డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఆగ్రహానికి ఆహూతైపోతానని భయపడ్డాడు. చివరకు ఆమె తెలివితేటలకు తెల్లబోతున్నాడు.
ఆమెను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు తనకు ఒక జీవితకాలం చాలదు. ఆమెను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేలోగా ఆమె తననూ, తన ప్రపంచానే్న క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతోంది. అగ్నికణాలు తళతళ మెరుస్తూ, అందంగా కెంపులవలె ఉన్నవి కదానని చేతులోకి తీసుకున్న విధంగా తయారైంది తన బతుకు.
క్లియోపాత్రా ఆధిక్యతను తాను గుర్తిస్తూనే వున్నాడు. దాంతోపాటే తన అల్పత్వం కూడా అర్థవౌతున్నది. ఇప్పుడిప్పుడు తన మీద తను జాలిపడుతున్నాడు. ఎందుకంటే తనను అసహ్యించుకోవటంవల్ల ప్రయోజనం ఉండదు సరికదా, ఆ ద్వేషం తననే భస్మం చేస్తుందేమోనని!
తననామె ఏ దృష్టితో చూస్తున్నదో తెలుసుకోవాలని విశ్వప్రయత్నం చేశాడతను. కాని, సాగరమంత లోతు మనిషి క్లియోపాత్రా, ఏంటనీకి అందుతుందా? అందునా, వికలమైపోయిన మనఃస్థితిలో వున్న ఏంటనీకి! ప్రళయం వచ్చినా తనకేమన్నంత ప్రశాంతత ఆమె ముఖంలో స్పష్టంగా ప్రకాశిస్తున్నది.
నిజంగానే ఈమెలో దేవతా శక్తులు ఉన్నవేమోననే నమ్మకం ఏంటనీకి కలుగుతోంది. మాట నిలబెట్టుకొనేందుకు ఇతరులెవరికీ తమ మధ్య జరిగిన సంఘర్షణ తెలియరాకుండా ఉండేందుకు మాత్రమే ఆమె ప్రయత్నిస్తున్నదని అతను సరిపెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే, తానిప్పుడు అనుభవిస్తున్న స్థితి అదే! కాని అలాటి ఛాయలు కూడా తాను ఆమెలో తేలిగ్గా పసిగట్టి ఉండవలసింది. అలా జరగలేదు సరికదా, ఆమె అంతా మరిచిపోయిన విధంగా, లేదా అదొక స్వాప్నవికానుభవమేన్నంత తేలిగ్గా ప్రవర్తిస్తూన్నది.
చివరకు రెండు పెద్ద పాత్రల నిండా మధువు తేబడింది. క్లియోపాత్రా, బహుశా తన అందానికి దాన్ని దర్పణంవలె ఉపయోగించేందుకేమో, ఆ మధు పాత్రలోకి చూసింది. ఆ పాత్రను మెచ్చుకున్న ధోరణిలో విసురుగా తల ఆడించింది. ఆమె తలలోని గులాబి పూవొకటి మధుపాత్రలో పడింది.
ఇదే సమయంలో ఏంటనీ చేయి ఆ మధుపాత్రమీద పడింది. ఆమె అతని ముఖంలోకి చూసింది. అతను వెకిలిగా నవ్వి, ఆ గులాబి పూవును తీసిపారేసి, మధుపాత్రను తన ముందుకు లాక్కున్నాడు. ఆమె ఒక కంట అతన్ని కనిపెడుతూనే మధువు సేవించసాగింది. తాను ఆ రాత్రి మొదటినుంచీ అనుసరిస్తూన్న పద్ధతి ప్రకారం, ఆమె మధువు తాగగానే ఇందులో కూడా విషం కలపబడలేదని అతను నిశ్చయంగా తెలుసుకొని మధుపాత్రను పెదవులదాకా ఎత్తాడు.
‘‘ఆగు ఏంటనీ!’’ క్లియోపాత్రా కంఠంలో ఆతృత, ఆజ్ఞ ఇమిడి ఉన్నవి. ఆ కొవ్వొత్తుల కాంతిలో ఆమె కళ్ళు రత్నాలవలె మెరుస్తూన్నవి.
ఏంటనీ పాత్రను కాస్త కిందికి దించి, ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘ఏంటనీ! నీవు నన్ను నమ్మదలచుకోలేదు. కాని, నేను నిన్ను నమ్మి, చెడినదాన్నయ్యాను. నేను నిన్ను చంపుతానేమోనని పాపం, భయపడిపొయ్యావు. భోజన పదార్థాలలో విషాన్ని కలిపి ఇస్తానేమోనని వొణికిపొయ్యావు. అయితే తెలివిగా ప్రతి పదార్థమూ నీ కళ్ళ ఎదుట నా చేత తినిపించి కాని నీవు తినలేదు. కాని, ఏంటనీ నీకన్నా తెలివిగలవాళ్ళు ప్రపంచంలో ఉండి ఉంటారని వొప్పుకునేందుకు నీ అహంకారం అడ్డుపడుతుందనుకుంటాను.. ఆ పాత్ర ఇలా ఇవ్వు’’
ఏంటనీకేమీ అర్థం కావటంలేదు. ఆమె ఆ పాత్రను లాక్కున్నది.
నేరస్థుడైన బానిసనొకణ్ని వెంటనే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిందామె. కొద్ది క్షణాల్లోనే నేరస్థుడొకడు ఆమె ఎదుటికి వచ్చాడు.
‘‘బానిసా! ఈ మధువు సేవించు!’’ ఆజ్ఞాపించిందామె.
వాడు ఆమె ముద్దుమొహం చూస్తూనే మధువు తాగాడు. మరుక్షణంలో మొదలు నరికిన చెట్టులా కింద పడిపొయ్యాడు. మొహమంతా పీక్కుపోయి, నాలుక మూరెడు పొడుగున వెళ్ళక్క్రి, గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు.
చేతులు చరిచి మిగతా సేవకుల్ని పిలిపించిందామె. కిందపడి వున్న శవాన్ని వేలితో చూపించింది. సేవకులు గ్రహించి ఆ శవాన్ని ఎత్తుకొని వెళ్ళారు.
ఏంటనీ నిశే్చష్టుడయ్యాడు. సేవకులు మోసుకెళ్ళేది తన శవం కాదని తేల్చుకున్నాడు. గారడీ చేయటం తానెరుగు కాని, ఇంత గొప్ప గారడీని తాను కలలో కూడా చూడలేదు. క్లియోపాత్రా రుూ సందర్భంలో తనకు ప్రాణదానం చేసిన దేవతగానే తోస్తున్నది.
‘‘ఏంటనీ! నిన్ను చంపదల్చుకుంటే నాకొక లెక్కనుకున్నావా? నిజానికి నీకు మరణదండనే తగిన శిక్ష! ఈజిప్టు మహారాణిని అవమానించి, ప్రాణాలతో ఉండగలిగిన అదృష్టవంతుల్లో నీవే మొదటివాడివీ, చివరివాడివీను! ఐతే, నీకొక సందేహం రావచ్చు. ఈ సమయంలో నినె్నందుకు హతమార్చలేని!.. నేను నీలాగు కృతఘు్నరాల్ని కాదు. నా పిల్లలకు తండ్రివి నీవు. మనిద్దరం ఎన్ని రహస్యాలు చెప్పుకున్నామో, ఏకశరీరలుగా ఎన్ని రాత్రులు గడిపామో, అర్థంలేని పిచ్చిమాటల్తో ఎనె్నన్ని కొత్త భావాలను రూపొందించామో నేను మరిచిపోలేదు. ప్రేమమీద నమ్మకమున్న స్ర్తిని నేను. నీవా ప్రేమను కాలదన్నినప్పటికీ, నేను ఆరాధిస్తాను. ఇప్పటికైనా తెలుసుకో. నేను నిన్నింకా మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. కాని, దాన్ని బైట పెట్టేందుకు సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళూ, ఇనే్నళ్ళూ ఒక మహాయోధునికి, పురుషోత్తముడికి, యోగ్యునికి నా ప్రణయాన్ని అర్పించాను కదానని గర్వపడేదాన్ని.
కాని, రుూనాడు నా స్వప్న సుందరుడు, నిజ జీవితంలో నరుడన్నా కాదు, వానరుడని తేలిపోయింది. ఇంత పిరికిపందను, హీనుణ్నీ, అయోగుణ్నీ ప్రేమించినందుకు నాలో నేను చిన్నబొయ్యాను. నన్ను నేను దూషించుకున్నాను, నా తప్పులకు శిక్షలెమ్మని కూడా సరిపెట్టుకున్నాను.. కనుకనే నీవలె ఇతరులమీద పడి ఏడవలేదు. అందుకనే నా మూలాన నీవు చావటం నాకిష్టంలేదు. ఇక్కడ ఏం జరుగబోతున్నదో నాకు తెలుసు. మధుపాత్రలో కాలకూట విషమున్న గులాబీని ఎలా పడేయాలో నాకు తెలుసు. నీవా మధువును సేవించినట్లయితే చివరకు నీ తప్పులకు పశ్చాత్తాపపడే అవకాశమన్నా ఉండేది కాదని, నీవింతకు ముందు స్వయంగా తెలుసుకొనే ఉన్నావు. ఏంటనీ! నీ నీచ ప్రవర్తనకు నా మన్సు వికలమైంది. ఐతే, దాన్ని తిరిగి యథాస్థితిలోకి తేగలిగిగే స్థైర్యం నాకున్నది. ఆ జరిగిపోయినదంతా ఒక పీడకల! నీతో చెప్పినట్లు నేను రేపే ఈజిప్టు వెళ్తున్నాను.. వెళ్ళే ముందు మనం మరొకసారి కలుసుకోవటం అవసరం. నా భవిష్యత్తును గూర్చిన భారం నీకు అవసరం లేదు. అక్కడ నేనూ, నా సంతానమూ సుఖంగా కాలం గడపగలమనే నమ్మకమున్నది. ఇక్కడ నీవు కూడా, ఈ యుద్ధంలో నెగ్గి, రోమన్ సామ్రాజ్యానికి సర్వాధికారివి కావాలని వేయి దేవుళ్ళకు హృదయపూర్వకంగా మొక్కుకుంటాను.. మరి సెలవు!’’ అన్నదామె.
ఆమె కళ్ళనుంచి మంచు ముత్యాలవలె మెరుస్తూన్న నీటి బిందువులు, నున్నని చెంపమీద నుంచి జారి, నేలమీద పడేందుకు సిద్ధంగా ఉన్నవి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు