డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె దేశద్రోహిగా ముద్రింపబడింది. ఈ అభిప్రాయం తమకు లేకపోవచ్చు. తమ సేనానులమైన మాకు లేకపోవచ్చు. కాని ఆమె ఈజిప్షియన్ కనుక, ఆమె నేరాలను విచారించే హక్కు ఈజిప్షియన్ చట్టాలకే ఉంటుంది.’’
‘‘కాని ఈప్టు రోమన్ అధికారాలకు లోబడి ఉన్నది కదా?’’ అన్నాడు సీజర్. ఎలాగైనా క్లియోపాత్రా మీద ఈగ వాలకుండా చూడాలని ఆయన ప్రయత్నిస్తున్నాడని అర్థవౌతోంది.
‘‘ఎప్పుడు? నిన్నమొదటిదాకా! కాని, మీరు తొందరపడి దేశద్రోహిని చేరదీశారు. రాజవంశానికే ద్రోహం చేశారనే భావం ఈజిప్షియన్ ప్రభుత్వానికి ఏర్డింది. మీరు భార్యాభర్తలమధ్య సంధి కూర్చగల పెద్దమనుషులూ, మధ్యవర్తులూ కదానని వారు ఆశపడ్డారు. కాని, ఆ భార్యనే తాము స్వంతం చేసుకున్నారు. ఇప్పుడు మనందరం అటు క్లియోపాత్రా వలెనే దేశద్రోహులుగా తయారయ్యాము. ఒక్కటి ఆలోచించండి. ఇదే సంఘటన రోమ్‌లో జరిగి ఉంటే, మనందరి మనస్తత్వాలు ఎలా ఉండేవి? ఈ నీచానికి వడిగట్టిన వ్యక్తిని క్షమించి ఉండేవాళ్ళశమా?’’
ఉద్రేకంలో వొళ్ళు తెలయక సీజర్‌ను నీచుడుగా కూడా సర్వసేనాని చిత్రించాడు. సీజర్ ఇది గ్రహించాడు. కాని, ఉద్రేకాలకు ఇది సమయం కదాలు. ఈ సమయంలో తాను సేనానుల్ని ఎదిరించి అవమానంచి, తన ఇష్టానుసారంగా ప్రవర్తించలేడు. అన్ని విధాలా తాను ఇరుకున పడ్డాడు. ఎలాగైనా వారిని మెప్పించాలి.
ఆ‘‘నాకు అర్థమైంది.. కాని క్లియోపాత్రకూ, నాకూ ప్రణయబంధం ఉన్నది. ఆ విషయం మా ఇద్దరికీ సంబంధించిన వ్యక్తిగత సమస్య. ఇతరులకు ఇందులో సంబంధం లేదు కదా!’’ అన్నాడు సీజర్.
‘‘క్లియోపాత్రా వ్యక్తిగా మిమ్ము ప్రేమించి ఉండొచ్చు. కాని, ఆమెతోపాటే అనేక రాజకీయ సమస్యలు కూడా మిమ్ము ప్రేమించినవని అనుకుంటున్నారా? ఆమెకు మీరు రక్షణ ఇచ్చినంతకాలం, ఆమె చేసిన తప్పుల్ని కాపాడుతుండవలసిన బాధ్యత మీ మీద పడుతుంది. ఆమె చేసిన నేరాలన్నీ మీవిగా కూడా పరిగణించబడతవి కదా! ఐనప్పుడు మనకున్న సమస్యలే తీరక చస్తూంటే, ఈ కొత్త ప్రమాదాల్ని కూడా కావాలని కొని తెచ్చుకోవటం దేనికి?’’’
సీజర్ మాట్లడలేదు. నిస్సహాయ స్థితిలో సేనానులందర్నీ పరీక్షించి చూశాడు. ఒక్కరూ తనకు సుముఖులుగా లేరని గ్రహించాడు.
‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్లియోపాత్రాను టాలమీకి అప్పగించండి; వాళ్ళూ వాళ్ళూ ఏమైనా చస్తారు. అప్పుడు టాలమీ ప్రభుత్వానికి మీమీద కత్తి కట్టవలసిన కారణం ఉండదు!’’ అన్నాడు సర్వసేనాని.
‘‘ఏమిటీ?’’ అని హూంకరించాడు సీజర్.
‘‘మాకు తోచిన సలహా అదీ! అదే న్యాయమని కూడ మేమందరమూ అనుకుంటున్నాము!’’ అన్నాడు సర్వసేనాని.
‘‘న్యాయం! న్యాయానిచ్చే అధికారం నాకు లేదా?’’
‘‘ఉన్నది సీజర్! ఈ రోజుల్లో అధికారమే న్యాయం! అధికారంతో వున్నవారు, తమకు అనుకూలంగా ఉండేట్లుగా న్యాయాన్ని ఎటుపడితే అటు తిప్పగలుగుతారు. అందుకనే న్యాయశాస్త్రాలనేవి సామాన్యులపాలిట కల్పతరువుల్లాగు కనిపించినా, వారికవి విషతుల్యాలుగా పరిణమిస్తున్నవి. అయినా ఇక్కడ న్యాయా న్యాయాలతో పనేమిటి? అధికారిగా, నియంతగా మీరే నిర్ణయిస్తున్నారు. కాని, ఆ అధికారం ఇప్పుడు మన చేతుల్లో లేదనీ దాన్ని ఈజిప్టు లాక్కుపోతున్నదనీ మీరు గ్రహిస్తే న్యాయాన్ని గూర్చి మాట్లాడే హక్కు మనకెంతవరకూ ఉంటుందో తెలిసిపోతుంది!’’ అన్నాడు సర్వసేనాని.
సీజర్ మళ్లీ మామూలు మనిషవుతున్నాడు. ప్రతి ఉద్రేకానికి, తీవ్రమైన ఆలోచనలు ఉండనందువల్లనే, అంత తేలిగ్గా అంతర్థానవౌతోంది.
‘కాని..’ అన్నాడు సీజర్. ‘‘క్లియోపాత్రాకు కూడా ఈజిప్షియన్ సింహాసనంమీద హక్కున్నది కదా! ఔలటీస్ టాలమీ పెద్ద కూతురుగా ఆమె కూడా రాజ్యపాలనకు అర్హురాలు! ఆమె పక్షాన న్యాయం లేదని ఎవరనగలరు?’’
తాము ఊహించినదానికన్నా సీజర్ చాలా ముందుకు వెళ్ళాడని సేనానులు గ్రహించారు. సీజర్‌ను ఈ మైకంలో నుంచి మేల్కొల్పటం ఎంతకష్టమో కూడా వారికి తెలియకపోలేదు. ఐనప్పటికీ, తమ బాధ్యతల్నిమరచి ఉండలేని సేనానులు తిరిగి తిరిగి చేయక తప్పింది కాదు.
‘‘ఆమె హక్కుల సంగతి ఆమె చూసుకోవాలి. న్యాయాన్ని నిలబెట్టేందుకు మనం నడుం కట్టామా? అదిలా ఉంచి, ఆమె వివాహిత. ఆమె యోగక్షేమాలనేవి, ఆమె భర్త టాలమీ చూసుకోవలసి ఉంది. విశేషించి ఆమెకు వివాహమైననాడే ఆమెకున్న హక్కులు కూడ ఆమె భర్తకే చెందినవి. ఇక్కడి చట్టం ఇదీ! దీన్ని మార్పుచేయాలంటే, పాలన మన చేతుల్లోకి రావాలి. అంతవరకూ రుూచట్టాలకు తల వంచవలసిందే కాని మరోదారి లేదు!’’
‘‘మనం పోరాడి క్లియోపాత్రా హక్కును స్థాపిద్దాం’’.
‘‘అందుకు ముందు మన బొందిలో ప్రాణాలుండే మార్గం చూడండి!’’
‘‘మీరింత పిరికిపందలా!’’ అన్నాడు సీజర్.
‘‘సీజర్! ఈనాడు ఆ మాటెలా అనగలుగుతున్నారు? మా ధైర్య సాహసాలను నిన్నటిదాకా చూస్తూనే ఉన్నారు. పాంపేలాంటి అతి శక్తివంతునితో తలపడి, రోమన్ సామ్రాజ్యాన్ని గెలిచి, తమకు సమర్పించాము. ఈ విశ్వాసాన్ని కానీ, మా శౌర్యాన్ని కానీ తాము శంకించటం మమ్ము అవమానించటమే కాగలదు!’’
‘‘సేనానులారా! క్షమించండి.. పొరబడ్డాను!’’ అన్నాడు సీజర్.
ఆ మాటలతో అక్కడ లేచిన సుడిగాలులు చాలా తేలిగ్గా అంతరించినవి.
‘‘ఇక కర్తవ్యం ఆలోచించండి సీజర్! నియంతగా మీకు ఎదురుచెప్పేసాహసం మాలో ఎవరికీ లేదు!’’ అన్నాడు సర్వసేనాని.
‘‘అవసరమైతే యుద్ధం చేద్దాం. అందుకు తగిన సన్నాహాలు చేసే ఉంచండి. క్లియోపాత్రాను నేను విడనాడలేను. ఆ అందాలరాశి ప్రణయాన్ని నేను తృణీకరించలేను!’’ అన్నాడు సీజర్ కుండ పగలగొట్టినట్లు.
‘‘సీజర్! మీరింకా స్వప్నసీమల్లోనే విహరిస్తున్నారు. క్లియోపాత్రా ప్రణయ దేవతని మీరు భ్రమపడుతున్నారు. కాని, ఆమె మన సర్వనాశనానికే కారకురాలవుతుంది. ఆమె మృత్యుదేవత! ఒక్కొక్కసారి మృత్యుదేవత కూడా కళ్లు మిరుమిట్లు గొలిపే అవతారాలు దాలుస్తూంటుంది. మనమంతా ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా గెలుచుకున్న రోమన్ సామ్రాజ్యాన్ని ఒక స్ర్తి కోసం బలిపెడతారా సీజర్!’’
సీజర్ వౌనం వహించాడు. వౌనమే అంగీకారమని ఎవరికి తెలియదు?
‘‘ఆలోచిండి సీజర్! అనేక క్లిష్ట సమస్యల్లో కూడా మీరెంతో చురుకుగా ఉండి, అతి త్వరలో నిర్ణయాన్ని చేసేవారు. కాని ప్రస్తుతం తొందరపడి లాభం ఉండదు. తెలిసి ఉండే ప్రమాదాలలో పడటం అవివేకవౌతుంది! చివరకు విచారించవలసిన దుస్థితి రాకుండా చూడండి!’’
‘‘ఆమె ననె్నంత ప్రేమిస్తోందో మీరెవరూ ఊహించలేరు’’ అన్నాడు సీజర్.
‘‘సీజర్! మీలోని బలహీనతను ఆమె కనిపెట్టింది. అర్ధశతాబ్ద జీవితాన్ని చూశారు! ఎంతోమంది అందగత్తెల కౌగిళ్లు రుచి చూశారు. ఆమెకి మీకు ఇప్పటికి ప్రణయమంటే, అదెంత మధురతరమైనదనా సరే మొహం మొత్తి ఉండవలసింది! కాని..’’మాట పూర్తిగాకముందే నవ్వి సీజర్ అన్నాడు: ‘‘కనుకనే- సేనానులారా! ఈ వయస్సులో కూడా ప్రణయమంటే నన్ను నమ్మించగల స్ర్తి ఎంత గొప్పదో ఆలోచించండి! ఆమె నన్ను మనసారా ప్రేమిస్తుంది!’’
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు