డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఉహూ.. మీ పెదాలనుంచి వచ్చే మాటలకూ, మీ కళ్లు వ్యక్తం చేస్తోన్న భావాలకూ పోలికే లేదు. సూటిగా చెప్పాలంటే నా పేరూ, ఊరూ, వృత్తి, ప్రవృత్తి.. వగైరాలు తెలుసుకుని నాతో పరిచయం పెంపొందించుకోవాలని ఉంది మీకు. కాదంటారా?’’ అందామె సీరియస్‌గా.
తన మనసులోని మాటల్ని అంత స్పష్టంగా చదివిన ఆమె తెలివితేటలకు మనసులో అభినందించినా పైకి ఏం మాట్లాడాలో తెలియక తడబడ్డాడు సామ్రాట్.
‘‘సరే.. నాపేరు సాహిత్య. మనం బస్ ఎక్కిన ఊళ్ళోనే ఉంటున్నాను మా వారితో కలిసి. నేను చదువుకున్న చిన్నపాటి చదువుకు తగిన చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఉన్నదున్నట్టు మొహంమీద మాట్లాడడం నా ప్రవృత్తి. అంతేనా.. నా గురించి ఇంకేమైనా తెల్సుకోవాలని అనుకుంటున్నారా?’’ అందామె అతణ్ణి సూటిగా చూస్తూ.
‘‘మీరు నన్ను అపార్థం చేసుకున్నారేమో అనిపిస్తోంది. అందుకే మీ గురించి గబగబా క్లుప్తంగా చెప్పేశారు. ఏది ఏమైనా మీ గురించి మీరు చెప్పుకున్న తర్వాత నా గురించి చెప్పకపోవడం మర్యాద కాదు’’’ అంటూ తన గురించి చెప్పాడు సామ్రాట్.
అతడి మాటలనామె భావరహితంగా వింది. తన ధోరణి అతడిని ఎంతో కొంత నొప్పించిందేమో అనిపించిందామెకు.
‘‘సరే.. మీ గురించి నాకు, నా గురించి మీకూ ఎంతవరకూ తెలియాలో అంతవరకూ తెలిసింది. కాసేపట్లో మీరు దిగాల్సిన చోట మీరూ, నేను దిగాల్సిన చోట నేనూ దిగిపోతాం. కొంతకాలానికి ఇవేవీ మీకూ నాకూ గుర్తుండవు.
కాకపోతే నా సహజ ప్రవర్తనను ఇష్టపడే మగవాళ్ళలో మీలాంటి మనిషి ఒకరున్నారని నాకూ, చాలామంది ఇతర ఆడవాళ్లకు భిన్నంగా ఆకాస్త చైతన్యంతో ప్రవర్తించే నాలాంటి ఆడవాళ్లు కూడా అక్కడక్కడా ఉన్నారనే విషయం మీకూ మరికొంతకాలం గుర్తుండవచ్చు’’ అందామె.
‘‘మీరు చెప్పింది అక్షరాలా నిజం. కాకపోతే చిన్న సవరణ. నేను మీకు గుర్తుండే కాలానికంటే మీరునాకు గుర్తుండే కాలం ఖచ్చితంగా ఎక్కువని చెప్పగలను’’ అన్నాడు సామ్రాట్.
అర్థంకానట్టు చూసిందామె.
‘‘పురుషుడికి జన్మనిచ్చేది స్ర్తియే కనుక పురుషుడికీ స్ర్తిపట్ల ఉండే అనిర్వచనీయమైన భావానికీ, స్ర్తికి పురుషుడిపట్ల మామూలుగా ఉండే భావానికీ వౌలికంగా ఎంతో తేడా ఉండడమే అందుకు కారణం అని నా ఉద్దేశ్యం’’ అన్నాడు సామ్రాట్.
అతడి గొంతులో ధ్వనించిన నిజాయితీ ఆమెనీసారి అతడి మాటలపట్ల కాస్త ఆసక్తి చూపించేలా చేసింది. తన మాటలకు ప్రతిస్పందనగా ఆమె ముఖ కవళికల్లో వచ్చిన మార్పును చూసి పుంజుకున్నాడు సామ్రాట్.
‘‘అవును.. అమ్మను గుర్తుకుతెచ్చే ఏ స్ర్తిపట్ల అయినా పురుషుడికి ఆసక్తి కలగడం సహజం. స్ర్తి బలహీనురాలని అంటారు గానీ.. నిజానికి పురుషుడు మానసికంగా స్ర్తితో పోలిస్తే ఎంతో బలహీనుడు. బహుశః తల్లి పొత్తిళ్లలో పెరిగిననాడే ఆ బలహీనతకు పునాది ఏర్పడుతుందేమో!
భావావేశంతో అతడు మాట్లాడడాన్ని గమనించి అంది సాహిత్య, ‘‘ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? కొద్ది నిముషాల పరిచయంతోనే నాతో మీ భావాల్ని పంచుకుంటున్నారంటే.. నానుంచి నాకు తెలియకుండానే నేను మీతో పరిచయాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నాననే సంకేతాలేవైనా అందాయా మీకు?’’
‘‘ఉహూ మీ ప్రవర్తన ఎంతో హుందాగా ఉందని నేను మనసారా నమ్ముతున్నాను. కాకపోతే నేనిలా ఎందుకు మాట్లాడానో నాకే తెలియదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రమేయం లేకుండానే మిమ్మల్నెంతో దగ్గర మనిషిగా నా మనసు భావించడంవల్లనే అలా మాట్లాడానేమో! నా అసందర్భపు మాటలకు మన్నించండి’’ అన్నాడు సామ్రాట్ రెండు చేతులూ జోడిస్తూ.
‘‘్ఛ.. ఛ.. మీరు అప్రయత్నంగా ఏదో మాట్లాడినట్టే మనసులోని మాటను సూటిగా చెప్పడం నాకు అలవాటు కనుక నేనూ అలా అన్నాను. చూడబోతే చాలా సున్నితమైన మనస్తత్వం కలవారిలా ఉన్నారు. ఇలా అయితే ఈ సమాజంలో నెగ్గుకురావడం కష్టం’’ అని చిరునవ్వు నవ్వింది సాహిత్య.
‘‘హమ్మయ్యా.. నా మాటలు మీకు కోపం తెప్పించలేదు. అంతే చాలు నాకు..’’ అని తనూ నవ్వాడు సామ్రాట్.
‘‘కాసేపట్లో మనం ఎటూ విడిపోబోయేటపుడు నా మాటలు మీకూ, మీ మాటలు నాకూ కోపం తెప్పించినా, ఇష్టం కలిగించినా ఒకటేగా! దానికే ఎందుకంత సంబరపడిపోతున్నారు?’’ అంది సాహిత్య.
ఈసారామె మాటలు భావరహితంగా కాక ఒక స్నేహితుణ్ణి అనునయించినట్టుగా ఉండడం అతడికెంతో ఆనందాన్నీ, ఊరటనూ కలిగించింది.
‘‘అలా అనకండి. బస్‌లో మీ ప్రవర్తనకు ముగ్ధుడినై కేవలం మిమ్మల్ని అభినందించాలని మీతో మాట కలిపిన నాకు, మీ మాటలవల్ల మీకు కోపం వచ్చిందంటే బాధ కలగదూ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘మీ పేరుకూ మనస్తత్వానికీ ఎక్కడా పోలిక కనబడడం లేదు’’ అందామె అప్రయత్నంగా.
‘‘పేరుకూ మనిషికీ సంబంధం ఉండాలంటే నామకరణం తల్లిదండ్రులు కాక, తమ ఊహల్లోనూ, ప్రవర్తనలోనూ స్పష్టత వచ్చాక ఎవరి పేర్లు వారు పెట్టుకుంటే మంచిదేమో!’’ అన్నాడు సామ్రాట్.
నవ్వి ఊరుకుంది సాహిత్య.
‘‘నా పేరు సంగతి సరే! అమ్మా నాన్నలు మీకు పెట్టిన పేరుకూ, మీ నిజ జీవితానికి ఏమైనా సంబంధం ఉందేమో నేను తెల్సుకోవచ్చా?’’
‘‘ఆ.. మా అమ్మా, నాన్నా ఏ ఉద్దేశ్యంతో సాహిత్య అని పేరు నాకు పెట్టారో తెలియదు కానీ, సాహిత్యంపట్ల కాస్తో కూస్తో ఆసక్తి లేకపోలేదు నాకు’’’ అంది సాహిత్య.
సామ్రాట్ ముఖకవళికల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ‘‘నిజంగా సాహిత్యమంటే మీకు ఇష్టమా? నాకు సాహిత్యమంటే ప్రాణం. మనుషుల సమక్షంకంటే పుస్తకాల సాన్నిహిత్యమే నాకెంతో హాయిగా ఉంటుంది’’ అన్నాడు సామ్రాట్ పొంగిపోతూ.
‘‘ఈ విషయంలో నేనూ మీలాంటిదాన్ననే చెప్పాలి.

ఇంకా ఉంది

సీతాసత్య