డైలీ సీరియల్

దూతికా విజయం-67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను ద్వారపాలకునికి లొంగటం వేరు. ఈ వీరభద్రునికి లొంగటం వేరూనూ. ద్వారపాలుడు రాణి కోరిన ప్రియుడు కాదు. అందుకని ఆమెకు ఆ విషయంలో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇక ఈ వీరభద్రుడు ఆమె మానసచోరుడు. ఇలాంటివాణ్ణి తానే వశం చేసుకున్నానని రాణికి తెలిస్తే ఈర్ష్యపడి, తనమీద కారాలూ, మిరియాలూ నూరుతుందేమో? ఈ చిక్కును మరెలా విడదీయటం?
ఈ ఇబ్బందిని విశదీకరిస్తే రాణి ఏమీ అనుకోదనే ధైర్యం తనకు ఉన్నది. ఇతన్ని కాదని వట్టి చేతులతో రాణి దగ్గరికి వెళ్లి తన ఓటమిని ఒప్పుకోవటం కేవలం తన అసమర్థతను అంగీకరించటమే అవుతుంది.
తన కన్యాత్వాన్నీ, మానాన్నీ కాపాడుకున్నందుకు ఆమె తనను ఎంత హీనంగా అంచనా వేస్తుందో ఊహించవచ్చు. తన పట్ల ఆమె పెట్టుకున్న ఆశలూ, విశ్వాసం అన్నీ మట్టికొట్టుకుని పోతవి.
ఇక వీరభద్రుణ్ని పరమ పవిత్రంగా తాను రాణికి అప్పగించలేకపోయినా, కొద్ది దెబ్బ తగిలినంత మాత్రాన రాణి కించపడవలసిన అవసరం ఏమిటి? చిటారుకొమ్మన ఉన్న పండు ఎంత జాగ్రత్తగా దింపుదామన్నా కుదరక, నేలమీద పడి కాస్త దెబ్బ తిని మలినమైనంత మాత్రాన పనికిరాదని అవతల పారేస్తున్నామా? దుమ్ము దులిపి ఆనందంగా ఆరగించటంలేదా?
అదీగాక ఎవరి జీవిత రహస్యాలు వాళ్ళకే విపులంగానూ, క్షుణ్ణంగానూ, నిజంగానూ తెలిసి ఉంటాయి. ఉదాహరణకు తాను కనే్యనన్న విషయం తనకు తెలిసినంత బాగా ఇతరులకు తెలియదు. బహుశా చాలామంది ఆ విషయాన్ని నమ్మినట్లు నటిస్తూనే, నమ్మరాదని మనసులో నిశ్చయించుకుంటూ ఉండి ఉండొచ్చు.
అదేవిధంగా ఈ వీరభద్రుడు ‘బ్రహ్మచారి’ అని భావించబడుతూన్నాడే కాని, నిజం అతనికీ, ఆ పరమాత్మకే తెలుసు. ఇతనికి ఇంతకుపూర్వమే ఇతర స్ర్తిలతో అనుభవాలు ఉండి ఉన్నట్లయితే రాణికి అభ్యంతరం ఏమిటి? ఒక విధంగా చూస్తే అనుభవజ్ఞుడైన ప్రియుడ్నే స్ర్తి కోరుకుంటుంది కూడాను. ఎందుకంటే ఆ అనుభూతుల సారం తన పరం చేసేందుకు ప్రియుడు సంసిద్ధుడౌతాడు కదా!
ప్రతిదీ మొదటి మెట్టునుంచీ రావాలంటే ఎంత చుట్టు దోవ అవుతుంది! ఎంత కాలయాపన- దాన్ని అనుసరించే అనేక ఇబ్బందులూ ఏర్పడుతవి? కనుక తాను లొంగిపోవటమనే దాన్ని రాణి ఏ విధంగానూ అపార్థం చేసుకునేందుకు అవకాశం లేదు!
ఒకో ఆశయ సిద్ధికి ఇష్టంలేని పనులు ఎన్నో చేయవలసిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతూంటవి. అది బాధగా తోచినప్పటికీ ఒకో ఇబ్బందికి తలవంచటం, ఆ తరువాత పొందే సుఖాన్ని అంచనా వేసే సరిపెట్టుకోవడం జరుగుతోంది. కష్టసుఖాలు ఈ విధంగా జీవితంలో కలిసిమెలిసి కాపురం చేయగలుగుతూన్నవి. మానవుడు వాటిని విడదీసి విపులీకరించి, తూచి ఏది అనుసరణీయమో నిశ్చయించుకుంటున్నాడు.
ఒక్కో సమయంలో పొరబడనూ వచ్చు. లేదా పడిన కష్టమే నిజమై, ఫలితంగా రావలసిన సుఖం ఎండమావివలె అదృశ్యమవనూ వచ్చు. కాలమే ఆ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కనుక కర్తవ్యం తన వంతయితే - భావి సంఘటనలు వాటంతటవే ఏ విధంగా ఏర్పడేది వేచి ఉండటమే తాను ఎదురుచూడవలసింది!
మానవుని కోరికలు ఊహించిన విధంగా యథాతథంగా ఎవరికి మాత్రం రుూడేరినవి? సమయ సందర్భాలను బట్టీ, అవకాశాలను అనుసరించీ కొద్ది కొద్ది మార్పులను పొంది అనుకున్నదానికి విరుద్ధంగా కాకున్నా (విరుద్ధమైనా చేయగలిగేది లేదనుకో!) సంబంధం లేకుండా, అనేక మార్పులతో రూపమే మారి లభ్యమైతే మాత్రం కాదంటామా? అంతవరకే దక్కుదల అని తృప్తిపడతామే కానీ, ఇన్ని మార్పులు వచ్చినవని దుఃఖపడతామా? ఈ సిద్ధాంతం ప్రకారం కూడా తాను వీరభద్రునికి లొంగి, అతన్ని తన వశం చేసుకోవటమే అత్యుత్తమ మార్గం అనిపించిందామెకు.
సిద్ధాంతరీత్యా తనకు తెలిసిన కామశాస్త్ర సూత్రాలను అనుసరించి ఆలోచిస్తే ఈ వీరభద్రుడు బ్రహ్మచారి అనే అనుకోవలసి ఉన్నది. అందుకనే ‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్న సామెతను అనుసరించే అతని ప్రవర్తన ఉన్నది. ఆ తొందరపాటూ, బలప్రదర్శన, చిలిపిచేష్టలూ, అల్లరిచేసే మనస్తత్వం- మొదలైనవన్నీ స్ర్తి విషయంలో అతని అమాయకత్వానికి తార్కాణాలు. కాకపోతే దేవసుందరి రాణి పిలుపును లెక్కచేయక దూతికను, కేవలం మానవ మాత్రురాలైన తనను వాంఛిస్తాడా? అందుబాటులో వున్న తానే లభ్యపడకుంటే- ఆ రాణీ పొందు కేవలం స్వప్నానుభూతే అని నిశ్చయించుకొని అనవసరపు హైరాను పాలుగాకుండా మొదట్లోనే ఆ తలపును తుంపివేయడా?
అదీగాక ముందసలు కామించిన స్ర్తి తోడిరతి సౌఖ్యాన్ని చవిచూస్తే స్ర్తి అంటే ఏర్పడే భ్రాంతి గట్టి పునాదులమీద పెంపొందుతుంది. రుచిపడినవాడు మరచిపోలేడు సరికదా వైవిధ్యాన్ని కోరక తప్పదు; అందుకు పురుషుడు చంచల హృదయుడు కనుకా, మానవ హృదయం పొందిన అనుభూతికన్నా, పైఅంతస్థులో వున్న అనుభవానికి అర్రులుజాచే తత్వమున్నది కనుకా, క్రమంగా రాణిమీద మరులుగొనక తప్పదు. రాణి సేవిక దగ్గరే ఇంత గొప్ప సుఖం లభ్యమైతే ఇక రాణీ దగ్గరి సుఖం ఎలా ఉండగలదో అంచనాలు వేసుకొని అంచలంచలుగా ఏర్పరచుకునే అచంచలాభిప్రాయంతో రాణివాసానికి రాక తప్పదు. ఆశ పర్వత ప్రమాణంలో పెరిగితే, అతన్ని నడిపించే అత్యద్భుత శక్తి కుంటువడుతుంది.
ఆశ ద్వారా పొందే ఆత్మవిశ్వాసం అతన్ని సప్త సముద్రాలూ దాటి సప్త దర్పణ మందిరానికి జేరేదాకా కన్ను మూయనిస్తుందా? అందుకని అతనిలో దావానలంలాటి ఆత్మవిశ్వాసాన్ని రగుల్కొల్పేందుకు ఆశను ఎరగా వేసి సాధించవలసిన బాధ్యత తనకు ఉన్నది.
ఆత్మవిశ్వాసానికీ ఆత్మకూ చాలా దగ్గరి సంబంధం ఉన్నది. ఆ రెండింటిలోనూ ఏది శరీరాన్ని విడిచినా మళ్లీ తిరిగిరాదు. కనుక అతని ఆత్మవిశ్వాసాన్ని తెలివిగా తన బంగారు పంజరంలో బంధించెయ్యాలి; దానికి స్వేచ్ఛ లభించిందా రెక్కలు కట్టుకొని ఎగిరిపోగలదు!
రాణి ప్రియసఖి అనీ, తనను సమీపించిన వ్యక్తి సామాన్యురాలు కాదనే అభిప్రాయాన్ని వీరభద్రునికి మొదటి చూపులోనే కలిగించాలని, సర్వాలంకార భూషితాలు ధరించి, అతన్ని ఆకర్షించాలని తాను తలచింది. రాణి ఛాయ అయిన తనను బట్టి, అసలు వస్తువునే వీరభద్రుడు ఊహించుకునేందుకు వీలుగా వేషధారణ చేస్తే, నీడకే లొంగిపోయే స్థితి అతనిలో వచ్చిపడింది. బహుశా తనలోని ఆకర్షణా విశేషాలు తనకు తెలియకుండానే అత్యధికమైనవేమో? ఇప్పుడేమనుకొనీ ప్రయోజనం లేదు కదా!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు