డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఈజిప్షియన్ రాణి మూలకంగా రోమన్ చరిత్రే వేరొక విధంగా రూపొంది ఉండేది.
తాను మూర్ఖుడు కనుకనే క్లియోపాత్రా సౌందర్యాన్నీ, ఆమె ఐశ్వర్యాన్నీ అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతో కాలాన్ని వృథా చేశాడు! అయినా ఇపుడు మాత్రం మించిపోయిందేమిటి? ముసలివాడు కనుక, పడుచుదాని వలపుల వలల్లో చిక్కుకున్నాడని తాను అనుకొని, నవ్వుకొనేవాడు. కాని తనలాటి పడుచువాడు ఇప్పుడీ ప్రణయంలో తల్లక్రిందులుగా పడిపొయ్యాడు.
ఆ రాత్రి పెద్ద విందు ఏర్పాటుచేయబడింది. ఏంటనీ కాని, అతని ఉన్నతోద్యోగులు కానీ జన్మలో రుచి చూడని మధురమైన మధువుతో మత్తెక్కిపొయ్యారు. రాజభోజనం అని విన్నారే కాని, ఈనాడు వారు రుచి చూసిన భోజనంతో పోలుస్తే, ఇన్నాళ్ళూ తాము గడ్డి మేస్తున్నామని అర్థమైంది. భోజనమేమి, మధువేమి- బంగారు పళ్ళెరాల్లోనూ, పాత్రల్లోనూ ఇవ్వబడింది! దీప కాంతిలో మెరిసిపోతూన్న లోహం వారికి కన్నుల పండువగా ఉన్నది.
భోజనానంతరం నాట్య ప్రదర్శనలు జరిగినవి. వయసుకత్తెలెందరో తమ నగ్న సౌందర్యాన్ని అన్ని కోణాల నుంచీ ప్రదర్శించారు. చూపరులందరూ స్వర్గమంటే ఏమిటో అర్థం చేసుకున్నారు.
‘‘ఎంత ధనం! ఎంత బంగారం!’’ అని తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు ఏంటనీ, క్లియోపాత్రా నవ్వింది- తనకు ఇదొక లెక్కా అన్నట్లు.
‘‘ప్రభూ! ఈ ఓడమీద వున్న ధనమంతా మీది. నా కానుకగా స్వీకరించండి’’ అన్నది క్లియోపాత్రా.
‘‘ప్రభూ!’’ అని ఆమె తనకు తెలియకుండానే ఏంటనీని సంబోధించింది. తీరా ఆ మాట అన్నాక నాలిక కరచుకున్నది. తాను ఇంత తేలిగ్గా లొంగిపోతున్న సూచన చేసినందుకు బాధపడింది. అయినా ఇప్పుడు చేసేదేమిటి?
ఏంటనీ శరీరం వేడెక్కి వున్నది. ఆమె నోటి వెంట ‘‘ప్రభూ!’’ అని విన్న మరుక్షణంలో, తన కోరికల్ని దేవతలు ఇంత తేలిగ్గా తీరుస్తారని అతను తలవలేదు. ఏ విదంగా ఈమెను మెప్పించి, మభ్యపెట్టి, తన ప్రణయాన్ని సాధ్యం చేసుకోగలనా అని అతను తలబద్దలు కొట్టుకుంటున్నాడు.
‘‘రాణీ!’’ అన్నాడు ఏంటనీ దీనాతిదీనంగా, ‘‘నాకివేమీ వొద్దు.. నీ అనురాగమే కావాలి!’’
క్లియోపాత్రా అరమోడ్పు కన్నులతో ఆలోచనలలో పడింది. నిజానికి తాను ఏంటనీని వశపరచుకునేందుకే రుూ పథకాన్ని వేసింది. ఐతే, అతన్ని చుట్టుతోవలో తిప్పి, అవస్థ పెట్టి కాని లొంగకూడదనుకున్నది. కాని, తాను చూపిన అడ్డతోవలో అతను రానే వచ్చాడు. ఇప్పుడు నిరాకరించి, అతన్ని మరింత బాధపెట్టడంలో అర్థముండదు. అదీగాక అన్ని ఎంత త్వరలో తాను వశపరచుకుంటే అంత మంచిది. అప్పుడు తనకూ, తన రాజ్యానికీ ఒక నాథుడంటూ ఏర్పడి, రక్షణ ఉండగలదు.
మూర్ఛపోతూన్న విధంగా ఆమె ఏంటనీ రొమ్ములమీద వాలిపోయింది. రంగు రంగుల దీపాలు ఆమె ధరించిన ఆభరణాలమీద, విలువైన రత్న వైఢూర్యాలమీద పాపల్ని చూసుకుంటున్నవి.
ఏంటనీ ఆమెను గాఢంగా కావిలించుకున్నాడు. ‘‘రతీదేవి భూలోక సంచారానికి రావటమేగాక, నా పూర్వజన్మ సుకృతంవల్ల నాదైంది!’’ అన్నాడతను.
క్లియోపాత్రా ఏంటనీని కొంగున ముడేసుకోవటం చూసిన ఉద్యోగులు నవ్వుకున్నారు. నాయకుని అడుగుజాడల్లో నడవటం తమ విద్యుక్త ధర్మమని భావించి, వారు తమకు వచ్చిన బానిస పిల్లల్ని ఎన్నుకొన్నారు. ఈ ఈజిప్షియన్‌లు ఎంత అందమైనవారో, ఆరోగ్యంగా, బలంగా ఉంటారో, కామకేళిలో ఎంత నిపుణులో, రసికురాండ్రో వారందరికీ అర్థమైపోయింది.. ఆ వెనె్నల రాత్రిలో, రాజహంసను బోలిన ఓడ భూతల స్వర్గమైంది. ఆనంద నిలయమైంది.
క్లియోపాత్రా ఇలా భావించింది:
తన మొదటి ప్రియుడు సీజర్‌కన్నా, ఈ రెండో ప్రియుడు ఏంటనీ సుమారొక ఇరవై ఏళ్ళు చిన్న. ఇతను బలాడ్యుడు. ఇతనితో తాను మరికొంతకాలంపాటు- బహుశా జీవితాంతంవరకూనేమో ఎవరు చెప్పగలరు? సుఖపడొచ్చు, ఈజిప్షియన్ ధనరాశులు కొంత తరిగినా, రుూ ప్రయాణం విజయవంతమైంది. రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ కూడా గెలుపు తనదే!

***
వారం రోజులవరకూ ఏంటనీ ఓడ విడిచిపోలేదు. ఈ జీవితమే శాశ్వతమైతే ఎంత బాగుండునోనని అతను అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళూ ప్రపంచంలో తనకేమీ కావాలో తెలియక, అనేక పరిశోధనలు జరిపాడు కాని, ఎన్నడూ ఇంత తృప్తిని పొందలేదు. ఇంతకన్నా సుఖపడే అవకాశాలున్నవన్నా తనకు అనవసరం.
క్లియోపాత్రా రోమ్ నుంచి తిరిగి వెళ్ళాక ఏం జరిగిందో అంతా పూసగుచ్చినట్టు ఏంటనీ చెప్పేశాడు. రహస్యాలు- ఎంత గొప్పవైనా సరే, క్లియోపాత్రా దగ్గర దాచలేని అశక్తతకు అతను గురయ్యాడు. ఆమె వింటూ కూర్చున్నది. దేనికీ అవునని కానీ, కాదని కానీ అనలేదు. అంతా మనసులోనే ఆలోచించుకుంటోంది. మనుషుల చేత వాగించి, దాని సారాన్ని గ్రహించే విద్యలో ఆమె ప్రవీణురాలు.
ఇప్పుడు ఏంటనీ వయసు 42 సంవత్సరాలు. క్లియోపాత్రా వయసు 28 సంవత్సరాలు. ఏంటనీ మంచి వయసులో ఉన్నాడు. క్లియోపాత్రా అతనికి తగినట్లే మృదుత్వంతోపాటు, బలాతిశయమున్న మదవతి. వీరిద్దరికీ తగిన రుూడు జోడు విధి నిర్ణయించిందంటే, ఒక్కో సమయంలో ఆదర్శ ప్రణయారాధకుల్ని ఎన్నుకోవటంలో విధి న్యాయాన్ని కూడా గొప్పగా అమలు జరుపుతుందనే అనుకోవలసి వుంటుంది.
ప్రపంచంలోని అధికారం, సౌందర్యంతో మిళితమైనదని వీరిని చూసిన వారనుకున్నారు. ‘ఇలాంటిది అరుదుగా జరుగుతుంది. బంగారానికి తావి అబ్బింది’’ అని ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఏంటనీ దృష్టిలో ఇపుడు రోమ్ కానీ, రాజకీయాలు కానీ, పర్షియన్ దండయాత్రకానీ లేవు. అతనికి క్లియోపాత్రాయే ప్రపంచం! అందునా తాను సీజర్ ప్రియురాల్ని, తన ప్రియురాలుగా చేసుకున్నాడు. కనుక తాను కూడా సీజరంతా మనిషిని అనుకుంటున్నాడు. సీజర్ ముసలితనాన్ని కూడా మరిచిపోయి అమితోత్సాహంతో ఉండేవాడంటే, బహుశా క్లియోపాత్రా వేడి కౌగిలి మహత్యమే అయివుండాలనే అభిప్రాయంలో ఉన్నాడు.
ఇక క్లియోపాత్రా కూడా, తనకు జీవితంలో ఏర్పడిన లోటు- తను అనాధగా బతకకుండా తనే్నలుకునే ఒక నాథుడు, తన ఏకైక పుత్రునికొక తండ్రి, తన రాజ్యానికో రక్షణ దొరికినందుకు ఎంతో సంతోషించింది. తాను నిజంగా హృదయపూర్వకంగా, సరిగ్గా పధ్నాలుగేళ్ళ క్రితం ప్రేమించిన మనిషే తనకు లభ్యమయ్యాడు. పధ్నాలుగేళ్ళు తన హృదయమందిరంలో పూజించిన రూపమది! ఇన్నాళ్ళ తరువాత కాని తనకు చిక్కలేదు. ఆ కసికొద్దీ పధ్నాలుగేళ్ళ అనుభవాన్నీ ఇప్పుడే, ఇక్కడే అనుభవించాలని ఆమె పట్టుదల! ఇంత రసికతను వర్షించే రుూ రాచరమణి మనసా, వాచా తనదైనందున తన అదృష్టానికి ఏంటనీ కళ్ళకు మైకం కమ్మింది.
కనుకనే క్లియోపాత్రాను పిలిపించింది ఎందుకో కూడా అతను మరిచిపొయ్యాడు. కాస్పియస్‌కు ఆమె ఎందుకు సహాయపడిందో అతను అడగలేదు. తీరా క్లియోపాత్రా పదిరోజుల తరువాత, తాను అలెగ్జాండ్రియాకు వెళ్తున్నానంటే ఏంటనీ కంట తడిపెట్టాడు.
‘‘ఇంత మాత్రానికే ఏడుస్తారా?’’ అన్నది క్లియోపాత్రా హేళనగా. ఆమెకు తెలుసు- తాను ఏంటనీని ఆకాశపుటంచులదాకా లాక్కువెళ్ళగలిగానని. తాను లేకుండా ఇతను బతకలేడు. సౌందర్యానికి ప్రపంచంలో లోబడనిదేదీ లేదని ఆమెకు గర్వం.
‘‘రాణీ! నాకీ జీవితమంటేనే వెగటేసింది. ఎప్పుడూ నీ సాన్నిధ్యంలోనే ఉండగోరుతున్నాను’’అన్నాడు ఏంటనీ.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు