డైలీ సీరియల్

దూతికా విజయం-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్తినంతా ఉపయోగించటం వల్ల అలసట తీర్చుకునేందుకు అలాగే కాసేపు నిలబడిపోయింది. భయంతో కూడిన ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించింది.
ఇలా అరుగుమీద మేలిముసుగుతో ఎక్కువ సేపు ఉండటం కూడా క్షేమం కాదు. ఎవరైనా చూస్తే ఏ కామినీ భూతమో అని హడలి నానా హంగామా చేస్తే తను బైటపడిపోయి ఈ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ముఖ్యం గా రక్షక భటుల పాలబడి తాను ఎన్ని విధాలా సంజాయిషీలు చెప్పినా ప్రయోజనం ఉండదు. వారందరూ తననొక ఆట వస్తువుగా అనుభవించి మలినపరిచి, ఏ స్థితిలో ఎప్పుడు విసిరి పారేస్తారో ఊహకు అందని విషయం. అంత అవమానాన్ని పొందినా ఎవరికీ ఏమనీ చెప్పుకోలేక, ఏ విధంగానూ ప్రతీకారాన్ని తీర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంకన్నా వేరు మార్గం ఉండదు.
ఇలాంటి ఊహలన్నీ ఆమెలో ఎన్నో వికారాలనూ, భయాన్నీ, గగుర్పాటునూ కలిగిస్తూన్నవి. ఎంత త్వరగా వీరభద్రుని గృహంలో జొరబడితే అంత మంచిది. ఐతే తొందరపడి అతన్ని బెదరగొట్టి, బైటికి గెంటించుకుంటే.. తను రుూ వీధి కుక్కల గతికి ఈర్ష్యపడవలసిన దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది.
ఎంత హీనమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది! మంత్రసానితనం చేతబట్టినట్లయింది. రుూ వెధవ కామవాంఛలు ఇంత ప్రమాదకరమైనవి కనుకనే ఎంత సుఖాన్నివ్వగలిగినా, చాలామంది వీటికి దూరదూరంగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు తనూ, తనతోపాటు రాణివాసంలో వున్న దాసదాసీ జనమూను.
ఐతే ప్రకృతి ఏర్పరచిన చట్టాలు మానవుడు సృష్టించిన చట్టాలకన్నా బలవత్తరమైనవి కావటంవల్ల అత్యధికులు లొంగిపోతూనే వున్నారు. ఎంత ప్రాణాంతకమైనదిగా తోచినప్పటికీ, ఆ ప్రాణానికి కాస్త సుఖాన్నిద్దామనే ఎంత ప్రమాదాన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతూనే వున్నారు. ఉదాహరణకు తన రాణి!
చిత్రం! రాణి గొప్ప సాహసానికి సిద్ధపడింది. మరి రుూ వీరభద్రుడు బలశాలి, తేజోశాలి ఐనప్పటికీ సాహసం గలవాడనేందుకు రుజువులు చూడవలసి వున్నవి. అతని మనసులో ఉద్భవించి, పెంపొందని సాహసాన్ని తాను నాటి, మొలకెత్తించి విస్తరింపజేయాలి. అదేం మాటలతో అయ్యే పనిగా తోచదు. ఐనా ప్రయత్నలోపం జరుగకూడదు కదా!
కేవలం, సేవాధర్మకారణంగా, తన స్వార్థం ఆవగింజంతయినా లేకుండానే ఆడకూతురైన తాను ప్రదర్శించే సాహసానికి తనకే ఆశ్చర్యం కలుగుతోంది. తనను చూసయిన సిగ్గుపడే అతని పురుష హృదయం తిరగబడి ముందుకు సాగమని పురిగొల్పదా? తన చాకచక్యానికి ఇదో గొప్ప పరీక్ష!
పిలవని పేరంటంగా వచ్చిన అతిథి తాను. సత్కారం ఎలా వుంటుందో, అసలు లోపల అతను ఏకాంతంగా వున్నాడో లేదో, జాగ్రదావస్థలో వున్నాడో, లేక సుషుష్తావస్థలో వున్నాడో- అబ్బ ఎన్ని అనుమానాలు!
