డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరాన సీజర్ శవం తగలబడుతూండగా విడుదలైన పొగవలెనే ఆమె ఆశలన్నీ ఆకాశంలోకి పాకి, మటుమాటమైపోతూన్నవి. ఇక తనకీ ప్రపంచంలో ఏమున్నదని? జీవచ్ఛవంవలె ఆమె ఈజిప్టు వైపు వెళ్లిపోతోంది. జీవితాన్ని తాను ఇన్నాళ్ళూ భరించింది. ఇక జీవితం తనను ఎన్నాళ్ళు భరిస్తుందో ఆమెకే తెలియాలి. నిరాశ మినహా తనకేమీ మిగలలేదు.
‘ఏం జీవితం!’ అనుకున్నదామె
***
అలెగ్జాండ్రియా రేవులో క్లియోపాత్రాకు ఘనస్వాగతం ఇవ్వబడింది. అయితే ఆమె ఎంత దుఃఖంతో, ఎంత బరువైన హృదయంతో తన దేశం చేరిందో ఎవ్వరూ ఊహించలేకపొయ్యారు. వాడిపోయిన తమ రాణి ముఖాన్ని చూసి, బహుశా ప్రయాణ బడలికై వుంటుందని అందరూ అనుకున్నారు.
రెండేళ్ళుగా ఆమె రోమ్‌లో రాజకీయ మిత్రత్వం కోవసం పడి ఉన్నదని ప్రభుత్వం అనుకుంటోంది. ఈసారితో ఆమె దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని సంపాయించుకొచ్చిందని అందరూ తలచారు.
కాని, ఆమె రోమన్ ముద్రలున్న పత్రాలేవీ తేలేదు సరికదా, వొట్టి చేతుల్తో తిరిగి వచ్చింది. తన దేశ సౌభాగ్యాన్నాంతా వొడ్డి, జూదమాడి, సర్వస్వాన్ని పోగొట్టుకుని బిక్కమొహంతో, విధి విసిరివేయగా స్వదేశంలో పడింది. తన కొడుకు ఏదన్నా సాధిద్దామనుకున్నదామె, కాని వాడు రుూనాడు పితృహీనుడయ్యాడు!
అయితే, క్లియోపాత్రా కేవలం విలాసాల కొరకే రోమ్‌లో రెండేళ్ళపాటు ఉన్నదని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే, గత రెండు సంవత్సరాల్లోనూ ఈజిప్టు, రోమ్‌తో గొప్ప వ్యాపారం చేయగలిగింది. ఇదంతా తమ రాణి చలవేనని ప్రజలు నమ్మారు. ఇతర అనుమానాలు వారిని వేధించి, అల్లరులు లేవదీసేందుకు అవకాశాలు లేవు.
శూన్య హృదయంతో ఆమె తన భవనం ప్రవేశించింది. ఇక్కడే తన జీవితమంతా గడిచింది. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, ఆటపాటలు, చదువు సంధ్యలు ఒకటేమిటి ఎనే్నళ్ళుగా రుూ ప్రదేశాలు తన జీవితానికి వాతావరణాలైనవో ఆమెకు గుర్తొస్తోంది.
అయితే ఈనాడు ఈ భవనంలో ఆమెను ఆకర్షించగలిగేదేమీ లేదు! టాలమీ వంశజులు రుూ భవంతుల్లోనే ఉండేవారు ఇక్కడే సహజంగానో, అసహజంగానో చచ్చారు. కుటుంబీకుల మధ్య ద్వేషం మినహా ఏమీ లేదు. ఎన్ని కుట్రలు, హత్యలు, అక్రమాలు ఇక్కడ జరిగినవో ఈజిప్టు దేశ చరిత్రంతా రుూ ప్రాసాదంలోనే చర్చించబడి, మార్చబడి, మూసపోయబడింది. తన సర్వస్వమూ ఇక్కడే గుప్తపరచబడింది. తన రాజ్యపాలనకు ఎలాంటి అడ్డంకి లేకుండా టాలమీ వంశానికంతకూ తాను, తన కుమారుడు మాత్రమే మిగిలి ఉన్నారు.
అయితే తానిప్పుడు దిక్కులేనిదైంది. చివరకు తనను పెంచిన ఆయా కూడా చనిపోయింది. జీవరహితమైన రుూ విశాల రాజభవనంలో తానొక మూల పడి ఉన్నది. జీవితమంటే ఇదివరకెప్పుడూ లేని భయం ఆమెను ఆవరించింది. ప్రపంచమే శూన్యమన వేదాంతులు అంటూంటారు. అదంతా నిజమేసుమా అనిపిస్తోందిప్పుడు.
ఈ భవంతిలో తాను సీజర్‌కు ప్రియురాలైంది. చచ్చి స్వర్గంలో అనుభవించగల సౌఖ్యాలంటూ ఏమైనా ఉంటే, అవి ఇక్కడ సంభవైనవని తను అనుకున్నది. తనలాంటి జగదేకసుందరిని కరుణించి దేవతలు ప్రసన్నులై, జగదేకవీరుడైన జూలియస్ సీజర్‌ను తనకు జతచేశారని మురిసిపోయింది. ఆయన సాన్నిధ్యంలో, రక్షణలో కలకాలం సుఖపడగలనని సంబరపడింది.
కాని.. కన్ను మూసి తెరిచేలోపలే అంతా కూలిపోయింది. ఈనాడు తనకు ఎవ్వరూ లేరు! తను అనాధ! దేవతలందరూ తనను చూసి నవ్వినట్లే నవ్వారు, అంతలోనే అది విషపు నవ్వవుతుందని తను అనుకోలేకపోయింది కదా పావు శతాబ్ద జీవితంలోనే, అర్ధ శతాబ్ద జీవితానుభవాన్ని పొందాను కదానని సంతోషపడింది. కాని, తాను నిజంగా గడపని కాలం కూడా తన వయస్సును పెంచి పారేసి, తన ఉత్సాహాన్నీ, జీవశక్తుల్నీ నాశనం చేసింది!
ప్రపంచం అద్దం లాంటిదనీ, దాన్ని చూసి నవ్వితే అదీ నవ్వుతుందనీ వేదాంతులు అంటారు. అందుకనే తనలాటి అందాల రాణికి, యోధాన యోధుడు రోమన్ నియంత లభ్యమైనాడు కదానని రుూ సామెతను నమ్మింది.
ఇప్పుడు రుూ మాటలు వినేందుకు ఎంత మధురంగానూ, సత్యంగానూ తోచినప్పటికీ, వొట్టి అబద్ధలు! తను సీజర్‌ను మనసారా ప్రేమించింది. ఆయనకు తన సర్వస్వాన్ని అర్పించింది. చివరకు తన దేశానే్న దోచి సమర్పించింది. దానికి ప్రతిఫలంగా ఆయన తనకేమిచ్చాడు? తన యవ్వనాన్నీ, వలపునూ అనుభవించి ఆనందించాడు. చివరకు తనను తన కొడుకులో చూసుకొమ్మని ఒక చిన్న అద్దాన్ని మాత్రం తన మొహాన పారేసి, రుూ ప్రపంచానే్న విడిచి వెళ్ళాడు. వీలునామాలో చివరకు తన పేరు కూడా ఉదహరించలేదు. ఇంతకన్నా కృతఘ్నత ఉండగలదా? సీజర్ తనకు మనసిచ్చి ప్రేమంచాడని రుూనాడు తను ఎలా నమ్మగలదు? చివరకు పుట్టెడు దుఃఖాన్ని తనమీద పారేశాడు.
ఏమిటీ వెధవ బతుకు! సారమంతా రుూ ఐదేళ్ళలోనే తాను పీల్చి పిప్పి మాత్రం మిగిల్చిందనుకోవాలి. నిస్సారంగా, నిరుత్సాహంగా, జుగుప్సతో, అసంతృప్తితో, బాధతో, వేదనతోనే తాన జీవిత శేషాన్ని గడపాలి. విధి తననిలా నడి సముద్రంలో ముంచుతుందనుకోలేదు కదా!
ఇలా విచారిస్తూ కూర్చుంటే ఏవౌతుంది? ఈ ప్రపంచ బాధల నుంచి సీజర్ విముక్తుడయ్యాడు. కాదు- ఆయన్ను సెనేట్ సభ్యులు విముక్తుణ్ణి చేశారు. తనక్కూడా ప్రాణభయం ఉన్నది. తాను అంత తేలిగ్గా చచ్చి, లోక బంధనాలను వదిలించుకోలేదు. ఏమైనా భూగోళం తన చుట్టూ తాను తిరుగుతున్నంత కాలం, తాను కూడా కాలచక్రగమనంలో పాల్గొనే తీరాలి.
ఇంతవరకూ, తనకు జరిగిన కీడు ఒక ఎత్తు. ఇక ముందు రాబోయేది మరొక ఎత్తుగా ఆమెకు తోచింది. ఏమైనా తాను తన రుూ చిన్నవాడికోసం ఇంకా బతకాలి. వీలుంటే- ఏ విధంగానైనా సరే వీణ్ని సీజరంతా చేయాలి. అదే ఇప్పటి జీవితాశయం. ఇందుకుగాను తనకు అనుకూలిచేవీ, ప్రతికూలించేవీ ఏమిటనే మీమాంసలో పడిందామె.
సీజర్ మరణానంతరం రోమన్ రాజకీయాలు గందరగోళంగా ఉన్నవి. సీజర్‌ను హత్యచేసిన కుట్రదారులు ఒక పక్షమయ్యారు. ఐత, సీజర్ వీలునామాను విన్న ప్రజాసమూహాలు సీజర్‌మీదా, అతని అనుచరులమీదనే సానుభూతి, సహకారాల్ని చూపుతున్నవి. ఆక్టోవియన్ స్థానం ఇంకా సుస్థిరం కాలేదు.
ప్రజల అండదండలు లేని కుట్రదారులు భయపడి దేశం విడిచివెళ్లారు. పరదేశాల్లోనూ, దేశం నలుమూలల్లోనూ నక్కి, కొంత సైన్యాన్ని కూడగట్టుకొని ప్రస్తుతం ఆత్మరక్షణ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
సీజర్ బతికి ఉండగా రోమ్‌లో క్లియోపాత్రాకు అంతా సానుకూలంగానే ఉన్నది. సీజర్ తరువాతి పాలకులు, సీజర్ అడుగుజాడల్లో, అతని ప్రణాళికల్నే అనుసరించబోరు. పూర్వం సీజర్‌కు తాను ప్రియురాలుగనుక, అప్పటి రాజకీయాలు తనకు సానుకూలంగా ఉండేవి. ఇపుడు రోమ్ తన పట్ల ఎలా ప్రవర్తిసుంది? మిత్రత్వం లేకుంటే మానె- శతృత్వాన్ని వహించదు కదా?
సీజర్ లేని తన బతుకు ఎంత భీతి గొల్పుతోంది! సీజర్ తన ప్రియుడు మాత్రమే కాదు. ఆయన ఆచార్యుడూ, తండ్రీ, రసికుడూ, విలాస పురుషుడూ, రాజకీయ దురందరుడూ- ఒకటేమిటి తన ఆరాధ్య దైవం! ఆయన రుూ ప్రపంచంలో లేకుండా తాను బతకడమంటే నిజంగానే ఎంత ధైర్యం, స్థైర్యం, సాహసం కావాలి!

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు