డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశపుటంచుల్లోకి వెళ్లిన గాలిపటం తెగిన రీతయింది తన బతుకు విశేషించి తన జీవితంలో సీజర్ ఆక్రమించుకోగలిగిన స్థానానికి వేరెవ్వరూ అర్హులు కారు. అందుకనే జీవితంలో ఎటుచూసినా కారుచీకట్లు తప్ప మరేమీ గోచరించలేదామెకు.
మెత్తని తివాసీలమీద నడుచుకుంటూ సీజర్ టాలమీ తనవైపే వొస్తున్నాడు. రెండేళ్ళ క్రితం, తాను రోమ్ జేరే సమయానికి నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నడవటం, మాట్లాడటం కూడా నేర్చుకున్నాడు. మరో సీజర్ రుూ ప్రపంచంలో పెరుగుతున్నాడని ఆమె అనుకున్నది. కాని, వీడు పెరిగే వరకూ వీణ్ని రక్షించటం, వీడికి అవసరమైన సామ్రాజ్యం సాధించటం ఎలా? సామ్రాజ్యం- దాని సంగతి దేవుడికెరుక! ముందు తను రుూ ఈజిప్టును దక్కింకోవటం, శాంతితో బతకటమే విషమ సమస్యగా కనిపిస్తోంది.
కొడుకును ఎత్తుకున్నది క్లియోపాత్రా, దూరాన రేవు నుంచి కొన్ని ఓడలు బయలుదేరుతున్నవి. కొడుక్కు ఆ దృశ్యాన్ని చూపించిందామె.
‘‘అమ్మా! ఆ ఓడలు ఎక్కడికి వెళ్తూన్నవి?’’ అని అడిగాడు వాడు.
‘‘రోమ్‌కు వెళ్తున్నవి!’’ అన్నదామె ఉద్రేకమూ, విచారమూ, జుగుప్సా మిళితమైన కంఠస్వరంతో.
వాడికేమీ అర్థం కాలేదు. తల్లి చిరాగ్గా ఉన్నదని మాత్రం అనుకున్నాడు.
రోమ్ నుంచి ఎప్పటికప్పుడు వార్తలు ఆమెకు అందుతూనే వున్నవి. ఈ వార్తల్ని గూర్చి తెలుసుకోవటమంటే, తన బతుకును గూర్చి తెలుసుకోవటమే అవగలదు. పూర్వం రోమన్‌ల జీవితాన్ని ఆమె ఊహించేది. ఇపుడు రెండేళ్లకుపైగా రోమ్‌లో వుంది. వారి నిత్య జీవితాలతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక, ఆమె ఊహలు చాలా గురిగానూ, సరిగ్గానూ ఉంటూన్నవి.
అందుకనే ఆమె ఎంతో భయపడిపోయింది. ఎందుకంటే, రోమన్ యోధులే ప్రమాదకరమైన వ్యక్తులైతే, వారి స్ర్తిలు అంతకన్నా ప్రమాదకరంగా ప్రవర్తిస్తారు. పేరుకు పురుషులే రాజకీయాలను నడిపినా, వారి వెనుక స్ర్తిలుండి తమ రాజకీయాలను పలుకుబడితో ఆలోచనలో నడిపిస్తారు. స్ర్తిత్వాన్ని గురించి కూలంకషంగా తనకు తెలుసు కనుక, స్ర్తి బుద్ధి ప్రళయానికి దారితీస్తుందని ఆమె నమ్మకం. ఆ ప్రళయానికి తను బలికాకుండా చూసుకోవటమే ప్రస్తుత సమస్య!
ముఖ్యంగా ఏంటనీ జీవితానికి , తన జీవితానికి గొప్ప సంబంధం ఏర్పడింది. సీజర్ మీద కుట్ర చేసిన వారిని శిక్షించేందకు ఏంటనీ ప్రయత్నించాలి. కానీ, సీజర్ స్థానంలోకి ఎగబాకాలని ప్రయత్నించే ఏంటనీ తనకు తానుగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాడో తానూ ప్రమాదానికి గురవుతుంది. రోమ్‌లో ఏదెలా జరిగినా తాను మాత్రం ఆమోదించి, భరించి రోమ్‌తో సంధి చేసుకోవాలే గానీ ఎదురు చెప్పేందుకు వీల్లేదు కదా.
ఏంటనీ భార్య పుల్వియా చండశాసనరాలు. క్లియోపాత్రా తానొక్కతే చాలా తెలివి గలదాన్నని గర్వించేది. కానీ, పుల్వియా కూడా తనకన్న తెలివి గలదని ఈనాడు నమ్మలేదు. ఐతే తన వలెనే పుల్వియా కూడా అక్టోవియన్ ను ఏవగించుకుంటూన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఆ ఒక్కకారణం వల్లా ఆమె తన క్షేమాన్ని , స్నేహాన్ని కోరటం లేదు.
ఎందుకంటే ఏంటనీ తన చెప్పుచేతల్లో లేకుండా క్లియోపాత్రా వలలో పడతాడేమోనని ఆమె భయపడుతోంది. అందుకనే తన భర్తను క్లియోపాత్రాకు దూరంగా ఉండేట్లు చూస్తూ రోమన్ రాజకీయాల్లో అతనిది పైచెయ్యిగా ఉండేందుకు మార్గాన్ని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నది. ఈవిధంగా ఏంటనీలో తాను స్నేహాన్ని చూడగలిగితే అతని భార్యలో శతృత్వాన్ని స్పష్టంగా చూడవలసి వస్తోంది.
పుల్వియా, సీజర్ అంతరంగిక కార్యదర్శి సహాయంతో సీజర్ చే స్వయంగా రాయబడిన వనబడే కొన్ని పత్రాలు సృష్టించింది. ఎవరికి ఏ విధంగా ఆ పత్రం ఉంటేవీలో లాభమో దాన్నామె ఆ విధంగానే తయారు చేయించి విశేషంగా ధనార్జన చేయగలిగింది. రోమ్‌లో చట్టాలకూ , డబ్బుకూ పీటముడి పడింది. చాలా కూడబెట్టిన ధనంతో ఏంటనీ అధికారంలోకి వొచ్చేందుకు అవసరమైన పలుకుబడిని ఆమె కొనగలుగుతోంది.
ఇప్పుడీ ప్రపంచంలో తనకు అక్టోవియస్ పరమ శత్రువు. తన జీవితాంతం వరకు ఇది సత్యమే అవుతుంది. అక్టోవియస్ కు ఏంటనీ శత్రువుగా ఉన్నంతకాలం, ఏంటనీనీ తాను అభిమానించగలదు. కానీ, దురదృష్టవశాత్తు ఏంటనీ, అక్టోవియన్‌లు స్నేహితులైతే ..! అప్పుడు ఏంటనీ ఎవరైనప్పటికీ తనకు ఒకటే.
అధికారం కోసం ఏంటనీ పోరాటాన్ని లేవదీశాడు. అయితే, ఈ యుద్ధం తన బాగుకోసం కాదని ప్రజల్ని నమ్మించాడు. కేవలం సీజర్‌ను ఖూని చేసిన వారి మీద ప్రతీకారాన్ని సాధించేందుకు యుద్ధమన్నాడు. ఐతే ఈ యుద్ధంలో ఓడిపోయి అలప్స్ పర్వత ప్రాంతాలకు పారిపోయాడు.
అక్టోవియన్ క్రమంగా అధికారంలోకి వస్తున్నాడు. అతని మీద ప్రజలకు విశ్వాసం లేకపోయినా సీజర్ దత్తపుత్రుడుగా ఆయన వీలునామా ప్రకారం అక్టోవియస్‌ను గౌరవించక తప్పలేదు. అక్టోవియస్ -ఏంటనీ తనకు పరమ శత్రువు అనే మాట గ్రహించి అతన్ని పట్టుకునేందుకు సైన్యాన్ని పంపాడు.
ఇలాంటి విషమ పరిస్థితి ఏంటనీ పతనానికి కారణవౌతుందనీ తన కిక రోమ్‌లో మిత్రులే ఉండరనీ క్లియోపాత్ర భయపడింది.
కాని, పుల్వియా - ‘ఏంటనీ సీజర్ ను హత్య చేసిన వారి మీద దండెత్తుతే సీజర్ ఆస్తిపాస్తులన్నీ గుటకాయస్వాహా చేసుకొన్న ఈ అక్టోవియన్ తన పెంపుడు తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు ఏమీ చేయలేని అప్రయోజకుడుగా తయారవటమే గాక ఏంటనీ లాంటి విశ్వాస పాత్రుణ్ణి పట్టుకొమ్మని సైన్యాల్ని పంపటం ఏం సబబు? ఈ ధోరణిలో ఉపన్యాసాలు దంచింది.
మరికొన్ని వారాలు గడిచాయి. రోమన్‌లు, రోమన్‌లతో పోట్లాడేందుకు నిరాకరించారనే వార్తలు వచ్చినవి. అంతఃకలహాలతో రోమ్ సర్వనాశనవౌతోంది. జరిగి పోయిందేదీ తిరిగి జరగదుకదా. కనుక ఎవరి తప్పయినప్పటికీ అందరూ ఐక్యతతో ఉండటం సర్వత్రా శ్రేయస్కరం కనుకా , సంధి జరగాలనీ అందరూ ఆశించారు. కేవలం నాయకుల ధనతృష్ణా , మానవ రక్తతృష్ణలు మరి సాగవనే ధోరణి కనిపించింది.
ఈ మార్పును క్లియోపాత్రా ఊహించలేదు. ఏంటనీ తన అధికారం కోసం వేరొక పక్క సీజర్ కుమారుని శ్రేయస్సు కోసం పోరాడుతున్నాడని క్లియోపాత్రా ఆశపడింది. కానీ, ఈ వార్తలు విన్నాక ఆమె ముఖం పాలిపోయింది. తనకు రోమ్ వొరగబెట్టేది మరేమీ ఉండబోదని తేలిపోయింది. ముందు తనను తాను రక్షించుకోవడం ఎలాగనేది గడ్డుసమస్యయింది.
సంధి కూడా జరిగింది. ఈ రాజీకి విలువలంటూ ఉండేందుకు గాను, పుల్వియా తన మొదటి భర్తకు కన్న కుమార్తెను అక్టోవియన్ పెళ్లాడాడు. ఆ అమ్మాయి వయస్సు తొమ్మిదేళ్ళే ఐనా, ఇది రాజకీయ వివాహం కనుక, సామాజిక నిబంధనలను అతిక్రమించింది. తనకు అల్లుడూ, రోగీ ఐన అక్టోవియన్ ను బొటనవేలి కింద ఉంచవచ్చుని పుల్వియా ఆలోచించి ఉండాలి. ఏంటనీ , అక్టోవియన్‌లు మిత్రులే గాక, బంధువులు కూడా అయ్యారు. ఇక ఉభయులకూ - తానొక శత్రువుగా కనిపిస్తుందనీ తనపని పడతారనీ క్లియోపాత్రా భయపడిపోయింది.
రోమ్‌లో అక్టోవియన్‌కు ఇప్పుడు ఎదురులేదు. శత్రువులని తలచిన వారిని రెండు వేలమందిని విచారణ లేకుండానే వధించేందుకు అతను ఆజ్ఞలిచ్చాడు రెండువేల తలలు నేలవ్రాలినవి. ప్రజలు భయకంపితులై పట్టణం విడిచి పారిపోయారు.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు