డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఛిలాస్ మన మనిషి కాదు, మనకు శత్రువు కూడాను. గాయపరచటమేగాక, అవమానించాడు. మనమిప్పుడు ఈజిప్షియన్‌లనూ, రోమన్‌లను కూడా ఎదుర్కోవలసిన దుస్థితిలో పడ్డాం!’’ అన్నాడు సర్వసేనాని.
సీజర్‌కు మతిపోయినట్లయింది. ప్రపంచాధికారాలే తనచేతుల్లో వున్నవనే భ్రమ నిన్నటిదాకా- కాదు- కొన్ని నిమిషాలకు పూర్వం వరకూ తనలో వున్నది. ఇప్పుడు ప్రపంచాధికారానికి తాను లోబడ్డాడు. ఈ భూమిమీద అనేకమంది సామాన్య మానవుల్లో ఒకడుగా రూపొందుతున్నాడు. ఎంత ఎత్తునుంచి జారి కిందపడవలసి వచ్చిందో ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. చివరకు ప్రాణభిక్ష కోసం కుక్కలలాటి మనుషుల కాళ్ళముందు మోకరింపజేసి, విధి తనను పరాభవించదు కదా?
‘‘ముందు సిరియాకు వాయువేగ మనోవేగాలతో వెళ్ళగల వార్తావహుణ్ణి పంపండి. అక్కడ వున్న రోమన్ సైనికులందర్నీ వెంటనే మనకు సహాయంగా రమ్మని నా ఆజ్ఞగా తెలియపరచండి’’ అన్నాడు సీజర్.
‘‘అదీ చేశాను. తిరిగి ఇప్పుడే మరొక వార్తావహుణ్ణి పంపుతాను. కాని, అక్కణ్ణుంచి సేనలు తరలి వచ్చేదాకా మనం బతికి ఉండటమెలా? ఈలోగానే ఈ యుద్ధం తేలిపోవచ్చును. అదీగాక సిరియా నుంచి వచ్చే సైనికులను ఓడరేవులో దిగకుండానే ఈజిప్షియన్‌లు చూస్తారు. చూడగలరు. ఎందుకంటే ఓడరేవు ఉత్తర దిశలో మాత్రమే మన ఓడలున్నవి, మన సైనికులున్నారు. అంటే పావుభాగం మాత్రం మన అధీనంలో ఉన్నది.. యుద్ధం లాభం లేదు సీజర్!’’ అన్నాడు సర్వసేనాని.
‘‘ఐతే సంధి చేసుకుందామంటావా?’’ అని ఎత్తిపొడిచాడు సీజర్.
సేనానులకు మండిపోతోంది. సీజర్ పట్టిన పట్టు వదిలే రకం కాదు. సర్వనాశనవౌతుందని తెలిసినపుడు కూడా, తాను పట్టిన కుందేలుకు మూడు కొమ్ములేనని మొండికెయ్యటంవల్ల పడే ప్రమాదాన్ని ఆయన దేనికి ఆలోచించాడు?
‘‘అంతకన్నా గత్యంతరంలేదు!’’
‘‘అలాగా!’’
‘‘కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే రుూ చిన్న విషయం మీకు అర్థంగాకపోదు. యుద్ధమే సంభవిస్తే మన మెడకాయలమీద తలకాయల్తో అలెగ్జాండ్రియా నిండిపోతుంది. అసలే రోమన్‌లంటే, ఈజిప్షియన్‌లు మండిపడుతున్నారు. తమ దేశం స్వాతంత్య్రం కోసం తహతహలాడుతున్నారు. ఉద్రిక్తులైనవారితో, అలసి సొలసిపోయి ఉన్న మన సేన నిరుత్సాహంతో తలపడే ఫలితాన్ని వేరుగా చెప్పనవసరంలేదు.
మనం మిత్రులవలె ఇక్కడికి రాబట్టి వారు ఓర్చారు.. కాని, నిన్నటి సంఘటనతో మనం మిత్రుల రూపాన వచ్చిన శత్రువులమని రుజువైంది. అదీగాక ఈజిప్టు నుంచి ప్రస్తుతం మనకు కావలసింది ధనం దాన్ని గుంజుకునేందుకే కదా మనం ఎన్ని ఎత్తులువేసినా? ఇప్పుడు ఈజిప్టులో ధనం లేదు. పన్నులు సరిగా వసూలుగాక ప్రభుత్వం గుంజుకుంటోంది. యుద్ధమే వొస్తే, వారు మనకు కప్పం కట్టనక్కర్లేదు. ఎటుచూచినా రాజీ పడేందుక్కూడా తగిన వాతావరణం కనిపించటంలేదు’’ అన్నాడు సర్వసేనాని.
‘‘అప్పుడు యుద్ధం జరుగుతుంది!’’ అన్నాడు సీజర్. ‘‘యుద్ధం జరగకుండానే చూడాలి. యుద్ధరంగంలో ఆక్రమిత ఈజిప్టులోని రోమన్‌లు, ఈజిప్టు పక్షం వహిస్తే అదిచూచి మన సైనికులు కూడా ఎదురుతిరిగే అవకాశం ఉంటుందనేది మీరు మరచిపోతున్నారు!’’
సీజర్ తిరిగి ఆలోచనలో పడ్డాడు. తన మనసులోని భావాల్ని సేనానులచేత గ్రహింపజేసి, వారిచేతనే ఆ సళాస చెప్పిద్దామని ఆయన తంటాలు పడ్డాడు. కాని, అది కుదరలేదు. కనుక తానే సూటిగా చెప్పవలసి వచ్చింది.
‘‘అయితే నరమానవుడికి తెలియకుండా పారిపోదామంటారా?’’ అన్నాడు సీజర్ రహస్యం మాట్లాడుతున్న విధంగా.
‘‘ఎట్లా పారిపోతారు? మన రక్షణార్థం రోమన్ సైనికును కోటకు కాపలా పెడితే, ఇప్పుడు కోట చుట్టూ ఈజిప్షియన్ సైనికులున్నారు. సీజర్! రాజభవనంలో కూడా మనం ఆక్రమించుకున్నది నాలుగో వంతే! మనమిప్పుడు బందీలుగా ఉన్నాము. ఆ కోటకు నిప్పుపెడితే, మన బూడిద మాత్రమే మిగులుతుంది సుమా!’’
‘‘వీళ్ళు అందుకు సాహసిస్తారా?’’
‘‘ఎందుకు సాహసించరు? వాళ్ళ హృదయంలోని చిచ్చు సంగతి మీరు గమనించటంలేదు. మనం పారిపోగలగటం అంత తేలిక కాదు. అదీగాక నాయకులమైన మనందరం పారిపోగలం గాక కాని, ఎంతో విశ్వాసంతో తమ ప్రాణాలను వడ్డి మీకు విజయలక్ష్మిని కూర్చిన రుూ సైనికులందర్నీఇక్కడ ఆహుతిచ్చి, మనం పారిపోతే మనకీ ప్రపంచంలో స్థానమెక్కడుంటుంది? గెలుచుకున్న రోమన్ సామ్రాజ్యం కూడా మనకు దక్కదు. ఈజిప్టు నుంచి ధనం లేకుండా రోమ్‌లో దిగితే, కుక్కలకన్నా హీనంగా చూస్తారు. ఇప్పుడు దాస్యం చేయవలసి వస్తుందనేది తథ్యం’ అన్నాడు సర్వసేనాని.
ఈ సమస్య ఎటూ తెగటంలేదు. తాను బోనులో చిక్కుకున్నానని సీజర్ నమ్మక తప్పటంలేదు. తన బలపరాక్రమాలు ఇప్పుడు నిరుపయోగం. ఏదైనా తెలివిగా ప్రవర్తిస్తేనే తప్ప తాను బైటపడలేడు.
తనకన్నా ముందుగానే పరిస్థితుల్ని అర్థం చేసుకొని, తగిన పరిష్కార మార్గాల్ని సేనానులు సిద్ధపరచి ఉంటారు. తనను కూడ ఆ అభిప్రాయానికే లాక్కురావాలని వాళ్లు ప్రయత్నిస్తుండి ఉండాలి.
అందుకని సీజర్ ‘‘మరేం చేద్దామంటారు?’’ అన్నాడు.
ఆయన ఆలోచనా మందిరానికి వచ్చినపుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన కంఠస్వరంలో ఆజ్ఞలు మినహా మరేమీ ధ్వనించలేదు. కానీ, ఇప్పుడు చాలా నీరసంగానూ, దైర్యం ధ్వనించేటట్లుగానూ మాట్లాడుతున్నాడు. సీజర్ దిగి వచ్చాడని, సర్వసేనాని గ్రహించాడు. కనుక తాను తయారుచేసిన పథకాన్ని బైటపెట్టే సమయం వచ్చిందనుకున్నాడు.
సర్వసేనాని అన్నాడు, ‘‘సీజర్! యుద్ధరంగంలో శక్తి సామర్థ్యాలతోపాటు, కొంతలో కొంతన్నా న్యాయం మన పక్షం లేనిదే గెలవటం కష్టమని మనకు తెలుసు. ఇప్పుడు ఆ న్యాయం మన పక్షంలేదు, కనుక మనం ఎంత పట్టుదలగా పోరాడినా గెలవటం అసంభవం!’’
‘‘న్యాయం లేదా? అంటే?’’ అన్నాడు సీజర్.
‘‘మీరు చేసే పనుల్ని మీకు మీరు సమర్థించుకోగలరు ఇక! ఇతరులను కూడా మీ అభిప్రాయలవైపే మళ్లించటం కష్టం! సూటిగా చెపుతాను. క్లియోపాత్రాను మీరు ప్రియురాలిగా చేసుకున్నారు. ఆమె సామాన్యురాలైతే ఎవ్వరూ లెక్కచేయరు. కాని ఆమెక్కూడా ఈజిప్షియన్ సింహాసనం మీద హక్కున్నది. ముఖ్యంగా ఆమె టాలమీ భార్య. వారిద్దరికీ ఇంకా విడాకులు జరగలేదు’’.
‘‘ఇప్పుడు జరుగుతుంది. దానికి అభ్యంతరమేమిటి?’’ అన్నాడు సీజర్.
‘ఏ చట్టాన్ననననుసరించి? ఇది రోమ్ కాదు, కనుక చట్టాలు ఇక్కడ చెల్లవు. పోనీ నైతిక దృక్పథంతో చూద్దామా అంటే- పరదారను వరించుటమనేది నీతి కాగలదా? నీతిని చట్టాలరూపాన అమలు జరపవలసిన నాయకులే అవినీతికరంగా ప్రవర్తిస్తే కంచె చేను మేసిన సామెతవుతుంది. ఇక్కడి నీతి ఎవరు. ఎక్కడ, అందునా రాజవంశానికి సంబంధించిన ఆచారాలు తమకు తెలియనివి కావు. రాజవంశీకులు బైటినుంచి వివాహ సంబంధాలుంచుకోరు. అందుకనే క్లియోపాత్రనా, ఆమె తమ్ముడు టాలమీకి ఇచ్చి వివాహం చేశారుకాని క్లియోపాత్రా గర్విష్టి, ఆమె ఈజిప్టునే ఏవగించుకుంది. పవిత్రమైన దేశాచారాలను, వివాహ బంధనాలనూ తిరస్కరించి, అవమానించి, అందుకు శిక్ష అనుభవించవలసి వస్తుందని భయపడి పారిపోయి మాతృదేశంమీదనే కత్తికట్టింది..
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు