డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖంగుమనే ఆ కంఠస్వరంలో యవ్వనం తిరిగి ప్రతిధ్వనించింది. ఆ రాత్రి తిరిగి వారు ప్రణయోపాసకులయ్యారు.
క్లియోపాత్రా అనుకున్నదిది. సీజర్ వెళ్ళాక, తాను కూడా ఈజిప్టు వెళ్లాలి. అక్కడ పర్షియన్ యుద్ధంలో వున్న సీజర్‌కు తనకు చేతనైనంత ధన సహాయం, సైనిక సహాయం పంపాలి. ఇపుడు సిరియా కూడా తన పాలనలోనే ఉన్నది కనుక, సీజర్ ఘనవిజయానికి తాను దోహదం ఇవ్వగలదు.
మర్నాడు వీడలేక వీడలేక సీజర్ క్లియోపాత్రాను విడిచివెళ్ళాడు. వెళ్ళే ముందు తన పుత్రుణ్ణి ముద్దాడి ‘‘వీడు అలెగ్జాండరంత అవుతాడు- చూస్తుండు రాణీ!’’ అన్నాడు. క్లియోపాత్రా కళ్ళు మూసుకొని పరవశం చెందింది.
మర్నాడు ఆయనకు క్షణం తీరిక లేదు. యుద్ధ సన్నాహాలన్నీ సక్రమంగా జరిగినవా, లేదా అని ఆయన స్వయంగా చూసుకున్నాడు. ఆరాత్రి కలత నిద్రతోనే గడిపాడు.
తెల్లవారి సెనేట్‌లో సర్వాధికార వర్గం సమావేశమైనదని పిలుపు వచ్చింది. సీజర్‌కు చాలా అలసటగానూ, విసుగ్గానూ ఉన్నది. వెళ్దామా, వద్దా అని సందేహించే సమయంలో ఆయన భార్య కల్‌పుర్నియా తనకు గత రాత్రి పీడకల వచ్చిందనీ, ఎక్కడికీ వెళ్ళవద్దనీ సీజర్‌ను ప్రాధేయపడింది. ఈ కలలు కల్లలని నిరూపించాలనీ, సీజర్ లాంటి వ్యక్తి మరణదేవతలకు భయపడేవాడు కాదని స్పష్టపరచాలనీ, ఆయన వినకుండా బయలుదేరాడు.
సెనేట్ సభ్యుల్లో చాలామంది అనుకున్న ప్రకారం బాకుల్ని తెచ్చుకున్నారు. వాటిని వారు రహస్యంగా మొడ్డులో దోపుకున్నారు. కొంతమంది బాకులు తేలేదు. భయపడ్డారు. ఒకపక్క రుూ దుష్కార్యంలో తాము భాగస్థులం కాలేదనే మనశ్శాంతి వారికి ఉన్నప్పటికీ, వేరొకపక్క తాము సెనేట్ సభ్యులకే ద్రోహం చేశామనే బాధ ఉన్నది. ఐతే వారు తాము సీజర్‌ను చంపేందుకు సిద్ధంగా లేమని ఎవ్వరికీ తెలియనీయలేదు. తాము కూడా బాకులు తెచ్చుకున్నవారితోపాటే నవ్వు మొహాలు పెట్టారు.
సీజర్ సెనేట్‌లోకి ప్రవేశించేముందే ఒక సభ్యుడు అతనితో రహస్యంగా మాట్లాడాడ. దీంతో కుట్రదారులు తమ బండారమంతా బయటపడిందని భయపడ్డారు. ఆ భయంతో పరుగెత్తటం అవివేకవౌతుంది కనుక, ఎలాగో నిలదొక్కుకున్నారు. మొత్తంమీద రుూ కుట్ర ముందుగా బైటపడలేదు.
సీజర్‌కు కుడి భుజంగా వున్న ఏంటనీని కుట్రదారులు చంపదల్చుకోలేదు. అదీగాక సీజర్ సెనేట్ హాలులో ప్రవేశించే సమయంలో ఏంటనీ బైటనే ఉండిపొయ్యాడు.
సెనేట్‌లో సీజర్, రాజ సింహాసనాన్ని బోలిన కుర్చీలో కూర్చున్నాడు. సభ్యులు 80 మందీ వణికిపోతున్నారు. అనుకున్న ప్రకారం ఏది జరగకపోయినా అది జీవన్మరణ సమస్య అవుతుంది.
మొదటి సభ్యుడొచ్చి సీజర్‌పట్ల తనకున్న విశ్వాసాన్ని నిరూపించే మిషతో వొంగి, ఆయన చేయి ముద్దు పెట్టుకున్నాడు. ఈలోగా అనేకమంది సభ్యులు వచ్చి ఆయన్ను చుట్టుముట్టారు. ఒకడు ఆయన రొమ్ముదీ కప్పుకున్న గుడ్డను తొలగించాడు. ఎందుకంటే, ఆయన లోహపు కవచాన్ని ధరించాడేమోనని వారి అనుమానం. రొమ్ములమీద రక్షణ లేదని తెలిసిన మరుక్షణంలో మొదటి సభ్యుడు తన బాకును సీజర్ రొమ్ముల్లో గుచ్చాడు.
దెబ్బతిన్న సింహంవలె లేచి నిలబడ్డాడు. వెంటనే మరొక సభ్యుడు ఆయన్ను బాకుతో పొడిచాడు. సీజర్ దిమ్మెరపోయాడు. తనకు సెనేట్ హాలులో ఈ గౌరవం జరుగుతుందని ఆయన కలలో కూడా తలచలేదు. అక్కడికీ సీజర్ తనను ఈగలల్లే ముసురుతున్న సభ్యుల్ని పక్కకు నెట్టివేద్దామని తన కుడిచేతిని పైకి ఎత్తాడు.. కాని, ఈలోగానే వరుసగా బాకు పోట్లు తగిలినవి. సీజర్ కళ్ళు బైర్లుకమ్మినవి.
చివరకు బ్రూటస్ కూడా బాకుతో మీదికి ఉరికాడు. బ్రూటస్ సీజర్ అక్రమ సంతానమనే వదంతి ఉన్నది. తనను తండ్రివలె గౌరవించవలసిన బ్రూటస్, ఈ ఘోరాతి ఘోరమైన సంఘటనలో పాల్గొంటాడని ఎవ్వరూ అనుకోలేదు. తీవ్ర గాయాలకు గురైనప్పటికీ, బ్రూటస్‌ను చూడగానే ‘బ్రూటస్.. చివరకు నీవు కూడానా?’’ అన్నాడు!
సీజర్‌కు పరిపూర్ణంగా అర్థమైపోయింది. ఇక తాను బతికి బైటపడేందుకు ప్రయత్నించీ లాభం లేదు. తన చుట్టూ వున్నవాళ్ళు తనకు మిత్రులుగా చెలామణి అవుతూ, తన నుంచి అనేక సహాయాల్ని పొందినవారే! వారు చూపే కృతజ్ఞతా స్వరూపం ఇది! ఇంత దుష్టమైన ప్రపంచం తనకిక పనికిరాదు! తాను రుూ పాడు ప్రపంచం భరించలేనంత గొప్పవాడయ్యడు. కనుక ప్రపంచమే తనను విడనాడుతోంది!
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు