డైలీ సీరియల్

తిన్నని శర విద్యాభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి కాంతివంతంగా కాటుక దిద్దారు. మందుల తాయెత్తులు కట్టారు. తిన్నడు ఆవిధంగా శబర పుత్రులతో ఆటలాడటానికి వెళ్లాడు.
ఆ విధంగా తిన్నడు వారితో కలిసి ఆడిన ఆటలెనె్నన్నో, చిట్లి పొట్లకాయ- సిరిసింగణావత్తి- గుడుగుడుగుంచాలు- కుందెనగుడి- దాగుడుమూతలాటలు - గ్రచ్చకాయలు - వెనె్నలకుప్పలు - తన్ను (తొక్కుడు) బిళ్ల - తూరనతుంకాలు - గీరిన గింజలు - పిల్లదీపాలంకి - బిల్లగోడు (గూడుబిళ్ల) - చిడుగుడువ్వలపోటి - బెండు గట్టిన బోది - అల్లియుప్పన బట్టెలు - అప్పళాలు - చిక్కనాబిళ్ల- లోటిల్లు, చిందర, ఇటువంటి ఆటలెన్నింటిలో శబరపుత్రులతో కూడి తిన్నడు బాల్యక్రీడలలో తేలియాడాడు.
తిన్నడు విలువిద్యనభ్యసించడం
అంతమాత్రమే కాదు. బాల్యంలో చిన్న విల్లును, అలుగులు (ఇనుపముక్కలు) లేని బాణాల్ని గ్రహించి చెంగుచెంగున ఎగిరే లేడిని; నింగినెగిరే పక్షిని గురిచూసి విలువిద్యా నైపుణ్యంతో కొట్టే తిన్నణ్ణి చూచి ఈతడు దేవాంశ సంభూతుడు. అందుకే ఆ విధంగా సూక్ష్మాతిసూక్ష్మవస్తువులను చూడ గల దివ్యశక్తి తిన్నడికి అబ్బి ఉంటుంది. కాకపోతే ఆ దృష్టి తల్లిదండ్రులనుండి సిద్ధించగలదా? అని వేటగాండ్రు అనేవారు. తిన్నడు విల్లుపట్టిన నెలపది రోజులలోనే బలమైన తడవిల్లు (గూబ తడబద్దలతో చేసిన విల్లు) వెదురువిల్లు; సెలసువిల్లు (సెలసుకర్రతో చేసిన విల్లు) మొదలైన చేవగలిగిన విండ్లను సులభంగా తీసి ప్రయోగించగలిగేవాడు.
కొంతకాలానికి తిన్నడు వనవంతడయ్యాడు. ఆతనికి వివిధమైన వేట పద్ధతుల్ని తెలుప వలసిన సమయం వచ్చిందని అనుచరులు బోయలరాజగు నాదనాథుడికి విన్నవించారు. ఆ మాట విని ఆటవికరాజు బోయపల్లెలో కాటిఱేని (ఆటవికుల కులదేవత) జాతరకు చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు. తదాజ్ఞానుసారంగా ఆ బోయపల్లెలో చాటింపు వేయబడింది. ఆ సమయంలో వనచర స్ర్తిలు సాటిలేని ఇంద్రనీలమణుల వలె నల్లగా వంకరగా ఉండే ముంగురులు ప్రకాశించించే నొసటి భాగాలపై జేగురుబొట్టు పెట్టుకొన్నారు. వారు తమకు భారమైన స్తనాలమీద పూలగుత్తుల్ని అలంకరించుకొన్నారు. తమ భుజాలపై వారు తామర తూండ్లతో అలంకరించుకొన్నారు. మెడలలో నెమలి కన్నులదండల్ని కట్టుకొన్నారు. చెవులకు నెమలి ఈకల్ని ఆభరణాలుగా ధరించారు. ఘనమైన తమ పిరుదులపై పారుటాకుల్ని కట్టుకొన్నారు. గోరింటపూల గుత్తుల్ని కొప్పులలో అలంకరించుకొన్నారు. ఎర్రని తమ పాదపద్మాలకు పారాణి పూసుకొన్నారు. లేడిచూపుల వలె సొగసులీను అందమైన కన్ను తామరలు అనే మన్మద బాణాలకు తుప్పు పట్టకుండు టకై కాబోలు చమురుతో నిండిన నల్లని కాటుకను పెట్టుకొన్నారు. పునుగు- జవ్వాది - పచ్చికస్తూరి కలయిక వలన గుబాళించే అడవి పసుపు పూసుకొన్నారు. మరు నాడు మంగళవారాన కాట్రేని జాతర ఆరంభమయ్యింది.
కాట్రేని దొరకు నైవేద్యంగా భిల్లస్ర్తిలు వివిధ ఆహార పదార్థాల్ని తయారుచేసారు. వానిని వివిధ పాత్రలలో నింపారు. అవి ఉపాహారాలుగా పువ్వుల వలె నివ్వెర బియ్యాన్ని వండి వార్చి నింపిన కుండలు; చమరీమృగాల పాలకు తగిన గునుకు బియ్యం (ఒకవిధమైన అడవిబియ్యం) కలిపి వండిన పాయాసాల్ని నింపిన భాండాలు; వెదురు బియ్యాన్ని పిండిగా కొట్టి ఉడికించి వార్చి ఆవిరితో మరల ఉడికించి సిద్ధం చేసిన కుడుముల్ని నిండుగా పోసిన పాత్రలు; పుచ్చకాయ ముక్కలతో వెల్లుల్లి వాసనా భరితమైన మాంసపు పిండి కూరల్ని వండి నిండుగా అమర్చిన కుండలు; ఆకుపచ్చదనం చెదరిపోనీకుండ రుచికరంగా అడవికూరలతో వండి సిద్ధంచేసిన పాత్రలు; ద్రాక్ష - బెల్లం - ఇప్పపువ్వు- తాడి - ఈత- బియ్యం మొదలైన వాని నుండి తీసిన మద్యాన్ని నింపిన కలశాలు, కాట్రేనికి బలి పెట్టడానికి వన్యసంబంధమైన అడవి పంది - కోడి - దున్నపోతు - మేక - గొఱ్ఱె మొదలైన మృగాల్ని నింపిన గంపల్ని పెట్టుకొన్ని కావళ్లు. ఇలా అన్నింటిని తీసుకొని వరుసగా కాట్రేని గుడికి అందరు నడిచారు. ఆ సమయంలో తప్పెటలు మ్రోగించారు. వెర్రి సొరకాయల బుర్రల్ని కట్టిన తొడిమెట్లకినె్నర వాద్యాలు వాయిస్తూ కిరాతులు తానమాన యుతంగా పాటలు పాడసాగారు. తుడుము అనే వాద్య విశేషంతో పెద్దగా ధ్వనుల్ని సృష్టించారు. కొమ్ముబూరల్ని బిగ్గరగా ఊదారు.
అప్పుడు తందెదేవియు - నాదనాథుడు ఒక పొద్దు ఉపవాస మున్నారు. స్నానం చేసారు. కర్ణ్భారణాలు, కంఠాభరణాలు, హస్త్భారణాలు, పాదాభరణాలు ధరించారు. కుమారుడు తిన్నని చూచి వారు ‘‘నీవు కూడ అలంకరించుకో’’ అని అనుజ్ఞ యిచ్చారు.
తల్లిదండ్రులు అనుమతి యిచ్చిన వెంటనే తిన్నడు స్నానం చేసాడు. విభూతి ధరించాడు. రక్షామూలికలు ఉంచిన రక్షరేఖల్ని కట్టుకొన్నాడు. గోచిగాపోసి పంచెను ధరించాడు. తలనిండుగా పెరిగిన కేశపాశానికి లేత తీగ చుట్టుకొన్నాడు. విల్లంబుల్ని చేత ధరించాడు. ఆ రీతిగా తిన్నడు అలంకరించుకొని కాట్రేని పూజకు బయలుదేరాడు. ఆ కుమారుని చూచి తల్లిదండ్రులయిన తందె- నాదనాదల మనస్సులు ఉప్పొంగిపోయాయి. తిన్నడు వేటదేవతయైన కాట్రేని సన్నిధికి పోయి చేతనున్న విల్లంబుల్ని - వేటసాధనాల్ని ఉంచాడు. అప్పుడు ఆ దేవతను ఎర్రని పూలదండతో, నివ్వరి బియ్యంతో, ఎర్రచందనంతో, గుగ్గిలపు పొగతో, దట్టమైన పునుగుతో, వెలిగించి పైకెత్తిన జ్యోతులతో వివిధమైన ఘనోపచారాల్ని శబరులు చేసి అర్చించారు. తిన్నడు తన తల్లిదండ్రులతో ఆ దైవానికి నమస్కరించి వేట సాధనాల్ని పట్టాడు. పిదప బోయపల్లెలోని శబర దంపతులతో కలిసి సహపంక్తి భోజనాల్ని చేసాడు.
పిమ్మట వేటదేవతయైన కాట్రేని జాతర ఆరంభమయింది. ఆజాతరలో అందరు మద్యం సేవించారు. దానివలన వారిలో కొందరు మాటాడదలచి మరచిపోయారు. మరికొందరు నడువబోయి తూలిపడిపోయారు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512