డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజవంశజుల ఆచార వ్యవహారాలను మేము తృణీకరించలేము. రోమన్ సామాజిక రాజకీయ చట్టాలను బలాత్కారంగా ప్రవేశపెట్టి అక్రమ పాలన జరగటాన్ని సహించము. కనుక క్లియోపాత్రాను ఈజిప్టు రాణిగా గుర్తిస్తూ, ఆమె పట్ట్భాషేక సమయంలోనే, ఆమెకూ, ఆమె చిన్న తమ్ముడు టాలమీకి వివాహం చేయిస్తాము. ఈజిప్టు కలకాలం క్లియోపాత్రా పరిపాలనలో శాంతియుతంగా ఉండగలదని ఆశిస్తున్నాము.
రేపే టాలమీ వంశజురాలైన ఏడవ క్లియోపాత్రా టాలమీ రాణిగా పట్ట్భాషేకం జరుగుతుంది. ప్రజలందరూ పాల్గొంటారు గాక! ఈజిప్టు పురోభివృద్ధికి మీరంతా దోహదం చేస్తారుగాక!
ఇట్లు
జూలియస్ సీజర్
రోమన్ సామ్రాజ్య సర్వాధికారి
ఈ ఆజ్ఞాపత్రాన్ని విన్న ప్రజలందరికీ ఇందులో చాలా అబద్ధాలున్నాయని తెలుసు. ఐతే ఆ మాట అనే సాహసం ఎవ్వరికీ లేదు. ఏమైనా ఈజిప్టు రోమన్ సామ్రాజ్యంలో కలపబడకుండటం, మీదు మిక్కిలి సిరియా కూడా ఈజిప్టుకే సంక్రమించటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తృప్తిపరిచింది.
రోమన్‌లు తాము భావించినట్లుగా తమకు శత్రువులుకారు, మిత్రులేననే భావం అందరి సహృదయాల్లో పాతుకొని పోయింది. ఇలాంటి సహృదయం మీద కత్తికట్టిన టాలమీ ప్రభుత్వం ఎంత దుష్టమైనదో అందరూ గ్రహించారు. నిన్నమొన్నటిదాకా టాలమీ ప్రభుత్వాన్ని, దేశభక్తిని కొనియాడిన ప్రజలే రుూనాడు దేశద్రోహులుగా తెగనాడుతున్నారు.
పోతే నిన్నటిదాకా క్లియోపాత్రాను దేశద్రోహిగా గుర్తించిన ప్రజలు, రుూనాడు ఆమె మూలానే ఈజిప్టు తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటమేగాక, పోగొట్టుకున్న సిరియాను కూడా తిరిగి సంపాయించుకోగలిగినందుకు ఎంతో సంతోషించారు. క్లియోపాత్రాను వ్యభిచారిణిగా పేర్కొన్న చరిత్రకారులు, ఆమె దేశానికి చేసిన మహోపకారాన్ని గుర్తించి, ఆమె ప్రణయం దివ్యమైనదనీ, అది పవిత్రమైనదనీ అన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఒకవేళ కాలుజారిందనుకున్నప్పటికీ, అందుమూలంగా ఈజిప్టు పొందిన లాభాన్ని గమనించినట్లయితే, ఆమె త్యాగం చేసిందనే అందరూ ఒప్పుకున్నారు. ఇలాంటి సమర్థురాలిని తాము రాణిగా అంగీకరించేందుకు ఎవ్వరూ ఎదురుచెప్పలేకపోయారు.
సీజర్ ఆజ్ఞాపత్రం ప్రజలకు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదో, క్లియోపాత్రాకు కూడా అంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, ఆమె రాత్రులు ప్రణయారాధనకే కేటాయిస్తుందిగాని, చచ్చు రాజకీయాలను గూర్చి ఆలోచించదు; సీజర్‌తో చర్చించదు. నిజానికి గత రాత్రి ఆజ్ఞాపత్రాన్ని మరునాడు చదివి వినిపిస్తానని సీజర్ అన్నపుడు కూడా ఆమెకు ఆసక్తి కలుగలేదు. విననట్లే ఊరుకున్నది. ఆమెకు సీజర్ మినహా మిగతా ప్రపంచమే పట్టలేదు.
తన కలలన్నీ నిజమైనవి. తనకు జగదేకవీరుడైన సీజర్ ప్రియుడుగా ఉండటం మాత్రమే నిజమనుకున్నది. సీజర్ సాంగత్యంలో ఆమెను విడనాడిన రాజ్యకాంక్ష, ఇపుడు రాజ్యప్రాప్తిగా మారింది. ఆమెకు ఆగర్భ శత్రువుగా వున్న టాలమీ మర్నాడు ఉరివేయబడతాడు. ఈ ప్రపంచమంతా ఆ అందాలరాశి ముందు ప్రణమిల్లినట్లే తోచింది. జీవితమంతా తీరుతూండవలసిన కోర్కెలన్నీ ఒక్కసారిగా తీరేప్పటికి ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. ముఖ్యంగా సీజర్ చూపిన సుహృద్భావంతో ఆమె తన ప్రియునికి దివ్యత్వాన్ని ఆపాదించింది.
ఆ రాత్రి సీజర్ రాగానే ఆమె భక్తితో, గౌరవంతో మోకరిల్లి అతని చేతిని ముద్దాడింది.
‘‘ఏమిటీ వింత?’’ అన్నాడు సీజర్.
‘‘ఇంతవరకూ మిమ్ము ప్రియునిగా పూజించాను. కాని, ఈనాటి ఆజ్ఞాపత్రం విన్నాక మీ మీద భక్తి ఏర్పడింది. ఎన్ని జన్మాల పుణ్యమో ఈనాడు ఫలించి, మీలాటి పురుష పుంగవుల సాంగత్యాన్ని సంపాయించగలిగానని అనుకుంటున్నాను’’ అన్నదామె,.
‘‘పిచ్చిపిల్లా!’’ అన్నాడు సీజర్. ‘‘నీ నుంచి నేను పొందిన దివ్యానుభవాలకుగాను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించిన రుూ కానుకలు ఒక లెక్కలోవా?’’
ఆమె వౌనం పాటించి తలవంచుకుంది. ఏదో చెప్పాలనుకుంటూన్నదనీ, కాని చెప్పేందుకు సందేహిస్తున్నదనీ సీజర్ గ్రహించాడు.
‘‘రాణీ! నా మనసు తెలిసి కూడా చెప్పదల్చుకున్నది ఎందుకు చెప్పవు?’’’ అన్నాడు సీజర్.
ఆమె అతని బాహువుల్లో వాలిపోయింది. అరచేతుల్లో ముఖం దాచుకుంటూ ‘‘ప్రభూ మీరు నాకిచ్చిన బహూకృతికి ప్రతీకారంగా నేను కూడా త్వరలో మీకు బహుమతి సమర్పించుకుంటాను’’ అన్నదామె.
సీజర్ తొందరపాటు అడగలేదు. కొంచెం ఆలోచించి తెలుసుకోగలిగాడు.
‘‘నిజమా! నిజమా- రాణీ!’’ అని ఆయన ఉద్రేకంతోనూ సంతోషంతోనూ ఆమె చేత త్వరగా మాట్లాడించాలని ఆమెకు కదిపాడు.
‘‘నిజం స్వామీ!’’ అన్నది ఆమె. ‘‘ఐదారునెలల్లో మీరు తండ్రి కాబోతున్నారు. సీజర్ స్వరూపం.. మగబిడ్డ రూపాన..’’
ఆమె మాటలకడ్డువచ్చి ‘‘మగబిడ్డని ఎలా తెలుసు?’’ అన్నాడు సీజర్.
‘‘ఎలాగో నేను చెప్పలేను.. కాని, తప్పక మగబిడ్డే పుడతాడు!’’
సీజర్ ఆనందానికి అంతులేకపోయింది.
‘‘రాణీ! నా గౌరవాన్ని కాపాడావు. మగబిడ్డ తండ్రిని కాలేదనే అపవాదు నాకుండేది. ఇప్పుడా మచ్చ మాసిపోతుంది. చరిత్రకారులు నన్ను వేరువిధంగా చిత్రించలేరు’’ అన్నాడు సీజర్.
ఉభయులూ తమ తమ ఆలోచనల్లో కొంతసేపు నిశ్శబ్దాన్ని ఆరాధించారు. కొద్ది నిమిషాలలో క్లియోపాత్రా ముఖంలో విచారం పొడచూపింది. మనసులోని భావాన్ని దాయలేని నిర్మలమైన ఆ ముఖకళ సీజర్‌కు చాలా బాగా తెలుసు.
‘‘ప్రియా!’’ అన్నాడు సీజర్. ‘‘నీ ఆనందానికి తిరిగి అడ్డంకులు ఏమున్నవి? విచారంగా ఉండటం దేనికి? చెప్పవా?’’ అని లాలించాడాయన.
‘‘ప్రభూ!.. ఇన్నాళ్ళూ ఈజిప్టు క్లిష్ట సమస్యల్లో తాము కాలం గడిపారు కనుక ఆ సమస్యలే మిమ్మిక్కణ్ణుంచి కదలకుండా చేసి, నా దగ్గర ఉంచగలిగినవి. ఇప్పుడా సమస్యలన్నీ పరిష్కరించబడినవి కనుక, మీరు రోమ్‌కి తిరిగి వెళ్లిపోతారు. ఈ రాజ్యభారాన్ని నా తల మీద ఉంచారు కనుక, నేను ఈజిప్టు నుంచి కదిలేందుకు వీల్లేని పరిస్థితులు ఏర్పడినవి. ఈ విధంగా మనిద్దరిమధ్య చీలికలు ఏర్పడుతున్నవి. ఈ జన్మంతా మీ సాన్నిధ్యంలో గడపాలని నేను ఆశిస్తున్నాను. నాకీ రాజ్యమూ వద్దు, చట్టుబండలూ వద్దు. నన్ను మీతో తీసుకొని వెళ్లి ఏలుకుంటే అదే పదివేలు!’’ అన్నదామె.
సీజర్ జవాబు చెప్పేందుకు కాస్సేపు ఆలోచించవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెను ఓదార్చి, తృప్తికరంగా వుండే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయనమీద పడింది.
ఇలా అన్నాడు: ‘‘రాణీ! నాబోటి చరిత్ర ప్రసిద్ధికెక్కిన పురుషునికి ప్రియురాలుగా ఉండేవారికి ఎంత హోదా ఉండాలో ఆలోచించు. నిజానికి నీ జీవితాశయం ఈజిప్టును ఏలటంకాని, నాబోటి ప్రియుణ్ణి సంపాయించటం కాదు కదా! ఐతే ఆశయాలు మారవనీ, అభిరుచులు ఎప్పుడూ ఒకే విధంగా వుంటవనీ- నేను అనను. ఇప్పుడు నీకు ప్రాప్తించిన రుూ రాజ్యాన్ని తృణీకరించకు. నీ మీద ప్రజలకు ఇప్పుడెంతో అభిమానం ఏర్పడింది. జనరంజంకంగా పరిపాలించు. నేను రోమ్ వెళ్ళక తప్పదు. నాతోపాటే నిన్నుతీసుకొని వెళ్ళలేను. నేను వెళ్ళాక నీకు కబురు పెడతాను. అప్పుడు రావొచ్చు’’.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు