డైలీ సీరియల్

దూతికా విజయం-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడిపిల్లలాటి తాను సింహం గుహలోకి ప్రవేశించింది. ఆ సమయంలో సింహం ఆకలిగొని ఉండటం తన తప్పుకాదు. అసలు ఆ ఆకలి పుట్టించే బాధ్యత తనది! కాని అది ఆ సమయంలో ప్రకృతి సిద్ధంగానే దానికి ఏర్పడి ఉన్నది. ముందు ఆ ఆకలి తీరితేనే తప్ప అది చెప్పిన మాట చెవిన వేసుకొనే స్థితిలో లేదు. తన కన్న బలమైన జంతువుకు, సహజంగానే అత్యధికమైన ఆత్మశక్తీ, ధైర్యసాహసాలూ ఉంటవి. దీనికితోడు స్థానబలిమి కూడాను. గుహలోని ఆకలిగొన్న హరి దరిజేరిన హరిణి తాను! హరిహరులు కూడా అడ్డుపడలేరు. అధవా ఈ సింహాన్ని తప్పించుకుంటే బైట ఇద్దరు వేటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు!
వాళ్ళతో తనకు ఎలాంటి పనీలేదు; పైపెచ్చు వాళ్ళ జోలికి వెళ్ళటమంటే మృత్యువు దగ్గరికే తాను పరుగెత్తటం! ఇక ఇక్కడున్న ఈ సింహంతో ఎటుగూడీ తనకు పని ఉన్నది కనుక దీన్ని తృప్తిపరచక తప్పదు.
విధి ఈ కీడు జరిగే తీరాలని నిర్ణయించిన తరువాత అది ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది. ఎందుకుంటే అశుభం ఎక్కువసేపు ఉండాలని ఎవ్వరూ కోరుకోరు కదా! అదీగాక ఆ వెనుక వున్న శుభాన్ని త్వరితగతిన జేరుకునేందుక్కూడా ఉవ్విళ్ళూరుతారు కదా!
వీరభద్రుని నేరం మాత్రం ఏమున్నది కనుక? తానేదో ఆదర్శాన్ని పట్టుకొని వేళాడుతూంటే అది సడలవలసిన సమయాన్ని ప్రయోగించాడనే బాధ తనను వేధిస్తున్నది; ఆ మాటకొస్తే వీరభద్రుని స్థానంలో మరి ఏ ఇతర పురుషుడు ఉన్నా ఇలాంటి సదవకాశాన్ని జారవిడుచుకోడు. ఇతనికన్నా మరో మగాడు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించి ఉన్నట్లయితే అతను జడుడూ, నపుంసకుడూ అయి ఉండాలి. అలాటివాడి ఎదుట తన స్ర్తిత్వానికే తలవొంపులు! తన అందచందాలకు చలించనివాడిలో అసలు జీవనాడులూ పనిచేస్తున్నవా అనే సందేహం కలిగి తీరాలి; అలాటి దుంగను ఎవరు మాత్రం చిత్రిక పట్టినా ఎలా ఉపయోగించుకోగలరు?
మానవుల్లోని బలహీనుల్ని ద్వేషిస్తాం కాని, అవి లేకుంటే ఈ ప్రపంచం ఒక్క అంగుళం ముందుకు సాగుతుందా? స్ర్తి అంటే పురుషునికి సహజంగా ఉండే బలహీనతా; అదేవిధంగా పురుషుడంటే స్ర్తికి ఏర్పడే బలహీనతా నిజానికి బలహీనతలా? అవే అతిబలంగా వారిద్దరి సంబంధాలను బలిష్టపరచడం లేదా? దేనికీ లొంగనివాడు ఈ ప్రపంచానికి ఎంత నిష్ప్రయోజకుడో వేరుగా చెప్పక్కర్లేదు!
ఈ వీరభద్రుడు తానెంత ఆశజూపినా లొంగక, తన అసమ్మతిని ప్రకటించి, తనను వీధిలోకి తోసిపారేస్తే ఏం చేసి ఉండేది? దేనికో ఒకదానికి లొంగే ఇతని బలహీనతే, తనకిప్పుడో బలమైన పట్టుకొమ్మ. పరమ పవిత్రుడే ఈ వీరభద్రుడైనట్లయితే, మానవమాత్రులకు ఇతనితో ఏ పనులూ అయేవి కావు; సర్వజన విసర్జితుడుగానే ఉండిపొయ్యేవాడు కదా!
అతను దేనికి వశ్యుడౌతాడో కష్టపడి పరిశోధించవలసిన శ్రమకు గురిచేయలేదు. సూటిగా తాను కోరిందేమిటో తెలియజెప్పాడు. ఆ లంచమే తాను ఇవ్వగలిగిందే కావటం మరో అవకాశం. దాన్ని అర్పించటమూ, అర్పించకుండట మొక్కటే తన నిర్ణయం!
ఈ మకరాంకునికన్న బలవత్తరమైన దేవుడు మరొకడు ఉంటాడా? ఈశ్వరునిలాంటివాడికే నిరోధించే శక్తిలేక, చికాకుపడి వున్న శక్తిని దుర్వినియోగం చేసి మన్మథుణ్ని భస్మం చేసినా, వాడు లేనిదే తన జీవితమూ నిస్సారమేననే సత్యాన్ని వెనువెంటనే గ్రహించి, శరీరాన్నివ్వలేకపోయినా, అనంగుడుగా సకల భువనాలను ఏలమని నిర్దేవించక తప్పలేదు. పురాణగాథ ప్రకారం చూసినా విజయం పుష్పబాణునిదే కదా!
ఈశ్వరునికి సాధ్యంకానిదాన్ని తనలాటి అల్పజీవి సాధించబూనటం హాస్యాస్పదం! ప్రవాహానికి ఎదురీది త్వరలోనే అలసిపోయి మునిగిపోవటంకన్న, ప్రవాహవేగంతో పాటే పయనిస్తూ, ఏటవాలుగా ఈది దూరాన వున్న ఒక ఒడ్డుపట్టడం తేలిక. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయజూడటం అవివేకం గాక మరేమిటి?
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకవిధంగా చూస్తే కొండ కొన నుంచి కిందకిపడిన తనను, బైటపడుకున్న రుూ రాజభటులే రక్షించి, మరో సదవకాశాన్ని కల్పించారు. వీళ్ళు ఎదురుకానట్లయితే వీరభద్రునికి బైటికి గెంటబడిన తను వీధుల్లో తిరుగుతూ, రాజభటులకు పట్టుబడినట్లయితే ఎంత రభస జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
రాజభటులు అధికారం వున్న అల్పులు కనుక- ఒంటరిగా అందమైన తనలాటి ఆడది కనిపించినట్లయితే, ముందు వెనుకల ఆలోచనలు లేకుండానే, ఏమాత్రం సానుభూతి చూపక, ఎవరు, ఏమిటి అనే విచక్షణ చూపక, అడిగే ఐదు ప్రశ్నలూ పేరు, ఊరు, తండ్రి, భర్త లేక సంరక్షకుడు, వయస్సు, స్ర్తియా పురుషుడా? అడిగి ఆ తరువాత వంతుల ప్రకారం తనను అనుభవించితీరేవాళ్ళు. తాను అబద్ధాలు ఆడినా వీళ్ళ కబంధ హస్తాల నుంచి బైటపడేందుకుగాను కుక్కబడిన పేనల్లే వీళ్ళ అత్యాచారాలన్నింటినీ సహించి, వీళ్ళను తృప్తిపరిచి విడుదల పొందేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చేది.
వీళ్లిద్దరితోనే సరిపొయ్యేదా- ‘తేరగా వొస్తే మామబావమరిది కూడా ఉన్నాడు!’ అనే సామెతను అనుసరించి, వీళ్ళ ముఠాకు సంబంధించిన వాళ్ళను పిలుచుకొని వస్తారు. ఒకడు తనను అనుభవిస్తూంటే, రెండోవాడు రుూ గర్భాధాన మహోత్సవాహ్వాన పత్రికలకు పంపకపు వ్యవహారం చూస్తాడు. తన సోదరులమీద వుండే ఆపేక్షవల్ల కాదు; రేపెప్పుడన్నా ఆ సోదరుల క్కూడా ఇలాంటి అవకాశమే లభ్యపడితే ఇదేవిధమైన ఆహ్వానాలు తమకూ లభ్యవౌతవి కదానని!
అందునా రుూ వాన రాత్రి, చలికి బిగుసుకొనిపోకుండా నవ యవ్వనీ, రూపతీ చేజిక్కిందని ఏ పాడుపడిన ఇంటి నేలమీదనో తనను దొల్లిస్తే, మర్నాటి సూర్యోదయాన్ని చూసే అదృష్టం కూడా తనకు అనుమానమే!
ఈ వీరభద్రుడు తనను ఎంత గొప్ప ప్రమాదం నుంచి కాపాడాడో సరస్వతికిప్పుడు పట్టపగలంత స్పష్టంగా తెలిసివచ్చింది.
వీరభద్రుని పాటి సంస్కారమన్నా ఈ రాజభటులకు ఉండగలదా? కేవలం వ్యాయామంతో సాధించిన పశుబలానికి తోడుగా, పశుత్వం గడ్డకట్టుకొని, తమ పాలబడిన వారందరూ పాపులనీ, తామే ఈ చట్టాలను అమలు జరుపుతూ పట్టణంలోని శాంతిభద్రతల్ని కాపాడుతున్నామనే గర్వంతో ఎంత ఘాటుగా, మోటుగా ఈ రక్షక భటులు తనను ఎదుర్కొనేవాళ్ళు!
ఈ వీరభద్రుడు ప్రణయారాధకునివలె తనను ఎంతో ఆదరించాడు; నెత్తురు చిమ్మేదాకా తనచేత పీకించుకొని, రక్కించుకున్నాడు. ఐనప్పటికీ బలాత్కారంగా తనను పొందేందుకు మనస్కరించకనే కదా-

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు