డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రయాణంలోనే సైనికులు, నాయకులూ అలసిపొయ్యారు.
వారు యుద్ధమైతే చేస్తారు కానీ- దేశం కాని దేశంలో అసలు దారే తెలియకుండా, బరువైన ఆయుధాల్నీ, ఆహార పదార్థాలనూ, నీటినీ కూడా మోసుకుంటూ రోజూ మైళ్ళు మైళ్ళు నడవటమంటే మాటలు కాదు. ఈ ప్రయాణంతోనే అలసి సొలసి, విసుగుజెందిన వీరు, తీరా యుద్ధరంగంలో ఏం పోరాడుతారనేది పెద్ద ప్రశ్నయింది.
ఏంటనీ ఓర్పు కూడా నశించింది. సైనికులు ముందుకు సాగేందుకు నిరాకరిస్తున్నారు. పటంలో ఏయే దేశాలు తనకు కావాలో గుర్తులు వేసుకోవటమంటే తేలిగ్గా లేదిది. అదీ గాక, ఆర్మీనియా రాజు తనకు తోడుగా పంపిన వారిక్కూడా అసలు దారంటూ తెలుసా అనే అనుమానం కలిగింది. ఒకవేళ తననూ, తన సైన్యాలనూ ఏ కొండల్లోనో పట్టించి, అక్కడ హతమారుస్తే తనకు దిక్కేమిటి? ఐదు నెలలపాటు సాగించిన రుూ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సగమైపొయ్యారు. తను బయలుదేరిన వేళ మంచిది కాదు. ముందు వెనుక ఆలోచించకుండా వెనక్కు తిరిగాడు ఏంటనీ!
తిరుగు ప్రయాణం మరింత బాధావసమైంది. ప్రకృతి బాధలకు తట్టుకొనే శక్తి కూడా నశిస్తోంది. అశ్విక దళం చాలా నష్టపడింది. వెంట తీసుకొచ్చిన యుద్ధ సామగ్రిని మోసుకెళ్ళేందుకు కూడా తగిన సిబ్బంది లేనందువల్ల, చాలావరకు నాశనం చేయవలసి వచ్చింది. ప్రాణాలతో ఆర్మీనియాలోని ఓడరేవుకు జేరటమే విషమ సమస్యయింది.
శీతాకాలంలో వారు కొండ ప్రదేశాలలో చిక్కుకున్నారు. ఆహార పదార్థాలు అడుగంటినవి. చివరకు తాగేందుకు మంచినీరు కూడా కరువైంది. ఆహారలేమివల్ల అనారోగ్యం ఏర్పడి, కొంతమంది సైనికులు చచ్చారు.
ఏంటనీ ఆశలన్నీ అలెగ్జాండ్రియా మీదనే ఉన్నవి. సుఖాన వున్న ప్రాణాన్ని రుూ నరకకూపలోకి తోసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. ఈ దేశాలలో నిజంగా తనకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోవటమే కష్టం. యుద్ధం జరగకపోయినా కొన్ని వేలమంది సైనికులు చచ్చారు. ఎంతో సామగ్రిని నష్టపోవటం జరిగింది.
నానా అవస్థలుపడి, ఏంటనీ ఓడరేవుకు జేరాడు. తనతోపాటు సజీవులుగా వున్న సైనికుల్ని చూసి కంటతడి పెట్టాడు. ఇంకా నయం- ఆర్మీనియా రాజువల్ల లాభమంటూ జరగలేదు. ఇక్కడ వదిలేసి వెళ్లిన ఓడలు మాత్రం చెక్కుచెదరనందుకు వేయిదేవుళ్ళకు మొక్కుకున్నాడు. బోనులో పడబోయి, అంతలోనే తెలుసుకొని, తెలివిగా బతికి బైటపడ్డాడు. తన అదృష్టం బాగాలేదు.. ఏం చేయగలడు?
చచ్చి చెడి ఈజిప్టువైపు ప్రయాణాన్ని సాగించాడు. యుద్ధమే జరగలేదు, ఐనప్పటికీ తనకిది ఓటమే! సీజర్ స్వప్నం, స్వప్నంగా ఉంటే ఎంత బాగుండేది! అది అనుభవంలోకి వస్తే ఎంత బాధో తెలిసొచ్చింది. ఈ ఓటమితో సిగ్గుపడి ఛస్తూ, క్లియోపాత్రా దగ్గర మీసాలు మెలేసి బయలుదేరిన తనకు, ఇప్పుడామెను చూసేందుకు మొహం చెల్లటంలేదు. ఈజిప్టు కోశాగారాల్లోని ధనాన్ని తాను వృధాగా పాడుచేశాడు. అందువల్ల తానూ నష్టపడ్డాడు. తానే పొడిచేస్తాడని భార్య అనుకున్నది. ఇప్పుడు ప్రేతకళతో వేలాడే మొహంతో ఆమె ఎదుటికివెళ్తే, ఆమె తననెంత నీచంగా చూస్తుందో!! తన అసమర్థతకు నవ్వి, మొహాన ఉమ్మివేసినా వేస్తుంది.. ఇంతకూ విధి అనుకూలించలేదని సరిపెట్టుకున్నాడతను!
ఇక రోమన్ ప్రభుత్వానిక్కూడా తాను సంజాయిషీ చెప్పుకోవాలి. క్లియోపాత్రాకూ, తనకూ మధ్య ప్రణయబంధం ఉన్నది కనుక తననామె అర్థం చేసుకొని క్షమించగలదు, తాను బతికి వచ్చినందుకన్నా సంతోషపడుతుంది.
కానీ, రోమ్ తనను ఏమంటుంది? ఇప్పటి తన ప్రవర్తనకే మండిపోతూన్నది. తాను అనవసరంగా ఈ దండయాత్ర చేసి, రోమ్‌ను నష్టపెట్టినట్లుగానూ, తాను అసమర్థుడని రుజువు చేసుకున్నట్లుగానూ అక్కడ ఆక్టోవియన్ ప్రచారం చేస్తాడు. తనను తాను సమర్థించుకోవటం కూడా కుదరదు. బహుశా రోమ్‌నించి తాఖీదు రావచ్చు. అయిన నిర్వాకం చాలు, ఇక తిరిగి రమ్మని కబురు రావచ్చు. ఈ దుర్విధి తనను అపాయాల పాలు చేస్తూన్నది కదానని అతను విచారపడ్డాడు.
ఇదంతా ఆలోచిస్తూంటే మతిపోతూన్నది. అలెగ్జాండ్రియా రాజభవనంలో సాధ్యమైనన్నాళ్లూ సకల సుఖాలూ పొందవచ్చు. మిగతా ప్రపంచం ఎలా ఛస్తే తనకేమిటి?
ఈ తలపులతో అతను అలెగ్జాండ్రియా వైపు ఆశగా చూస్తూ, ప్రయాణ వేగాన్ని హెచ్చించాడు.
***
ఓటమితో ఏంటనీ తిరిగి వస్తున్నాడనే వార్తలు క్లియోపాత్రకు జేరినవి. ఆమెలో అనేక చిత్ర విచిత్ర భావాలు చెలరేగినవి.
యోధుడుగా తనకు గొప్ప సామ్రాజ్యాన్ని సంపాయించ గలడనుకున్నందుకు ఏంటనీ నిరాశ కలిగించాడు. ధననష్టం, జననష్టం కలిగించాడు. పైపెచ్చు దాదాపు ఒక సంవత్సరంపాటు ఏమీ సాధించలేక కాలాన్ని వృధా చేశాడు. కీర్తి లేకుంటే మానె, అపకీర్తిని మూటగట్టుకొని ఈజిప్టు తీరాలను జేరుతున్నాడు. ఏంటనీ కామరంగంలో ఎంత గొప్ప యోధుడో, కదనరంగంలో అంత గొప్పవాడుగా మాత్రం కనిపించలేదు.
ఐతే, రాజ్యకాంక్ష సంగతి కొంచెం సేపు మరిచిపోయి, తన దేశం, తన ప్రజలు, తన సంతానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఓటమిని పరిశీలించినట్లయితే, ఏంటనీ పర్షియాను జయించినట్లయితే, అది తనకే కలుస్తుందో లేక రోమ్‌కే చెందుతుందో ఎవరికీ తెలియదు. పర్షియాకన్నా ఏంటనీ బలవంతుడు కనుక, దాన్ని జయించి ఉండేవాడు. ఏంటనీ కన్నా రోమ్ బలవత్తరమైనది కనుక, మెదలకుండా పర్షియాను రోమ్ దిగమింగేది. అపుడు రోమ్ మరింత బలవత్తరమై- తననూ, తన రాజ్యాన్నీ మరో మెట్టుకింద చూపులో ఉంచేది. అసలు ఏంటనీ విజయం తన విజయం అయేది కాదేమో? ఎందుకంటే, ఈ విజయోత్సవాలు రోమ్‌లో జరిగేవి. అంటే, ఏంటనీ తిరిగి రోమ్ జేరేవాడు. అక్కడ అతను పొందే గౌరానికి మూర్ఛపోయి తిరిగి అతను కేవలం రోమన్‌గా మారిపోయి, మహా ఇల్లాలైన తన భార్యతో ఉండిపొయ్యేవాడు. తిరిగి అన్ని ఇటు రప్పించటం బ్రహ్మప్రళయమయ్యేది. తనను మరిచిపోవటంవల్ల తాను మళ్లీ అనాథగా మారి, ఒంటరి బతుకుతో చితికిపొయ్యేది!
ఏంటనీ పర్షియన్ విజయాన్ని సాధించినట్లయితే, అతని అంతస్తు పెరిగిపొయ్యేది. అప్పుడు తానొక లెక్కలోకి రాదు. ఇప్పుడు ఓడి, పారిపోయి వస్తున్నాడు కనక, భయంతో తనకన్నా ఎంతో తక్కువగా బతక్క తప్పదు. ఈ విధంగా ఏంటనీ మీద తన పలుకుబడి పెరుగుతుంది. ఏంటనీ విజయుడైతే ముఖ్యంగా తనకూ, తన దేశానికీ రోమ్ మరింత భయంకరంగా కనిపిస్తూ వుంటుంది. ఇప్పుడు ఆ బెడద తప్పింది!
ప్రముఖుడైన ఒక రోమన్‌ను తాను వశపరచుకున్నది కనుక, రోమ్‌మీద యుద్ధమే వస్తే, దాన్ని పోరాడేందుకు ఏంటనీ సిద్ధపడే ఉండాలి. ఎందుకంటే ఈజిప్టు మీద మమకారంతో కాకున్నా, కనీసం రోమ్‌లోని తన స్థానం అనుమానాస్పదమైననాడు, దాన్ని స్థిరరపరచుకోవలసిన బాధ్యత అతని నెత్తిమీద పడక తప్పదు. అప్పుడు రోమ్‌తో వైరం తనకు కాదు ఏంటనీకి. కనుక పూర్వంకన్నా తన స్థానమిప్పుడు బలపడినందుకు ఆమె ఎంతో సంతోషపడింది. ఏంటనీ రాకకోసం ఎదురుచూస్తున్నది.
కాని, ఏంటనీ మనసు మార్చుకున్నాడు. ఈ వెధవ మొహంతో క్లియోపాత్రాను దర్శించదలచుకోలేదు. అందుకని తన సేవలతో అతను సరాసరి సిరియా జేరాడు. అక్కణ్ణుంచి సహాయ సహకారాల్ని అర్థిస్తూ, క్లియోపాత్రాకు మనిషిమీద మనిషిని పంపి, ప్రాధేయపడ్డాడు.
క్లియోపాత్రా నవ్వుకున్నది. ఏంటనీ తనకు పూర్తిగా బానిస. తనంటే అనురాగమే కాదు భయం కూడా వున్నది. తన సౌందర్యంతోనూ, మేధస్సుతోనూ ఇతన్ని జయించి బందీగా చేసుకోకలిగినందుకామె గర్వపడింది. కొన్ని ఓడలు సిరియా బయలుదేరినవి.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు