత్తుల మీద సాము కనుక ప్రాణభయం ఉండనే ఉన్నది’’
‘‘రాణీ! నీ కొరకై నవ్వుతూ ప్రాణాలను అర్పించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా విశ్వాసాన్ని శంకించి నన్ను అవమానించవద్దని వేడుకుంటున్నాను. ఆ దైవం మీద ఆన!’’
రాణి హఠాత్తుగా లేచి నిలబడి సరస్వతిని ఎంతో ఆప్యాయంగా కావిలించుకుంది.
‘‘మనిద్దరమూ అక్కచెల్లెళ్లం సరూ! నేను నీ ముద్దుల చెల్లెలిని.. నా కోర్కెలు తీర్చటం నీకు సరదా.. అవునా?’’ అన్నది రాణి.
క్షణంలో సరస్వతి కరిగిపోయింది. తన ఏలిక రాణి ఎంత కిందికి దిగి తనను కలుసుకున్నదో ఆమె గ్రహించింది. కోమలి హృదయంలోని కోరిక సురాపానం చేసిన కోతివలె గంతులు వేస్తూ, అది తీరేందుకు ఎన్ని అడ్డతోవల్ని అనే్వషిస్తూంటుందో సరస్వతికి అర్థమైంది.
‘‘నేను అర్థిస్తున్నాను’’.
‘‘తప్పు రాణీ! అలా మాట్లాడకండి. రాజభక్తికన్నా గొప్ప ఆదర్శం నాకీ జీవితంలో మరి లేదు. నన్ను ఆజ్ఞాపించండి’’ అన్నది సరస్వతి.
‘‘ఎంతో కిందికి వెళ్లిపోయి నాకు దూరమవకు సరూ! నీ తెలివితేటలమీద నాకెంతో విశ్వాసమున్నది. ఎలాంటి అపాయాన్నయినా నీ ఉపాయంతో భేదించగల కౌశలమున్నదానివి. నా రుూ కోర్కె తీర్చగల సమర్థురాలివి. నీ మీదనే ఆశలన్నీ మోపుకున్నాను’’.
‘‘రాణీ! శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను’’.
‘‘విజయం లభిస్తుందని నాకో గాఢమైన గుడ్డి నమ్మకం సరూ!’’
‘‘విజయానే్న ఆశిద్దాము. రుూ నవరాత్రులు గడవనివ్వండి. దిగవలసిన లోతు చూసుకొని కార్యరంగంలోకి దూకుతాను’’.
‘‘సరూ! రుూ జన్మంతా నీకు కృతజ్ఞురాలిని’’.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు