డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం పట్ల ఆమెకున్న మమకారాన్ని అంత స్పష్టంగా ఆమె చెప్పిన తర్వాత ఆ విషయాన్నామెతో చర్చించడంకంటే నిష్ప్రయోజనకరమైన పని మరొకటి వుండదనిపించిందతడికి.
మాట తీరు ఎలా వున్నా సామ్రాజ్ఞి అందమైన వాళ్ళ కోవలోకే వస్తుంది. చక్కని కనుముక్కు తీరూ, ఎక్కువమంది కోరుకునే ఒంటిరంగూ, ఏ పెళ్లికాని కుర్రాడైనా చూసీ చూడగానే సూదంటూ రాయిలా ఆకట్టుకునే అందంతోపాటు వయ్యారపు నడకా, ఎదుటివారిని సమ్మోహనం చేసే దరహాసం వగైరాలన్నీ సామ్రాజ్ఞికి పుట్టుకతో లభించిన వరాలు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. దూరాన్నుంచి ఎడారిలో ఒయాసిస్సులా భ్రమింపజేసే వ్యక్తిత్వం ఆమెది. దగ్గరగా వెళ్లి చూస్తేగానీ అది ఎండమావి అని తెలియదు.
చాలామందిలానే పొగడ్తలకు పరవశించడం ఆమె బలహీనత. తన అందాన్ని, అలంకరణనూ, మాటల్నీ, చేసే పనుల్నీ ఎవరైనా విమర్శిస్తే వారిని జీవితాంతం క్షమించదాయె. తనకెవరైనా సలహాలిస్తే అంతులేని కోపం వస్తుందామెకు.
లేక లేక లేటు వయసులో పుట్టిన ఆడపిల్లకు సామ్రాజ్ఞి అని పేరు పెట్టుకోవడమే కాకుండా చిన్నప్పటినుంచీ మహారాణిలానే పెంచారామె తల్లిదండ్రులు.
ఎటూ వయసొచ్చాక ఎవరో ఒకరికి కట్టబెట్టవలసిందే. కట్టుకునేవాడు కూతురి చెప్పుచేతల్లో ఉంటాడో, కాల్చుకుతింటాడో ఎవరూ చెప్పలేరు. కనీసం తమ దగ్గర పెరిగినంతకాలమైనా కాలు కిందిపోకుండా పెంచితే అదే చాలనుకుని సామ్రాజ్ఞి ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట.. చందంగా పెంచారామె తల్లిదండ్రులు.
చిన్నప్పుడామె జాతకం చూసిన గుళ్లో పూజారిగారు, ‘‘ఈ పిల్ల మహర్జాతకురాలు. కట్టుకున్న వాణ్ణి జీవితాంతం తన కొంగుక్కట్టుకుని తిప్పుకుంటుంది’’ అని చెప్పిన మాటల్ని అప్పుడప్పుడూ తలచుకుని పొంగిపోయేవారామె తల్లిదండ్రులు.
పూజారిగారి మాటలు నిజం కావాలంటే మానవ ప్రయత్నం కూడా ఉండాలనే గ్రహింపుతో నోట్లో నాలుక లేని కుర్రాళ్ల కోసం గాలించగా గాలించగా చేపే ఎగిరొచ్చి వలలో పడినట్టుగా, వాళ్లు కోరుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్న సామ్రాట్ దొరికాడు వాళ్లకు. తర్వాత అతణ్ణి తమ అల్లుడిగా చేసుకునేందుకు వాళ్లు పెద్దగా కష్టపడనవసరం లేకపోయింది.

2
‘‘రావోయ్ కొత్తపెళ్లికొడకా.. రా! కనీసం వారం రోజులైనా ఆఫీస్ మొహం చూడవని మేమంతా అనుకొంటూంటే నువ్వేవిటీ పెళ్లయిన నాలుగో రోజే ‘రాముడు మంచి బాలుడి’లా ప్రత్యక్షమయావ్!’’ అంటూ ఆట పట్టించాడు మహర్షి, ఆఫీస్‌కొచ్చిన సామ్రాట్‌ను.
సమాధానంగా చిరునవ్వు నవ్వి తన సీట్లో కూర్చున్నాడు సామ్రాట్. భోజన విరామ సమయంలో మళ్లీ అడిగాడు మహర్షి ‘నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదోయ్ నువ్వు!’’’
‘‘ఇందులో ప్రత్యేకంగా చెప్పేందుకేవుందీ! వారం రోజుల తర్వాతైనా ఆఫీసుకు రావాల్సిందే కదా!’’
‘‘అవుననుకో.. నేనైతే ముందు వారం రోజులు సెలవు పెట్టినవాణ్ణి తర్వాత మరో పది రోజులవరకూ ఆఫీస్ మొహం చూడలేదని నీకు తెలుసు కదా! అందుకే అడిగాను.. మరోలా అనుకోకు’’ అన్నాడు మహర్షి.
‘‘నాది నీలా ప్రేమ వివాహం కాదు కదా.. అందుకే సెలవు రద్దుచేసుకుని ముందుగా వచ్చేశాను’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహు.. నీ మాటలు నమ్మదగ్గవిగా లేవు. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సామ్రాజ్ఞిని ఇష్టపడే చేసుకున్నావు కదా!’’
‘‘ఇష్టమంటే.. ఇష్టమూ కాదు.. అయిష్టమూ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరో ఒకర్ని చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాను’’.
‘‘అదేం.. పెళ్లికి ముందు నువ్వూ సామ్రాజ్ఞీ మాట్లాడుకోలేదా?’’
‘‘లేదు కాబట్టే మాది పెద్దలు చేసిన పెళ్లని అంటున్నాను’’.
‘‘పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు మాత్రం.. ఆనందంగా సంసారాలు చేసుకోవడంలేదూ?’’ అన్నాడు మహర్షి.
‘‘పెద్దలంతా అలా అనుకునే పెళ్లిళ్లు చేస్తారు. కానీ వాళ్లు చేసిన పెళ్లిళ్లు అనుకున్న మేరకు విజయవంతమవుతాయో లేదో మాత్రం ఎవరు చెప్పలేరు. కాదంటావా?’’
‘‘కాదని నేనెందుకంటాను? కళ్లముందు ఎన్నో జంటలు అలా కనిపిస్తోంటేనూ! ఒకటి మాత్రం నిజం.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లన్నీ విఫలమవుతాయని అనుకోవడం ఎంత పొరపాటో ప్రేమ పెళ్లిళ్లు విజయవంతమవుతాయని అనుకోవడమూ అంతే పొరపాటు’’ అన్నాడు మహర్షి.
‘‘అదేం.. వల్లీ ప్రియకూ నీకూ ఏవైనా గొడవలొచ్చాయా?’’ ఆత్రుతగా అడిగాడు సామ్రాట్.
‘‘గొడవలంటే గొడవలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే అభిప్రాయ భేదాలనవచ్చు’’ అన్నాడు మహర్షి.
‘‘సామ్రాజ్ఞి గురించి నాకూ, నా గురించి ఆమెకూ పెళ్లికి ముందు ఏమీ తెలియదు. మీ విషయం అలా కాదే! దాదాపు రెండు మూడేళ్లు కలిసి మాట్లాడుకున్నారు, తిరిగారు. ఒకరి ఇష్టాలొకరికి పూర్తిగా తెలిసిన తర్వాతే కదా పెళ్లి ద్వారా ఒకటయ్యారు’’ అన్నాడు సామ్రాట్ ఒకింత ఆశ్చర్యపోతూ.
‘‘నా గురించి తనకూ తన గురించి నాకూ పూర్తిగా తెలుసుననుకున్న తర్వాతే మేం పెళ్లి చేసుకున్నమాట నిజమే! కానీ పెళ్లికి ముందు మాకు ఒకరి గురించి మరొకరికి తెల్సింది ఆవగింజంతా, తెలియవలసింది కొండంత అనిపించింది, మా రుూ సంవ్సరం కాపురంలోనూ’’ అని అర్థోక్తిగా ఆగాడు మహర్షి.
సామ్రాట్ వౌనంగా ఉండడం చూసి తిరిగి అన్నాడు మహర్షి, ‘‘అవును... పెళ్లికి ముందు ఎప్పుడూ నేనామె కళ్లలోకే చూస్తూ ఉండటం ఎంతో ఇష్టం ఆమెకు. పెళ్లయ్యాక సమయం దొరికినపుడల్లా నేనా పని చేయడం.. వల్లీప్రియకు నచ్చని విషయాల్లో ఒకటి.. ఇప్పుడు-
గతంలో షాపింగ్‌కు వెళ్లినపుడు నేను బేరం చేసి వస్తువులు కొంటే మెచ్చుకునే వల్లీప్రియకు ఇప్పుడది నా పిసినారి గుణం క్రింద లెక్క. పెళ్లికి ముందు అప్పుడప్పుడూ నా గదికి వచ్చిన వల్లీప్రియకు నేను ఎక్కడి వస్తువునక్కడ శుభ్రంగా అమర్చి ఉంచడం ఎంతో నచ్చిన విషయం.

-ఇంకాఉంది

సీతాసత్య