డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటువంటివి శాంపిల్‌గా ఈ ఊరి మొత్తంమీద బొంబాయి నుంచి వేరుగా మా దుకాణానికే రెండంటే రెండే వచ్చాయి. నిన్న మీలానే ఒక కస్టమర్ మరీ మరీ కావాలని ఒకటి తీసుకోగా ఇదొక్కటే మిగిలింది. మళ్లీ మళ్లీ ఇటువంటి పీస్ వస్తుందో, రాదో ఖచ్చితంగా చెప్పలేం అని కొనుగోలుదారు మనసును పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని, వాళ్లకు నచ్చే విధంగా, తాము చెల్లించే డబ్బుకు వాళ్లు అక్కడికక్కడే పూర్తిగా సంతృప్తి చెందేవరకు వారి మెదడును సన్నద్ధం చేసి ఆ కొనుగోలుదారుణ్ణి అక్కడితో వదిలించుకుని, అప్పుడే దుకాణంలోకి అడుగుపెట్టి అటూ ఇటూ చూసుకుంటూ వస్తోన్న మరో కస్టమర్‌ను సాదరంగా ఆహ్వానిస్తారు.
అనుభవరీత్యా సేల్స్‌మెన్‌కు కొనుగోలుదారు అభిరుచి తెలిసినట్టే తరచూ బట్టల దుకాణాలకు వెళ్ళే కొనుగోలుదారులకూ సేల్స్‌మెన్ మాటల వెనుక వున్న వాస్తవం తెలిసినప్పటికీ డోలాయమాన స్థితిలో ఉన్న కొనుగోలుదార్లు సాధారణంగా సేల్స్‌మెన్ మాటలకే విలువ ఇస్తారు.
కానీ ఆవిడ మాత్రం సేల్స్‌మేన్ సూచించిన దాన్ని కాక మరి కాస్సేపు ఆ విభాగం వద్ద ఓపిగ్గా వెదకి తనక్కావాల్సిన షర్ట్ గుడ్డతో పాటు, పాంటు గుడ్డనూ ఎంపిక చేసుకుంది.
సాధారణంగా ఎవరినీ మెచ్చుకునే స్వభావం లేని సామ్రాజ్ఞి ఈ తతంగాన్నంతా గమనించాక ఎందుకో ఆవిడ పట్ల అమితంగా ఆకర్షింపబడి మనసుండబట్టలేక ఆమెను పలకరించింది.
‘‘మీ ఎంపిక చాలా బావుంది. మీరేమనుకోకపోతే నాకూ ఒక జత ఎంపిక చేసి పెడతారా?’’ అంది సామ్రాజ్ఞి.
ఆమె తల తిప్పి సామ్రాజ్ఞి వైపు నవ్వు మొహంతో చూసింది. సాధారణంగా ఒంటరిగా దుకాణానికొచ్చే మగవాళ్లు అప్పుడప్పుడూ చీరల్ని ఎంపిక చేసి పెట్టమని అడుగుతూ వుంటారు.
కానీ సాటి స్ర్తి తనను బట్టలు ఎంపిక చేయమని అడగడం కొంచెం చింతగా అనిపించినా, ‘తప్పకుండా.. మీవారెలా ఉంటారు? అంటే ఒంటి ఛాయ, ఒడ్డూ, పొడవూ..’’ అని ఆగిందామె.
పరాయి స్ర్తితో భర్త గురించి ఆ వివరాలు చెప్పాల్సి వచ్చినపుడు సహజంగా భార్యలందరూ సిగ్గుపడే విధంగా కొంచెం సిగ్గూ మరికొంచెం మొహమాటమూ కలగలసిన ముఖ కవళికలతో ఆ వివరాలు చెప్పింది సామ్రాజ్ఞి.
వెంటనే చకచకా కార్య రంగంలోకి దిగి.. సేల్స్‌మెన్ చూపించిన వాటిలోంచి నాలుగైదు గుడ్డలు ఎంపిక చేసి ‘‘ఇవి చూడండి.. వీటిలో ఏవైనా బావుంటాయి మీవారికి’’ అందామె.
‘‘నాకు ఇవన్నీ బానే వున్నట్టుగా ఉన్నాయి. కానీ బట్టల నాణ్యతగురించి నాకేమీ తెలియదు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘నాణ్యతకు సంబంధించి నాకు తెల్సినంత వరకూ ఇక్కడ ఉన్నవాటిలో ఇవి మంచివే! మరి రంగు విషయం మీరు నిర్ణయించుకుంటేనే బావుంటుంది’’ అందామె.
‘‘ఉహూ అది కూడా మీరే ఎంపిక చేసి పుణ్యం కట్టుకోండి’’ అంది సామ్రాజ్ఞి.
ఆమె కాస్సేపు వాటిని అటూ ఇటూ తిప్పి చివరకు రెండు గుడ్డల్ని చేత్తో పట్టుకుని ‘‘ఇవి తీసుకుంటారా?’’ అంది.
‘‘ఊ.. మీ ఇష్టమన్నానుగా.. మీకు నచ్చితే, నాకూ నచ్చినట్టే’’ అంది సామ్రాజ్ఞి ప్రోత్సాహపూర్వకంగా.
ఆమె నవ్వి, ‘‘మీకూ నాకూ నచ్చడం కాదు, మీవారికి నచ్చుతాయో లేదో ఆలోచించండి’’ అంది.
‘‘ఆయనకు నేను ఏది చేసినా ఒహపట్టాన నచ్చదులెండి. ఇది కేవలం నా తృప్తికోసమే!’’ అంది సామ్రాజ్ఞి.
‘‘మిమ్మల్ని ఆట పట్టించేందుకు అలా నచ్చలేదంటారేమో ఆయన. ఇంత శ్రద్ధతో ఆయన కోసం మీరే స్వయంగా బట్టల దుకాణానికి వచ్చి, శ్రమపడి కొనుక్కుని వెళితే నచ్చకుండా ఎలా ఉంటాయి?
ఈసారి మిమ్మల్ని ఆయన తప్పక మెచ్చుకుంటారు. చూస్తుండి’’ అందామె చిరునవ్వును మొహంమీద నుంచి చెరిగిపోనీయకుండా.
‘‘చూద్దాం. మీ నోటి మాట వల్లో లేక మీ ఎంపికవల్లో ఈసారాయన మెచ్చుకుంటారేమో’’ అంది సామ్రాజ్ఞి తనూ నవ్వుతూ.
తర్వాత ఇద్దరూ ఆ దుకాణంలో వివిధ విభాగాలూ తిరిగారు. దుకాణంలో అక్కడక్కడా ఆగి.. చేతి రుమాళ్లు, తువ్వాళ్లు, రేడీమేడ్ లంగాలూ, మగవాళ్ల బనియన్‌లూ కొందామె.
ఆమె చేసే ప్రతి పనినీ ఇష్టంగా, ఎంతో ఆసక్తిగా గమనించసాగింది సామ్రాజ్ఞి.
దుకాణంలో పని ముగించుకుని బయటకు వచ్చాక అంది సామ్రాజ్ఞి.
‘‘నాకు మీరెంతగానో నచ్చారు. మీరేమనుకోకపోతే కాస్సేపు ఎక్కడైనా ఆగి చెరో కూల్ డ్రింక్ త్రాగి మన ఈ పరిచయాన్ని సెలబ్రేట్ చేసుకుందామా?’’
‘‘ఓ తప్పకుండా.. పదండి.. ఇక్కడికి దగ్గర్లోనే మంచి కూల్‌డ్రింక్ షాపుంది. బాదం పాలు అక్కడ చాలా బావుంటాయి’’ అందామె.
ఇద్దరూ కాస్సేపు నడిచి దగ్గరలోనే ఉన్న కూల్‌డ్రింక్ షాపులోకి నడిచి ఓ మూలగా అద్దాల కిటికీ పక్కనే ఉన్న టేబిల్ వద్దకు నడిచి ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నారు.
‘‘ఊ.. ఇప్పుడు చెప్పండి నాలో మీకంతగా నచ్చిందేమిటి?’’ అందామె బేరర్ తెచ్చిన పానీయాన్ని రుచి చూస్తూ.
‘‘ఏమో.. నాకెవరూ ఒహపట్టాన నచ్చరు. ఆడవాళ్ళు.. అందునా అందమైన ఆడవాళ్లు అసలు నచ్చరు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘ఊ.. నాకంటే మీరే బావున్నారు కనుక నేను మీకు నచ్చి ఉంటాను. అవునా?!’’ అందామె అల్లరిగా.
‘‘అహహ.. నా ఉద్దేశ్యవదికాదు. మీలో అందం లేదని ఎవరనగలరు? సాటి ఆడదానికి నాకే మిమ్మల్ని చూస్తే అసూయగా వుంది. మీరు కాస్త రంగు తక్కువైతే కావచ్చునేమో కానీ.. మీలో వున్న ఆకర్షణ చాలా తక్కువమందిలో ఉంటుంది.
నిజం చెప్పాలంటే ఇంతవరకూ అందం అంటే నా మనసులో వున్న అభిప్రాయాలు వేరు. అందానికి నిర్వచనంలా ఉన్న మిమ్మల్ని చూశాక అందం పట్ల నాకింతవరకూ వున్న అభిప్రాయాలన్నీ తప్పనే అనిపిస్తోంది’’ అంది సామ్రాజ్ఞి గబగబా.
‘‘ఉహూ.. మీ గురించి నేననాల్సిన మాటల్ని మీరంటూంటే వినడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. మీకేం తక్కువ!

-ఇంకా ఉంది

సీతాసత్య