డైలీ సీరియల్

దూతికా విజయం-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు- ఇప్పటికి జరిగిపోయిందేదో దాన్ని జరగకుండా ఉంచగలవారెవ్వరూ లేరు. ఇక జరగబోయేదాన్ని తానే స్వతంత్రించి నిర్ణయించటంకన్నా, రాణి సూచనల్ని అనుసరించి నడుచుకుంటే తనకొక రక్షణ ఏర్పడుతుంది.
‘చెపుతాలే రాణీ.. మీరు స్నానానికి సిద్ధంకండి’’ అన్నది సరస్వతి.
ఆ రాణి వివస్త్ర అవుతూ చిలిపిగా సరస్వతి మొహంలోకి చూసి నవ్వి ‘‘ఒక్కసారి ఆ అద్దంలో చూసుకో సరూ! నీ మొహం దివ్యకాంతులీనుతున్నట్లు నీకే తెలుస్తుంది’’ అన్నది.
ఎదురుగా ఉన్న నిలువెత్తు దర్పణంలో సరస్వతి తన పాపను చూసుకొని ఆశ్చర్యపడింది. రాణి అన్నట్లు తన ముఖం కొత్త వెలుగులతో ప్రజ్వరిల్లుతూన్న మాట నిజమే! కన్యగా ఉన్నప్పటి ముగ్ధ మోహనాకారం కాదిది; ప్రౌఢగా పతి ఏర్పడగా పరమ పావనమైన హొయలుతో కూడిన యవ్వనశోభ! కన్యాత్వమనే వెల చెల్లించి, పాతివ్రత్యమనే అమూల్య సంపదను గ్రహించినందుకు సరస్వతి తనను తాను ఈ క్షణంలో అభినందించుకోగలిగింది.
‘‘నీ సౌందర్యమూ, ఆకర్షణా, పురుషుని సవాలు చేసే చిలిపితనమూ నీకు తెలియవే! నేను ఏమనుకునేదాన్నో చెప్పనా?’’ అంది రాణి.
‘‘నాకు తెలుసులే రాణీ! మీరు నాకు నాయకులైతే బాగుండునని అనుకునేవారు!’’ అన్నది సరస్వతి.
‘‘కాదు’’ అన్నది రాణి. ‘‘ఈ సంవత్సరంలో నేను గర్భధారణ చేయకుంటే నా తరువాతి రాణివి నీవే అవుతావనుకున్నాను!’’
‘‘అపచారం రాణీ! అపచారం!’’
‘‘అపచారమే మరి! ఈ నరకంలో నీవు పడకుండా ఉండాలనే నేనూ ఇష్టదేవతలందర్నీ వేడుకుంటున్నాను. చెప్పవచ్చిందేమిటంటే నీకా యోగ్యత వున్నది సరూ!.. కనుకనే వీరభద్రుణ్ణి ఇట్టే బుట్టలో పెట్టావు. సరే... అదంతా వివరంగా, వీనులవిందుగా చెప్పు సరూ!’’ అని రాణి జలకమాడసాగింది.
రాణికి వొళ్లు రుద్దుదామని సరస్వతి కాస్త ముందుకు వొంగగానే, వీపుమీది టపటపలు విననైనవి. రాణి ఆ శబ్దాన్ని ఆలకించి, చప్పున సరస్వతి వెనక్కి తిరిగి, రవికె అనేక చోట్ల పిగిలి ఉండటం, కొద్ది కుట్ల ఆధారంతో వీపున వేలాడుతూండటం గమనించి, ‘‘ఛ! ఇలా ఉంటే ఏం బాగుంటుందీ?’’ అని తన వేలు దూర్చి ఆ మిగిలివున్న కాసిని కుట్లూ ఊడివచ్చే విధంగా పైనుంచి కిందికి చీల్చిపారేసింది. రవిక రెండు తుండాలై సరస్వతి వీపున వేళ్ళాడసాగింది; రాణి పగలబడి నవ్వింది.
‘‘ఏం పెళ్ళికూతురా! శోభనం మొదటి రాత్రే, వరుడు రవిక చింపుతున్నా తెలియనంతటి పారవశ్యాన్ని పొందావే! ఏమోనమ్మా ఏమీ తెలియని అమాయకురాలల్లే కనిపించే ఆడపిల్లను ఈ రోజుల్లో అసలు నమ్మేందుకే వీల్లేదు. తగిన నాయకుడు కనిపిస్తే చాలు- అతను ఎంత చిలిపి పనులు చేసినా సహించి ఊరుకోవటం తప్ప, తనకు ఇంకేమీ చేతకాదన్న విధంగా భరించటం తప్ప మరేమీ చేయలేరు! మా కాలంలో ఇలాంటివి ఎరగమమ్మా!
ఐతే నువ్వతన్ని బుట్టలో వేసుకొని ఉండవులే! నినే్న సమ్మోహనాస్త్రంతో వశం చేసుకొని తన వలపు వలలో, నీ రెక్కలు విరిచేసి బంధించి ఉంటాడు. ఔనా?’’ అన్నది రాణి.
చచ్చే సిగ్గుతో సరస్వతి మాట్లాడబోయింది కాని ఆమె పెదవులు అదిరించటం మినహా, మరేమీ చేయలేని అశక్తురాలయింది.
‘‘రవికేనా- చీరె కూడా చింపాడా? చూడనీ!’’ అని రాణి బలవంతంగా అలనాడు నిండు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది వలువ వొలిచే విధంగా సరస్వతి బొడ్డులో చేయి పెట్టి చీరె చెంగును దృఢంగా చేజిక్కించుకున్నది; చేతికి గట్టిగా తగలటంతో ముందది విప్పి, సువర్ణ ముద్రికను బైటికి తీసి అరచేతుల్లో ఆడిస్తూ ‘ప్రియుడు చెంగున కట్టాడా?’ అన్నది రాణి.
సరస్వతి నోరు మెదపలేదు.
‘అంతా సవ్యంగా, సక్రమంగా, శాస్త్ర ప్రకారమే కార్యాన్ని జరిపించుకున్నావన్నమాట! అభినందనలు సరూ! అన్నట్లు చీరె విప్పి చూపు!’’
‘‘రాణీ! సిగ్గుతో ఛస్తూన్న నన్ను ఇంకా చావబాదుతావెందుకు!’’ అన్నది సరస్వతి బిక్కచచ్చి.
‘‘ఎంత సిగ్గొచ్చిందే! సిగ్గే సింగారమే సరస్వతీ నీకు! నా దగ్గరా నీ సిగ్గు! నీ రుూ వేషాలన్నీ నీ ప్రియుడి దగ్గర ప్రదర్శించు..’’
‘‘మీకో నమస్కారం... ‘నీ ప్రియుడు’ అనొద్దు రాణీ! నేను కావాలన్నానా? లేని పోనిది నా తలమీద పడితే ఏం చేయను?.. అంతా వింటే మీకే అర్థవౌతుంది..’’
‘‘చెప్పు మరి’’
‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మిమ్ము స్నానం చేయిస్తూ చెపుతాను!’’ అని సరస్వతి రాణితో రాజీ కుదుర్చుకున్నది.
‘‘సరే ఐతే.. ఇదుగో నీ శోభనపు బహుమతి. కళ్ళకద్దుకొని జాగ్రత్తగా దాచుకో’’ అని సువర్ణ ముద్రికను రాణి సరస్వతికి అందించింది. సరస్వతి దాన్ని కళ్ళ కద్దుకోకుండానే బొడ్డున దోపుకున్నది.
ఆ తరువాత రాణి జలకమాడుతూండగా, సరస్వతి గత రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెపుతూంటే, రాణి ఆ వినోదాన్ని వింటూ, పగలబడి నవ్వుతూ ఎంతో ఆనందించింది. ప్రణయకలాప విశేషాలు, శృంగార చేష్టలు, వివిధ ప్రయోగాలు మొదలైనవి మాత్రం సరస్వతి జాగ్రత్తగా తన హృదయంలోనే దాచి ఉంచుకొని, తన కథనం నుంచి దూరం చేసింది.
‘‘అనంగ రంగాన్ని గూర్చి ఒక్క ముక్క కూడా పొక్కనీయలేదేం?’’ అని రాణి ఫిర్యాదు చేసింది. కాని సరస్వతి చలించలేదు.
‘‘చెప్పదలచలేదా?’’ అన్నది రాణి.
‘‘తాము వినదగినదంతా చెప్పనే చెప్పాను రాణీ!.. నా పాటికి నాకు ఇది పొడిగించవలసిన వ్యవహారంగా తోచటంలేదు!’’ అన్నది సరస్వతి ధోరణిని పూర్తిగా మారుస్తూ.
‘‘ఏం? ఎందుకనీ?’’
‘‘మొదట ఎదురుపడిన ఏ స్ర్తికైనా తేలిగ్గా వశుడయ్యే తత్వమున్న నాయకుడ్ని నమ్మటమెలా?’’
‘‘పిచ్చిదానా! స్ర్తిలోని ఆకర్షణా, పురుషుణ్ణి తేలిగ్గా బోల్తా కొట్టించగల చాకచక్యమూ నీకింకా తెలిసి రాలేదా? ఎంత బలాఢ్యుడవనీ, కఠినాతి కఠినుడవనీ, మహా పరాక్రమశాలి కానీ, ధైర్యసాహసాలకు మారుపేరవనీ- కోరిన ఆడదాని ముందు మాత్రం పురుషుడు అల్పాతి అల్పుడవుతాడు! అది రుజూ చేయగలిగి కూడా నీలో నిరాశ ఎందుకు గూడు కట్టుకుంటుందో నాకు బోధపడటంలేదు!’’ అన్నది రాణి.
‘‘రాణీ! అతనికి నామీద పిచ్చిపట్టిందని నేనంటే బహుశా నాకే పిచ్చెక్కిందని మీరు భావిస్తారేమోనని భయపడుతున్నాను’’
‘‘అది శుభసూచకమే సరూ! మదోన్మాదిని లొంగదీయటం మరీ సులువు; ఐతే సమయం చూసి కీలెరిగి వాత పెట్టినట్లుగా ప్రవర్తించాలి!’’ అన్నది రాణి.
‘‘ఆ శుభ సమయమే సుదూరంలో వున్నదని నా నమ్మకం!’’
‘‘ఎంత దూరమున్నప్పటికీ, ఎదురేగి దాని దరి జేరటం సాధ్యమే సరూ! కాస్త ఓర్పూ, చాకచక్యమూ అవసరం. ఇతనేం విశ్వామిత్రుడా? ఋష్యశృంగుడా? వాళ్ళు ఎంత తేలిగ్గా స్ర్తికి లొంగారో ఇతనూ అంతే కదా! ఆయా నాయికలు వాళ్ళను ఎలా ముక్కులకు తాళ్ళు పోసి లాక్కొచ్చి తమ కార్యాలు సాధించారో, అదే విధానం ఇతని పట్ల కూడా జయప్రదంగా ప్రదర్శింపబడుతుందనేందుకు ఎలాంటి సందేహమూ లేదు. కఠినాతి కఠినమైన విధిలాటిది భక్తికీ, సేవలకూ లొంగుతుంది కదా!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు