డైలీ సీరియల్

దూతికా విజయం-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఒక్కక్షణం రాజు వదనాన్ని సమీక్షించింది. ఆయన ముఖాన్ని కారుమేఘాలు కమ్మినవి. తీవ్రమైన ఆలోచనలలో ఆయన మునిగారని, సత్యాన్ని క్షణంలో, అర్జునుని వాడిబాణంతో పాతాళగంగ పైకి లేచి అంపశయ్యమీది భీష్ముని నోటికి అందినవిధంగా చేయగలరనే నమ్మకం సరస్వతికి ఏర్పడింది.
రాజు నోటినుంచి రాలే ముత్యాలు ఏరుకునేందుకు అందరూ సంసిద్ధులుగా ఉన్నారు. అవి నిజమైన రత్నాలే అవుతవనే ధైర్యంతో జయపాలుడు వేచి ఉన్నాడు.
రాజు మొహం పైకెత్తి ‘‘జయపాలా! దివ్వె పట్టుకుని ఆ ఆకారాల దగ్గరికి వెళ్ళానన్నావ్ కదూ!’’ అన్నాడు.
‘‘ఔను మహారాజా!’’
‘‘ఆ దివిటీతోనే ఇతన్ని వెంటాడావా?’’’
‘దివిటీ’ అనే పదం ద్వారపాలకుడుగా తనకు సహాయంగా ఉండేందుకుగాను తనకిచ్చిన దివిటీ మాత్రమేనని జయపాలుడూ, తదితరులూ అభిప్రాయపడ్డారు. అది సర్వ సామాన్యాభిప్రాయం. కాని రాజు ఉద్దేశ్యం ‘సూర్యునంత వెలుగునివ్వగల నా విజ్ఞానం ముందు- దివిటీలాటి నీ విజ్ఞానాన్ని ప్రదర్శింపజూస్తున్నావా?’ అనే ఈసడింపు, హెచ్చరికాను. ఆ విషయం రాజుకూ, సరస్వతికీ మాత్రమే తెలుసు. చిక్కుపడిన దారంలోని ఒక కొస రాజుకు చిక్కిందనీ, ఇక మిగతాదంతా వరసగా క్రమం తప్పకుండా రాగలదనీ సరస్వతికి స్పష్టమైంది.
ఆ ప్రశ్నతో జయపాలునికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఒక్క క్షణం ఆలోచించి, ‘‘లేదు మహారాజా! ఆ దివ్వెను అక్కడే ఉద్యానవనంలోనే పారేసి ఇతన్ని వెంటాడాను. చేతిలో దివ్వె కూడా ఉంటే కాలు సాగదని దాన్ని అక్కడే వదిలేశాను’’అన్నాడు జయపాలుడు.
‘‘అసలు నీ ఆధీనంలో ఎన్ని దివిటీలు ఉంటవి?’’
‘‘రెండు మహారాజా! ఒకటి గోడలోనే గుచ్చబడి ఎక్కువ కాంతినిచ్చే కుడ్యదీపిక. మరొకటి అవసరమైతే అల్లంత దూరానికి వెళ్ళి చూసేందుకు వీలుగా ఉండే తేలికైన కరదీపిక. కరదీపిక అవసరమైనప్పుడే వెలిగించబడుతుంది’’.
‘‘కరదీపికను వెలిగించే వ్యవధి కూడా లేనందున కుడ్యదీపికతోనే ఆగంతకులను పరిశీలించావా?’’’
‘‘ఔను మహారాజా! కుడ్యదీపిక కనుకనే బరువై అక్కడే వదిలేయవలసి వచ్చింది!’’’ బతికి బైటపడ్డానీ, తన తెలివితేటలతో అందర్ని నమ్మించగలిగాననీ జయపాలుడు పొరబడ్డాడు!
అపాయం ఎదురయ్యేప్పటికి సురక్షిత స్థలమనే నమ్మకంతో అబద్ధమనే ఊబి నేలమీదికి జయపాలుడు ఉరికాడనీ, అతని బరువుకే అతను అధఃపాతాళానికి కుంగిపోక తప్పదని సరస్వతి గ్రహించింది.
ఇదంతా గాఢాంధకార బంధురంగా ఉండే వాతవారణంలో జరిగింది కనుక, బ్రహ్మరుద్రాదులైనా తన మాటల్ని నమ్మక తప్పదనే ధీమా జయపాలునికి కలగడం సహజమే! కాని, కటిక చీకటిలో బలహీనమైన కాంతి కిరణం కూడా ఎంతో కాంతివంతంగా ప్రజ్వరిల్లుతుందనే న్యాయం జయపాలునికి తెలియదు. చీకటికి వేయికళ్ళనేది కేవలం సామ్యం మాత్రమే కాదేమో? అందునా ధర్మపాలుని కుశాగ్రబుద్ధి చొరలేని కారు చీకట్లను ఈ ప్రకృతి సృష్టించలేక, తన అసమర్థతను ఒప్పుకోక తప్పదనేది త్వరలోనే రుజువు అవుతుందని సరస్వతికి నమ్మకంగా తెలుసు!
జయపాలుడు మొట్టమొదటి అబద్ధం ఎప్పుడైతే వాగాడో తన గోతిని తానే తవ్వుకున్నవాడయ్యాడు. దాన్ని నిజంగా రూపొందించేందుకు మరికొన్ని అబద్ధాలను అల్లుతున్నాడు. అవి నిలిచేవి కావు. తనను తాను గురిచూసుకొని పదునైన బాణాన్ని గురి తప్పకుండా విడిచాక, తన చావుకు తానే కారకుడు గాక తప్పదు. ఐతే గొలుసులోని ప్రతి లంకెకూ ఉండే సంబంధాన్ని అనుసరించి, జయపాలునితోపాటే, తనూ, రాణి కూడా దోషులవక తప్పదనే సత్యం సరస్వతికి స్పష్టమైంది.
‘‘మంత్రీ! మీరొక భటుణ్ణి తీసుకొని దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళిరండి. కుడ్యదీపిక ఎక్కడ వున్నదో చూడండి. ఇది ఒకవేళ గోడలో లేకుంటే ఉద్యానవనానికి దక్షిణ ద్వారానికి ఉండే సరిహద్దు సామీప్యంలోనే నేలమీద పడి ఉండొచ్చు. ఇంకా వెలుగుతూంటే సరే- లేక ఆరిపోయి వుంటే నేలమీది పచ్చికా, దీపికకు సమీపంలో వున్న చిన్న మొక్కలూ కాలిపోయిన గుర్తులున్నవేమో గమనించండి.. అన్నట్లు ఇక్కణ్నుంచే ఒక దీపిక తీసుకొని వెళ్ళండి’’ అని మరొక భటునితో ‘‘వీణ్ణి రుూ ద్వారపాలకుణ్ని బంధించు!’’ అని రాజు ఆజ్ఞాపించాడు.
జయపాలుడు వెంటనే బంధించబడ్డాడు. తాను చెప్పిందంతా అబద్ధమని రుజువు అవ్వబోతుందనే సంగతి అతనికి తెలిసిపోయింది. అయితే నోటి నుంచి బైటపడిన మాటను ఉపసంహరించుకోవటం ఎలా?
తాను చెప్పినదాన్ని అతికేందుకు ఆ కుడ్యదీపిక తిరిగి గోడలోనే ఉంచేశానంటే ఇప్పుడెవరు నమ్మరు. అదీగాక తాను వెనక్కు వెళ్లి దాన్ని గోడలో ఉంచి వీరభద్రుణ్ణి వెంటాడానని చెపితే మాత్రం - ఆ తొందరలో దొంగగా అనుమానించినవాణ్ని పట్టుకునేందుకు మారుగా ఈ తతంగం చేశానంటే ఏ విధంగానూ సబబనిపించదు. క్షణంలోనే ఇదంతా తలకిందులైనందుకు జయపాలుడు నీరుకారిపోయాడు.
సాక్ష్య కథనారంభంలో కాంతివంతంగా వున్న అతని మొహం ఇప్పుడు వెలవెలబోతున్నది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరెన్ని అసత్యాలాడినా, ముందుకు సాగినకొద్దీ అదంతా పెద్ద అతుకులబొంతగానే తయారవుతుందనే సత్యం ఇప్పుడిప్పుడే అతనికి తెలిసివస్తోంది. ఏం లాభం? అంతా మించిపోయింది!
రాజు మెడలోని రత్నాలహారం మీద కాదిప్పుడు జయపాలుని దృష్టి, తన ప్రాణాన్ని కాపాడుకోవటమే గగన కుసుమమయే విషమ పరిస్థితిలో పడి తప్పించుకునే మార్గాలేమన్నా ఉన్నవా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు