డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంచెం ఆలోచించి, బహుశా ఈ ఏర్పాట్లు మధ్యాహ్నమే జరిగి ఉంటవి. తాను గదిలోనుంచి బైటికి రాకుండటంవల్ల సేవకులందరూ వేచి ఉండొచ్చనుకున్నాడు. ఐతే క్లియోపాత్రా ఎక్కడ? ఈ రాజప్రాసాదంలో ఎన్ని గదులున్నవో కూడా తెలియదు. ఆమెను చూడాలని తహతహలాడే మనస్సు ఆమె ఎక్కడున్నదో వెతికేందుకు నిరాకరిస్తోంది.
‘‘క్లియోపాత్రా ఎక్కడ?’’ అన్నాడు సీజర్, తనకు దగ్గిర్లో వున్న బానిసను.
వాడు జవాబు చెప్పకుండా, దూరంగా వున్న గది వైపు వేలెత్తి చూపి, తలవంచుకున్నాడు.
చిత్రం- రాజప్రాసాద నిర్మాణంలోని శిలలవలెనే, అందరూ ఇంత అచేతనంగా ఎందుకున్నారో సీజర్‌కు అర్థం కాలేదు. ఆయన ఊహలోకి మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన రాకకోసం ఎదురుచూసి చూసి నిరాశ చేసుకొని, చివరకు తనను విడనాడానని నిశ్చయించుకొని, క్లియోపాత్రా ఆత్మహత్య చేసుకోలేదు కదా! ఈ తలపు రాగానే సీజర్ వణికిపొయ్యాడు. పరుగు పరుగున క్లియోపాత్రా ఉన్నదని చెప్పిన గదివైపు వెళ్లాడు.
సీజర్ గదిలోకి జొరబడే ధైర్యం లేక వాకిట్లో నుంచే తొంగి చూశాడు. క్లియోపాత్రా పట్టు పరుపులమీద బోర్లాపడుకుని, తలగడలో మొహం పెట్టుకొని ఉన్నది. వినబడే ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూండి ఉంటుందని సీజర్ అనుకున్నాడు. తాను ఊహించినట్లు ఆమె అఘాయిత్యాలకు తలపడనందుకు తనదేవతలకు మొక్కుకున్నాడు. ఐతే సర్వాలంకారభూషితయై, తన రాక కొరకు ఆమె ఎందుకు ఎదురుచూడటంలేదు? తన అదృష్టం ఒక్క రాత్రిలోనే స్వప్నంవలె కరిగిపోయినందుకు విచారపడుతోందా?
క్లియోపాత్రా- పాపం! ఎంత అమాయకురాలు! ఇతరులెవ్వరికి ఈమె మీద సదభిప్రాయం లేకపోగాక! కాని ఒక్కసారి తనకు హృదయాన్ని సమర్పించిన నేరానికేనా - ఇప్పుడిలా దుఃఖ సముద్రంలో మునిగితేలుతోంది? అందునా వికలమైన మనస్సుతో తానిక్కడకు వచ్చాడు. ఆమె స్థితి చూశాక, తనకు తాను ఎంతో ధైర్యం నూరిపోసుకున్నాడు. ఇక ఆమెను కూడా తిరిగి మనిషిని చేసేందుకు సిద్ధపడి దగ్గరికి వెళ్ళాడు.
తన పాదాల సవ్వడికి ఆమె లేచి కూర్చుంటుందనుకున్నాడు సీజర్! కాని, ఆమెకు రుూ ప్రపంచంలో జరిగే సంఘటనలేవీ పట్టినట్లు లేవు. తన బాధలో తాను తలమునకగా ఉన్నది.
మెల్లిగా ఆమె పక్కనే కూర్చుంటూ ఆమె తలమీద చెయ్యి వేశాడు. పీడకలలోంచి మేలుకున్నట్లుగా ఆమె ఉలిక్కిపడి సీజర్ వైపు చూసింది. తన కళ్లను తానే నమ్మనట్లు, ఆమె కనురెప్పల్ని చాలాసార్లు విదిలించింది. ఆ తరువాత ఏదో భయంతో ఆమె తన ముఖానికి అరచేతుల్ని అడ్డం పెట్టుకుంది.
సీజర్‌కివేమీ అర్థం కాలేదు చందమామలోని మంచుకొండలన్నీ కరిగినట్లయితే, దాని స్వరూపమెలా ఉండగలదో ఇప్పుడు క్లియోపాత్రా ముఖాన్ని చూస్తే తేలిగ్గా అర్థవౌతుంది. ఐతే ఆమె తననింక చూడరాదనుకున్నదా? లేక తాను మాటిచ్చిన ప్రకారం రాలేకపోయినందుకు అలిగిందా? సమస్యలనేవి తనలాంటి వీరాధివీరుణ్ణి వేధించటంలో అర్థమున్నది కాని, క్లియోపాత్రా లాంటి సుకుమారినే, రాచకన్యనే ముప్పతిప్పలు పెడతాయని ఆయన అనుకోలేదు. ఏమైనా అసలు ఎందుకని ఆమె బాధపడుతోందో తెలుసుకోకుండా ఊహించటంలో అర్థం లేదు.
లాలిస్తూన్న మెల్లిగా ఆమె ముఖాన్ని పైకెత్తుతూ ‘‘రాణీ! నా చిట్టి రాణీ! నేను త్వరగా రాలేదని కోపమా? లేకా? అందుకే ఏడుస్తున్నావా? ఇంత చిన్న విషయాలక్కూడా దుఃఖపడితే ఎట్లా? మొగవాళ్ళకు అనేక రాచకార్యాలుంటవి. తెమిలి బైటపడేందుకు కొంత కాలయాపన కావొచ్చు’’ అని ఆమెకు సమాధానం చెప్పుకున్నాడు.
ఈ ధోరణికి క్లియోపాత్రా చకితురాలైంది. ఎందుకంటే, ఈసారి సీజర్ ప్రణయభిక్ష కొరకు తన దరిదాపుల్లోకి వస్తాడని ఆమె ఆశించలేదు. ఆలోచనా మందిరంలో జరిగినదంతా ఆమె చాటునుంచి విన్నది. తనను బందీగా టాలమీకి అప్పగించేందుకు మృగరాజు నిజరూపంలోనే లేడిని సమీపించిన విధంగా వస్తాడని ఆమె అనుకున్నది కానీ, సీజర్ తననేదో ప్రాధేయపడుతున్నవాడిలాగా మాట్లాడుతుంటే, ఆమె నోట మాట రాలేదు.
ధారలుగా ప్రవహ్తిన్న ఆమె కన్నీటిని తుడుస్తూ సీజర్ అన్నాడు: ‘‘రాణీ! చెప్పు- నీ మనసును కష్టపెట్టిందెవ్వరు? వారిని ఖండ ఖండాలుగా నరికించి, రోమన్‌లకు పరమ పవిత్రమైన గద్దలకు వేయిస్తాను.. లేదా, నీకేం కావాలి? జగదేకవీరుడు సీజర్ ఆదరణలో నీకే లోటూ ఉండేందుకు వీల్లేదు. చివరకు ఆ సూర్యచంద్రులే నీకు కావాలన్ననప్పటికీ, ప్రయత్నించేందుకు వెనుకాడను- చెప్పు క్లియోపాత్రా!’’
క్లియోపాత్రా మాట్లాడలేకపోయింది.
‘‘ప్రియా! నాతో మాట్లాడకూడదనుకున్నావా? నీవు లేని జీవితం వృథా అని నేను నిర్ణయించుకున్నాను. నా మీద దయ చూపవా?’’ అన్నాడు సీజర్.
క్లియోపాత్రా సీజర్ ముందు మోకరించింది. ‘‘స్వామీ! నేను అత్యల్పురాను. పేరుకు ఈజిప్టుకు రాణినైనప్పటికీ సామాన్యురాలను. విశేషించి, మీ ముందు పిపీలకాన్ని. ఏ దేవతతో కరుణించి నాకు మీ సాంగత్యాన్ని ప్రసాదించారు. అంతే చాలనుకున్నాను. అదృష్టహీనురాలిగా బతుకుతూ, ఏ కొద్ది అదృష్టం ఎదురైనా అదే పదివేలని భావించాను. నేను మీకు ఏ విధంగానూ తగను..
అదంతా అలా ఉంచి, నాలాంటి పడుచుది, మీలాంటి వృద్ధుణ్ణి ప్రేమించిందంటే ప్రపంచం నమ్మదు. నాదంతా నటనేనని అంటుంది. నటన కాదని నేనెలా రుజూ చేసుకోగలను? నా హదృయాన్ని తెలుసుకునే శక్తి నాకు మినహా, ఇతరులకు లేదు. అందుకని నేను, ప్రపంచం నన్ను గూర్చి అనే మాటలన్నిటినీ అంగీకరిస్తున్నాను.. కాని,, నిజమేమిటంటే నేను కూడా మొదట్లో మీ ప్రణయాన్ని ఆశించలేదు. మీ చేతుల్లో వున్న అధికరాన్ని చూసి భ్రమసిపోయాను. ఎలాగైనా మీ సానుభూతిని సంపాయిస్తే ఈజిప్టులో గౌరవంగా, పాలకురాలుగా జీవితశేషాన్ని గడిపే అవకాశాలుంటాయని కదా అని ఆశపడ్డాను. ఇందుకుగాను మీమీద మమతను నటించేందుక్కూడా సిద్ధపడ్డాను..కాని మీతో గడిపిన సుదినం.. నిన్ననే, మిమ్ము మోసగించేందుకు వచ్చిన నేను, నన్ను నేనే మోసగించుకున్నానని తెలుసుకున్నాను. మీమీద నాకు నిజమైన ప్రేమ ఏర్పడిపోయింది. దాన్ని నటించటం నా శక్తికి మించిపోయింది. సహజోద్రేకాలే నన్ను నిలవనీయకుండా చేసేటంత బలవత్తరంగా చీలుస్తే, అందులో సీజర్ తప్ప మరెవ్వరూ ఉండరు. అంతకు మినహాగా తమపట్ల వున్న నా అనురాగాన్ని రుజూ చేయలేను’’ అన్నది క్లియోపాత్రా.
సీజర్ ఆమె కంఠస్వరంలోని దైన్యానికి స్తంభించిపొయ్యాడు. ఆ మృదు మధురమైన మాటల అర్థం ఆయన్ను కలచివేసింది. క్లియోపాత్రా నిజంగా పిచ్చి పిల్ల! కానట్లయితే ప్రేమను నటించేందుకు ఆమె వచ్చినప్పటికీ, ఆ మాట చెపుతుందా? తన నిజస్వరూపాన్ని బైట పెట్టేందుక్కూడా వెనుకాడలేదు. ఇన్ని నిజాలను ఒక్కసారిగా బైటపెట్టేంత అమాయకురాలు! ప్రపంచమంతా ఈమెను అర్థం చేసుకోలేకపోగాక! కాని ఒక్కనాటి స్నేహంతోనే, తానామెను అర్థం చేసుకోగలిగాడు.
మోకరించి వున్న తన ప్రేయసిని, సీజర్ మెల్లిగా లేవనెత్తాడు. తన వొళ్ళో కూర్చోబెట్టుకొని లాలనగా ఆమె తల నిమిరాడు.
క్లియోపాత్రా చెప్పసాగింది. ‘‘స్వామీ! ఇప్పుడు నాకీ ప్రపంచంలో మరేమీ అక్కర్లేదు, నాకు ఈజిప్టు పాలనా వద్దు. ఆ ఇతర ఆశలన్నీ అంతరించినవి. మీ ప్రణయం మినహా నాకీ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు. మీరు నమ్మండి- నమ్మకపోండి. తమకు న్యాయమని తోస్తే నన్ను ఏలుకోండి. మీ క్షేమం కొరకై నేను ఏదైనా చేయగలను... నన్ను మీరు టాలమీకి అప్పగించండి.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు