డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లియోపాత్రా చప్పున లేచి కూర్చుంది. ఆయా యువరాణి శరీరాన్ని తాకి చూసి ‘‘జ్వరం లేదు.. పిచ్చి పిల్ల! రాత్రి అనవసరంగా భయపడ్డావు. ఈ రాజప్రాసాదంలో భయం అనేది ప్రవేశించగలదా?’’ అన్నది.
‘‘పిచ్చి ఆయా!’’ అనుకున్నది యువరాణి. భయమనేది దాసదాసీలకూ, బానిసలకూ ఉండకపోవచ్చు. ఎందుకంటే వారి జీవితాలు విలువైనవి కావు. కాని తన జీవితపు విలువ- ఈజిప్టుసామ్రాజ్యం! సాధారణమైన రాళ్ళను ఎత్తుకువెళ్లటం బరువుచేటు! కాని వజ్ర వైఢూర్యాలూ కూడా రాళ్ళ జాతికి చెందినా, వాటి విలువను బట్టి ఎవరైనా ఎత్తుకొనివెళ్తారనే భయం ఉండటం సహజం! అందుకనే తాను భయపడుతోంది; ఈ స్వల్ప విషయం ఆయాకు తెలియదు. తనమీద అనురాగమే తనకు రక్షగా ఉంటుందని ఆయా నమ్ముతోంది.
‘‘లే తల్లీ! గురువుగారు రుూపాటికి వస్తూ ఉంటారు’’ అని ఆయా తొందర చేసింది.
క్లియోపాత్రా కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది.
కాస్సేపటికి ఆచార్యులు వచ్చారు. ఆయన్ను ఆశీనుణ్ణి చేసి, రుూ కబురు చెప్పేందుకు ఆయా చకచకా లోనికి వెళ్లింది.
క్లియోపాత్రా స్నానం చేసి దుస్తులు ధరిస్తున్న సమయంలో ఆయా గురువుగారి రాకను తెలియపరిచింది. క్లియోపాత్రా వెంటనే ఆయన్ను కలుసుకునేందుకు బయలుదేరింది.
‘‘ఫలహారం చేసి వెళ్ళు తల్లీ!’’ అని ఆయా ప్రాధేయపడింది.
కాని క్లియోపాత్రా వినిపించుకోలేదు. ‘‘ఫలహారం అక్కడికే తీసుకొని రమ్మను’’ అని పరుగెత్తింది.
గురువుగారికి ప్రణామం చేస్తూనే క్లియోపాత్రా ఆయన్ను పరిశీలనగా చూసింది. గత రాత్రంతా తనవలెనే ఆయన కూడా తీవ్రంగా ఆలోచించి ఉంటాడని గ్రహించింది.
‘‘యువరాణీ! నిన్న సాయంత్రం నాలుక జారాను. నిన్ను ఎంత బాధపెట్టి ఉంటానో నేను గ్రహించాను. కాని, ఏం చేసేది? జరిగిన తప్పును అన్యథా భావించకు!’’ అన్నాడాయన పశ్చాత్తాపంతో.
‘‘ఆచార్యా! మీరు నిజం చెప్పారు. నిజం చెప్పినందుకు విచారపడటం దేనికి? నన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా వెలుగును చూసేందుకు కళ్బు బైర్లు కమ్మినా, క్రమంగా అలవడుతవి. అది మన మంచికే కదా!’’ అన్నది క్లియోపాత్రా.
‘‘ఎంత తెలివైన పిల్ల!’ అనుకున్నాడు ఇరాస్. ‘నిజంగా ఈజిప్టుకే కాదు ఈ ప్రపంచానికే మహారాణి అవగల సామర్థ్యం ఈమెకు ఉన్నది’.
గురువుగారు సమాధానం చెప్పలేదు. తన మాటల్లోని నిజాన్ని అంగీకరించి ఉంటారని క్లియోపాత్రా తలపోసింది.
ఇంతలో ఫలహారాలు వచ్చినవి.
‘‘తీసుకోండి!’’ అన్నది క్లియోపాత్రా.
ఆయన మాట్లాడకుండా ఆరగించాడు. కాని, ఆయన మనస్సు అక్కడ లేదని క్లియోపాత్రా గమనించకపోలేదు. నిజానికి తన మనస్సు అక్కడ లేదు. అది పంజరంలోంచి తప్పించుకున్న చిలకవలె రుూ ప్రపంచమంతా తన కొరకే ఏర్పడిందన్నట్లు ఇష్టానుసారంగా పరిభ్రమిస్తోంది.
‘‘మీరు నా కళ్ళు తెరిచారు.. కాని నాకింకా కొన్ని సందేహాలున్నవి’’ అన్నది క్లియోపాత్రా. ‘‘వాటికి మీరిచ్చే జవాబుల్లో కూడా కేవలం సత్యమే ఉండగలదని నమ్ముతున్నాను’’.
‘‘యువరాణీ! నేను మీతో అబద్ధం చెప్పలేను!’’ అన్నాడు ఇరాస్.
‘‘ఆచార్యా! మీరు నన్ను ‘యువరాణీ’ అని పిలవవద్దు. నేను నిజంగా యువరాణిని కావొచ్చు. కాని మీకు కాదు. మీకు శిష్యురాలను మాత్రమే! నా మీద మీకున్న వాత్సల్యం ‘యువరాణీ’ అని పిలవటంతో గౌరవంగా మారుతుంది. ఆ గౌరవాన్ని పొందవలసింది నేను కాదు మీరు. అందుకని నన్ను మీ బిడ్డల్లే చూసుకోండి!’’ అన్నది క్లియోపాత్రా ప్రాధేయపూర్వకంగా.
‘‘అలాగేనమ్మా! కాని నేను మాత్రం నిన్ను యువరాణిగానే చూసుకోగలను. టాలమీ వంశంలో ఒక అమానుష శక్తి సామర్థ్యాలున్న రాణి ఉన్నదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నిన్ను చూసి నేనే కాదు, ఈజిప్టు దేశమే గర్వించగలదు. అందుకని నేను నిన్ను ‘యువరాణీ!’ అని పిలిచినప్పటికీ నీ మీద వాత్సల్యం తగ్గదు’ అన్నాడు ఇరాస్.
‘‘సరే, మీ ఇష్టం!’’ అన్నది క్లియోపాత్రా. ‘‘నా అనుమానాలు చెప్పమంటారా?’’’
‘‘చెప్పు తల్లీ!.. తెలిసినంతవరకూ జవాబులు చెపుతాను. నీవు అర్థం చేసుకోగలవనీ, అనవసరంగా కుంగిపోవనీ నాకు నమ్మకం ఉంది’’ అన్నాడాయన.
‘‘మా నాయన రోమ్‌నుంచి తిరిగి వచ్చే అవకాశాలున్నవా? అసలాయన ఇంకా బతికే ఉన్నారా?’’ అన్నది క్లియోపాత్రా.
ఈ ప్రశ్నకు గురువుగారు చాలాసేపు ఆలోచిస్తారనుకున్నదామె. కాని, ఆయన ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబుల్ని ఆలోచించి సిద్ధంగా ఉన్నాడనే సంగతి ఆమెకు తెలియదు.
‘‘తప్పక తిరిగి వస్తారు. వేగులవాళ్ళ వార్తల ద్వారా ఆయన రోమ్‌లో ఇంకా బతికే ఉన్నారనీ, రోమన్ ప్రభుత్వం నుంచి ఈజిప్టు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తిరిగి సంపాయించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, బహుశా ఆ స్వేచ్ఛతోనే తిరిగి ఈ గడ్డమీద కాలు మోపుతారనీ విశ్వసిస్తున్నాను’’ అన్నాడు ఇరాస్
‘‘రోమన్‌లు మనకు స్వేచ్ఛనిస్తారా? పాడి ఆవును ఎవరైనా వదిలిపెడతారా’’ అన్నది క్లియోపాత్రా.
‘‘పేరుకు స్వేచ్ఛ! అంతే.. ఈనాడు అది కూడా లేదు కదా! అసలు మీ తండ్రిని రోమన్‌లు ఈజిప్టుకు రాజుగా అంగీకరించటంలేదుగా!’’ అన్నాడాయన.
‘‘ఐనప్పుడు ఈజిప్టు నుంచి రుూ ఐశ్వర్యమంతా ఓడల్లో రోమ్ నగరానికి ఎగుమతి కావలసిన అవసరం ఏమున్నది?’’
‘‘రోమన్ సామ్రాజ్యానికి ఈజిప్టు సామంత రాజ్యంగా ఉన్నది కనుక’’
‘‘ఐతే ఇప్పుడు ఈజిప్టు పాలకులు ఎవరనేది నిర్ణయం కావాలంటారా?’’’
‘‘ఔను’’
‘‘దానికి సందేహమేమున్నది? నా అక్క బెరినైస్ మహారాణి ఉన్నదికదా!’’ అన్నది క్లియోపాత్రా, బెరినైస్ పేరు మీద అసహ్యభావం ఉట్టిపడేటట్లుగా ఉచ్ఛరిస్తూ.
‘‘నిజమే! పరిపాలన ఆమె పేరుమీదుగా జరుగుతున్నప్పటికీ, తిరిగి మీ నాయన ఈజిప్టు రాజుగా తిరిగి వస్తాడేమోననే భయం మీ అక్కగారికున్నది. ఈజిప్షియన్లు ప్రస్తుతానికి బెరినైస్‌ను రాణిగా అంగీకరించినా, రోమ్‌లో జరిగే నిర్ణయం మీదనే ఆమె భావి జీవితం ఆధారపడి వుంటుంది’’ అన్నాడు ఇరాస్.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు