డైలీ సీరియల్

మంగళకరుడు శివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా పాము పెట్టిన బాధను భరింపలేక, ఏ యుపాయం తోచక చివరకు ధైర్యంతో ‘ఇప్పుడు శివసన్నిధిలో నేనా చావక తప్పదు. సర్పం నన్ను చంపక విడువదు. నాకంటె ఈ సర్పం ఘనమైనదా? నాకే దుఃఖమేల? సరిజోదు అయిన వానిని చంపి చావడం జనామోద యోగ్యమైనది కదా! ఈ దక్షిణకైలాస పర్వతమే వధ్యశిలగా చేసి కొంటాను.’ అని తలంచి ఆ ఏనుగు ఈశ్వరాభిముఖంగా నిలిచి నమస్కరించిం ది. ఈ సర్పం ఏ సందులో నుండి పారిపోతుందో అని భావించి తుండాన్ని దగ్గరగా చుట్టి దానిని నోటిలోనికి దూర్చింది. శిరస్సును బాగా వంచి కొండ శిఖరాలు ఊగిసలాడగా వేగంగా వచ్చి భగ్గున ఆ కైలాస పర్వతాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో కొండరాళ్లు క్రిందకు జారే విధంగా, కొండ మరొక కొండను ఢీకొన్నట్లు తోచింది. తలలోపల నున్న పాము చిదికి పోయింది. ఏనుగు నేల కూలిపోయింది. నెత్తురచ్చట పడియ కట్టింది. కాళ-సర్పాల మరణస్థానం దక్షిణకైలాస సమీపం మరియు సువర్ణముఖరీ నదీ తీరం కావడం చేత ఆ రెండూ రుద్రగణాకారాలను దాల్చాయి. హిమగిరి తనయతో కూడి చంద్రశేఖరుడైన ఆ శివుడు వృషభారూఢుడై బ్రహ్మ - విష్ణువులు మొదలైన దేవతాశ్రేణులు సేవిస్తూ ఉండగా లింగమధ్యంలో నుండి ప్రత్యక్షమై మీకభీష్టమైన వరాల్ని కోరుకొండని ఆనతిచ్చాడు. వారు సాష్టాంగ దండప్రణామాలు చేసి క్రింది విధంగా సన్నుతించారు.
కాళహస్తులు చేసిన శివస్తుతి
‘అగస్త్యాచల పుత్రికయైన సువర్ణముఖరీనదీ తీరంలో ఉన్న కల్పవృక్షమా! దక్షిణకైలాస పర్వతాన ఉండే మునీశ్వరుల చేత సేవింపబడు పాదపద్మాలు కలవాడా! జ్ఞానప్రసూనాంబ అనే పార్వతీ దేవి దృఢ ఆలింగన సౌఖ్యంలో తేలినవాడా! క్రీడాపర్వతమైన దుర్గాచలంపై గల సానువులలో విశృంఖలంగా విహారం చేసేవాడా! భారద్వాజాశ్రమ వనాలలోని వినోద సరోవరకేళియందు సంతోషాన్ని పొందేవాడే. మోహన తీర్థాన్ని దర్శించాలని కాంక్షించే వారి సంసార బంధాన్ని నిర్మూలించే వాడా ! మయూరతీర్థాన్ని ఆశ్రయించిన మునీశ్వరుల హృదయ మండలి జ్ఞానానందానికి సూచకమైన వాడా! సహస్ర లింగాలయాన్ని దర్శించినంత మాత్రాన స్నిగ్ధమైన కలిగించే వాడా! మార్కండేయ మునీశ్వరుని తీర్థాన్ని సేవించువారి పాపాల్ని నాశనం చేసేవాడా! ఇంద్రతీర్థంలో స్నానం చేసేవారి పాపాలనే కట్టెలను దగ్ధం చేసే అగ్నివంటి వాడా! నీ పాదపద్మాలను సేవించేవారిని దయా దృష్టితో చూచి రక్షించే వాడా! దేవా! నిన్ను వర్ణించ డానికి బ్రహ్మవిష్ణువు లైన సమర్థులా? నీ తత్త్వజ్ఞానాన్ని తెలియనివారు సకల వేదాలు - ఆగమాలు చదివి జీవన్ముక్తులు కాగలరా? కొందరు నిన్ను సో-హమ్మని అద్వైతస్థిర చిత్తం తో ధ్యానిస్తారు. మరికొం దరు దాసో-హమ్మని భక్తితో నిన్ను సకలగుణాపూర్ణుడిగా భావి స్తారు. కొందరు నీవు మంత్రరహస్య స్వరూపుడవని జపనియమాన్ని పూని జపిస్తారు. నీవు హఠయోగార్థ స్వరూపుడవని కుండలిని ప్రాణవాయువు చేత జాగృత పరుస్తారు కొందరు. అందరు తమ ఇచ్ఛాను సారంగా ఏఏ మార్గాలననుసరించినా చిద్రూపమైన (ఆనందస్వరూపమైన) భగవత్తత్త్వాన్ని చేరుకోలేక నీవే దిక్కని తమలోని సంతాపాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. నిన్ను సేవించిన ధన్యుడు మాత్రం తక్కిన నీచ దేవతల్ని ఆరాధించడు. నిన్ను శరణమని ఆశ్రయించిన ధీరుడు ఏ యితర చోటులలో నిలువ జాలడు. నీవు అనే ఒక గొప్ప నిధిని పొందిన వాడు మరియే ఇతర అర్థాన్ని కోరుకోడు.
నీవే గతివని స్థిరంగా ఉండే పుణ్యుడు ఇతరులను చేరవలెనని భావించడు. నీ పద పంకజములపై హృదయం నిలువకుంటే జననమనే చెడు వాసన పోదు. నిన్ను ఉపాసింపనిచో ఏ ఇంద్రియాలు విషయవాంఛలను వీడవు. భక్తితో నిన్ను సేవింపకుంటే ఈ లోకంలో జననమరణ బాధలు తప్పవు. నీ ఆనందస్వరూపాన్ని మనసునకు మరగింపకుంటే అణిమాది సిద్ధులు సిద్ధింప జాలవు. నీ మాహాత్మ్యం ఇంతయని పరిమితి చేసి చెప్పడానికి మేమెంత వారం? మా మీద దయ కలిగి ఓ మహేశ్వర! మమ్ము మన్నింపుమయ్యా! నీకిదే మా నమస్కారం. ఓ దేవా! ఈ సంసార సముద్రంలో పడి చాలకాల మీదాము. దేహం మీద ఆశ వీడజాలక మునిగితేలుతూ శతసంఖ్యాకమైన జన్మ-మరణదుఃఖాలను అనుభవించాము. ఈ కపటమైన సౌఖ్యాలు మాకిక చాలు. మాకు నిత్య సుఖాన్ని అనుగ్రహించు’’ అని ప్రార్థించిన ఆ కాళహస్తుల్ని దరికి చేరదీసి శివుడు అఖండజ్ఞాన స్వరూపమూ, మహావిశాలమూ, వాక్కుకు- మనస్సుకు అందనిది, మాయా రహితమైనది, ఆకాశతుల్య మైనది - స్వచ్ఛమైనది అయిన తన సర్వవ్యాపక పరంజ్యోతిలో విలీనం చేసికొని వానికి ముక్తిని అనుగ్రహిం చాడు. దానిని చూచి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ విధంగా కాళ-హస్తులు ఆ లింగంలో విలీనమయ్యాయి గనుక నాటి నుండి చంద్ర వౌళీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడనే పేరున ప్రఖ్యాతుడయ్యాడు. శివుడు ఇట్లు శ్రీకాళహస్తుల కద వినిపింపగా యాదవ భూపాలుడు ‘‘ఆ నీలగ్రీవుని సేవించి ముక్తి పొందిన వారెవరున్నారు తెలుపు’’మని ప్రార్థించగా శివుడిట్లు కన్నప్ప కథను చెప్పాడు.
ఆశ్వాసాంతము
కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలనే అంతః శత్రురూపమైన అంధకారానికి ప్రచండమైన సూర్యుడా ! సమస్త బ్రహ్మాండాలను నశింపచేయు కాలంలో చేసే మహాతాండవ నృత్యం చేత కల్లోలితమై నశించే ప్రపంచం కలవాడా! దశదిక్కులు అనే వివిధవర్ణవస్త్రాలతో ప్రకాశించే తేజఃస్వరూపా! కాలమనే విజయలక్ష్మి తోడి దాంపత్యం చేత నిత్యవర్ధమాన మహాదైవమా! శ్రీకాళహస్తీశ్వరా! పాపాలను హరించువాడా! బ్రహ్మానంద మార్గంలో విహరించువాడా! తారకమంత్రమనే ఘంటాధ్వని చేత మనస్సులనే మృగాల్ని హరించే వేటగాడా! శ్రీకాళహస్తీశ్వరా !
- ఇంకావుంది...

చరవాణి: 9490620512