కాలం దొళ్ళుతోంది. ఇంకా ఆలస్యం చేయటం వివేకమవదు. అందుకని సరస్వతి తలుపు దగ్గరికి వెళ్లింది. తలుపు తట్టబోయి అంతలోనే తనను తాను సంభాళించుకొని చెవులు రిక్కించి విన్నది. లోపలినుంచి ఎలాంటి అలికిడీ లేదు. లోపల బహుశా వీరభద్రుడొక్కడే ఉండి ఉండొచ్చు. లేక అతను కూడా లేడా? తలుపు గొళ్ళెం వేలాడుతుండటాన్ని తడివి చూసింది సరస్వతి. అతను కూడా లేకుంటే దానికి తాళం వేసి ఉండేది కదా!
ఇవాళ సాయంత్రం రాజవీధిలో నడుస్తూ తాను చూసిన రుూ ఇల్లు తగినంత పురాతనమైనది. కనుక తలుపు చెక్కలో ఎక్కడన్నా బొక్క లేకుండా ఉండదు. లోపలి వెలుగు కిరణమేదీ తలుపుగుండా బైటికి ప్రసరించడంలేదు. చూరులోంచి వెలువడే గుడ్డి వెలుగును బట్టి బహుశా దివ్వె చాలా దూరానన్నా ఉండి ఉండాలి. లేదా తలుపులోని పగుళ్లు తగినంత పెద్దవి కాకుండనన్నా ఉండి ఉండాలి అని తేల్చుకుందామె.
తలుపు పైభాగమంతా తడిమి చూసిందామె. తరువాత కింది భాగమంతా తడివి తడివి చూడగా ఒక చిన్న కంత ఉన్నట్లు తోచిందా కాంతకు. మోకరించి కూర్చొని రంధ్రాన్ని అనే్వషించిందా రమణి. ఆ తరువాత కుడి అరచేతిని గొట్టాం వలె మడిచి ఆ తూటులోంచి ఒంటి కంటితో నిశితంగా లోనికి చూసిందా తరుణి. చిల్లులోంచి అస్పష్టంగా కనిపించినా చాకచక్యంతో ఆ దృశ్యాన్ని స్పష్టంగా చిత్రించుకోగలిగిందా చకోరాక్షి.
వీరభద్రుడు దివిటీ వెలుగులో తాళపగ్రంథాన్ని చదువుతూన్నాడు. అతను జాగ్రదావస్థలో ఉండటంవల్ల తన పిలుపునకు వెంటనే జవాబు రాగలదు. మొత్తంమీద ఇవాళ అదృష్టదేవత తనను నీడవలె అనుసరిస్తూనే వున్నదనిపించింది సరస్వతికి.
మెల్లిగా తలుపుమీద చప్పుడు చేసిందామె. జవాబు లేదు. బహుశా గాలి తాకిడై ఉంటుందనుకున్నాడేమో? లేక వినిపించనేలేదో?
ఈసారి స్పష్టంగా వినిపించేటట్లుగా వేళ్లుముడిచి వాటి వెనక భాగాలతో తలుపుమీద చప్పుడు చేసిందామె.
‘‘ఎవరూ?’’
తానెవరని తెలియచెప్పాలి? మళ్లీ ఇదివరకువలెనే వేళ్ళతో తలుపుకొట్టింది.
బరువైన అడుగుల చప్పుడు, చికాకుపడుతూ అక్రమ విధానంలో తలుపునకు దాపైనవి.
‘‘ఎవరంటే!’’’ అని అవతలి కంఠం చిన్నగా, చికాకుగా గద్దించింది.
‘‘దయచేసి తలుపు తెరవండి!’’ తగ్గు స్థాయిలో మృదువుగా ప్రాధేయ పూర్వకంగా అన్నది సరస్వతి.
ముష్టిది కాదని నిర్థారణ చేసుకున్నట్టు ఆ చిరాకంతా తగ్గించుకొని మెల్లిగా తలుపు తెరిచాడు వీరభద్రుడు.
బైట మేలిముసుగులో ఎవరో తెలియలేదతనికి.
‘‘ఎవరూ?’’ అని తిరిగి ప్రశ్నించాడు.
‘‘లోపలికి రానివ్వండి.. చెపుతాను..’’
ఒక్కక్షణం ఆలోచించినట్లు కనిపించాడతను. తరువాత దారి ఇవ్వగా సరస్వతి లోపలికి అడుగుపెట్టింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు