డైలీ సీరియల్

ధ్యానమే శివయోగం (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ దివ్య దృష్టితో చూసి, ‘‘మునులారా! ఈ దివ్య ప్రకాశ దర్శనం మీకు పరమేశ్వరుడిచ్చిన ప్రబోధానికి సంకేతం. ఆ ప్రకాశంలో మీకు కనిపిస్తున్న మహనీయులందరూ పశుపత వ్రతాన్ని ఆచరించి ఆయనలో ఐక్యమవబోతున్న సత్పురుషులు. వారి లాగే మీరూ ఆ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాలని పరోక్షంగా మీకు పరమశివుని ఆదేశం.
మీ అదృష్టం, కాలం కలిసి వచ్చాయి కాబట్టి సరైన సమయానికిక్కడికి వచ్చారు. అతి త్వరగా ఇక్కడినుండి పయనించి మీరు సుమేరు పర్వతానికి చేరుకోండి. మరి కొద్ది రోజులలో అక్కడ తపస్సు చేస్తున్న సనత్కుమారునికి శివతత్వాన్నీ, పశుపత వ్రతాన్నీ బోధించటానికి శివుని ఆదేశంపై నందీశ్వరుడు అక్కడికి వెళ్ళనున్నాడు. అతడిని అర్థించి మీరు కూడా ఆ బోధలు వినండి. వాయుదేవుడు తెలిపిన ఆ వ్రతం గురించి మరింత విపులంగా మీకతడు తెలుపగలడు. మీరు అటు తరువాత ఆ వ్రతాన్ని ఆచరించి కైవల్యాన్ని పొందండి’’ అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు.
శౌనకాది ముని శ్రేష్ఠులారా! ఆ మునులందరూ బ్రహ్మ ఆదేశించిన విధంగా నందీశ్వరుని వలన శివ చరితాన్నీ, తత్వాన్నీ, పశుపత వ్రత విధానాన్నీ విని, ఆ వ్రతాన్ని ఆచరించి శివ సాయుజ్యాన్ని పొందారు.
సనత్కుమారుడు, నందీశ్వరుడు తనకు ప్రసాదించిన శివ జ్ఞానాన్ని మా గురువుగారైన వ్యాసుల వారికి బోధించగా, వారు నాకదంతా బోధించటం జరిగింది.’’ అని శౌనకాదులకు వివరించారు సూతమహర్షి.
‘పరబ్రహ్మ స్వరూపుడూ, పరమ పదాన్నొసగేవాడూ అయిన శ్రీ మహావిష్ణువు స్వయంగా ఋషుల తపోదికాల కోసం తన చక్రాన్ని నిలిపిన ప్రదేశమైన నైమిశారణ్యంలో పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి, ప్రయాగ స్నానాలతో, కాశీ విశే్వశ్వర అన్నపూర్ణా విశాలాక్షుల దర్శనాలతో, పశుపత వ్రత ఆచరణతో పునీతులైన ఆ మహర్షుల కంటే శివ సాయుజ్యాన్ని పొందే అర్హత మరెవరికుటుంది?’ అనుకుంటూ శౌనకాదులు ఆ పుణ్యాత్ములకీ, కాశీ విశే్వశ్వరుడికీ నమస్కరించుకున్నారు..
వాయుదేవుడి బోధనలలోని సారాంశం
ఫలాపేక్షలేని, ప్రాణాయామంతో కూడిన ధ్యానము శివదర్శనాన్ని ప్రాప్తింపజేస్తుందనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు. మొదట సాకారంలో శివుడి రూపాన్ని ధ్యానిస్తూ, క్రమక్రమంగా నిరాకార ధ్యానాన్ని సాగించగలగటమే శివ యోగము. ప్రారంభంలో యోగికి ఎన్నో అంతరాయాలు కలుగుతాయి. సోమరితనమూ, అనారోగ్యమూ, చంచల చిత్తమూ సంశయాలూ, అజాగ్రత్తా, జీవిత గమనంలో సంభవించే దుఃఖాలు లాంటి ఎన్నో అంశాలు ధ్యాన మార్గంలో అవరోధాలుగా నిలుస్తాయి. సాధనతో అన్నింటినీ అధిగమించాలి.
ఒక్కొక్కప్పుడు యోగికి కొన్ని సిద్ధులు సంక్రమిస్తాయి వాటిలో ‘ప్రతిభ’ అనగా చాలా దూరంలో ఉన్న వాటిని చూడగలగటం, ‘శ్రవణ’ శక్తి అనగా దూరాన జరిగే భాషణాలు వినగలగటం, ‘వ్రతము’ అనగా జంతువుల భాష తెలియటం, దివ్య దర్శనాలు పొందటమనే ‘దర్శన’ శక్తీ, రుచి చూడకనే పదార్థాల రుచిని ‘ఆస్వాదన చేయగలగటం ముఖ్యమైన సిద్ధులు. ‘వేదన’ అంటే స్పర్శాజ్ఞానం.
ఇటువంటి శక్తులు తమ సాధనలకు ఆటంకమవుతాయి కనుక నిజమైన భక్తులు వాటిని కోరరు.
మంత్రాలను అర్థం చేసుకుని ఉచ్ఛరించటం, ప్రాణాయామంతో కూడిన మంత్ర జపమూ, వౌనంగా భగవద్భావనలో ధ్యానం చేసుకోవటం, ‘అభావం’గా అనగా భావాలూ, భావనలూ లేకుండా ఉద్రిక్తత లేని ధ్యానమూ, అలాగే పరమ శివుడు తప్ప మరే ఆలోచనలూ లేని స్థితి, అనగా మహా యోగమూ, ఈ ఆచరణలన్నీ కూడా యోగమనే చెప్పబడుతాయి.
శాస్త్ర విహిత పద్ధతిలో, ‘కామ్య కర్మ’గా శివ పూజ చేసేటప్పుడు ముందుగా ఐదు ఆవరణ దేవతలనూ, శివుడి త్రిశూలది ఆయుధాలనూ, ఢమరుకాది వాద్య వస్తువులనూ కూడా పూజించటం ఆచారం.
త్రికాలాలలో సంధ్యా వందనం చేస్తూ, దయా మంచితనం భక్తీ కలిగి, మంచి నడవడితో యోగ సాధనాలు చేస్తూ, వేదాలను చదివి, ఇతరులకు వాటి సారాన్ని బోధిస్తూ, ‘ఓం నమశ్శివాయ’ ఆదిగా గల మంత్రాలను పఠిస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ, చేయిస్తూ తృప్తిగా జీవించేవాడే నిజమైన బ్రాహ్మణుడు.
కాలం శివ స్వరూపమని వాయుదేవుడు నైమిశారణ్యం లోని మునులకి తెలిపాడు. కాలాన్ని నిర్ణయించేవాడూ, నియంత్రించేవాడూ ఆ పరమేశ్వరుడే! కనురెప్ప క్రిందికి వ్రాలిన కాలం ఒక నిమేషం కాగా, పదిహేను నిమిషాలొక కళగానూ, ముప్ఫై కళలు ఒక ముహూర్తంగానూ, ముప్ఫై ముహూర్తాలు ఒక పగలూ రాత్రీ కలిసినంతకాలమూ అనగా ఒక దినం అవుతాయి. ముప్ఫై దినాలు ఒక మాసం. మాసంలో రెండు పక్షాలు.అవి శుక్ల, కృష్ణ పక్షాలు. ఒక్కో పక్షపు నిడివి పదిహేనురోజులు. పనె్నండు మాసాల కాలం ఒక సంవత్సరం కాగా, ప్రతి సంవత్సరంలోనూ రెండు అయనాలు. మకర సంక్రమణం నుండీ ఆరు నెలల కాలం ఉత్తరాయణం కాగా, ఆ తరువాతి ఆరు నెలల కాలం దక్షిణాయనంగా కాలం రూపొందించబడింది.
భూలోకంలోని మూడు వందల అరవై సంవత్సరాల కాలం దేవలోకంలో ఒక్క సంవత్సరం.
బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా శాశ్వతులు కారు. ఒక ఖ్రహ్మజీవితకాలం విష్ణుమూర్తికి ఒక్కరోజు కాలం కాగా, విష్ణువు జీవితకాలం రుద్రుడి కాలంతో సమానం. కానీ వారూ నశించేవారే! పరమశివుడు లేదా పరమేశ్వరుడొక్కడే శాశ్వతుడూ, నిత్యుడూ, అవ్యయుడు.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె 9676926171