డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె దృష్టి ఈ ప్రపంచమంత విశాలమైనది. ప్రపంచాన్నంతనూ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె మనసు ఉవ్విళ్లూరుతున్నది.
అయితే ఈ సేనలు ఎందుకో ఎవరికీ తెలియడంలేదు. చాలామంది- బహుశా పర్షియన్ దండయాత్రకొరకేనని అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలు ఏంటనీకి తెలిసి అతను చూసీ చూడనట్లు ఊరుకున్నాడు. ఏనాటికైనా క్లియోపాత్రానే స్వయంగా తన దగ్గరకు వచ్చి తీరాలి. అపుడే ఆమె అన్ని విషయాలు చర్చిస్తుంది. తన అండలేకుండా ఆమె రోమ్‌మీద కత్తిదూయడం మాత్రం అసంభవం. ఆమె పైఎత్తున వుండి తనలాంటి వాడిచేత అసంభవమనుకున్న కార్యాలను చేయించి విజయాన్ని చేపట్టగలుగుతుంది. అందుకని, తాను తొందరపడవలసిన అవసరం ఏమీ లేదని ఏంటనీ నిర్ణయించుకున్నాడు.
అతను తనంతట తానే వచ్చి తనతో సమాధానపడతాడనే ఆశలు క్లియోపాత్రాలో అడుగంటింది. తనకు దూరమైపోతున్నాడనే కొత్త భయం కూడా ఆమెను వేధించసాగింది. ఒకవేళ అతను రోమ్ వెళ్లిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తిరిగి అతన్ని ఇటువైపు రప్పించేందుకు బ్రహ్మరుద్రులు దిగిరావాలి.
తాను సౌందర్యంతోనూ, ధనరాశులతోనూ, ప్రణయ కళతోనూ అతన్ని ఆకర్షించగలిగితే- అక్కడ తన సవతి ఆక్టోవియా- ప్రశాంతమైన వాతావరణంతోనూ భర్తపట్ల చూపే భక్తితోనూ, పిల్లల పెంపకంలోనూ, ప్రవర్తనలోనూ, చూపే శ్రద్ధలోనూ ఏంటనీని కట్టిపారేయగలదు. ఈ సుడిగుండంలో పడకముందే తాను మేల్కొని జాగ్రత్తపడటం అవసరం. రాజకీయ వాతావరణాన్ని గూర్చి తరువాత ఆలోచించవచ్చు. వ్యక్తిగత సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వీటిని పరిష్కరించుకోకుంటే, ఏంటనీ తన ప్రేమ పాశంలోంచి బయటపడకముందే, అతన్ని తిరిగి ఆ మత్తులోకి తీసుకెళ్లకుంటే, తన జీవితానికి ఇదే అంతిమగీతం అవగలదు. కనుక ఏంటనీని తన వలయంలోకి లాక్కునేందుకు ఆమె నిశ్చయించుకుంది.
ఆమెకు తెలుసు, ఇప్పటికైనా ఏంటనీ రోమ్ వెళ్తే తిరిగి అగ్రస్థానం పొందగలడు. తాను వివరించినట్లుగా ఇంకా అంతా మించిపోలేదు. ఆ విషమ పరిస్థితే కనుక సంభవిస్తే ఏంటనీయే రోమన్ ప్రభుత్వం తరఫున ఈజిప్టును ఆక్రమించుకునేందుకు వచ్చినా రావచ్చు.
కనుక ఇప్పటికే తాను చాలా ఆలస్యం చేసిందని అర్థమైంది. ఎలాగో అతనితో రాజీపడి ముందు తన దాంపత్యాన్ని సరిదిద్దుకోవాలి. అపుడు ఆ అనురాగంతోనే తానేమైనా సాధించగలుగుతుంది. చెడులో అమృతాన్ని తాగించడం కూడా కష్టమే. కానీ మంచిలో విషాన్నైనా సరే తాగించవచ్చునని జీవిత సత్యం ఆమెకు తెలియకపోలేదు.
అతన్ని తను పిలుస్తున్నట్లు కబురు చేసే పొరపాటు ఆమె చేయలేదు. ప్రాచ్య దేశాల పరిపాలకురాలిగా మహారాణిగా వెళ్లి మేరుపర్వతమే ఒడిలో పడ్డట్టుగా ఏంటనీని మభ్యపెట్టవలసిన తన బాధ్యతను ఆమె గుర్తించింది.
అద్దం ముందు కూర్చున్నపుడు తన సౌందర్యాన్ని గూర్చి తానే అచ్చెరువొందింది. నలుగురు బిడ్డలకు తల్లైనా జవసత్వాలు తగ్గలేదు. కాలచక్రం తనమీదుగా వెళ్లినా ఆ చారలే ఇపుడు కనిపించడంలేదు. యవ్వనం అనుభవిస్తున్న కొద్దీ తరుగుతుందంటారు. తనలో మాత్రం పెరుగుతోందని నమ్మేందుకు చాలా కారణాలున్నాయి.
ఏంటనీ కూడా కొన్ని వారాలుగా వియోగాన్ని అనుభవించే వున్నాడు. తాను అలంకరించుకొని భూలోక రంభలాగు అతని ఎదుట నిలుస్తే, అతను కరిగిపోక తప్పదు. కిందటిసారి మూడేళ్ళ వియోగానంతరం సిరియాలో తనను కలుసుకున్నపుడు, అతను ఎంత మధనపడ్డాడో, తన పొందుకోసం ఎంత తహతహలాడిపొయ్యాడో ఆమెకు గుర్తొచ్చింది. ఈ మగాళ్ళు అందమైన అమ్మాయి ఎదుట, నిప్పు వేడి తగిలిన నవనీతంవలె అయిపోతారు! మన్మథుడు బతికి ఉన్నంతకాలం తన ఆటలు సాగగలవు. వాడు రుూ ప్రపంచం ఉన్నంతకాలమూ చావదు. ఇక తనకు అడ్డేమిటి?
సర్వాలంకార భూషిత అయాక, తన అందానికి తానే గర్వపడిందామె. కొత్తగా ప్రణయ రంగంలోకి దూకి, విజయాన్ని సాధించేందుకు తన రుూ రూపమే చాలునని తేల్చుకున్నది. తాను వొస్తూన్నట్లుగా ఏంటనీకి కబురు పంపింది.
ఇలా జరుగుతుందని ఏంటనీ ఊహించాడు. కాని, ఇంత త్వరలోనని మాత్రం అనుకోలేదు. ఆమె వచ్చి, తనను రోమ్ మీద యుద్ధాన్ని ప్రకటించమని ప్రాధేయపడుతుందనుకొన్నాడతను. మళ్లీ రుూమెను వొదిలించుకోవటం యాతనవుతుందేమోనని భయపడ్డాడు. తన మనశ్శాంతికి భంగం వాటిల్లజేస్తుందేమోనని అనుమానించాడు. ఐనా, ఇలాటి ఊహలవల్ల అయేదేమిటి?.. ఈసారి క్లియోపాత్రా తన ధోరణి మార్చుకోకపోతే, ఆమెను శాశ్వతంగా వొదిలేసి, స్వదేశానికి పారిపోవచ్చును కదా! తన వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు ఇలాంటి సదవకాశాన్ని ఆమె కలిగిస్తే అదే పదివేలు.. ఈ విధంగా ఆలోచించి, కఠినత్వంతో హృదయాన్ని బిరుసెక్కించుకొని ఆమె రాకకు ఏంటనీ అనుమతించాడు.
క్లియోపాత్రా ప్రవేశిస్తున్న పాదాల సవ్వడి విని ఏంటనీ తల ఎత్తి చూశాడు. శాపగ్రస్థ అయిన దేవకన్యవలె, దేదీప్యమానంగా వెలుగుల్ని విరజిమ్ముతున్న ముఖారవిందంతో, నిండు సరస్సులోని నీటిని పిల్లతెమ్మరలు కదిపినప్పుడు మెత్తగా, ఉవ్వెత్తున లేచే అలలవలె వయ్యారంగా, నాజూకుగా నడిచి వస్తున్నదామె.
తానెరిగిన యువతి ఈమె కాదు; ఏళ్ళ తరబడి కాపరం చేసిన క్లియోపాత్రా కాదీమె.. ఆనాడు, తాను చివరిసారి కలహించిన నాటి ఆమె ప్రతిరూపమే అతని కనుసన్నల్లో మెదులుతోంది. ఆ రోజు ఆమె కాళికా స్వరూపిణి అయింది; తనను పిచ్చివాణ్ణి చేసింది. వెంట్రుకవాసిలో తప్పుకున్నాడు కానీ, లేనట్లయితే మానవుడైన తాను దానవుడయ్యేవాడు.. ఇక ఈనాడు మధురమూర్తి. తప్ఫఃలాన్ని ప్రసాదించేందుకు దివినుండి భువికి దిగిన దేవతా స్వరూపిణీమె. ఈమె నీ స్థితిలో చూసి భూలోకానుభవాన్ని అంచనాలు వేయటమే జరుగుతే, స్వర్గమనే దానికి స్థానం ఉండదు.
ఏంటనీ కళ్ళ ఎదుట మెరుపు మెరిసింది. దాంతో అతను స్వప్నం నుంచి బైటపడినట్లయింది. క్లియోపాత్రా పట్ల తాను చూపదలుచుకున్న కఠినత్వమే మాయమైంది. జీవిత సర్వస్వమూ తనకీ క్లియోపాత్రాయే ననిపిస్తోంది.
అంతలోనే మేడిపండు సామెత గుర్తుకొచ్చింది. పైకి ఈమె ప్రసన్న వదనం కనిపిస్తున్నా అంతరాంతరాల్లోని విషజ్వాలలకు తాను భయపడవలసి వుంటుంది. శారీరక సౌందర్యారాధనకు కళ్ళు ఆరాటపడుతోన్నప్పటికీ, మానసిక సౌందర్యాన్ని కనుగొని అంచనాలు వేయగల అతని మనస్సు తొందరపడకుండా అతన్ని నిలదొక్కుతోంది. క్లియోపాత్రా అసలు ఛాయలు బైటపడేవరకూ తాను జాగ్రత్తగా వుండాలని తనను తాను హెచ్చరించుకున్నాడతను.
తనను చూడగానే ఏంటనీలో కలిగిన సంచలనానికి క్లియోపాత్రా లోలోన నవ్వుకొన్నది. ముడిపడిన అతని కనుబొమలు విప్పారటాన్ని ఆమె కనిపెట్టి, తన లావణ్యం అప్పుడే అతనిమీద పనిచేస్తున్నందుకు గర్వపడింది.
‘ఏమొచ్చావ్?’ అన్నట్లుగా ఏంటనీ ఆమె వైపు చూశాడు.
ఆమె మెల్లిగా వెళ్లి, అతని పాదాల దగ్గర కూర్చున్నది. ఏంటనీ తన కాళ్ళని కాస్త అవతలికి లాక్కున్నాడు.
‘‘మీరెంత మారిపొయ్యారు!’’ అన్నదామె కమ్మని కంఠస్వరంతో.
తాను మారిపోయిన సంగతి ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతున్నాడతను.
‘‘ఎంత చిక్కిపొయ్యారు!’’ అన్నదామె.
తనను తాను సంభాళించుకునేందుకు ఏంటనీ ప్రయత్నిస్తున్నాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు