డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూడండీ.. మీతో గొడవ పడ్డానికి నేనీ బస్ ఎక్కలేదు. మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నందుకు సిగ్గుపడడం మానేసి ఎదురు దబయిస్తారేమిటి?’’ అందామె.
‘‘మీకంటే ముందుగా వచ్చి ఈ సీట్లో కూర్చున్నాను. మీరు బస్ బయల్దేరేవేళకు వచ్చి నన్ను లేవమంటే నేను లేచి నిలబడి మీకు ఈ సీటు ధారాదత్తం చేయాలా?’’ అన్నాడతడు ఉక్రోషంగా.
తన పొరపాటు తెలిసి కూడా అతడలా వితండవాదం చేయటం ఆమెకు చికాకు తెప్పించింది. అతడితో మాట్లాడటం అనవసరమని అర్థమై, ‘‘కండక్టర్‌గారూ.. కండక్టర్‌గారూ..’ అని పిలిచింది అటూ ఇటూ తేరిపార చూస్తూ.
బస్ వెనుక వైపు క్రిక్కిరిసి నిలబడిన జనం మధ్యలో దాదాపు ఒంటికాలి మీద నిలబడి ప్రయాణీకులకు టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమంలో మునిగిపోయిన కండక్టర్ ఆమె నాలుగైదుసార్లు పిలిచిన తర్వాతగానీ తను చేసే పని నుంచి దృష్టి మరలించలేదు.
ఆమె జనాన్ని తప్పించుకుని అతడి దగ్గరగా వచ్చి అంది, ‘‘చూడండి కండక్టర్ గారూ.. ఆయనెవరో ఆడవాళ్ల సీట్లో కూర్చుని లేవమంటే లేవడంలేదు. ఈ బస్‌లో మేం ఆరుగురురాడవాళ్లం నిలబడి ఉన్నాం. మాకు కేటాయించిన సీట్లలో దర్జాగా కూర్చున్న మగాళ్లందర్నీ ఖాళీ చేయించి మా సీట్లలో మమ్మల్ని కూర్చోనివ్వండి దయచేసి’’.
కండక్టర్ ఆమె వైపు ఓసారి తేరిపార చూశాడు. ఆమెతో ఏదో అనబోయి, నోట్లోని మాటల్ని నోట్లోనే మింగేసి, ‘‘ఎవరండీ ఆడవాళ్ల సీట్లలో కూర్చుని లేవనంటున్నదీ! మీరంతా ఆ సీట్లలోంచి లేచి నిలబడి ఆడవాళ్లకు సీట్లివ్వండి’’ అని గట్టిగా అరిచాడు వాళ్లకు వినబడేలా.
ఉహూ, అతడంత గట్టిగా అరిచినా ఒక్కరు కూడా లేచి నిలబడే ప్రయత్నం చేయలేదు. తన మాటల్ని కూడా లెక్కచేయని ఆ ప్రయాణీలమీది కోపాన్ని తన చుట్టూ నిలబడి వున్న జనం మీద చూపిస్తూ, ‘‘జరగండయ్యా.. జరగండి.. మీ తగువులే తీర్చనా? నా ఉద్యోగమే చేయనా?’’ అంటూ మోచేతులతో జనాన్ని పక్కకు నెడుతూ బస్ ముందు భాగానికి చేరుకుని, ‘‘ఆడవాళ్లు లేనప్పుడు వాళ్ల సీట్లలో కూర్చున్నారు.. బానే వుంది. ఇప్పుడు వాళ్ళొచ్చి తమ సీట్లు తమకు ఇవ్వమంటే లేవకుండా అలా కూర్చున్నారంటే అర్థవేమిటి?’’ అన్నాడు కండక్టర్.
కండక్టర్ మాటలతో సిగ్గుపడి ఇద్దరు లేచి నిలబడ్డారు సణుక్కుంటూ. కూర్చున్నవారిలో ఒకరిద్దరు వాళ్ళను వారించబోయారు. ‘‘లేవకండి.. లేవకండి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ.
ఈసారి ఆమె కలగజేసుకుని, ‘‘కండక్టర్‌గారూ.. వీళ్లిలా మాటల్తో వినే రకం కాదు గానీ, బస్‌ను పోలీస్ స్టేషన్‌కు పోనివ్వండి’’ అంది.
ఇదంతా గమనిస్తోన్న మిగిలిన ప్రయాణికులు కలగజేసుకుని, ‘‘పోలీస్ స్టేషన్‌కెందుకూ పోనివ్వడం! వాళ్లందర్నీ బస్‌లోంచి బయటకు తోసేసి బస్‌ను పోనివ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది’’ అన్నారు.
అన్ని వైపులనుంచీ పరిస్థితి తమకు ప్రతికూలంగా మారడంతో అప్పటివరకూ మొరాయించిన మగధీరులు తమ సింహాసనాల్ని తప్పనిసరి పరిస్థితుల్లో ధారాదత్తం చేస్తున్నట్టుగా, కోరలు తీసిన పాముల్లా బుసలుకొడుతూ తాము కూర్చున్న సీట్లలోంచి లేచి ‘‘రాండమ్మా.. వచ్చి కూర్చోండి.. మీ సీట్లలో ఇంతవరకూ మమ్మల్ని కూర్చోనిచ్చినందుకు మిమ్మల్నెప్పటికీ మరచిపోం’’ అంటూ తమ కసినంతా కళ్లలో కురిపిస్తూ దీనికంతటికీ కారణభూతమైన ఆమె వైపు నమిలేసేలా చూస్తూ పక్కకి జరిగి జనం మధ్య సర్దుకున్నారు.
ఆ ప్రహసనాన్ని మొదటినుంచీ ఆసక్తితో గమనించిన సామ్రాట్ మనసు సంతోషంతో నిండిపోయింది. ఇంతకాలానికి తాను కోరుకున్న విధంగా చైతన్యంతో ప్రవర్తించిన ఆమె తీరును మనసులోనే అభినందించాడు.
దాదాపు గంటసేపు ప్రయాణించాక దారి పక్కనున్న పాకా హోటల్ దగ్గర బస్ ఆగినపుడు దిగిన కొంతమంది ప్రయాణీకులతో ఆమె కూడా దిగడంతో తన సీట్లోంచి లేచి తనూ బస్ దిగాడు సామ్రాట్.
ఆమె బస్ దిగి ఓసారి అటూ ఇటూ చూసింది. ఆమె వెనుకకు చేరిన సామ్రాట్ ఆమెను పలకరించాడు. ‘‘నా పేరు సామ్రాట్. ఇందాక బస్‌లో మీరు ప్రవర్తించిన తీరుకు నాకెంతో ముచ్చట కలిగింది. ఆడవాళ్లంతా మీలా ప్రవర్తించగలిగితే బుద్ధిలేని మగవాళ్లకు త్వరలోనే కొంచెమైనా బుద్ధొస్తుంది తప్పకుండా. మీకు నా అభినందనలు’’ అంటూ.
ఆమె అతడినోసారి చూసి చిరునవ్వు నవ్వి అంది, ‘‘ఇందులో నన్ను అభినందించేందుకు ఏవుందీ! సుఖంగా ప్రయాణించాలంటే కూర్చుందుకు నాకో సీటు కావాలి. చట్టప్రకారం ఆ అవకాశం ఉంది కనుక దాన్ని నేను ఉపయోగించుకున్నాను. అంతేగా!’’
‘‘అదే నేనూ అంటున్నాను. తమ హక్కుల గురించి తెలియనివాళ్లు వౌనంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తమ హక్కుల గురించి తెలిసిన వాళ్లు కూడా ఎదుటివారి దౌష్ట్యాన్ని వౌనంగా భరిస్తూ ఉండిపోవడంవల్లనే రావాల్సిన మార్పు ఎన్నటికీ రావడంలేదు, లేదా మార్పు రావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది మన సమాజంలో. అందుకే మీకు నా అభినందనలు!’’ ఆవేశంగా అన్నాడు సామ్రాట్.
‘‘మీ అభినందనలకు నా కృతజ్ఞతలు! సమాజంపట్ల మీకున్న ఆపేక్షకు నా అభినందనలు’’ అందామె అతణ్ణి మెచ్చుకోలుగా చూస్తూ.
‘‘బస్ మరి కాస్పే ఇక్కడ ఆగుతుందేమో.. మనం అలా కాస్త పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా?’’ అని ఆమె ముఖ కవళికల్లో వచ్చిన మార్పును గమనించి ‘‘... అహహ.. మీకభ్యంతరం లేకపోతేనే!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఇంకేం వుంది. మనమధ్య మాట్లాడుకుందుకు?!’’ అందామె ముక్తసరిగా. ఆమె మర్యాదగానే అలా అన్నా, ఆమె మాటల్లో హెచ్చరిక కూడా ధ్వనించింది సామ్రాట్‌కు.
మరేం లేదు.. మీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు అరుదు. అందుకే మరి కాస్సేపు మీతో మాట్లాడితే నాకు తెలియని విషయాలేమైనా తెల్సుకోవచ్చు కదా.. అని..’’ అని నసిగాడు సామ్రాట్.

-ఇంకా ఉంది

సీతాసత్య