డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుకూ రేపటికీ తేడా ఉండాలి. ఈ రోజైన అనుభవాలు, రేపు కాబోయే అనుభవాలు ఒక్కటిగానే ఉంటే జీవితంలో సారం ఏముంటుంది?
మనిషి సగటు ఆయుఃప్రమాణం డెబ్భై సంవత్సరాలనుకుంటే.. కనీసం నెలకో కొత్త అనుభవం చొప్పున.. పోనీ చిన్నప్పటి పదిహేనేళ్లు తీసేసినా.. యాభై అయిదూ ఇంటూ పనె్నండూ.. అంటే ఎడు వందల ఇరవై అనుభవాలైనా రుచి చూడకుండా చచ్చిపోతే ఎలా?’’ అన్నాడు గౌతమ్.
‘‘కొత్త అనుభవాలంటే.?’’ అన్నాడు సామ్రాట్.
‘‘అతి తక్కువ వ్యవధిలో పునరావృతం కానిదేదైనా కొత్త అనుభవమే నా దృష్టిలో. మీకు మందు కొట్టే అలవాటుందో లేదో నాకు తెలియదు. ఉదాహరణకు మందు కొట్టడం ఒక అనుభవం అనుకుంటే.. రకరకాల బ్రాండ్‌లు రకరకాల మోతాదుల్లో మార్చి మార్చి తీసుకోవడం ద్వారా మందు కొట్టడమనే దుర్వ్యసనాన్ని కూడా స్టీరియో టైప్ గాకుండా.. వివిధ రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు.
అలానే సిగరెట్లూ, అన్నిటికంటే మిన్నగా మగువా! అన్నట్టు మీకు పెళ్లయింది కదూ?!’’ అన్నాడు గౌతమ్.
తలూపాడు సామ్రాట్.
‘‘మరింకేం.. భార్యకు భర్తమీదా భర్తకు భార్యమీదా ఎంత ఇష్టమున్నా, ఆ ఇష్టం అలానే కలకాలం ఉండాలంటే వాళ్లిద్దరూ పరస్పరం ఒకరినొకరు అమితంగా ఇష్టపడటం తగ్గించుకోవాలి.
అలా తగ్గించుకోవాలంటే రకరకాల పూలమీద వాలే భ్రమరాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. శీలం అనే పదం ఉనికిని పట్టించుకోనివాళ్లే జీవితాన్ని ఆస్వాదించగలరని నా నమ్మకం’’ అన్నాడు గౌతమ్.
అతడి మాటలు విడంతవాదంలానూ, అతడో పెర్వర్ట్‌లానూ అనిపించాడు సామ్రాట్‌కు.
‘‘మరైతే ఈ వివాహ వ్యవస్థ ఎందుకు? ఈ కట్టుబాట్లెందుకు? సంఘ నియమాలెందుకు?’’ అన్నాడు సామ్రాట్ అతడి మాటల్ని ఖండిస్తూ.
‘‘మీ ప్రశ్నకు సమాధానం రెండు పదాల ఒక చిన్న వాక్యంలో చెప్పాలంటే ‘ఇదంతా ట్రాష్!’.. తమ మీద తమకే నమ్మకం లేని మన మగజాతికి చెందిన చేతకాని దద్దమ్మలు తమ అహాన్నీ, ఆధిపత్యాన్ని తాము జీవించి ఉన్నంతకాలమూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా తృప్తిపరచు కుందుకేర్పరచుకున్న నియమాలివి.
గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి. ఈ లోకంలో భార్యలందరూ త్రికరణశుద్ధిగా అనవరతమూ భర్తనే తప్ప ఇతర మగవాళ్లను మనసులో కూడా తలచుకోకుండా జీవితాలు గడపుతున్నారా?
అలానే మగాడు. నిజాయితీగా భార్యను ప్రేమించే మగాడు కూడా ఏ సందర్భంలోనూ మానసికంగా కూడా పరాయి స్ర్తి పట్ల ఆకర్షితుడు కాడా? అతడి మనసు ఏ సందర్భంలోనూ కొంచెమైనా చలించదా?!’’ అన్నాడు గౌతమ్. ‘ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ అంత దొంగ మరొకడుండడు’ అన్నట్టుగా.
సామ్రాట్‌కే కాదు.. శీలం గురించి ఉపన్యాసాలు దంచే ఎవరికైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే!
‘‘మీరు చెప్పిందాంట్లో వాస్తవముంటే ఉండొచ్చు. కానీ ఎదుటివారి పట్ల ఒకసారో, కొన్నిసార్లో మనసు చెదిరినంత మాత్రాన వారు సమాజ నియమాలను ఉల్లంఘించినట్టూ, శీలాన్ని కోల్పోయినట్టూ కాదు కదా!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆ.. ఇప్పుడు మీరు నా దారిలోకి వస్తున్నారు.. మీ దృష్టిలో శీలమంటే ఏమిటి? అది మనకు అర్థంకాని బ్రహ్మపదార్థమా?! దాని రూపం భౌతికమైనదా? మానసికమైనదా? చెప్పగలరా!’’ అన్నాడు గౌతమ్.
సామ్రాట్ మాట్లడకపోవడంతో తిరిగి తనే అన్నాడు గౌతమ్, ‘‘సరే.. నేనే చెప్తాను. నా దృష్టిలో సమాజ నియమాల ప్రకారం మనం నిర్దేశించుకున్న ఒకానొక లక్షణం శీలం అంటే.
ప్రజల అవసరాలననుసరించి దేశాలు కాలానుగుణంగా చట్ట సవరణలు చేసినట్టే సమాజ నియమాలు కూడా కాలంతో మారుతూంటాయి. కాకపోతే చట్టాలు మార్చినపుడు ఆ విషయం ప్రజలకు తెలిజేయబడుతుంది. కానీ సంఘ నియమాల్లోని మార్పు చాప క్రింద నీరులాంటిది.
చాపమీద కూర్చున్న వారికి తమ దేహానికి నీటి స్పర్శ తెలిసినపుడే చాప క్రింద నీరు చేరిందని తెలుస్తుంది. అంటే.. ప్రజల బాగు కోరి కొంతమంది మేధావులు ఆలోచించి చట్టాలు చేస్తే సంఘంలోని మార్పును మనసులో కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నా ఎవరూ తమ ఊహల్ని బాహాటంగా చెప్పుకుందుకు ముందుకురారు.
కానీ వాళ్లు తమ ఇష్టానికనుగుణంగా తాము చేసే పనులు సంఘ నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి పిరికివాళ్లలా పక్కవాడికి తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడుతూ తమకు తెలియకుండానే సంఘ నియమాల్లో తాము అభిలషించిన మార్పులకు కారకులవుతారు.
కానీ సంఘాన్ని అంతగా లెక్కచెయ్యని నాబోటివాళ్లూ అందరూ చూస్తోండగానే చేత్తో నీళ్ల చెంబు పట్టుకుని ఆ చెంబులోని నీటిని చాపక్రింద పోసే ప్రయత్నంలో ఉన్నట్టుగా లోకానికి కనిపిస్తూ ఉంటారు.’’
గౌతమ్ మాటల్లోని తర్కానికి బుర్ర తిరిగిపోయింది సామ్రాట్‌కు. ‘‘మీరు చెప్పింది పూర్తిగా కొట్టిపారవేయడానికి లేదు. ఆడాళ్లూ, మగాళ్లూ విశృంఖలంగా సమాజ నియమాలను పట్టించుకోకుండా ఎవరిష్టమొచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ పోతే సమాజంలో బ్రతుకుతోన్న మనుషుల భద్రత మాటేవిటి?
తనెంత ప్రేమించినా భర్త తనతోనే జీవితాంతం కలిసి ఉంటాడనే నమ్మకం భార్యకూ, అలానే మనసా వాచా కర్మణా ప్రేమించే భార్య తననూ అదే స్థాయిలో అభిమానిస్తూ కలకాలం తనతో కాపురం చేస్తుంనే నమ్మకం భర్తకూ లేనపుడు వివాహ వ్యవస్థ కుప్పకూలిపోదూ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘వివాహ వ్యవస్థ కుప్పకూలడం అనివార్యమైతే ఎవరెంత ఆపాలని ప్రయత్నించినా అది జరిగి తీరుతుంది. అప్పుడందరికీ ఆమోదయోగ్యమైన వ్యవస్థ దానంతటదే వస్తుంది. దానికీ ప్రజల మద్దతు వుంటుంది.

-ఇంకా ఉంది

సీతాసత్య