డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహూ.. నిజాయితీగా ఒప్పుకోవాలంటే.. తమ పరిచయం స్నేహం అనే వలయాన్ని దాటి దాని లోపల ఉండే మరో వలయానికి చేరువగా చేరుకుంది. ఆ వలయం పేరేమిటి? ప్రేమా?!
ఉలిక్కిపడింది సాహిత్య.
తాము ఒకరినొకరు ప్రేమించుకునే స్థాయికి చేరుకున్నారా? ఒకరి సమక్షం మరొకరికి ఆనందాన్నిస్తోందంటే దానికర్థం ఏమిటి?
రోజూ కాకపోయినా వీలైనంత తరచుగా తాము కల్సుకుంటూ గంటల్ని నిముషాల్లా గడుపుతూ ప్రతిసారీ విడిపోయేముందు మళ్లీ ఎంత త్వరగా కల్సుకుంటామో కదా! అనే భావనతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్తున్నారంటే దానికర్థం ఏవిటి? తమకు తెలియకుండానే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారా?!
తన మాటలకు సమాధానమివ్వకుండా సాహిత్య ఆలోచనల్లో మునిగిపోవడం సామ్రాట్‌కు కొత్తగా అనిపించింది.
తన ఉనికినే మరిచిపోయినట్టుగా, ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా, మాటా పలుకూ లేకుండా నిర్నిమేషంగా ఆమె అలా చాలాసేపు ఉండిపోవడంతో ఆమె భుజం పట్టుకుని కుదుపుతూ అన్నాడు సామ్రాట్ ‘‘ఏవిటి సాహిత్యా.. నన్నొక్కణ్ణీ ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఏదో లోకంలోకి వెళ్లిపోయావు!’’
‘‘ఏం లేదు సామ్రాట్.. మున్ముందు మనమేం చేస్తే బావుంటుందా? అని ఆలోచిస్తున్నాను’’ అంది సాహిత్య.
‘‘ఏం చేయడవేమిటి? మనమిప్పుడేమీ కాని పని చేయడం లేదు కదా!’’ అన్నాడు సామ్రాట్ తన మాట మీద తనకే నమ్మకం లేకుండా.
‘‘అలా అని మనమనుకుంటున్నాం. లోకం సంగతి పక్కనపెట్టి నీ భార్యా, నా భర్తా కూడా మన పరిచయాన్ని మనం భావించినట్టుగానే అనుకోవాలి కదా!’’ అంది సాహిత్య.
‘‘సామ్రాజ్ఞి సంగతి సరే! మీ ఆయన మనల్ని అర్థం చేసుకోరంటావా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘నీ భార్య మరో మగాడితో చనువుగా వుంటే నువ్వు దాన్ని మామూలుగానే తీసుకోగలవా?’’
‘‘నా గురించి నువ్వంతేనా అర్థం చేసుకున్నదీ?’’
అతడి గొంతులో ధ్వనించిన బాధను గమనించిన సాహిత్య అంది, ‘‘బహుశః నేను నిన్ను సరిగా అడగలేదేమో! సరే మళ్లీ అడుగుతున్నాను.. మనమధ్య వున్న చనువులాంటిది కాకుండా.. నీ భార్యకూ మరో మగాడికీ మధ్య మరో విధమైన ‘చనువు’ వుందని తెలిస్తే నువ్వు తట్టుకోలవా? అని అడుగుతున్నాను’’.
‘‘బహుశః నీతో పరిచయం కాకపోయి వుంటే అపార్థం చేసుకునేవాడినేమో! కానీ నీతో స్నేహం చేసిన తర్వాత, ఈ లోకంలో ఎవరు ఎవరితో ఎంత చనువుగా ఉన్నా అది నాకు సంబంధం లేని విషయమేమో అనిపిస్తోంది నాకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మన స్నేహమంత నిజం’’ అన్నాడు సామ్రాట్.
తన మనసును ఎప్పటినుంచో దొలుస్తోన్న ప్రశ్నను అప్పుడడిగింది సాహిత్య, ‘‘మన మధ్య ఉన్నది కేవలం స్నేహమేనంటావా? దానికి మరో పేరేదైనా ఉందా?’’
‘‘గత కొద్దికాలంగా నా మనసునూ ఇదే ప్రశ్న వెంటాడుతోంది. నువ్వేమైనా దీనికి సమాధానం చెప్పగలవేమోనని ఇంతకాలమూ అనుకుంటూ వచ్చాను.
అటువంటిది నువ్వూ ఈ ప్రశే్న వేశావంటే మనమధ్య వున్నది స్నేహం మాత్రమే కాదనీ దానికిమించి భావోద్వేగాలకు సంబంధించినది మరేదో మనమధ్య ఉన్నదనీ నాకు నిశ్చయంగా అనిపిస్తోంది. నీకూ అలానే ఉందా సాహిత్యా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘అనుమానవేవుంది? ‘మీర’ని ఒకరినొకరు గౌరవించుకునే మనం పరస్పరం ఏకవచన సంబోధనలోకి మనకు తెలియకుండానే ఎప్పుడు మారేమో నాకైతే గుర్తులేదు.
బహుశః అది తెచ్చిపెట్టుకున్నది కాక తనంతట తాను వచ్చుండడంవల్ల గుర్తులేదేమో! నీకు చెప్పకపోవడమేం! మధ్యలో ఒకసారి మాత్రం అనిపించింది- ఇదేవిటీ మనం ఒకరినొకరు ‘నువ్వు’ నువ్వని పిలుచుకుంటున్నావేమిటా? అని.
కానీ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు నాకు. మన అభిరుచుల కలయిక, ఒకరి భాష మరొకరికి అర్థం కావడం, ఒకరి సమక్షంలో మరొకరు ఆనందంగా గడపడం, మన సంసార జీవితాల్లోని లోటును భర్తీ చేసుకుందుకే మనం తరచూ కల్సుకుంటున్నామని అనిపించడం- వీటన్నిటి కలయికా బహుశః నువ్వు నన్నూ, నేను నిన్నూ ఎలా సంబోధించుకుంటున్నామనే విషయానికంత ప్రాముఖ్యతనివ్వలేదేమో!’’ అంది సాహిత్య.
‘‘మీరు నుంచి ‘నువ్వు’కు మనమెందుకు మారేమో అనడానికి కారణాలు సహేతుకంగానే ఉన్నాయి నువ్వు చెప్పినట్టుగా. కానీ మనం కల్సుకోకుండా ఉండలేకపోవడానికి కారణమేవిటి?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మన మధ్య వున్నది స్నేహం మాత్రమేనా, మరొకటా అనేది తెలిసిపోయినట్టే!’’ అంది సాహిత్య.
‘‘నువ్వేమనుకుంటున్నావు సాహిత్యా?!’’
‘‘నేనూ ఈ విషయం గురించి చాలాసార్లు ఆలోచించాను. సంతృప్తికరమైన సమాధానమేదీ రాలేదు. మనిద్దరి జీవితాల్లోనూ మన భాగస్వాములు మనకు తగిన వాళ్లు కాకపోవడమనే ఒకే రకమైన లోపం ఉంది. నీ భార్యా, నా భర్తా కూడా మన గురించి అలానే ఆలోచిస్తున్నారంటావా?’’ అంది సాహిత్య.
‘‘ఉహూ.. సామ్రాజ్ఞి గురించి చెప్పాలంటే తనను తనను జంతువుతో పోలుస్తున్నాననుకోకపోతే- తను గడ్డివామి దగ్గర కుక్కలాంటిది. కుక్క గడ్డి తినలేదు గానీ ఆ గడ్డివామి దగ్గరకు వేరే ఇతర జంతువునూ రానీయదు.
భర్తను సంతోషపెట్టడం తనకు చేతకాదు. భర్తల పుట్టుకకు పరమార్థం భార్యల్ని సంతోషపరచడమే గానీ భార్యకు కూడా భర్తను అన్ని విధాలా సంతోషపెట్టవలసిన వౌలికమైన బాధ్యత ఉందనే విషయానికామె మెదడులో స్థానం లేదని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అన్నాడు సామ్రాట్. ‘‘మావారి గురించి కూడా గతంలో చాలాసార్లు నీకు చెప్పాను. ఎదుటివారి మనసులో ఏముందో పట్టించుకోకుండా తన మనసుకు నచ్చింది చేసుకుపోవడమొక్కటే ఆయనకు తెలుసు.

-ఇంకాఉంది

సీతాసత్య