డైలీ సీరియల్

దూతికా విజయం-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు, దృఢమైన లోహమనబడే ఉక్కు కూడా, వేడిమీద విడవకుండా దెబ్బలు వేస్తే కావలసినవిధంగా సాగుతుంది. అందులోనే కాస్త మెలకువ అవసరం అంతే’’
‘‘రాణీ! మీరు చెప్పినంత తేలికగా తోచదు’’ అన్నది సరస్వతి.
‘‘తేలికని నేను అనలేదు. చుట్టు తోవనపడినా, ఓర్పుతో సాధించే అవకాశాలు అనేకం వున్నవంటున్నాను. స్ర్తి నుంచి పొందగల సౌఖ్యమేమిటో వీరభద్రుడికి తెలిసి వచ్చింది కదా! ఆ అనుభూతిని అంత తేలిగ్గా మరచిపోవటం కానీ, విడనాడగలగటం కానీ అతని సాధ్యమవదు. పూవులోని మకరందాన్ని పొందటం నేర్చిన తుమ్మెద చేతికి అందిన పూలన్నిటిలోని మధువునూ గ్రోలుతుంది. అది సహజం. అందునా ఈ పురుషుల చిత్తాలు మహా చాంచల్యాలు; తమమీద ఈ నింద పడకుండా ఉండేందుకు, పురుషులైన కవులు మాత్రం స్ర్తి మనసు చంచలమైనదని ప్రచారం చేశారు. అంతే! ఒక్క విషయం ఆలోచించు సరూ! ఒక సౌఖ్యం మీది నుంచి మరో సౌఖ్యంమీదికి మానవుని మనసు పోకుండా ఆపగలిగిందేదీ ఈ ప్రపంచంలోలేదు. ఐతే అదెప్పుడు సంభవమో, దానికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు ఏర్పడుతుందో ఎప్పుడన్నా యోచించావా?’’ అన్నది రాణి; సరస్వతి జవాబుకు ఎదురుచూసే విధంగా, ఆమె ముఖంలోకి చూసింది.
‘‘మొదటి అనుభవం మొహం మొత్తినప్పుడు’’ అన్నది సరస్వతి..
‘‘సరిగ్గా గ్రహించావు సరూ! ఒక అనుభవంతో పరిపూర్ణమైన తృప్తి కలిగినప్పుడే కదా దానిమీద మొహం మొత్తేది! దాన్ని ఇవ్వగలగటమనేది నీ అధీనంలో వుంచుకున్నాక, సాధించలేనేమోననే సందేహం నీలో రేకెత్తవలసిన అవసరం ఏమున్నది?’’
‘‘ఇదే చాలు లెమ్మని, అతను తృప్తిపడితే?’’
‘‘అతను మానవాతీతుడే అవుతాడు సరూ! ఎక్కడో కోటికొకడు అలాంటివాడుంటాడేమో అదీ అనుమానమేననుకో! వైవిధ్యం లేని జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారా? అదీగాక ఒక పూవులోని తేనెను పీల్చి పారేసేకన్నా, రెండోదాని కోసం ప్రయత్నించక తప్పుతుందా? ఇతనేం యోగిపుంగవుడూ, నీతోనే ముక్తి పొందేవాడంటే నేను నమ్మలేను. నీవు ఇవ్వగలిగిన సుఖంకన్నా అత్యధికమైనది దక్కుతుందంటే ఆశపడనివాడంటావా?’’
అతనితో ఒక్క మాటన్నా మాట్లాడని రాణి ఈ అంచనాలు వేసుకొని, తనను తాను వంచించుకుంటోందేమోననే భయం సరస్వతికి పట్టుకున్నది. తాను ఎదురాడి ఆమెకు నచ్చచెప్పలేదు. అందుకని వింటూ ఊరుకున్నది.
‘‘ఒకవేళ నీ మీద అతనికి అంత తీవ్రమైన మమత ఘనీభవించిందే అనుకుందాం- అప్పుడు కూడా విజయం మనదే సరూ!’’
‘‘ఎట్లా?’’ అన్నది సరస్వతి, అయోమయయమై కళ్ళు పెద్దవి చేసి.
‘‘నిజంగానే నీ పట్ల అంత ప్రేమ అతనికి ఏర్పడాలే కాని నీవు కోరే కోరిక ఎంత అనుచితమైనప్పటికీ, దాన్ని ఆజ్ఞగా భావించి తీర్చడా?’’
అదీ నిజమేననిపించింది సరస్వతికి. తనపట్ల వీరభద్రునికి వున్న ప్రేమకు ఇదొక విషమ పరీక్షగా, గీటురాయిగా కూడా ప్రయోగించవచ్చు. రాణి ఆలోచన ఎంత విజ్ఞానపూరితంగా వున్నదో గ్రహించటంతో సరస్వతి కొత్త వికాసపు తరంగం పొంగిపొర్లింది.
‘‘రాణీ! ఇది మంచి ఉపాయం!’’’
‘‘అంతేకాదు సరూ! వీరభద్రుణ్ణి అనేక విలువైన బహుమతులతో ముంచెత్తుదాం. దాన్ని బట్టి అతన్ని కోరే రాణి ఎంత గొప్పదో అర్థమైపోతుంది. నా నీడగా ఉండే నీవే అతన్ని పరవశుణ్ని చేయగలిగావని తెలుసుకున్న నాయకుడు, అసలు వస్తువుకోసం అర్రులు జాచడా? ఇతని నిశ్చయాలు, ఆదర్శాలూ, పట్టుదలలూ సడలటం ఎంతసేపూ? పాతికేళ్ళు పట్టుకొని వేళ్ళాడిన బ్రహ్మచర్యమే ఛిన్నాభిన్నమై క్షణంలో కరిగిపోగాలేనిది ఈ ఏకాగ్రత ఎంతకాలంలే సరూ!’’ అన్నది రాణి.
రాణి వేసిన పథకం ప్రయోగార్హంగానే తోచింది సరస్వతికి.
‘‘రాణీ! ఈ రాత్రి వెళ్ళటం మానేస్తే?’’
‘‘ఏం? అందువల్ల ప్రయోజనమేమిటి?’’
‘‘అతనికి అలుసు కాకుండా ఉందామని. బాగా వేడెక్కిన ఇనుము మీద బలంగా పడే సమ్మెట పోటులు అది బాగా సాగేందుకు అనుకూలిస్తుంది కదా!’’ అన్నది సరస్వతి.
‘‘నీవు చెప్పిన సిద్ధాంతం ప్రయోగించవలసిన సమయం ఇది కాదు సరూ! ప్రథమ ప్రణయావేశాలూ, ఉద్వేగ ఉద్రేకాలూ చల్లబడనీ. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని వినలేదా? రుచి మరిగాడు కనుక మతి చలించి నీవు రాలేదని నిన్ను వెతుక్కుంటూ ఈ ప్రాంతాలకు వచ్చినా రావచ్చు. అది మహా ప్రమాదం. పూర్తిగా ప్రణయసాగరంలో మునిగి ఊపిరాడక కొట్టుకుంటూండే పరిస్థితి వస్తే, అప్పుడు సహాయం కోసం అతను అర్థించక తప్పదు. ఆ సమయాన మనం బెట్టు చేసి, పట్టుబట్టి బుట్టలో వేసి, లోబరచుకోవాలి తెలిసిందా?’’ అన్నది రాణి.
‘‘అనుభవజ్ఞురాలివి నీకు తెలియందేమున్నదిలే రాణీ!.. మనం చాలాసేపు ఇక్కడే ఉన్నాం.. ఇక వెళ్దాం రాణీ! చెలులు ఏమన్నా అనుకుంటారేమో?’’ అన్నది సరస్వతి.
‘‘నేను మరి కాసేపు స్నానం చేస్తే ఏమన్నా అనుకుంటారా? చర్మం వొలిపించనూ? ఇకనుంచీ నా స్నానం ప్రతిరోజు ఇంత ఆలస్యంగానే జరుగుతుంటుందని చెప్పు.. మీ దూరపు బంధువుకు విషజ్వరమనీ, ప్రతిరోజూ రాత్రి అక్కడికి వెళ్ళేందుకు అనుమతించమని చెలులందరూ వింటూండగా నన్ను అడుగు. నేను అనుమతి ఇస్తాను. ఇక ఎవరికీ అనుమానాలుండవు!’’’
సరస్వతి సరేనన్నట్లు తలూపింది.
‘‘ఇవాళ నేనే నిన్ను స్వయంగా అలంకరిస్తానే’’ అన్నది రాణి.
‘‘వద్దు రాణి! వెళ్ళేది విషజ్వర పీడితుడైన రోగి దగ్గరికి. అలంకరణలు ప్రియునికోసమన్న విధంగా వుంటే అన్వయం కుదరదు కదా!’’
‘‘ఔనౌను. ప్రణయ జ్వరపీడితుడికి చికిత్స జరిపే నిమిత్తం వెళ్తున్న వైద్య ప్రముఖురాలుగానే ఉండాలిలే!.. బహుమతి తీసుకొని వెళ్లటం మరువకు. చివరకు ఈ బహుమతులు స్వీకరించిన కృతజ్ఞతన్నా అతనికి చూపక తప్పని పరిస్థితి ఏర్పరచాలి!’’ అన్నది రాణి.
సరస్వతి తన ఆమోదాన్ని తల ఊపి తెలియపరచింది.
‘‘ఇక వెళ్దామా రాణీ!’’
‘‘ఊ! నీవొకసారి మొహం కడుక్కో... తలమీద ఆ కుంకుమ కూడా తీసేయ్.. త్వరగా నీ గదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, దుస్తులు మార్చుకొని రా. మధ్యాహ్నం భోజనమయ్యాక హాయిగా నిద్రపో. రాత్రి చాలా అలసి ఉంటావులే!’’
‘‘నీకు ఎప్పుడూ వేళాకోళమే రాణీ!’’
‘‘మళ్లీ రాత్రికి బోలెడు పని ఉంటుంది సరూ! శోభనపు పెళ్లికూతురికి తగినంత విశ్రాంతి అవసరం. అందుకని చెపుతున్నాను!’’
‘‘సరేలే పోదాం పా రాణీ!’’
సరస్వతి దారి చూపగా రాణి తన మందిరానికి బయలుదేరింది.
***
మెల్లిగా, దగ్గరేసి వున్న తలుపు తోసుకొని వీరభద్రుని శయన గృసంలోకి ప్రవేశించి ఒక్కసారి పరికించి చూసి ఆశ్చర్యపోయింది సరస్వతి. రాత్రి తాను ఇక్కడే గడిపానా అనే సందేహం, పొరబడి తాను వేరొక ఇంటిలో ప్రవేశించానా అనే అనుమానం క్షణకాలం ఆమెను పీడించింది.
గదంతా ఎంతో శుభ్రంగా ఉన్నది. మంచం కూడా మార్చబడింది. మంచం మీద సుఖకరకంగా ఉండే పట్టు పరుపులూ, రకరకాల తలగడలూ అమర్చబడి ఉన్నవి.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు