డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదేవిధంగా మరో వివాహం చేసుకుంటే తన ప్రతిపక్షీయులు మిత్రులౌతారు. ఇలాంటి దురుద్దేశాలతో జరిగిన ఈ పెళ్ళిళ్లలో నీతి ఏ మాత్రం ఉన్నది? వారు వివాహ వ్యవస్థకు ఎంత విలువనూ, గౌరవాన్నీ ఇస్తున్నరు? చివరకు వారు ఎంతవరకూ సుఖపడుతున్నరు? ఒక్కో రాజకీయ నాయకుడికి నాలుగేసి పెళ్లిళ్ళు. తన భార్య ద్వారా తనకు కలిగే మేలు మరిలేదని తేల్చుకోవటం ఆలస్యం ఆమెకు విడాకులివ్వటం, మరొకతెను వెనువెంటనే పెళ్ళాడటం! ఈ నీతివంతులు తన వ్యక్తి జీవితంలోని నీతిని గూర్చి మాట్లాడుతున్నారంటే, గురిగింజ కథ గుర్తుకొస్తోంది!
ఈజిప్టులో రాజరికం ఉన్నది. రాజు కానీ, రాణి కానీ నిరంకుశంగా పరిపాలించవచ్చు. ఇందువల్ల ప్రజలు సుఖపడలేరనే సిద్ధాంతం అమల్లో వున్నది. పూర్వం లోమ్‌లో కూడా చక్రవర్తిత్వం ఉండేది. ప్రజలు తిరుగుబాటు చేసి, రాజుల్ని కూలద్రోసి, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించారు. అదే ఇప్పుడు కూడా అమల్లో వున్నది.
ప్రజలు సర్వాధికార వర్గాన్ని ఎన్నుకుంటరా. ఈ వర్గం తమ నియంతను ఎన్నుకుంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అమలు జరుపబడుతోందని భావించాలి.
కాని, నిజమేమిటంటే- సర్వాధికార వర్గ సభ్యుల్ని ప్రతి సంవత్సరమూ లంచమిచ్చో, లేక పెళ్ళిళ్ళ ద్వారానో లేక అధికారాలిచ్చో, ఏదో విధంగా కొనాలి. ఈ నియంతృత్వం కోసం రాత్రింబవళ్ళు పోరాటం జరుగుతూనే వుంటవి. నియంత బలం తగ్గిందంటే, కుక్కను తరిమినట్లు తరుముతారు. ఇదీ ప్రజాస్వామ్యానికి వున్న విలువ!
రాజరికంలో శాంతిభద్రతలంటూ ఏడ్చినవి. ఇక్కడ రోమ్‌లో ఏ మూల మృత్యుదేవత దాగి వున్నదో ఎవ్వరూ ఊహించలేరు. అంతర్గత పోరాటాలకే దేశ సౌభాగ్యమంతా బలిపెట్టబడుతోంది. వీథుల్లోకి వెళ్తే ఒకపక్క ఐశ్వర్యం, మరోపక్క బీదరికం కాపరం చేస్తూన్నవని తేలిగ్గా అర్థవౌతుంది.
ఎంత దరిద్రం రుూ దేశంలో సుస్థావరమేర్పర్చుకున్నదో? ఇక్కడి రాజకీయాలు సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నవో తేలిగ్గా అర్థమవగలదు! పేరుకు ప్రజాస్వామ్యం! ప్రజల కళ్ళకు గంతలు కట్టి, వారిని సుడిగుండాల్లోకి పడెయ్యటమే జరుగుతోంది. ఈ స్థితిలో వీరు, ఈజిప్టులోని రాజరికం అమానుషమనీ, అక్రమమనీ వాగుతున్నారు! ఇలాంటి దరిద్రం ఈజిప్టులో లేదు. వీళ్ళొకసారి అలెగ్జాండ్రియా చూస్తే తాము బతుకుతున్న బతుకులకు తప్పక సిగ్గుపడతారు!
అందాకా దేనికి? ఇప్పుడు తాను రోమ్ వచ్చి పదినెలలు దాటుతోంది కదా! అలెగ్జాండ్రియాలో ఎలాంటి అల్లరులూ లేవు. రాజ్యాంగం చాలా సాఫీగా సాగిపోతోంది. ఇక్కడ రోమ్‌లో అనేక వదంతులు బయలుదేరినవి. సీజర్ తమకు ముసలివాడైపోయాడు; వేరొక నియంతను వెతుక్కోవటం అవసరమని ప్రజలనుకుంటున్నారు. ఎప్పుడూ నాయకుల వెనుక నాయకులే గోతులు తవ్వటం పరిపాటయింది.
ఈ రాజకీయాలవల్ల ఎవరు సుఖపడగలుగుతున్నారు. చివరకు అధికారాన్ని చేతుల్లో ఉంచుకున్న నాయకులు కూడా ఏ క్షణాన తమను ఎవరు హత్య చేస్తారోననే భయంతో వణికిపోతున్నారు. ప్రతివాడు పైకి స్నేహితుడుగా కనిపిస్తాడు. కాని అంతరాంతరాల్లో సమయం చిక్కితే, విరోధ భావాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉంటాడు. మనిషిని మనిషి నమ్మలేని విషమ స్థితిలో రోమన్ సమాజం ఉన్నదంటే, వీళ్ళ సంస్కారం ఎంత గొప్పదో క్లియోపాత్రకు తేలిగ్గా అర్థమైపోయింది.
ఆమెను పీడిస్తూన్న భయమల్లా ఏ క్షణాన సీజర్‌మీద తిరుగుబాటు జరిగి, అతను నేల వాలుతాడోనని! ఎందుకంటే రాజకీయ పక్షాల్లో అప్పుడే చీలికలు బయలుదేరినవి. మార్క్ ఏంటనీ, సీజర్ మీద తిరుగుబాటు లేవదీసే ప్రయత్నాల్లో ఉన్నాడని వినవచ్చింది.యుద్ధరంగంలో సీజర్ ఒక ఉక్కుమనిషి. నిర్దాక్షిణ్యంగా శత్రు సంహారం చేస్తాడు. కాని పరిపాలనలో ఎంతో విశాల హృదయుడుగా కనిపిస్తాడు ఆగర్భ శత్రువును సైతం తేలిగ్గా క్షమిస్తాడు. అంతరాత్మలో కల్మషం లేని విధంగా అతన్ని తన మిత్రకోటిలో జేర్చుకుంటాడు. ఈ విధంగా ఏర్పడిన మిత్రబృందమంతా, తన వలెనే విశాల హృదయులని ఆయన నమ్ముతాడు. కాని సమయం చిక్కితే, వారి రూపాలు ఏ విధంగా మారుతవో ఆయన ఆలోచించడు. ఇపుడు తాను వింటున్న వదంతుల్ని బట్టి, సీజర్ పతనం ఏ క్షణాన జరిగినా ఆశ్చర్యపడవలసింది లేదని క్లియోపాత్రా అనుకున్నది.ఐతే సీజర్‌కు ఈ ప్రమాదాల్ని గూర్చి హెచ్చరించవలసిన బాధ్యత తనకు లేదా? సీజర్ ఒకరి మాట వినేనవాడు కాదు. ఆయన అనుకున్నదానికి ఎదురుచెప్పే సాహసం ఎవరికీ, చివరకు ప్రాణంలో ప్రాణంగా బతుకుతున్న తనక్కూడా లేదు. పైపెచ్చు, రోమన్ రాజకీయాల్లో కూడా తాను వేలు పెడుతోందదనీ, ముఖ్యంగా తన మిత్రబృందంమీద లేనిపోని అపవాదులు వేస్తోందనీ సీజర్ అనుకోవచ్చు. అందుకని, క్లియోపాత్రా అంతా తన మనసులోనే ఉంచుకోవలసి వచ్చింది.
ప్రజల్ని తన పక్షాన ఉంచుకోదలిచినపుడు, వారి సుఖ సౌఖ్యలను చూడవలసిన కనీస బాధ్యత పాలక వర్గానికి ఉన్నది. ప్రజాభిమానాన్ని పొందేందుకుగాను, పన్నుల భారం పెంచకుండా చూసుకోవాలి. ఐతే పన్నులు ఖజానాను నింపకుంటే రాజ్యపాలన సాగదు. ప్రజా క్షేమ కార్యకలాపాలకు తావుండదు.
అంతర్గత యుద్ధాలతో రోమ్ వైభవమంతా చితికిపోయింది. ముఖ్యంగా దేశ రక్షణార్థం పెద్ద పెద్ద సైన్యాలను పోషింవచలసిన అవసరం ఉన్నది. వీళ్ళందరికీ వేతనాలు సకాలంలో ఇవ్వకుంటే, పాలక వర్గం బలత్కారంగా తొలగించబడుతుంది. పోతే, ఇదంతా సమన్వయించుకొని రావాలంటే, ఈ సైన్యాన్ని పోషించాలంటే కొత్తగా ధనాగారాలను నింపాలంటే, మరికొన్ని దేశాలమీద యుద్దం చేయటం, ఆయా దేశాలను దోచుకోవటం లేదా ఆక్రమించుకొని, సామంత రాజ్యల కింద వారినుంచి కప్పం కట్టించుకోవడం అవసరం. కాని ఇది అనుకున్నంత తేలిక కాదు. అందునా దేశంలోని అంతఃకలహాలు ముందుగా పరిష్కరింపబడితేనే కాని ఇతర దేశాల విషయం ఆలోచించేందుకు వీలుండదు.రోమ్‌లో పరిస్థితులిలా ఉండగా, స్పెయిన్‌లో పాంపేయులు తిరిగి సీజర్‌మీద పితూరీ లేవదీసేందుకు సకల సన్నహాలూ చేస్తున్నారని వినవచ్చింది. బైటి ఒత్తిడులు అణచందే, స్వదేశంలోని అల్లరుల సంగతి చూసుకొనే వీలుండదు కనుక సీజర్ స్పెయిన్‌లో యుద్ధానికి వెళ్ళేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాడు.
సీజర్ లేని రోమ్ నివసించదగింది కాదని క్లియోపాత్రాకు తెలుసు. అదీగాక ఇక్కడి వాతావరణం కూడా బాగాలేదు. రాజకీయాల మాట అటుంచి, చల్లగాలి కోసం మొహం వాచి ఉండవలసి వస్తోంది. ఐతే తొందరపడి ఆమె అలెగ్జాండ్రియా తిరిగి పొయ్యేందుకు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే, సీజర్ రోమ్‌లో లేని సమయంలో అతని మీద తిరుగుబాటు జరుగకుండానూ, ఇక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచెలంచెలుగా ఆయనకు అందజేయంలోనూ తాను జాగ్రత్త వహించాలని ఆమె అనుకుంది.
ఇపుడు రాజకీయ నాయకులందరూ ఆమెకు పరిచయం చేయబడ్డారు. అతి ముఖ్యులు ఆమె దర్శనార్థం వచ్చి, అనేక కొత్త విషయాలను ఆమెకు చెప్పి పోతూ వుంటారు. సీజర్‌పట్ల సర్వాధికార వర్గ సభ్యులు ఎవరెలా ప్రవర్తిస్తున్నదీ, ఆయన వెనుక ఎలా గోతులు తవ్వుతున్నదీ ఆమె తెలుసుకోగలుగుతోంది. ఆమెతో రోమన్ రాజకీయాల్ని చర్చించటంవల్ల తాము సూటిగా సీజర్‌కు విన్నవించుకోలేని అనేక విషయాలు క్లియోపాత్రా ద్వారా తప్పక ఆయనకు అందుతాయని నాయకుల ఆశయం. ఐతే, క్లియోపాత్రాకు కూడా ప్రజల రాజకీయ నాయకుడైన సీజర్ దగ్గర తగినంత పలుకుబడి లేదు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు