డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గుర్తుంచుకో! పిల్లిలా ఉండే మొగాడు ఉన్నట్టుండి పులిలా మారాడంటే పెళ్లాం పట్టు అతడిమీద సడలినట్టే! అలా సడలడానికి కారణం.. సాధారణంగా మరో ఆడదాని సహాచర్యం అతడికి దొరకడమే అయ్యుండే అవకాశాలే ఎక్కువ!’’ తల్లి మాటలు గుర్తుకురాగానే సామ్రాజ్ఞి గుండె ఝల్లుమంది!
ఆఫీస్ టూర్‌మీద పొరుగూరి వెళ్లి నాల్రోజులుండి వచ్చాడు సామ్రాట్. టూర్‌కు వెళ్లకముందు సామ్రాట్ ఇలా లేడు.
ఏమాటంటే తనెక్కడ కోపగించుకుంటోందో అన్నట్టుగా మెత్తగా ఉంటూ తననెప్పుడూ ప్రసన్నం చేసుకుందుకు ప్రయత్నించే మనిషి.. ఊర్నించి వచ్చాక అందుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడంటే ఈ నాల్రోజుల్లోనూ ఏ వగలాడి ఊతమైనా దొరికిందా ఈ మహానుభావుడికి!
ఆలోచనల్లోంచి తేరుకుని ఒకసారి అతణ్ణి పరీక్షగా చూసింది.
పచ్చని ఛాయ, కోలమొహం, వింత ఆకర్షణ గొలిపే కళ్లూ, తీర్చిదిద్దినట్టుండే కనుబొమలూ, సూటిగా ఉండే ముక్కు, ఎప్పుడూ నవ్వుతూన్నట్టుండే పెదాలూ, విశాలమైన ఛాతీ, పొడవైన ఆకారం, ఎత్తుకు తగిన ఒళ్లూ, ఇలా ఏ విధంగా చూసినా సామ్రాట్ అందగాడే!
పెళ్లికొచ్చిన తనకున్న కొద్దిమంది స్నేహితురాళ్లూ సామ్రాట్ అందాన్ని బాహాటంగానే మెచ్చుకున్నప్పుడు తన మనస్తత్వానికి భిన్నంగా తనూ మురిసిపోయింది అప్రయత్నంగానే.
‘‘అందం ఆడదానికే గానీ మగాడికి అందంతో పనేముందనే వాతావరణంలో పెరిగింది తను. తనలా అనుకుందుకు కారణం తన తల్లిదండ్రులే!
తన తల్లి దొండపండైతే తన తండ్రి కాకి ముక్కు. తన విలువేమిటో తెలిసిన దొండపండు కాకి ముక్కుకి దొరక్కుండా, కాకినే ఆడించినట్టుగా తన తండ్రిని అదుపాజ్ఞలో ఉంచి సంసారం నడుపుకొచ్చింది తన తల్లి.
కానీ కూతురి విషయానికొచ్చేసరికి.. అసలైన తల్లిలానే ఆలోచించి సామ్రాట్ వంటి స్ఫురద్రూపిని కట్టబెట్టి సంతోషపడిందామె. కూతురు జీవితాంతం సంతోషంగా భర్తతో కాపురం చేయాలంటే ఏం చేయాలో తనకున్న పరిజ్ఞానంతో బోధించింది.
‘‘ఈ లోకంలో తన సుఖ సంతోషాల్ని మనసారా కోరుకునే మొదటి వ్యక్తి తన తల్లే!’’ అని మనసా, వాచా నమ్మిన సామ్రాజ్ఞి తన తల్లి సలహాల్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించింది తొలి రాత్రినుంచే.
‘‘లేదు, కాదు, కుదరదు.. నాకిష్టంలేదు.. వగైరా పదాల్ని వీలైనపుడల్లా ఉపయోగించడమే గొప్ప గొప్ప సమర్థులైన వాళ్ల కార్యనిర్వహణలోని విజయసూత్రం’’ అనే తల్లి సూచనలను తు.చ తప్పకుండా పాటించింది సామ్రాజ్ఞి.
అందుకు తగినట్టుగానే తన ఆలోచనలకనుగుణంగా సామ్రాట్ ప్రవర్తిస్తుండడంతో.. ఆమెకు తను అనుసరిస్తోన్న పద్ధతి సరైనదే అనిపించి.. లోలోపల ఎంతో మురిసిపోయింది కూడా.
కానీ ఆ రోజు సామ్రాట్ ప్రవర్తన తన ఊహలకు భిన్నం ఉండడంతో కొంచెం కలవరవపడింది. ‘గుర్రం కళ్లాలు తెంచుకుని పారిపోతోందా?’ అనిపించిందామెకు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలో తల్లి చెప్పిన మాటల్ని గుర్తుకుతెచ్చుకుంది.
‘‘మొగుడు మన ఉనికిని పట్టించుకోనట్లుగా ప్రవర్తించినపుడు ఆడది విరుచుకుపడిపోకుండా లాలనతో అతణ్ణి దగ్గరకు తీసుకుందుకు ప్రయత్నించి లొంగదీసుకోవాలి. అలా కాకుండా ఆ సమయంలో అరచి అల్లరి చేసినా, పెడసరంగా మాట్లాడినా మగాడు బిగుసుకుపోతాడు.
ఎంత పనికిమాలిన మగవాడిలో అయినా అహంభావం అనే లక్షణం అంతర్లీనంగా ఉంటుంది. అసూయ ఆడదానికి ఎలా సహజ లక్షణమో అలానే అహంభావం కూడా మగాడి సహజ లక్షణం.
ఆడదాని అసూయకు కారణం- ఆమెలో తరతరాలుగా ఉన్న అభద్రతాభావమూ, మగాడి అహంభావానికి కారణం- తన దౌష్టాన్ని ఎన్నో యుగాలుగా వౌనంగా భరిస్తూ వస్తోన్న ఆడదానితో సాహచర్యమూ కావచ్చు. అది వేరే విషయం!
మగాడు ఎదురుతిరిగినపుడు అతడితో సమానంగా గొంతుపెంచితే నష్టపోయేది ఆడదే! ఆ సమయంలో కోపంతో ఎత్తిన పడగను తాత్కాలికంగా దించి తన మనసులోని విషాన్ని.. భర్త అమృతంలా భావించే విధంగా పడకగదిలో శారీరక కలయిక ద్వారా భర్త మనసులోకి పిచికారీ చేస్తే.. మగాడు తోక ఊపుకుంటూ, చొంగ కార్చుకుంటూ ఆడదాని చుట్టూ తిరుగుతాడు.
తన ఆలోచనల్లోంచి తేరుకుని, ‘‘ఏవండీ.. అని లాలనగా పిలిచింది సామ్రాట్‌ను. భార్యనుంచి కర్ణకఠోరమైన పలుకుల్నే వినడానికి అలవాటుపడ్డ అతడి చెవులు మృదువైన ఆ పిలుపును స్వీకరించేందుకు చాలా కష్టపడ్డాడు. అందుకే అతడేమీ సమాధానమివ్వలేకపోయాడు.
తన పిలుపుకు స్పందించని భర్తనుద్దేశించి ఈసారి కొద్దిగా స్వరం పెంచి, ‘‘ఆ పుస్తకం తర్వాత చదూకోవచ్చు. భోజనం వడ్డించమంటారా?’’ అంది సామ్రాజ్ఞి.
సామ్రాట్ తల పైకెత్తి ఆశ్చర్యగా ఆమె వైపు చూసి, ‘‘ఏవిటి.. ఈరోజు కొత్తగా..’’ అన్నాడు.
అతడి మాటల్ని పట్టించుకోనట్టుగా ‘‘నేను మామూలుగానే పిలిచాను.. అయినా నా పిలుపేగానీ నేను కొత్తగా కనిపించడం లేదా మీకు?!’’ అంది సామ్రాజ్ఞి చిరునవ్వును పెదాలమీదకు తెచ్చుకుంటూ.
ఆశ్చర్యాన్నుంచి కోలుకోకుండానే లేచి చేతులు కడుక్కుని డైనింగ్ టేబిల్ ముందు కూర్చున్నాడు సామ్రాట్. వండిన పదార్థాలన్నీ సామ్రాట్ మెచ్చుకున్నా ఏనాడూ పట్టించుకోని సామ్రాజ్ఞి ఆ రోజు, తనంతటతానే వాటి బాగోగుల్ని గురించి వివరంగా అడిగి తెల్సుకుంది. అతడి వ్యాఖ్యానాలకు మురిసిపోయినట్టు నటించింది.
సామ్రాట్‌కు ఏయే వంటకాలు ఇష్టమో అడిగి తెల్సుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సామ్రాట్‌కు అతడి తల్లి గుర్తుకు వచ్చేలా ప్రవర్తించింది. జరుగుతున్న తతంగం కలో, నిజమో సామ్రాట్ ఊహకు అందలేదు.

-ఇంకా ఉంది

సీతాసత్య