డైలీ సీరియల్

దూతికా విజయం-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతికి ఛర్రుమంటోంది. తమను ఇక్కడ నిలవేసి ఏమిటీ యక్ష ప్రశ్నలు! ఎంత ప్రమాదమో తెలుసుకోకుండా ఏమిటీ వింత ధోరణి! దివ్వె కూడా ఆర్పని ఇతని మూర్ఖత్వానికి ఏమనుకోవాలి? సరస్వతికి చికాకు కలిగింది. కాని తన చిరాకు బైటపెడితే మరింత ప్రమాదమని సౌమ్యమైన ధోరణిలోనే జవాబిచ్చింది.
‘‘జయపాలా! ద్రవ్యమంటే తమాషాగా వున్నదా? ఇప్పటికే అక్కడి బొక్కసం నిండుకొని, అడుగంటుతోంది.. నేను తరువాత తీరిగ్గా వచ్చి అంతా విశదీకరిస్తాను!’’
ఆమె వీరభద్రునితోపాటు కదలబోయింది.
‘‘ఆగు!’’
జయపాలుని అధికారపూరిత స్వరం తగ్గుస్థాయిలో వినిపించగానే సరస్వతి ముందు కాళ్ళకు బంధాలు పడినవి. అతని ఉద్దేశమేమిటో ఆమెకు అంతుబట్టలేదు. అతని మాటపెడచెవిన పెట్టి ముందుకు సాగటం దూరాన వున్న ప్రమాదాన్ని పేరు పెట్టి పిలిచి ఘనస్వాగతం ఇచ్చినట్లే అవుతుందని గ్రహించిన సరస్వతి ఆగింది.
‘‘ఏమిటి?’’అన్నదామె మృదువుగా.
‘‘నా కోర్కె తీర్చకుండా వెళ్ళేందుకు వీల్లేదు!’’
‘‘నీకేమన్నా మతిపోయిందా యేం? అసలు ఆ కుడ్యదీపిక ఆర్పకుండా, ఇక్కడ ఈవిధంగా మనం మాట్లాడుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా?’’ అన్నది సరస్వతి.
‘‘అది మండనీ. ఆ వెలుగులో నీ ముద్దు మొహం నాకు కనిపిస్తుండాలి!’
‘‘ప్రణయ కలాపాలకు ఇదా సమయం?’’ అన్నది సరస్వతి, జయపాలుని వింత ధోరణిని ఎలా ఖండించాలో తీవ్రంగా ఆలోచిస్తూ.
‘‘మరి పగలు సమయమా?’’ వ్యంగ్యపూరితమైన అతని కంఠస్వరానికి చకిత ఐనదామె.
జయపాలుడు కూడా తెలివిమీరుతున్నట్లు గ్రహించింది సరస్వతి. అలా కానట్లయితే తాను వీరభద్రుణ్ని తోడ్కొని వచ్చేందుకు- అంటే ఇంతకుముందు కోట దాటినప్పుడే రుూ పేచీ పెట్టి వుంటే తాను తప్పక తప్పించుకునేది. చివరకు ఈ రాత్రి జరుగవలసిన సమాగమనాన్ని కూడా వాయిదా వేసి రాణిని ఏదో విధంగా సమాధానపరిచేది. అలాకాకుండా తనను వీరభద్రునితో సహా లోనికి రానిచ్చి, వేటాడదలచుకున్న మృగాన్ని ఎటూ తప్పించుకునేందుకు వీలు లేకుండా ఒక మూలకు తరిమి అష్టదిగ్బంధన చేసి, పదునైన బాణాన్ని సంధించిన విధంగా జయపాలుడు పెద్ద పన్నాగమే పన్నాడనేది తేలిపోయింది.
ఇప్పుడైనా ఈ వీరభద్రుడనే తద్దినం తన మెడలో లేకుంటే జయపాలుడ్ని చాలా సులభంగా తప్పించుకోగలిగేది. మరీ బలాత్కరిస్తే ఒక్క అరుపు అరిచి, మిగతా కాపలావాళ్ళను రప్పించి, తాను ఉద్యానవనంలోకి వాహ్యాళికొస్తే ఈ జయపాలుడు తనను బలాత్కరిస్తున్నాడనే నేరం మీద అతని తలను కోట గమ్మానికి వేళ్ళాడదీయించేది. ఇప్పుడేమి లాభం లేదు. అతన్ని సమాధానపరచగలిగే యుక్తుల్ని ప్రదర్శించటం, ఎటూ కుదరకుంటే అతనికి లొంగిపోవటం మాత్రమే మార్గాలు. ముందు మొదటిది ప్రయోగించి చూసేందుకు తానే నడుం బిగించింది.
‘‘జయపాలా! నేను చిన్నరాణి ప్రియసఖిని. నన్ను కోరటం ధర్మమా?’’ అన్నది సరస్వతి.
‘‘్ధర్మాధర్మాల ప్రమేయం వద్దు. నేను నిర్వర్తించాల్సిన ధర్మాలను ఏమన్నా కాపాడావా? రాణి చేసేది ధర్మమా? నీవు చేసేది న్యాయమా? పరదారను పంచదార వలె భావించే రుూ పెద్దమనిషి ధర్మవర్తనుడేనా? నీవెవరో నాకు తెలుసు. ఇప్పుడు నా చేతుల్లో వున్న అధికారమూ నీకు తెలుసు. ఒక నీచ కార్యంలో మనం నలుగురమూ భాగస్తులం. నా భాగానికి రావలసిన భోగాన్ని నేను ఆశిస్తున్నాను. త్వరగా తేల్చు!’’ అన్నాడు జయపాలుడు.
జయపాలుడు చాలా తెలివిగా మాట్లాడాడు. పగలైతే చిన్నరాణి ఆంతరంగికురాలుగా తనను ఎంతో గౌరవించి ఉండేవాడితను. తానీ నీచానికి పాల్పడకున్నట్లయితే తనను కనె్నత్తి చూసేందుక్కూడా ఇతడు సాహసించి ఉండడు. ఇప్పుడు తను ఎంత లోకువైపోయింది!!
అతనిది స్థానబలిమి. ధర్మబాహ్యమైన పనిలోకి దిగాక, చట్టవిరుద్ధమైన అవినీతికరమైన పనులు చేయనిదే కుదరదు మరి. తన తక్కువతనం తనకు తెలుస్తూనే వున్నది. అంటే జయపాలుని ఆధిక్యం కూడా గ్రహించటం జరుగుతూనే వున్నది.
నీచులే నీచకార్యాలు చేస్తారనేది నిజం కాదు. నీచకార్యాన్ని చేశాకనే నీచుడనే ముద్రపడుతుంది. ఉత్తములు కూడా అవసరార్థం, స్వార్థాన్ని తృప్తిపరచుకునేందుకు నీచ కార్యలకు పాల్పడుతున్నారు. అందుకు సిద్ధమయ్యాక మెట్టు మెట్టుగా జారడం తప్పదు మరి!
జయపాలుడు సైంధవుడంతటి బలశాలిగా ఈ సమయంలో అడ్డుకున్నాడు. మాటల్లో అతను చూపే కౌశలం గ్రహించాక, వాదనలో జయించగలనా అనే సందేహం సరస్వతిని పీడించసాగింది.
‘‘జయపాలా! రేపు రాత్రికి కలుసుకుంకటాను- ప్రమాణం!’’ అన్నది సరస్వతి. ఇప్పటికి ఇతని బారిన పడకుండా తప్పించుకుందామని.
నిజంగా అతను నమ్మితే- తన మాట మీద ఇంత గురి గలవాణ్ని- తప్పక కలుసుకోవాలని కూడా అనుకున్నదామె. అదీగాక ఇది ఇంతటితో అంతమయ్యే వ్యవహారం కాదు కనుక తన వాగ్దానాన్ని నిలబెట్టుకోనిదే ముందుకు సాగటం దుర్లభం కూడాను!
ఐతే జయపాలుడు ఆమె మాటల్ని లెక్కచేయలేదు. ఇదివరకు మాటను నిలబెట్టుకోని మగువ, ఇకముందు మాత్రం నిలబెట్టుకుంటుందనే నమ్మకం అతనికి కలగలేదు. ఇంత గొప్ప అవకావం మళ్లీ ఎప్పటికి వస్తుందో, అసలు రానే రాదేమోననే తలపు కూడా అతన్ని వేధిస్తోంది. చేతుల్లో ఉన్నదాన్ని వదులుకునేటంత మూర్ఖుడు కాలేడు తను!
‘‘ఈ రేపులు చాలా ఐనవి. రేపనేది వేరొక రోజు. రేపు రాజెవరో, రెడ్డెవరో?’’- - ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు