డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజర్‌ను మొదటిసారి కలుసుకున్నపుడే అతన్ని ఆశ్చర్యపరిచి, మభ్యపెట్టగలిగింది తాను! అదేవిధంగా ఏంటనీకి కూడా ఏ తివాసీలో నుంచి ఉద్భవించి దర్శనమివ్వటమా? ఈ ఊహ రాగానే ఆమె తనలో తాను నవ్వుకున్నది.. కాదు, ఇంకో కొత్త పద్ధతిలో అతన్ని కలుసుకోవాలి.
ధనాగారాలు నిండి వున్నవి. ప్రపంచంలో ఎక్కడా దొరకని రత్న మాణిక్యాలూ, బంగారమూ, ఇతర ఆభరణాలెన్నో తన దగ్గరున్నవి. వాటన్నింటినీ నాణ్యమైన కొయ్యతో తయారుకాబడిన పేటికలకు ఎత్తించిందామె. తనతోపాటు ఉత్తమ గాయనీమణుల్నీ, వాద్యగాళ్ళనూ వెంట తీసుకున్నది. ఈజిప్షియన్ రాణిగా తన వైభవమంతా చూపెట్టేందుకుగాను సకల సన్నాహాలు చేసింది. చివరకు ఎంతో కౌశలమున్న వేటగాడు, వన్యమృగాన్ని బంధించగలననే ఆత్మవిశ్వాసంతో బయలుదేరిన విధంగా, దారిలో అనేక ప్రణయ సంభాషణల్ని ఆలోచించింది కాని, ఏ ఒక్కటీ ఆమెకు తృప్తికరంగా తోచలేదు.. ఇదేమీ లాభం లేదు- చివరకు ప్రణయ రంగంలోకి దూకుతేనే కాని, సహజంగా తాను తన స్ర్తిత్వాన్ని నిరూపించి అతన్ని రెచ్చగొట్టి, లొంగినట్లే లొంగుతూ అతన్ని లొంగదీసుకొని, మధువిచ్చిన మత్తులో, ప్రణయం తెచ్చే మమతలో, నిషాలో- అతన్ని లోబరచుకొని కొంగున ముడేసుకోవాలి.
మూడేళ్ళుగా పురుష స్పర్శ నెరుగని ఆమె శరీరం, లోన ప్రవహించే వేడి నెత్తుటి ఉరుకులు పరుగులతో, యవ్వన శోభతో దేదీప్యమానంగా వెలిగిపోతూన్న కాంతులు ఆమెను భూమి మీద నిలబడనీయటంలేదు. తన అందచందాలకు జోహారులిచ్చి, సాష్టాంగపడని పురుషుడంటూ రుూ ప్రపంచంలో ఉండబోడని ఆమె దృఢ విశ్వాసం. యుద్ధ్భూమి అనుభవమంటూ తనకు పెద్దగా లేకపోయినా, ప్రణయ రంగానుభవం వున్నది. కనుకనే విజయలక్ష్మి దొడ్డిదారినన్నా వచ్చి, తనను కావలించుకోక తప్పదనే ఆత్మవిశ్వాసంతో, ఆతృతతో, ఉత్సాహంతో, కామోద్రేకంతో, మత్తుగా, గమ్మత్తుగా, వొత్తుగా, తనను కమ్మిన మదనుని మంత్రాలతో ఆమె ఏంటనీని కలుసుకునేందుకు ప్రయాణ వేగాన్ని హెచ్చించింది.
నైల్ నది మీద సీజర్‌తో జల విహారార్థం తయారుచేసిన ఓడ- ఓడా అది? నీటిమీద తేలియాడే ఒక రాజభవనం- దానిలోనే ఆమె ప్రయాణం చేసింది. ఈజిప్టు ఎంత సారవంతమైన దేశమో, సకల భోగాలకు నిలయమో, భూతల స్వర్గమో - ఈ దృశ్యం చూసినవారికి వేరుగా చెప్పనవసరం లేదు. మొదటిసారి చూసిన వారికి కళ్ళు బైర్లు కమ్మేటంత శోభాయమానంగా వున్నవా ఏర్పాట్లు.
టార్సస్‌లో ఏంటనీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దాదాపు సగం రోమన్ సామ్రాజ్యంమీద ఇప్పుడతని అధికారి. ఎవరికైనా ప్రాణదానం చేయగల అధికారం, లేదా మరణదండన విధించగల హక్కులు ఆయనకున్నవి. ఇవి రోమను అధికార వర్గాలు ఆయనకు ఇచ్చినవో, లేదో ఎవరికీ తెలియదు కాని, ఆయన తనకు తానుగానే సకలాధికారాలనూ చేజిక్కించుకున్నాడు.
సూర్యాస్తమయ సమయంలో టార్సస్‌కు సమీపంలో, సిడ్నస్ నదిలో ఈజిప్షియన్ ఓడ ఆగింది. తీరంలోని ప్రజలు ఆశ్చర్యచకితులై నిశ్చలంగా నిలబడిపొయ్యారు. ఆ ఓడలో మిత్రులే ఉన్నారో, శత్రువులే వున్నారో, దేవతలే దిగుతున్నారో, రాక్షసులే దాగొని ఉన్నారో వారి ఊహలకు అందటంలేదు. తాము స్వప్నంలో కూడా చూడలేనంత అందంగా అలంకరించబడిన ఒక రాజహంస నీటిమీద మెల్లిగా తేలియాడుతూ వచ్చి అల్లంత దూరాన ఆగిందనిపించింది. ఎంతసేపటికీ అది వొడ్డు జేరదు. ఎందుకని అక్కడే నిలిచిపోయింది? కొంతమంది ఆశ్చర్యంతోనూ, మరికొంతమంది భయంతోనూ, ఇంకొంతమంది ఆత్రుతతోనూ ఊగిపోయారు. ఈ వార్త వాయువేగంతో ఏంటనీకి అందింది.
ఏంటనీ కొద్దిమంది సైనికుల్ని తీసుకొని, నదీ తీరానికి వచ్చాడు. ఆ ఓడను చూసి, అతను కొద్ది క్షణాలు శిలా ప్రతిమవలె అలాగే నిలబడిపోయాడు. ఓడలో నుంచి మృధుమధురమైన సంగీతం వినవస్తోంది. బంగారు పూత పూసిన తెరచాప కొయ్య అస్తమయ సూర్యుని కిరణాలకు మిరుమిట్లు గొలిపేట్లుగా మెరుస్తూ వెలిగిపోతోంది. ఓడకు అమర్చబడిన తెడ్లన్నీ వెండితో తయారైనవి. నౌకలోనుంచి సుగంధ వాయువులు టార్పస్ తీరానే్న గాక ఆ పట్టణాన్నంతా ముంచెత్తుతున్నవి. దూరం నుంచి రుూ ఓడను చూస్తేనే, ప్రపంచంలో ఇంత ధనం ఉండగలదా అనే ఆలోచన రాక మానదు.
ఓడమీద ఎగిరే ఈజిప్షియన్ పతాకమే లేనట్లయితే ఏంటనీ తేలిగ్గా మనిషయ్యేవాడు కాదు. ఈజిప్షియన్ రాణి తన ఆహ్వానాన్ని అందుకొని, తనను దర్శించేందుకు వచ్చిందని తేల్చుకున్నాడు. ఈ ధనవంతురాల్ని తాను ఇక్కడికి ఆహ్వానించినందుకు సిగ్గుపడ్డాడు. ఎందుకంటే ఈమెను తానేవిధంగా గౌరవించగలడు? ఆమె ధనరాసుల ముందు తాను భూమిలోకి కుంగిపోవలసిందే! ఇప్పుడు ఏమనుకొనీ ప్రయోజనం లేదు. తాను పొరపాటు చేశానని రాణి దగ్గర ఒప్పుకొని, ఆమె అభిమానాన్ని పొందాలి.. ఇలా ఆలోచిస్తూ ఆమెను నది మధ్యలో నిలబెట్టటం ఏం సబబు?
కొద్దిమంది ఉన్నతోద్యోగుల్ని వెంట తీసుకొని ఏంటనీ ఓడమీదికి వెళ్లాడు. అప్పటికే ఓడ మీద రంగు రంగుల దీపాలు వెలిగించబడి, చీకటి వెలుగులు కంటికెంతో ఇంపుగా రూపొందించబడినవి.
క్లియోపాత్రా దర్శనం కోసం ఏంటనీ తహతహలాడాడు. ఆమె రావొచ్చని అనుమతినిచ్చింది.
అది శయన మందిరం. బంగారంతో చేయబడిన పందిరి మంచం, చుట్టూ వున్న రంగు దీపాలను ప్రతిఫలింపజేసుకొని, కొత్త కొత్త వర్ణాలతో ధగధగా మెరిసిపోతోంది. పట్టుపరుపులమీద క్లియోపాత్రా ఎంతో సుకుమారంగా, విలాసంగా పరుండి, అర్థనిమీలిత నేత్రాలతో చూస్తూన్నది. పరిచారికలు నెమలి పింఛాలతో చల్లని పిల్లవాయువుల్ని సృష్టిస్తున్నారు. నిజంగా రతీదేవి భూమిమీదికి ఏ శాప కారణానో దిగి, దర్శనమిస్తోందా అనిపించేట్లున్నదామె. ముద్దులు మూటగట్టే ఆమె ముఖంలో పురుషత్వానికొక సవాలు, స్ర్తిత్వానికో ఆదర్శం, రాణిగా హుందాతనం, యవ్వనానికో గర్వం, అందచందాలకొక నమూనా- ఇంకెన్నో ప్రతిఫలిస్తూన్నవి.
ఏంటనీ అదిరిపొయ్యాడు. తానెరిగిన క్లియోపాత్రా కాదీమె! నిజంగానే ఈమె దేవసుందరి! రోమ్‌లో అనేకసార్లు ఆ మాట తాను విన్నాడు కాని, ముసలి సీజర్ ప్రియురాలు క్లియోపాత్రా అందచందాలు జగద్విఖ్యాతమయ్యేటంత గొప్పవి కావనీ, అవన్నీ అతిశయోక్తులనీ అనుకునేవాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ప్రపంచంలోకెల్లా గొప్పది కాదనే వారెవరన్నా ఉంటే, ఏంటనీ వాదనకేమీ, పోట్లాటకేమీ సిద్ధంగా ఉండగలడనేది పరమ సత్యం!
నిలబడి వున్న ఏంటనీని చూసి ఆమె శయ్యమీది నుంచి లేవలేదు. స్నేహపూర్వకంగా తన తెల్లని మృదువైన చేతిని అందించిందామె! ఏంటనీ మోకరించి ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నాడు. ‘నేను రాణిననే మాట గుర్తుంచుకో!’ అన్నట్లు ఆమె తన రాజరికాన్ని చవిచూసింది. ‘నేను మీ సేవకుణ్ణే కాని, వేరు కాదు!’ అనే ధోరణిలో ఏంటనీ మోకరించాడు. క్షణంలో వారు తాము ఎవరో ఒకరికొకరు తెలియజెప్పుకొన్నారు.
ఈ విధంగా క్లియోపాత్రా తన స్థానాన్ని రూఢిపరచుకున్నాక మెల్లిగా లేచింది. స్వప్నసీమలోని దివ్యకాంత నిజరూపంతో ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతూన్న విధంగా, ఆమె తల్పంమీదినుంచి వయ్యారంగా, విలాసంగా కిందికి దిగింది.
ఏంటనీ నీరైపోతున్నాడు. రోమ్‌లో ఉండగా తాను నిజంగా గుడ్డివాడు! కాకుంటే ఆమెచూపిన అనురాగాన్నీ, స్నేహాన్నీ తాను ఎందుకు గమనించలేదు? సీజర్‌కు భయపడా? కాదు.. ఈ సమయంలో క్లియోపాత్రా ఆకర్షించగలిగినవిధంగా, ఆనాడే రోమ్‌లో ఆకర్షించి వుంటే సీజర్ తనకు అడ్డంకి అని తాను నిశ్చయంగా తెలుసుకొని ఉంటే, సీజర్‌ను హత్యచేసినవారిలో మొదటివాడు తానే అయేవాడు.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు