డైలీ సీరియల్

దూతికా విజయం-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదడులో జరిగిపోయన సంగతులు వీరభద్రునికి కదిలాయ. అంతలో
‘‘సరస్వతిని...’’ అన్నదామె అదే తగ్గు స్థాయిలో స్పష్టంగా.
‘‘వెనుక ఎవరూ?’’
‘‘మా చెల్లెలు శారద!’’
‘‘రాజానుమతి ఉన్నదా?’’
కాపలావాడి చేయి ముందుకు జాచుకున్నది. సరస్వతి బొడ్డులోంచి గుడ్డ సంచీ తీసి కాపలావాడి చేతిలో పడేసింది. లోన నాణాల శబ్దాన్ని బట్టి అది సువర్ణమై ఉండాలని వీరభద్రుడు అనుకున్నాడు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నవనే సంతృప్తి కలిగిందతనికి.
‘‘వెళ్ళవచ్చు’’ అన్నాడు కాపలావాడు, ఆ మూటను భద్రపరచుకొని.
సరస్వతి అడుగులో అడుగు వేసుకుంటూ వీరభద్రుని చేయి పట్టుకొని చీమ నడక సాగించింది. ముందేమున్నదో, ఇలా తాము ఎంత దూరం సాగాలో వీరభద్రునికి అంతుపట్టడంలేదు. చీమ చిటుక్కుమంటే కంపించిపోతున్నాడతను. చలిచలిగా ఉన్నా వీరభద్రుని చేయి- నువ్వుల నుంచి నూనె పిండగల హస్తం- నువ్వు గింజలు లేకుండానే చెమటతో తడిసి ఓడిపోతోంది. విటుడు భయపడి చస్తున్నాడనే విషయం సరస్వతి గ్రహించింది.
హఠాత్తుగా వీరభద్రుని చీర ఎవరో వెనుకనుంచి లాగారు. ముందుకు వేసే అడుగు తడబడి క్రిందపడ్డాడు. మరుక్షణంలో కరవాలానికి తన తల యెర అవబోతుందనే ఊహ వచ్చి భయంకరంగా చావుకేక వేసేందుకు నోరుతెరచాడు. తెలివైన సరస్వతి ఇలాంటి పిచ్చి పని చేస్తాడని ముందే గ్రహించి, అతని నోటికి తనచేయి అడ్డం పెట్టింది. ఆ గండం గడిచింది. హెచ్చరిస్తూ వీరభద్రుని చేయి నొక్కిందామె. ఆ తరువాత ఆ చీకట్లో గులాబిముళ్ళలో ఇరుక్కున్న వీరభద్రుని చీర చెంగును వడుపుగా తప్పించింది సరస్వతి.
ఈ సరస్వతి లాంటి చెలికత్తె లేకుంటే రాణి సాహించి ఉండదనుకున్నాడు వీరభద్రుడు. నిజానికి ఇప్పుడు రాణి యవ్వన లావణ్యాలమీద లేదతని మనస్సు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయం- మృత్యుదేవతకూ, తనకూ మధ్య వున్న దూరం ఒక అడుగా, లేక రెండా అనే సందేహం ఒక్కటే అతని మనసును పీకి పిండిపారేస్తున్నది.
ఇంత భయపడి తీరా శయనాగారం ప్రవేశించినా రాణి ఎంత ఆకర్షించగలిగినా, ఈ చీరె చాటున వున్న తన పురుషత్వం కూడా స్ర్తిత్వానికే మారిపోతుందేమోననే కొత్త నిరుత్సాహం రక్తంతోపాటే కలిసి శరీరమంతా వేగంగా ప్రవహించసాగింది. నిజానికి ఈ సింహపు నోట్లో పెట్టిన తల మళ్లీ బయటికి లాక్కునేదాకా ‘తను’ తనుగా మనలేడు.
ఇంకా ఎన్ని యోజనాలు నడవాలో? దారి బాగా అలవాటు కాబట్టి సరస్వతి తన బరువును కూడా మోస్తున్న విధంగా మెల్లిగా నడుస్తోంది. కాళ్లకింద పురుగూ పుట్రా ఉంటే ఆ సంగతి సరస్వతికే తెలియదు. ప్రాణాంతకంగా పరిణమిస్తున్న ఈ ప్రణయం ఆరాధించదగింది కాదనే నిశ్చితాభిప్రాయం వీరభద్రుడికి ఏర్పడుతోంది. ఇంత దూరం వచ్చాక తిరిగి పోవడానికి మనస్కరించక, కానీ చూద్దామనే మినుకు మినుకు సాహసం- అంతకన్నా తెలివైన దేవతే స్వయంగా తనను నడిపిస్తున్నదనే ధైర్యం అతన్ని వెనుదిరగనీయలేదు.
సజీవ వ్యక్తిలో ఉండవలసిన రక్తోష్ణం కూడా వీరభద్రుని చేతి స్పర్శలో సరస్వతికి కానరాలేదు. నాయకుని శరీరంలో సజీవ భాగాల కన్నా, నిర్జీవ భాగాలే అధికమై ఉండాలనిపించిందామెకు. మంచుగడ్డల్లే ముడుచుకొనిపోయాడనుకుందామె. ఇక ఇప్పుడు ఏ మాటలు చెప్పి ఉత్సాహపరిచేందుకూ ఎలాంటి సావకాశమూ లేదు. ఈ శవాకారాన్ని రాణి శయన మందిరంలో ప్రవేశపెట్టి మాత్రం ఏం ప్రయోజనం?
పోనీ బైటికి పంపి మరో సమావేశాన్ని ఏర్పాటుచేయవచ్చుననుకుంటే.. ఇదంతా రాణికి చెప్పి ఒప్పించటమెలా? అదీగాక రాణి ఈ ప్రియుని కోసం స్వాతివానకు తెరుచుకుని వున్న ముత్యపు చిప్పవలె ఎదురుతెన్నులు చూస్తూ ఎంతో ఆతృతతో ఉంటుంది. ఆమే స్వయంగా అనుభవపూర్వకంగా తన ఎన్నికలోని లోపాన్ని తెలుసుకునే అవకాశాన్ని తాను పాడుచేయరాదు. ఆమె ఆజ్ఞల్ని పాటించడమే తన విధి కనుక, ఆ ఫలితాలను ఆమెకే అప్పగించటంతో తాను చేతులు కడుక్కోవచ్చు.
దివ్యానుభూతి దాపవుతున్నకొద్దీ కామోద్రేకం ఉవ్వెత్తుగా లేచేందుకు బదులు చల్లగా చల్లారిపోతుందనే విషయం అతని చేతివేళ్ళు ఆమెకు విశదీకరిస్తూన్నవి. పక్షవాత రోగివలె, రక్తపు పోటులోని హఠాత్పరిణామానికి అతను వణికిపోతున్నాడు.. అతని శరీరంలోని నరాల అల్లికంతా క్రమం తప్పి అల్లకల్లోలమై నిరుత్సాహంతో కుంచించుకుపోతూన్నదనేది స్పష్టం.
ఎవరెలా ఐతే తనకెందుకు? ఏమో - రాణి కామకళా ప్రావీణ్యురాలు. ఈ నిర్జీవిని సజీవిగా చేసి, తన కోర్కెల్ని తీర్చుకునే ఓర్పూ, నేర్పూ ఆమెకు వున్నవేమో చూడాలనుకున్నది సరస్వతి.
ఎలాగో చచ్చి చెడి వీరభద్రుణ్ణి రాణి శయనగారపు వెలుపలి భాగానికి జేర్చింది. నిజానికి సరస్వతికి కూడా ఎంతో భయంగా ఉన్నది. ఇది ప్రాణాపాయమని ఆమెకూ తెలుసు. అదీగాక ఇలాంటి పని చేయటం ఆమెకు ఇదే మొదటిసారి. ఐతే తనే భయపడితే, ఆ సూచనలు ఏ మాత్రం పొక్కనిచ్చినా, వీరభద్రుడు మరింత భయకంపితుడై, అణువు పరిణామానికి ముడుచుకొనిపోతే అతన్ని తిరిగి బైటికి పంపాలంటే నిజంగానే రుూ ఇనుప ముద్దను తన భుజాన వేసుకొని కోట బైటదాకా మోసుకువెళ్లి పడేసి రావాలి. అది అసంభవం. తన శక్తికిమించిన కార్యం. ఇతరుల సహాయాన్ని అర్థించే సావకాశం లేదు. నిర్వహణ లోపం జరిగితే యమపాశం నలుగురి మెడల్లోనూ బిగుసుకుపోతుంది. అందుకే సరస్వతి పైకి ఎంతో గంభీరంగా, ధైర్యంగా వున్నట్లు నటించటంలో శక్తివంచన లేకుండా విశ్వప్రయత్నం చేయసాగింది.
పథకాన్ని అనుసరించి వీరభద్రుణ్ణి తన పక్కనే పడుకోబెట్టింది సరస్వతి. పందెంలో పరుగెత్తిన గుర్రంవలె వీరభద్రుడు రొప్పుతున్నాడు. బహుశా చొంగ కూడా కారుస్తున్నాడేమో!
అతనిమీద నుంచి తన చేయి తీసివేస్తే తనను విడనాడినట్లు భావించి మరింత కంపించిపోతాడేమోననే అనుమానం కలిగిందామెకు. ఎక్కుపెట్టి విడువబడిన బాణం శక్తంతా వ్యయమవగా, నిర్ణీత స్థలం జేరే మునుపే భూమిని ముద్దాడే ప్రయత్నంలో నేల రాలుతున్న విధంగా అతని శరీరంలోని త్రాణంతా ఖర్చయిపోయినట్లు తోచింది సరస్వతికి. బహుశా లేచి నిలబడే శక్తి కూడా ఈ మహాకాయానికి లేనట్లయితే- తన తిప్పలు చెక్కర్లేదు. చెమటలు దిగకారుతూ అలసటతో ఊపిరందక గిలగిలలాడుతూ వొణికి ఛస్తున్నట్లున్నాడు!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు