డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంటే.. ఇద్దరం కలిసి ఏ ఊరైనా వెళ్లి కొన్ని రోజులుండి వద్దామంటావా?’’ అంది సాహిత్య ఆశ్చర్యపోతూ.
‘‘అవును తప్పేం ఉందీ? మనం వెళ్లాలని అనుకోవాలే గానీ అదేమంత వీలుకాని విషయం కాదుగా..?’’
‘‘నీ మనసులో ఏం ఉందో నాకర్థం కావడంలేదు. రోజూ కాకపోయినా కనీసం వారానికి రెండు మూడుసార్లు మనం కల్సుకుని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా! పరాయి చోటికి వెళ్లి మాత్రం అంతకంటే ఏం చేస్తాం?’’ అంది సాహిత్య.
‘‘ఏమో నాకూ తెలీదు.. నాకు నీతో కలిసి పక్క పక్కనే నడవడం ఇష్టం. నీతో కలిసి ప్రయాణం చేయడం ఇష్టం. ప్రయాణంలో అనుభూతుల్ని ఆస్వాదించడం ఇష్టం. ఎదురెదురుగా నీతో కూర్చుని ఊసులాడుకుంటూ భోజనం చేయడం ఇష్టం. నీతో కలిసి రంగులు మారుతోన్న ఆకాశాన్ని చూడడం ఇష్టం. అవిశ్రాంతంగా సముద్రంలో విరిగిపడే కెరటాల్ని చూడడం ఇష్టం, నీతో కలిసి సినిమా చూడడం ఇష్టం, నువ్వు పుస్తకం చదువుతోంటే నీ ఎదురుగా కూర్చుని వినడం ఇష్టం. నీతో కలిసి ఉన్నపుడు కూర్చున్నా, నిలబడినా, ఏం మాట్లాడినా, అసలేమీ మాట్లాడకుండా ఎంతసేపున్నా ఎంతో ఇష్టం నాకు.
నాకిష్టమైన ఇన్ని అనుభవాల్న, అనుభూతుల్నీ జీవితాంతం కాకపోయినా కొన్ని రోజుల పాటైనా నేను పొందేలా చేయలేవా సాహిత్యా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఈరోజు నీ మాటలు చిత్రంగా ఉన్నాయి సామ్రాట్. మనం త్వరలోనే విడిపోబోతున్నామన్నట్టూ, విడిపోయేలోపునే మన పరిచయం ద్వారా నువ్వు కోరుకుంటున్నవన్నీ తీర్చుకోవాలనుకుంటున్నట్టూ ఈ అవకాశం జారవిడుచుకుంటే ఇహ ఈ జన్మకు ఈ అవకాశం దొరకదన్నట్టూ మాట్లాడ్తున్నావు నువ్వు’’ అంది సాహిత్య.
‘‘నువ్వలా అంటోంటే నాకెంతో దిగులుగా ఉంది సాహిత్యా.. మన పరిచయం త్వరలోనే ముగిసిపోతుందనే ఆలోచన కలలోకి వచ్చినా భరించలేను నేను. దయచేసి అలా అనుకోవద్దు.
నిజానికి నా ఈ కోరిక ఈనాటిది కాదు. మన పరిచయంతో పాటే అదీ పెరుగుతూ వచ్చింది. ఎందుకో ఈ రోజు అడగాలనిపించి అడిగేశాను. అంతే’’ అన్నాడు సామ్రాట్ ‘నీ దయ’ అన్నట్టు చూస్తూ.
‘‘ఊ.. ముందరి కాళ్లకు బంధం వెయ్యడంలో ఎవరైనా నీ తర్వాతే! ఇవే తెలివితేటలు మీ ఆవిడ దగ్గర చూపించి ఆవిణ్ణీ బుట్టలోవేసి నీక్కావాల్సినట్టుగా ఆమె ప్రవర్తించేలా చేసుకోవచ్చుగా!’’ అంది సాహిత్య నవ్వుతూ.
‘‘హు.. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అనే పద్యం చదువుకునే ఉంటావుగా చిన్నప్పుడు నువ్వు కూడా.
తెలిసి తెలిసీ అడుగుతున్నానంటే.. నాతో కలిసి వేరే ఎక్కడికైనా రావడం నీకిష్టలేదనుకోవాలా?.. ప్లీజ్ అలా అనకు సాహిత్యా. ఈ ఒక్కసారికీ ఒప్పుకో ప్లీజ్!’’ అన్నాడు సామ్రాట్.
‘‘నీ మాటల్లో ఏదో అపస్వరం ధ్వనిస్తోంది నాకు. అయినా ఒక్కసారి కాకపోతే మళ్లీ మళ్లీ కలిసి విహార యాత్రలు చేయడానికి మనవేమైనా మొగుడూ పెళ్లాలమనుకుంటున్నవా?’’ అని నాలుక్కరచుకుంది సాహిత్య.
ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు సామ్రాట్, ‘‘్థంక్స్ సాహిత్యా. నువ్వు ఒప్పుకున్నట్టేగా! అయితే చెప్పు. ఎక్కడికెళ్దాం. ఎన్ని రోజులుందాం? చెప్పు.. చెప్పు’’ అన్నాడు సంబరంగా.
‘‘నేనింకా ‘ఊ’ అనకుండానే ఏవేవో ఊహించేసుకుంటున్నావు. మనిద్దరం కలిసి జంటగా పరాయిచోటికి వెళ్లడానికి ఎందుకో ఒక పట్టాన నా మనసంగీకరించడంలేదు.
మనిద్దరితోపాటు మనల్ని కట్టుకున్న వాళ్లనుకూడా తీసుకెళితే ఎలా వుంటుంది?!’’ అంది సాహిత్య.
‘‘పెళ్లికెళ్తూ నువ్లో పిల్లినీ, నేనో పిల్లినీ చంకన పెట్టుకుని వెళ్లినట్టు ఉంటుంది’’ అన్నాడు సామ్రాట్ అక్కసుగా.
‘‘నీకు కోపం కూడా వస్తుందే!’’ అంది సాహిత్య, సామ్రాట్ ముఖకవళికల్ని పరికించి చూస్తూ.
‘‘నేనూ మామూలు మనిషినేగా! అరిషడ్వర్గాల్ని జయించిన మునీశ్వరుణ్ణి కానుకదా!’’ అన్నాడు సామ్రాట్ అదే ధోరణిలో.
‘‘సరే.. సరే.. మీ ఆవిడకేం కారణం చెప్తావో ఆలోచించుకో! మావారెటూ మరో నాల్రోజులవరకూ రారు’’ అంది సాహిత్య.
ఎగిరి గంతు వేయబోయి ఆగి, ‘‘చాలా చాలా థాంక్స్ సాహిత్యా.. సామ్రాజ్ఞికి ఏదో కారణం చెప్పడం కష్టంకాదు. నువ్వు నా ప్రతిపాదనకు ఒప్పుకోవడమే పెద్ద వరం నాకు.
అవునూ.. ఇంతవరకూ అడగనేలేదు నేను. మీవారేం చేస్తోంటారు? ఏదో ఉద్యోగం చేస్తున్నారని తెలుసుగానీ, అదేవిటో తెలియదు నాకు. అసలాయన పేరైనా నిన్నడక్కపోవడం తలచుకుంటేనే ఎంతో సిగ్గుగా ఉంది నాకు’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఎంతసేపూ మనం ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుని మురిసిపోవడం తప్ప.. ఆ ప్రసక్తి మన మధ్య ఎప్పుడొచ్చింది కనుకా? ఇప్పడైనా ఏదో మాటవరసకడిగావంతే కదా!’’ అని ఆగింది సాహిత్య.
‘‘సారీ సాహిత్యా.. నీ పరిచయం నన్ను ఎవరి గురించీ ఆలోచించవలసిన అవసరాన్ని నాకు కలిగించలేదు. కానీ ఇప్పుడు మాట వరసకు కాక నిజంగా తెల్సుకోవాలనే అడిగాను, చెప్పవూ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘నేనూ సరదాగా అన్నాను సామ్రాట్. నువ్వడక్కపోయినా నేనైనా చెప్పి ఉండాల్సింది కదా!.. పోనీలే.. అదేమంత చర్చనీయాంశమూ కాదు. ఆయన గొప్ప వ్యక్తీ కాదు.
ఆయన అటవీ శాఖలో అధికారి. నాతో ఎలా ఉన్నా ఉద్యోగం పట్ల ఆయనకున్న నిజాయితీ శంకించడానికి వీలులేనిది. చిత్తశుద్ధిగా విధి నిర్వహణ చేసినందుకూ, చేస్తున్నందుకూ ప్రశంసాపత్రాలూ, అవార్డులూ అందుకున్నారాయన. మున్ముందు కూడా ఉద్యోగంలో మరిన్ని ఎత్తులకు తప్పకుండా చేరుకుంటారు.
ఇహ ఆయన పేరంటావా? ఊహించు చూద్దాం అంది సాహిత్య.
‘‘క్లూ ఇవ్వు ప్రయత్నిస్తాను’’

-ఇంకా ఉంది

సీతాసత్య