డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ మగాడైనా చూసీ చూడగానే ఆకట్టుకునే రూపం మీది.
ఎక్కువమంది మగాళ్లు నాలా నాజూగ్గా వుండే ఆడవాళ్లకంటే కనుముక్కు తీరు చక్కగా ఉండి మీలా కాస్త బొద్దుగా, నిండుగా వుండే ఆడవాళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు.
మీరేదైనా ఉద్యోగం చేస్తున్నారో లేక గృహిణిగా ఇంట్లో ఉంటారో నాకు తెలియదు కానీ నేను చేసేది చిన్న ఉద్యోగమైనా మీకంటే ఎక్కువగా బయటి ప్రపంచంలో తిరగాల్సి వస్తుంది కనుక రకరకాల మగవాళ్లను పరిశీలించే అవకాశం ఉంటుంది కనుక ఆ అనుభవంతో ఉంటున్నాను’’ అందామె.
‘‘ఇప్పుడర్థమైంది నాకు.. మీలో అందం ఎక్కడుందో? మీ అందమంతా విషయాన్ని వివరంగా చెప్పడంలోనూ, మాట తీరులోనూ, విశ్వాసాన్ని చూపించే నడకలోనూ ఉంది.
మీరు చెప్పినట్టు చూసీ చూడగానే నా రూపం మగవాళ్లని ఆకర్షించినా కాసేపు మనిద్దర్నీ గమనించిన వారికెవరికైనా మీరంటేనే ఎక్కువ ఇష్టం కలుగుతుంది’’ అంది సామ్రాజ్ఞి మనఃస్ఫూర్తిగా.
‘‘పోనీలెండి.. మీరు చెప్పిందే నిజమనుకుందాం. అయినా మనిద్దరమూ ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకుందుకేమీ పోటీ పడడం లేదు కదా?!’’ అందామె నవ్వుతూనే.
‘‘బాగా చెప్పారు.. ఇద్దరమూ పెళ్లి అనే అంకాన్ని ముగించి సంసార జంఝాటం కొట్టుమిట్టాడుతున్నవాళ్లమేగా? మీకభ్యంతరం లేకపోతే మనం అప్పుడప్పుడూ ఎక్కడైనా ఇలా కల్సుకుందాం.
లేదూ.. వీలును బట్టి మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదూ? మీరు రమ్మంటే మీ ఇంటికివచ్చేందుకు నాకభ్యంతరం లేదు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అలాగే.. తప్పకుండా.. చూశారా కనీసం ఇంతవరకూ ఒకరి పేరేవిటో మరొకరు తెల్సుకోకుండా కాలక్షేపం చేశాం’’ అందామె.
‘‘అవును.. మీ పేరేవిటో తెల్సుకుందామనే ఆలోచన నాకూ రాలేదు చూశారా.. నా పేరు సామ్రాజ్ఞి. మీ పేరూ’’ అంది సామ్రాజ్ఞి.
‘‘నా పేరు సాహిత్య.. మళ్లీ కలుద్దాం’’ అందామె సామ్రాజ్ఞి చేయి నొక్కి వదులుతూ.
***
‘‘ఇవెలా ఉన్నాయో చూడండి..’’ అంది సామ్రాజ్ఞి చేతిలోని బట్టల్ని అతడికి చూపిస్తూ.
‘‘మార్వలెస్, అద్భుతం.. చాలా బావున్నాయి. ఎవరికివీ?’’ అన్నాడు సామ్రాట్ కనుకొసలనుంచి చూస్తూ.
‘‘నా బోయ్‌ఫ్రెండ్‌కి. పుట్టినరోజుకు బహుమతిగా ఇద్దామని కొన్నాను. అన్నిటికీ వంకలు పెట్టే మీకు నచ్చితే అతనికి తప్పకుండా నచ్చుతాయని ముందుగా మీకు చూపిస్తున్నాను’’ అంది సామ్రాజ్ఞి తాను కూడా వెటకారంగా.
‘‘ఇంతలోనే అంత ఉలకా? నాకెప్పుడూ నువ్వు కొనిపెట్టలేదు కదా అని అడిగానంతే! నీ బాయ్‌ఫ్రెండ్‌కయినా బానే వుంటాయని’’ అన్నాడు సామ్రాట్ ఆమెను ఆటపట్టిస్తూ.
‘‘అదొక్కటే తక్కువ నాకు. పెళ్లయింతర్వాత కూడా ఆడవాళ్ల చుట్టూ తిరగడం మగాళ్లకు చెల్లిందిగానీ, మా ఆడవాళ్లకు అటువంటి సదుపాయం ఎక్కడేడ్చిందీ?’’ అంది సామ్రాజ్ఞి తానూ తక్కువ తినలేదన్నట్టుగా.
‘‘ఒకవేళ ఉంటే.. నీకభ్యంతరం లేనట్టేగా!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఏం మాట్లాడ్తున్నారు మీరూ?.. మీ వాలకం చూస్తోంటే ఇప్పటికే మీరు ఏ ఆడదాని చుట్టూనే తిరుగుతూ, కావలిస్తే నన్నూ ఆ పని చేయమని ప్రోత్సహిస్తున్నారనుకోవాలా?’’ అంది గుడ్లురుముతూ సామ్రాజ్ఞి.
‘‘నువ్వెలా అనుకున్నా ఫర్వాలేదు. నీ మనసు నీ ఇష్టం!’’ అన్నాడు సామ్రాట్ ఆమెను రెచ్చగొడుతూ.
‘‘అంతేగానీ.. నేను చెప్పింది తప్పని నిన్ను ఖండించే ప్రయత్నం మాత్రం మీరు చేయరు. అంతేగా! గత కొద్ది రోజుల్నించీ మీ పద్దతి గమనిస్తోంటే నాకనుమానంగానే ఉంది.
అక్కడికీ మా అమ్మ ఎప్పటికప్పుడు చేప్తూనే ఉంది, ‘మగాడు చేపపిల్ల లాంటివాడు. వేళ్లమధ్య ఒకసారి గట్టిగా బిగించి, ఇక నా చేతి నుంచి జారిపోడులే అనుకుందుకు వీల్లేదు.
ఎప్పుడెప్పుడు బయటపడదామా అని వేళ్ల సందుల్లోంచి గమనిస్తూ సమయం చూసి జారిపోవాలని చూసే చేపపిల్లలా మగాడు కూడా ఆడదాని పట్టునుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని అహరహమూ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
ఆడది ఒక్కసారి ఆ పట్టును సడలిస్తే ఇక ఆ కాపురానికి నీళ్లొదులుకోవలసిందే!’ అని చెప్పింది మా అమ్మ మరీ మరీ.
ఇప్పటికీ వీలున్నపుడల్లా ఆ విషయం గుర్తుచేస్తూనే ఉంటుంది’’ అంది సామ్రాజ్ఞి నా బాగును కోరే తల్లిని తలచుకుని పొంగిపోతూ.
‘‘్భర్తమీది పట్టును భార్య ఎప్పుడూ సడలించకూడదని చెప్పిన మీ అమ్మ ఆ పట్టు సడలిపోకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలో చెప్పలేదా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఎందుకు చెప్పలేదూ? మా అమ్మ చెప్పిందనే కదా.. నాకిష్టమున్నా లేకపోయినా మీకిష్టమైన పనులే చేస్తున్నానూ?
మీకు నచ్చినట్లుగా ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నాను. మీకు ఇష్టమైనట్టుగానే అలంకరించుకుంటున్నాను. మీకు ఇష్టమైనవే వండి వారుస్తున్నాను. మీ ఆఫీసు విషయాల్లో కలగజేసుకోవడంలేదు.
మీరు బయట ఎన్ని గంటలు బలాదూరు తిరిగొచ్చినా ఎక్కడికెళ్లారని గానీ, ఆలస్యమైందేవిటనిగానీ మిమ్మల్ని నిలదీయడంలేదు. మిమ్మల్నెప్పుడూ ‘ఇది తేలేదు, అది తేలేద’ని ఆడిపోసుకోలేదు.
మీకిష్టమైనపుడు మీకు నచ్చినట్టుగానే పక్క పంచుకుంటున్నాను. ఏ పెళ్లామైనా ఇంతకంటే గొప్పగా ఏ విధంగా మొగుణ్ణి చూసుకుంటుందో మీరు చెప్తే నేను సంతోషిస్తాను’’ అంది సామ్రాజ్ఞి ఉక్రోషంగా.
‘‘అంటే మీ అమ్మ చెప్పిన పనులు చేయడం తప్ప స్వంతంగా నీకేమీ ఆలోచనలు లేవా?’’
‘‘విషయం మంచిదైనపుడు ఎవరు చెపితే ఏం? మా మా అమ్మ చెప్పింది కాబట్టి అవి పనికిరాని విషయాలైపోతాయా?
మీరు మాత్రం మీ అమ్మ చెప్పినట్టు చేయడంలేదా? ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది. నేనెంత ప్రయత్నిస్తున్నా మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతున్నానంటే.. మీ వెనుక ఎవరో వుండి నాతో ఎలా ఉండాలో చెప్తూ మీ ద్వారా నన్ను ఆడిస్తున్నారు.

-ఇంకా ఉంది

సీతాసత్య