డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నోర్ముయ్!’’ అన్నాడొక సభ్యుడు. ‘‘ఏంటనీని దేశద్రోహి అన్నందుకు ది సర్వాధికార వర్గ సభ కానట్లయితే, నీ నాలుక కోసి పారేసేవాణ్ని. ఆహా! ఏం దేశభక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడండీ! సీజర్‌ను హత్య చేసిన వాళ్లమీద పగ తీర్చుకున్న పితృభక్తి పరాయణుడు! ఏంటనీయే లేనట్లయితే, ఈపాటికి నీవు నీ పెంపుడు తండ్రిని కలుసుకుని ఉండేవాడివి!’’
ఆక్టోవియన్ పక్షం వారు ములుకుల్లాటి ఈ మాటల్ని సహించలేక చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నారు. ఇందువల్ల జరిగేదేమిటో ఆక్టోవియన్‌కు తెలుసు. తాను ఎటూ ఏంటనీతో విరోధాన్ని తెచ్చుకొని, అతన్ని సర్వనాశనం చేయక తప్పదు. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఆ ఉరితాడు తన గొంతుకే బిగుసుకుంటుంది.
ఐతే, తిరిగి ఈ అంతర్యుద్ధాన్ని ప్రారంభించేందుకు తగినన్ని కారణాలుండాలి. ముఖ్యంగా తనకు ప్రజల సానుభూతి, సహకారాలుండాలి. దీన్ని సాధించాలంటే చర్చల ద్వారానే నచ్చచెప్పుకోవాలి. అందుకని, ఆక్టోవియన్ తన పక్షీయుల్ని తగ్గమని సౌంజ్ఞ చేశాడు.
‘‘ఏంటనీ రోమ్ పక్షానే ఉన్నన్నాళ్లు అతని మీద మేము ఈగను కూడా వాలనీయలేదు.’’ అన్నాడు ఆక్టోవియన్. ‘‘ఈనాటి పరిస్థితుల్ని బట్టి అతను ఈజిప్టుతో కలిసి, రోమ్ మీద యుద్ధం చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల జరిగిన సంఘటనల్ని వివరించాను కదా! రోమన్ భూఖండాలను ఈజిప్టుకు కలపటమేమిటి? యుద్ధం చేసిందేమో.’’
మధ్యలోనే అందుకుని ‘‘నీవు!... జన్మలో ఒక్క యుద్ధమన్నా చేసి ఎరుగని నీవు... యుద్ధాన్ని గూర్చి ఎందుకు మాట్లాడుతావు? ఈ చర్చల్లో అర్థం లేదు. ఏంటనీ నుంచి జవాబు వచ్చేదాకా ఏం జరిగేందుకూ వీల్లేదు. అసలు ఇంతకుముందు రోమన్ సైన్యాలను పెంచింది కూడా ఏంటనీని ఎదుర్కొనే దురుద్దేశంతోనే మేమందరం అనుకోవలసి వస్తోంది’’ అన్నాడు ఏంటనీ ప్రాణ స్నేహితుడు.
‘‘స్వదేశ రక్షణ కోసమని లోగడే చెప్పి, మీ అందరి అంగీకారాన్ని పొంది ఉన్నాను కదా!’’ అన్నాడు ఆక్టోవియన్.
‘‘ఏమైనా ఈ స్థితిలో ఏంటనీ మీద యుద్ధాన్ని ప్రకటించినట్లయితే, మా సహకారం ఉండదని మాత్రం గుర్తుంచుకో. యుద్ధమనేది తప్పనిసరైన పక్షంలో, దాన్ని ప్రకటించటం ఏంటనీ వంతయ్యే వరకూ ఎలాటి ఏర్పాట్లనూ మేము సహించం.... పోతే, ఏంటనీ సామాజికంగా కూడా పెద్ద కీడేమీ చేయలేదు. అతను ఆక్టోవియాకు విడాకులివ్వలేదు. అతని సంతానాన్నీ, ఆస్తిపాస్తుల్నీ ఆమె చూసుకుంటోంది. ప్రశాంతమైన వాతావరణంలో నీ కొత్త దృక్పథంతో దుమారాన్ని లేపి, సర్వనాశనం చేసుకొని, చివరకు దుఃఖపడతావు. ఏంటనీలాటి వీరుణ్ని నీలాటి పిరకివాడు ఎదుర్కొనే దుస్థితికి అవకాశం ఇవ్వము. ఇక మేమేం మాట్లాడదలుచుకోలేదు.’’
ఈ మాటలతో హఠాత్తుగా సమావేశం ముగిసింది. ఏంటనీ పక్షం వారు తమ నిరసనను సూచిస్తూ బైటికి వచ్చేశారు.
ఎటు పోయి ఎటు వస్తుందో, అవసరమైతే ఏంటనీ పక్షం వారిని సెనేట్‌లోనే హత్య చేద్దామనే ఉద్దేశ్యంతో ఆక్టోవియన్ పక్ష సభ్యులు బాకుల్ని రహస్యంగా ఉంచారు. ఐతే, ఆక్టోవియన్ తొందరపడవద్దని హెచ్చరించకపోయినట్లయితే, రోమన్ సామ్రాజ్య సర్వాధికారాలు ఆనాడే మారి ఉండేవి.
తన పాచికలు పారనందుకు ఆక్టోవియన్ నిర్ఘాంతపోయాడు. ఏంటనీ పట్ల ప్రజలకింకా గౌరవం ఉన్నది. అతని పలుకుబడిని తగ్గిస్తేనే కానీ తానేమీ చేయలేను. అసలు అంతవరకూ తన స్థానానికి ప్రమాదం తప్పదు.
ఐతే, తాను చేసిన ఈ ప్రయత్నం బొత్తిగా వృధా అవ్వదు. ఎందుకంటే, తాను ఏంటనీని, క్లియోపాత్రానూ నానా దుర్భాషలాడాడు. వాయువేగ మనోవేగాల్లో ఈ సంఘటన ఈజిప్టు చేరుతుంది. ఏంటనీ స్వదేశం మీద కత్తి దూసేందుకు సాహసించకపోవచ్చు. తన మాటల్ని సహించవచ్చు.
కానీ, క్లియోపాత్రా ఊరుకుండే వ్యక్తి కాదు. ఆమెకు పౌరుషమొస్తుంది. స్వతహాగా శక్తి సామర్థ్యాలనేవి లేకపోయినా, ఆమెకు ఏంటనీ అండదండలున్నవి. సీజర్‌కు సాక్షాత్తూ కొడుకైన సీజర్ టాలమీని రోమన్ సామ్రాజ్యాధిపతిని చేయాలనే సంకల్పం ఆమెలో తీవ్రంగా పనిచేస్తూంటుంది. ఆమె కూడా తనవలెనే సమయం కోసం వేచి ఉండొచ్చు.
ఇప్పుడు తాను బహిరంగంగా ఆమెను అవమానించాడు. ఈ కారణాలు చాలు - ఆమె తెలివిగా ఏంటనీని రెచ్చగొట్టేందుకు.
ఆమె తెలివితేటలకు ఆ శక్తి ఉన్నది. బ్రహ్మిని తిమ్మిని చేయగల సర్వసమర్థురాలమె. అప్పుడు ఏంటనీయే రోమ్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ శుభ సమయం కోసం తాను ఎదురుచూడాలి. అప్పుడు ఏంటనీ దేశద్రోహి అని తాను అననవసరం లేదు, ప్రజలే అంటారు. తన రొట్టె విరిగి నేతిలో పడుతుంది. తన కోసం తన పక్షాన, రోమ్ పతాకం కింద యుద్ధం చేసి ఏంటనీని క్లియోపాత్రానూ సర్వనాశనం చేసినట్లయితే...
ఈ బ్రహ్మాండమైన స్వప్నాన్ని కంటూ ఆక్టోవియన్ ఆనందించసాగారు.
24
రోమన్ సర్యాధికార సమావేశంలో సరిగ్గా ఏం జరిగిందో పొల్లుపోకుండా ఏంటనీ, క్లియోపాత్రాలకు చారులు నివేదించారు.
వింటూన్నంత సేపూ క్లియోపాత్రా రక్తం పొంగిపోయింది. ఆక్టోవియన్ అన్న అవమానకరమైన మాటలన్నీ ఆమెను వొళ్లు తెలియనంత కోపంలో ముంచెత్తినవి. కళ్లు చింత నిప్పులైనవి. మధ్యలో ఈ దారుణమైన మాటల్ని చెప్పినందుకు క్లియోపాత్రా తనను చంపుతుందని చారుడు భయపడ్డాడు. ఏంటనీ ఇది గ్రహించి, చారునికి అభయమిచ్చాడు.
చిత్రం ఏంటనీ తనంత చలించకపోవటాన్ని క్లియోపాత్రా గ్రహించింది. అసలు అతను ఎవరి కథో వింటూన్నట్లు, ఎవరి అవమానమో అన్నట్లుగా కూర్చున్నారు. బహుశా అతనా మాటల అర్థాన్ని తనవలె, సరిగ్గా గ్రహించలేదేమో? వెధవ తాగుడు నిషాలో అసలతను ఈ ప్రపంచంలోనే లేడేమో?
చారుడు అంతా ముగించి, త్వరత్వరగా వెళ్లిపోయాడు.
ఏంటనీ శిలా ప్రతిమవలె అలాగే కూర్చున్నాడు. వీరుడుగా పేరొందిన ఈ పురుషుని శరీరంలోని వేడిరక్తం చల్లారిందా అనుకున్నది క్లియోపాత్రా, కనీసం అతను తనలోని అనుభూతుల్నీ, తన ముఖ కళను కూడా గమనించటం లేదు! ఎంతో అసహ్యంతో ఆమె నేల మీద గట్టిగా తన్ని బరువెక్కిన శరీరాన్ని ఈడ్చుకుంటూ హాలులో నుంచి వెళ్లిపోయింది.
ఏంటనీ ఆలోచనలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నవి. తాను తప్పుచేశానా అని చాలాసేపు తర్కించుకున్నాడు. చేసిన తప్పులకు తనకు తానుగా, సమాధానాలు చెప్పుకోగలుగుతున్నాడు. కానీ, రేపు సర్వాధికార వర్గ సమావేశంలో ఇవి అతుకుతవా అనే సందేహం అతనిక్కూడా కలుగుతోంది. దాంతో ఏదో నేరం చేసినవాడి తాలూకా కల్మషాత్మ పెట్టే బాధకు కూడా గురవుతున్నాడు.
ఆవేశంలో, ఉద్రేకంలో తాను కొన్ని చెడుపనులు చేసి ఉండొచ్చు. ఐతే, దానికి తన నుంచి జవాబు కోరకుండానే, ఆక్టోవియన్ తన ఇష్టానుసారంగా, తనకు అనుకూలంగా ఉండేట్లు ఏంటనీని చిత్రించేందుకు సాహసించాడంటే, బహుశా అతనికి కొంత బలగం ఉండి ఉండాలి. చివరకు బంధుత్వాన్ని కూడా చూడకుండా తనను దేశద్రోహిగా పేర్కొన్నాడంటే, సాహసం మాత్రమే కాదు, కుతంత్రం కూడా ఇందులో ఇమిడి ఉండాలి.
కానీ, ఆక్టోవియన్ వయస్సు 29 సంవత్సరాలు మాత్రమే. అతనికి ప్రపంచ జ్ఞానమే సరిగ్గా ఉన్నదని తోచదు. అనుభవ రహితంగా తొందరపడి ఉంటాడని అనుకునే అవకాశాలు కూడా ఉన్నవి. కానీ, అతను మనస్సులో ఏమనుకున్నప్పటికీ, తనను అవమానించటం మాత్రం జరిగింది!
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు