డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగలు కక్కుతూ, రోమన్ ఓడ వచ్చి ఈజిప్షియన్ ఓడల మధ్య పడింది. ఇదేదో ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చని ఈజిప్షియన్‌లు అనుకున్నారు. రోమన్ ఓడ తగలబడిపోతూంటే వారందరూ మొదట్లో సంతోషపడ్డారు. కాని, ఆ నిప్పు తమ ఓడలను దగ్ధపరచబోతుంటే మేలుకొన్నారు.
దాన్ని ఆర్పేలోగానే మరికొన్ని రోమన్ ఓడలు భగభగా మండుతూ ఈజిప్షియన్ ఓడలను ఢీకొన్నవి. ఈ విధంగా చేయటంవల్ల, రోమన్ సైన్యాలు పిరికిపడి, పారిపోదామన్నా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, వారి ప్రయాణాలకు తగినన్ని ఓడలు లేవు.
సముద్రం మీద హలాహలం లేచింది. ఆ మంటల్ని ఆర్పేందుకు సముద్రంలోని నీరు చాలుతుందా అనే సందేహం కలిగింది. ఓడరేవుల్లో నుంచి జ్వాలలు, అలెగ్జాండ్రియా పట్టణ సరిహద్దుల్ని తాకినవి. పట్టణం నలుమూలలా అగ్ని చుట్టుముట్టింది. ఈజిప్షియన్ సైన్యాలు యుద్ధం మాట మరిచిపోయి, ముందు తమ ఆస్తిపాస్తుల్ని కాపాడుకునేందుకు ముందుకురికినవి.
దాదాపు సగం అలెగ్జాండ్రియా తగలపడిపోయింది. ప్రపంచ వింతల్లో ఒకటిగా పరిగణించబడే పుస్తక భాండాగారం కూడా తగలబడిపోయింది. మానవుడు అనేక శతాబ్దాలుగా తన మేధస్సును ఇక్కడ పుస్తకాల రూపాన గుప్తరిచాడు. అందులో చాలా కొద్ది భాగమే రక్షించబడింది. అంతవరకున్న లోక చరిత్ర దాదాపు దగ్ధమైంది.
ఈ వార్త విని విచారించనివారు లేరు. చివరకు సీజర్ కూడా ఎంతో దుఃఖపడ్డాడు. జనక్షయాన్ని మానవుడు పూరించగలడేమో కాని, పోగొట్టుకున్న విజ్ఞానాన్ని తిరిగి సంపాదించటం ఎంత కష్టసాధ్యమో ఆయన గ్రహించకపోలేదు. ఆయన మనస్సు వికలమైంది. ఐతే తాను ప్రశాంతంగా బతుకుదామన్నా బతకనీయని రుూ ప్రాపంచిక విధానానికి ఎదురీదలేడు కదా!
ఈ హడావిడిలో సీజర్, అలెగ్జాండ్రియా రేవులోని ఒక భాగంతోపాటు కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఎలాగైనా యుద్ధం వాయిదా పడితే బాగుండునని ఆయన అనుకుంటున్నాడు. కాని, ఈజిప్షియన్ బలగాలు అధికంగా ఉండటంవల్ల, జయం తమదేననే ధైర్యంతో టాలమీ ప్రభుత్వం పోరాటానికే దారితీస్తోంది.
క్లియోపాత్రా ఎర్ర సముద్ర తీరంలో వున్న తన చిన్న సైన్యాన్ని రమ్మని కబురుచేసింది. మర్నాటికల్ల ఆ సహాయం రానే వచ్చింది. ఐతే అదొక సహాయం కిందనే లెక్క కాదు.
కబుర్లమీద కబుర్లు పోగా మరి రెండు రోజుల్లో సిరియా నుంచి కూడా కొంత సైనిక సహాయం వచ్చింది. ఇంత చేసినా, రోజూ సైనిక క్షయం తప్ప, జయం తమదయే సూచనలు రోమన్‌లకు లేవు. రోజులు గడిపేందుకు మాత్రమే రుూ సైన్యం ఉపయోగపడుతోంది.
సీజర్ తన ఆశలన్నిటినీ రోమ్ వైపు తిప్పుకున్నాడు. అంతిమ విజయాన్ని పొందాక సీజర్ రోమ్ వెళ్లనే లేదు. అక్కడ ప్రభుత్వం తన పేరుమీదుగానే కొనసాగుతూన్నదనే వార్తలు తప్ప, అసలేం జరుగుతుందో తెలియటంలేదు. పోతే పాంపేకు సంబంధించినవారు ఆయన కొడుకులు, ఇతర వారసులూ చెల్లాచెదరైన సైన్యాలను సమీకరించుకొని, ఇక్కడ ఈజిప్టులో చిక్కుపడిపోయిన సీజర్‌మీద వొత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తూన్నవి. ఎటూ తోచక, విధి విలాసం ఎటు వున్నదో ఎదురుచూసే స్థితిలో పడ్డాడు సీజర్!
సీజర్, క్లియోపాత్రాల ప్రణయం అధిక భాగం యుద్ధరంగంలోనే రూపొందింది. ఒకవైపు ఘోర యుద్ధం జరుగుతున్నప్పటికీ, మరోవైపు వారి ఘోర ప్రణయం కొనసాగింది. ఏ క్షణాన శత్రువులొచ్చి ముట్టడిస్తారోననే భయంతోనే వారు ఒకర్నొకరు విడవకుండా, ఒకరికి మరొకరు కనురెప్పవలె ఉండిపొయ్యేవారు. రాత్రులు కూడా ప్రశాంతత లేదు. దూరాన ఎక్కడో చావు కేకలు! హెచ్చరికలు! అవన్నీ వింటూనే, తాము సృష్టించుకున్న రుూ భూలోక స్వర్గం క్షణమే ఉండబోతోందనే భయంలోనే వారు ప్రణయారాధన చేశారు.
యుద్ధరంగంలో సీజర్ చండ ప్రచండుడయ్యడు. పూర్వంవలె ముసలివాడుగా ఆయన కనిపించటంలేదు. ప్రణయామృతాన్ని ఆరగించి, తద్వారా విశేష శక్తిని పొంది, అధికోద్రేకంతో ముందుకు ఉరుకుతున్నాడు. సీజర్‌ను గూర్చి, అతని యుద్ధ కౌశలాన్ని గూర్చీ విన్న కథల్లో అతిశయోక్తులేమీ లేవని, ఆయన్ను గమనించిన వారందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా క్లియోపాత్రా దృష్టిలో, ఆయన పురుషోత్తముడయ్యాడు, ప్రియునిగా లాలించే తను ఇప్పుడు వీరుడుగా కూడా ఆయన్ను ఆరాధిస్తోంది. నిజంగానే తన జన్మ సార్థకతను పొందిందని ఆమె నమ్మింది.
క్లియోపాత్రా చాలా తెలివిగలదనేందుకు సందేహం లేదు. అతి త్వరలోనే ఆమె యుద్ధరంగంలో కూడా అనుభవాన్ని సంపాయించింది.
సీజర్‌తోపాటే గుర్రపు స్వారీ చేయగలదు. సైనికులను ఆజ్ఞాపించగలదు. భూమి అదరటాన్ని బట్టి శత్రు సైన్యంలోని అశ్వికదళం ఎంత వస్తున్నదీ చెప్పగల సామర్థ్యం ఆమెకున్నది. రేవులోకి వచ్చిన ఓడల్ని చూడకుండానే అవి ఏ దేశానికి చెందినవో, ఆ తారు వాసనను బట్టి గుర్తించగలదామె! తగిన అశ్వం దొరక్క బాధపడుతూన్న సమయంలో చప్పున ఒక ఉత్తమాశ్వాన్ని ఏరి, సీజర్‌కు అప్పగించల ప్రజ్ఞ ఉన్నదామెకు.
ఈ విధంగా కొద్దివారాల్లోనే ఆమె సైన్యాలను చాకచక్యంతో నడపగల సమర్థురాలైంది. ఇప్పుడామె సీజర్‌కు కేవలం ప్రియురాలు మాత్రమే కాదు, సైన్యాధిపతి, సలహాదారు, మంచి చెడ్డల్ని తర్కించగల వ్యక్తి. ఒకటేమిటి, ఆయన ప్రాణానికి ప్రాణమైంది. కదనరంగంలోనే సీజర్, క్లియోపాత్రాలు ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు.
అదృష్టవశాత్తు రోమ్ తననింకా గౌరవిస్తూనే వుంది. తాను దూరదేశాల్లో ఇరుకున పడినందుకు, ఇదే సమయమని తన శత్రువులు పాలకులు కాలేదు. పరిపాలనంతా తన పేరుమీదుగానే సాగుతోంది; నాణాలమీద కూడా తన ప్రతిమ ముద్రించబడింది. ఈ అధికారంతోనే ఆయన రోమన్ సైన్యాలను వెనువెంటనే పంపమని ఆజ్ఞాపించాడు. చివరకు రోమన్ ఓడలనిండా సైనికులు బిలబిలలాడుతూ ఈజిప్టు గడ్డపైకి దిగారు.
ఈ యుద్ధంలోని విజయం నిస్సందేహంగా తనదేననే ధైర్యం సీజర్‌కు కలిగింది. ఎక్కువ జనయక్షం లేకుండానే చూశాడాయన. రోమన్ సైనికుల్ని చూసి ఈజిప్షియన్‌లు పిరికిపడ్డారు. అలెగ్జాండ్రియా సింహద్వారాలు తెరుచుకొని, రోమన్‌లకు స్వాగత గీతాలు పాడినవి.
ఈ హడావిడిలో టాలమీ పట్టుపడ్డాడు. అతని అక్క- అంటే క్లియోపాత్రా తరువాతది, తన ప్రియునితో సహా పారిపోతూండగా, రోమన్ సైన్యాధిపతులు చంపివేశారు. కోటంతా రోమన్‌ల వశమైంది. ఈజిప్షియన్ ప్రభుత్వంపోయి, రోమన్ ప్రభుత్వం ఆరంభమైంది.
పూర్వం ఈజిప్టును స్వాతంత్య్ర దేశంగానే రోమ్ గుర్తించింది. కాకుంటే ఈజిప్టు రోమ్‌కు ఋణపడి ఉండబట్టి, ఆ వసూళ్ళకు మాత్రమే వొత్తిడి చేస్తూండేది. పోతే ఈజిప్షియన్ రాజవంశీకుల రక్షణార్థం కొద్ది రోమన్ సైన్యాలు ఈజిప్టులో స్థావరాలు ఏర్పరచుకున్నవి. రోమన్ అధికారాలను తిరస్కరించి యుద్ధంలో ఓడిపోవటంవల్ల ఇపుడు ఈజిప్టు రోమన్ సామ్రాజ్యంలో కలపబడుతుందని ప్రజలు భయపడ్డారు. ఐతే బలమున్నవాడిదే బతుకుగా వున్న రోజుల్లో గరళంవలె తయారైన రోమన్ అధికారాలను భరించక తప్పదనీ, ఎదురు తిరగటమంటే తమ గొంతులకు ఉరితాళ్ళను బిగించుకోవటమేనని ప్రజలు తెలుసుకోగలిగారు.
యుద్ధమేఘాలు విచ్చిపోయి, శాంతిమేఘాలు ఆవరించినవి. ప్రభుత్వంలోని పెద్దలందర్నీ పిలిపించి ప్రజా సమక్షంలో సీజర్ రోమన్ అధికార పత్రాన్ని చదివి వినిపించాడు.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు