డైలీ సీరియల్

దూతికా విజయం-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో తెలివిగలవాళ్ళు మూర్ఖుల్ని మోసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అది సహజం కూడాను. ఐతే మూర్ఖులు కూడా ఒక్కోసారి అహంభావంతో, తాము కూడా తెలివిగల వాళ్ళమేనని పొరబడి, ఆ తెలివిని తెలివిగా ప్రయోగించబోయి, తమకు తెలియకుండానే బోర్లాపడి, తమ మూర్ఖత్వాల సంఖ్యకు మరొకటి కలుపుకుంటారు. ఇలాటిదే రుజూ అయ్యేందుకు జయపాలుడు ఇప్పుడు మరోసారి కొత్తగా ప్రారంభోత్సవం చేశాడని సరస్వతి పసిగట్టింది.
ధర్మపాలుని లాటి విజ్ఞాన సూర్యుని ముందు, ఈ వెధవ జయపాలుని విజ్ఞాన దీపిక వెలవెలబోక తప్పదు. త్వరలోనే తన భంగపాటు జయపాలుడు తెలుసుకుంటాడు!
కొన్ని మూర్ఖపుపనులు మూర్ఖులకోసం ప్రత్యేకించబడి ఉన్నవి. తెలివైనవారు ఆ ఛాయలకే పోరు. ఐతే పరిస్థితుల వత్తిడి కారణంగా విధి పన్నిన వలో చిక్కుకోక తప్పదు. ఒక్క క్షణం పాటు తనను కమ్మిన మూర్ఖత్వానికే కదా ఇప్పుడు నాలుగు మానవ ప్రాణాలు బలి అనే అపరాధం చెల్లించవలసి వొస్తోంది!
సరస్వతి తనలో తాను తర్కించుకున్నది. ఆమె మనసు పందెపు గుర్రంవలె పరుగులెత్తుతుంటే, దాన్ని అదుపులో ఉంచలేక సతమతవౌతున్నది.
జయపాలుని నోటివెంట పురుష వాచకం వినగానే రాజు, జయపాలుణ్ణి ఒకసారి తేరిపార జూచాడు. ఆ తరువాత వీరభద్రుని వీపులో ఉన్న బల్లాన్ని లాగివేయమని ఆజ్ఞాపించాడు. వీరభద్రుని కాయాన్ని వెల్లకిలా తిప్పించి ఇంకా అతనిలో ప్రాణం ఉన్నదేమోనని చూశారు. భయమంతా ఘనీభవించి ఉన్నదా ముఖంలో. గుడ్లు వెళ్ళుక వొచ్చి, నాలుకు బైటికొచ్చింది. చూస్తేనే అది శవమని అర్థవౌతున్నప్పటికీ నాడీ, శ్వాస కూడా చూసి నిర్ధారణ చేయబడింది.
అతని తలమీద శిరోభూషణాన్ని లాగివేశాక అతడు పురుషుడేనని నిశ్చయంగా తెలిసిపోయింది.
కోపోద్దీపితమైన సింహం బలంగా గాలి పీల్చి, కొత్త శక్తుల్ని పంజుకుంటున్న విధంగా రాజు శబ్దమయ్యేటట్లు శ్వాస పీల్చాడు. ఆయన కళ్ళు ఎరుపెక్కినవి. ముక్కుపుటాలు సాధ్యమైనంతవరకూ సాగినవి. ఒక్క క్షణం కోపంతో మాటలు రాక తడబడ్డాడు. అంతలోనే తనని తాను సంబాళించుకొని యథాస్థితికి వచ్చేందుకు ప్రయత్నించాడు. కాని పరిపూర్ణ విజయం లభించలేదని ఆయనకూ తెలుసు, ప్రేక్షకులకూ తెలుసు.
ఈ విచారణ రాణివాసానికీ, తన వ్యక్తిగతమైన ఆంతరంగిక జనానికీ సంబంధించినదనే విషయం రాజుకు అర్థమైంది. కనుక ఇక్కడ గుమిగూడిన వారిలో అత్యవసరమైన వారినే ఉంచి, మిగతా వాళ్ళను పంపెయ్యటం సముచితమని ఆయన భావించాడు.
‘‘ఈ హత్య చేసినవాడు గాక, మరో నలుగురు యోధులు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు ద్వార రక్షణలకు వెళ్ళిపోండి... దాసదాసీజనం వెళ్ళవచ్చు. రాణి దగ్గర ఇద్దరు ఉండండి. మరో ఇద్దరు సహాయానికి కాస్త దూరంగా ఉండండి...’’
రాజాజ్ఞ ప్రకారం క్షణంలో అంతా ఆయన కోరినట్లు సర్దుకున్నది.
ఈ సమయానికి మంత్రి కూడా వచ్చాడు. మొదట్లో మంత్రికి ఏమీ అర్థమవలేదు. రాజు వివరంగా చెప్పాలనే ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చనూ లేదు. కేవలం చూసేదాన్ని, వినేదాన్ని బట్టి మంత్రి సాధ్యమైనంతవరకూ పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నాడు.
‘‘బల్లాన్ని ప్రయోగించినవాడు నా ముందుకు వచ్చి నిలబడాలి!’’
జయపాలుడు రాజు ముందు తల వంచుకుని నిలబడ్డాడు. ‘‘ఇతన్ని నిరాయుధుడ్ని చేయండి!’’ యోధులు జయపాలుని కత్తినీ, మొలలోని బాకునూ లాగిపారేశారు. జయపాలుడు ఉద్రేకాన్ని తగ్గించుకొని చెల్లాచెదురైన తన శరీరాన్ని జాగ్రత్తగా కూడదీసుకుంటున్నాడు. ఈ విచారణలో వొళ్ళు దగ్గర పెట్టుకుని ఒక కట్టు కథ చెప్పాలనీ, అది బెడిసికొడితే తనకు మరణదండనా, అంగీకరించబడితే రాజుగారి మెడలో వేళాడే రత్నాల హారమూ లభ్యవౌతాయని అతనికి తెలుసు. కష్టసమయంలో మెదడు మరింత పదునుగానూ, సందర్భోచితంగానూ పనిచేయక తప్పదు. అందుకని జయపాలుడు మరింత జాగరూకతతో సర్వసంసిద్ధుడై ఉన్నాడు.
మంత్రి విప్పారిన వదనంతో రాజుతో రహస్యంగా అన్నాడు.
‘‘ఇతను ఈ సంవత్సరం నవరాత్రోత్సవాలలో బలప్రదర్శనల్లో ప్రథమ బహుమతి పొందిన వీరభద్రుడు మహారాజా!’’
ఇది రహస్యంగా చెప్పదగ్గది కాదనే ధోరణిలో రాజు బాగా వినిపించేటట్లు, ‘‘ఔను.. గమనించాను. అంతేకాదు రుూ వీరభద్రునికి కండబలమే కాని, గుండెబలం లేదని తెలుసుకున్నాను’’ అన్నాడు. విచారణ సమయంలో వీరభద్రుని శవం, కంటికి కంటప్రాయంగా ఉండటంవల్ల ‘ఈ శవాన్ని తీయించేద్దామా?’ అన్నాడు మంత్రి.
‘‘ఉండనివ్వండి. సాక్షులందరూ దాన్ని చూసన్నా తమకూ అదే గతి పట్టకుండా నిజం చెప్పే బాధ్యతను గుర్తించి, ఆ సదవకాశాన్ని దుర్వినియోగం చేసుకోరు గాక!’’ అన్నాడు రాజు, గంభీరంగా అందరికీ వినిపించేట్లు.
ఈ రాజు ‘్ధర్మపాల’ నామధేయుడు- సార్థక నామధేయుడని ప్రతీతి. అంతేకాదు ధర్మశీలుడని అందరికీ తెలుసు. గందరగోళంగా గిజిగాని గూడులె వున్న ఈ అయోమయాన్ని ఏ విధంగా ఛేదించి న్యాయరక్షణ, దుష్టశిక్షణ జరుపుతాడోనని ప్రేక్షకులు ఎంతో ఆతృతతో, ఉద్వేగంతో వేచి ఉన్నారు. సరస్వతి ఒక్కతే నిబ్బరంగా, నిర్లక్ష్యంగా ఉండగలిగింది.
‘‘నీ పేరేమిటి? ఉద్యోగం ఏమిటి?’’ అన్నాడు రాజు జయపాలుడ్ని తేరిపార జూచి.
రాజు వీక్షణాల నుంచి తప్పించుకుంటూ తల వంచుకొనే, ‘‘నా పేరు జయపాలుడు.. నేను దక్షిణ ద్వారపాలకుడ్ని మహారాజా!’’ అన్నాడు జయపాలుడు.
‘‘ఇతన్ని ఎప్పుడన్నా చూశావా? ఎరుగుదువా? పరిచయం వున్నదా?’’

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు