డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

రైలుబండి పరుగెత్తుతోంది. ఇంటివాళ్ళందరూ వీడ్కోలు చెప్పారు. కాని ఇల్లు మాత్రం అతడిని వదలడంలేదు. అతడని వాటేసుకుని అతడితోనే వస్తోంది. బయట దృశ్యాలు కిటికీలోంచి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు తీరాలలో చెట్లు, చేమలు. అక్కడక్కడ పోక చెక్క చెట్లు, అరటి చెట్లు, చిన్న చిన్న పెంకుటిళ్లు వెదురాకులతో కప్పబడ్డవి. మట్టితో కట్టపడ్డ ఇళ్లు.. అక్కడక్కడ హాండ్ పంపు చేత్తో కొడుతున్న మహిళలు. అక్కడక్కడ ఇంటిముందు వాకిలిని ఊడస్తున్న ఇల్లాళ్లు. ఇంటి బయట మేకలు, కోళ్ళు... నులక మంచాలమీద పడుకుని ఉన్న ముసలాళ్లు.. మధ్య మధ్యలో పొలాలు.. దాదాపు అన్ని ఈ దృశ్యాలే. కాని ఒక చోట కనిపించని దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డాడు. నడుందాకా బురదలో కూరుకున్న ఒక యువతి. ఆమెతోపాటు ఒక యువకుడు. బహుశ ఆమె భర్త అయి ఉండవచ్చు. ఇద్దరు సరస్సులోని బురదను బయటికి పడేస్తున్నారు. బహుశ వాళ్ళు అక్కడంత శుభ్రం చేస్తున్నారు. ఓహ్ భగవంతుడా! ఇంత కంపు కొట్టే బురదలో నడుం వరకు దిగి ఎవరు పనిచేయగలుగుతారు? అందులోనూ ఇంతసేపు! అబ్బా.. ఎంత ఘోరాతిఘోరమైన జీవితం. ఉదయం నుండే పొట్టకూటికోసం పనిచేసే స్ర్తి పురుషులు, ఒక చెట్టుపైన వేళ్లాడుతున్న గాలిపటాన్ని చూసాడు. కిటికీనుండి చేయి చాపి ఆ గాలి పటాన్ని అందుకుని దాన్ని ఎగరేద్దామా అనిపించింది.
ఒక చోట... రైల్వే పట్టాల దగ్గర చెంబులు పెట్టుకుని కూర్చుని, మల మూత్రాలను విసర్జిస్తున్న మనుషులు..ష్.. ఛీ.. అతడు చూపులు తిప్పేసుకున్నాడు.
తన తల్లి తండ్రులు, బాబాయి, పిన్నులు ఇటువంటి జీవితం జీవించడం లేదుగా! జీవితం- జీవితం మధ్య ఎంత తేడా..
తన జీవితం వికాసం పొందుతోంది. తను జీవితాన్ని ఇంకా లోతుగా పరిశీలించడానికి సిద్ధం అవుతున్నాడు. తను ఆర్మీలో చేరడానికి బయలుదేరినప్పుడు చివరిసారిగా తండ్రి అన్న మాటలు గుర్తుకువచ్చాయి. ఆయన నోటివెంట వచ్చిన చేదు నిజం గుర్తుకు వచ్చింది. నీవు జీవితంలోని టఫ్ కాంపిటీషన్‌కి భయపడి ఆర్మీలో చేరుతున్నావు. అక్కడ ఏ కాంపిటీషన్ లేదు. ఉద్యోగం ఊడుతుందన్న భయం లేదు. సరిహద్దులున్న ఆకాశం- సరిహద్దులున్న పయనం- కింద పడతానన్న రిస్క్ లేదు. పూర్తిగా పైకి ఎగిరి నిన్ను నువ్వు పోగొట్టుకుంటావేమోనన్న భయమూ లేదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే నువ్వు జీవితం నుండి పారిపోతున్నావు- నేను జీవితం నుండి కాదు పారిపోయేది. జీవితంలోకి పరుగెడుతున్నాను. నాన్నా.. ఆర్మీలోకి రాకపోతే జీవితాలలోని ఈ చేదు విషాదాలను చూసేవాడినా నాన్నా..’
నాన్నగారు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారా?
లేకపోతే కేవలం ఆయనకున్న పుత్రప్రేమా!
ఆలోచనల విహంగాలు మళ్లీ ఎగరడం ప్రారంభించాయి.
ఈసారి డెహరాడూన్ వాతావరణంలో ఒక గొప్ప మార్పు వుంది. ఇప్పుడు సందీప్ సీనియర్. అతడి సీనియర్స్ ఆఫీసర్లయ్యారు. రాగింగ్ వల్ల మేఘాలు విడిపోయాయి.
రోజులు గడుస్తున్నాయి. కాలం ఒక్కొక్కసారి లేడిలా గెంతులేస్తోంది. ఒక్కొక్క సారి తాబేలులా నడుస్తోంది. ప్రతిరోజు ఆ రహస్య- ప్రపంచంలోని పొరలు విప్పుకుంటున్నాయి. లోకాన్ని తెలుసుకుంటున్నకొద్దీ దానిపట్ల అతడికి ఉన్న ఆకర్షణ, వికర్షణ, గౌరవం, అగౌరవం ఒక్కొక్కసారి పెరుగుతున్నాయి. ఒక్కొక్కసారి తరుగుతున్నాయి. ఒక్కొక్కసారి తను ఆర్మీలో చేరి చాలా మంచి పనిచేసాను అని అనిపిస్తే మరొకసారి ఛ.. ఎందుకు చేరాను అని అనిపిస్తోంది. ఛ.. ఇదీ ఒక జీవితమేనా! చిన్న తప్పు చేస్తే ఎంత పెద్ద శిక్షలు.. అసలు తను రక్తమాంసాలు కల మనిషేనా! లేక ఆలుగడ్డలతో నింపిన బస్తానా!
ఇక ఇప్పడు చూస్తూ.. చూస్తూ ఉంటేనే ఆర్మీలో పాసింగ్ అవుడ్ పెరేడ్. ఆ తరువాత ఫారాలు నింపాలి.. అనుబంధ పత్రం.. శపథ పత్రం పైన సైన్ చేయాలి.. ఆ తరువాత అతడు ఇరవై సం.లోపల ఎంత సివిల్ లైఫ్‌లోకి రాలానుకున్నా రాలేడు..
ఇప్పటికీ నిర్ణయం అతడి చేతిలోనే ఉంది. ఇప్పటికి తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్ళగలడు. ప్రతీ ఉత్తరంలోనూ అతడి తల్లి దండ్రులు చివరన రాసే వాక్యం ఒకటే.. వెనక్కి తిరిగిరా.. ఈసారి తండ్రి ముఖంలో నిరాశా నిస్పృహల రంగు గాఢంగా ఉంది- చూడరా సందీప్! ఆర్మీలో ఉండి కూడా నీవు దేశ సేవ చేయలేవురా! నువ్వు అసలు వార్తాపత్రికలు చదువుతున్నావా! సైన్యంలోని కొంతమంది పై అధికారులపై చర్య తీసుకున్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళు గృహ మంత్రాలయం- రక్షణ మంత్రాలయాల పాలసీలను వ్యతిరేకించారు. ఈ దేశంలో ఆర్మీ తన నిర్ణయం తను తీసుకోలేదు. ఎందుకంటే ఆర్మీమీద అధికారం అంతా ప్రభుత్వానిదే. ఆర్మీకి ఆలోచించి చెప్పే స్వతంత్రం లేదు. శీఘ్రంగా ఏదైనా మార్పు వస్తుంది అంటే అదీ లేదు. అసలు ఆ ఆశే వదులుకోవాలి. ఇక్కడ రాజ్యం చేస్తున్నది మంత్రులకు తలఒగ్గే చెంచాలే. డూడూ అని తల ఊపే బసవన్నలే- ఒక చోట గాడిదలు సింహాసనం మీద కూర్చున్నారు. మరోచోట పేరాశకల రాబందులు.. వెనక్కిరా.. ఇంకా ఇప్పటికీ మించిపోయింది లేదు. రా.. తిరిగిరా. కాని తను తిరిగి ఎందుకు వెళ్లాలి? ఊహు.. చస్తే వెనక్కి వెళ్ళడు. అసలు ఛాలెంజ్‌లకు భయపడి పారిపోయేవాడు సైనికుడేనా? తను ఒక సైనికుడు. ఒక ఏడాది జీవితంలో తను తన తండ్రి నలభై ఐదు సం.లలో చూడనివి ఎన్నింటినో చూశాడు. ఈ ఒక్క సంవత్సరంలో... తనకు ఎన్నో అనుభవాలు.. ఊహు తాను ఆ ఇత్తడి గినె్నలను తూచుకుంటూ కూర్చోడు.. తను రైఫిల్ ఎత్తాలి. ప్రపంచాన్ని చూడాలి..

- ఇంకా ఉంది

టి.సి.వసంత