డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతడి చేయి తగలగానే సందీప్ చెయ్యి పక్కనే వున్న ఎ.కె.47 మీద పడ్డది. ఒరేయ్.. ఒరేయ్.. దాన్ని ప్రయోగించకు.. అన్నయ్యా.. నీకు రాత్రి కూడా స్వప్నాలలో కూడా మిలిటెంట్లే కనిపిస్తారా? నిద్రలో కూడా వాళ్లు నిన్ను వెంటాడుతూనే ఉంటారా?’’
సందీప్ ఉలిక్కిపడ్డాడు. అసలు తను ఎంతగా మారిపోతున్నాడు. తన వ్యక్తిత్వంలో ఎంత మార్పు వస్తోంది. ఏ కళ్ళల్లో అయితే ఎప్పుడు అందమైన కలలు ఉండేవో, ఆ కళ్ళు తనని పడగొట్టకుండా అవతలి వాడిని ముందు చంపేయాలి అన్న కలతో ఎరుపెక్కుతున్నాయి. ఏ మస్తిష్కంలోనైతే మంచి ఆలోచనలు ఉండేవో ఆ మస్తిష్కం నిండా చెడు ఆలోచనలే. ఈ కాశ్మీరం తనని మనిషిగా బతకనివ్వదు.
జీవితంలోని సౌందర్యాన్ని, భావుకతని, ఈ కాశ్మీరం పీల్చేసుకుంటోంది. హాయిగా నిద్రపోదామంటే పోనీయరు. అసలు భగవంతుడు ఏ చెడు క్షణాలలో ఈ కాశ్మీరాన్ని రచించాడు. ఎంత అందమైనదో అంత.. అపాయకరమైనది.. ఎన్ని వృక్షాలో అని సమాధులు....
ప్రతీ ఇంటి వెనక ఒక యువకుడి సమాధి.
అసలు తను ఒక మంచి పుస్తకం చదువుకుని ఎన్ని రోజులైంది. ఉఫ్.. కాశ్మీరానికి వచ్చినప్పటినుండి.. ఒక సంగీతం లేదు.. అందమైన కలలు లేవు. రంగుల జీవితం లేదు.
అంతటా ఎటుచూసినా ఉగ్రవాదం.. రక్తపాతాలు..
సిద్ధార్థ సందీప్‌ని కుదిపాడు... ‘‘అన్నయ్యా! ఏం ఆలోచిస్తున్నావు? ఏమయింది? ఈ లోకంలోకి రా!’’
‘‘ఊహూ! ఏమీ లేదు..’’
‘‘ఏమీ లేదు అనకు, ఏదో ఆలోచిస్తున్నావు’’.
సందీప్ సిద్ధార్థ వంక చూశాడు. సిద్ధార్థ ఎంత చక్కగా మన భావాలను పసికడతాడు.
తక్కినవాళ్ళకన్నా సిద్ధార్థకి ఎక్కువే తెలిసి ఉండవచ్చు.
చెప్పవద్దని అనుకున్న కంఠం నుండి మాటలు వెలువడ్డాయి.
‘‘ఇక్కడ మేము సహజంగా జీవించాలన్నా జీవించలేకపోతున్నాము. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఉగ్రవాదులను ఏ క్షణంలోనైనా మరచిపోలేము. గత వారం జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. పహారన్ ఊళ్ళో మిలిటెంట్లు కొండపై ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వార్త వచ్చింది. నేను, కెప్టెన్ అమీర్‌సింహ్, మేజర్ కులవంత్ ఇంకా కొందరు సైనికులు అందరం కలిసి ఆ కొండపైకి వెళ్ళాము. మేం మా మా చోట్లలలో నిల్చున్నాము. కొండని చుట్టుముట్టాము. హెచ్.హెచ్.టి.ఐని సెట్ చేశాము. ఎటువంటి పొరపాటు చేయలేదు. ఇటువంటి సమయాలలో బలపరాక్రమాలకన్నా పొసిషన్‌కే విలువ ఎక్కువ. ఉగ్రవాదులు కొండపైకి ఎక్కుతున్నారు. కనక మేం కింద వైపు చూస్తూ కూర్చున్నాము. కాని వాళ్ళు కొండపైనే ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు మేం ఎక్కుతున్నప్పుడు పేల్చడం మొదలుపెట్టారు. కెప్టెన్ అమీర్‌కి గుండు తగిలింది. ఒక్క క్షణం అప్రమత్తంగా ఉంటే.. అంతే.. అమరజీవిని మువ్వనె్నల జెండాలో నేను వాళ్ళ ఇంటికి చేర్చాను’’ చెబుతూ సందీప్ భావుకుడయ్యాడు. అతడు ఎ.కె.47 వంక కోపంగా చూశాడు.
గదిలోనుండి కిటికీగుండా బయటికి చూశాడు. పూర్ణచంద్రబింబం. భూమి మీద వెనె్నల పరచుకుంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. మేజర్‌కి పులకింత కలిగింది. ఇవాళ తమ్ముడితో కలిసినందుకు ఎన్నో రోజుల తరువాత తనూ ఒక మనిషే అన్న అనుభవం కలిగింది. చిన్నప్పటి వౌత్ ఆర్గాన్ గుర్తుకు వచ్చింది. తను ఎంతో తన్మయంతో వాయించేశాడు. ఒక్కసారి తన పెదవులతో దాన్ని మళ్లీ స్పర్శించగలిగితే ఎంత బాగుండును. పెద్దవాడైనకొద్దీ జీవితం చేతిలో నుండి జారిపోయింది.
ఆలోచనా తరంగాలలో మునిగిపోయిన సందీప్‌ని తమ్ముడు ఒక్కసారిగా ఊపాడు.
‘‘అన్నయ్యా! అసలు ఈ సంగతి చెప్పు. నీవు ఆర్మీలో చేరేటప్పుడు ప్రతీక్షణం గన్‌తో ఉగ్రవాదులను కాల్చి చంపాలన్న విషయం తెలిస్తే నీవు ఆర్మీలో చేరేవాడివా?’’
మేజర్ లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం జవాబు చెప్పగలుగుతాడు? నిజానికి రక్తంతో హోలీ ఆడటానికి తను ఆర్మీలో చేరాడా! ఆర్.ఆర్‌లో వేస్తారని తెలిస్తే తను ఆర్మీలో చేరేవాడా? ఏమో... అవును.. కాదు..
కాలచక్రం వెనక్కి తిరిగింది. నూనూగు మీసాల నూతన వ్వనం.. కలల కనడం తప్పిస్తే జీవితం అంటే ఏం తెలుసు? ఈ రోజు తెలుసుకున్నదంతా ఆనాడే తెలుసుకుంటే.. అసలు వర్తమానంలో జరుగుతున్నదానికి బీజాలు అతీతంగానే పడ్డాయి కదా! వర్తమానం అంటే ఏమిటి? భూతకాలంలో జరిగిన దాని పర్యవసానం కాదా?
బహుశా.. నిజమే.. కాని జీవితంలోని ఆనందం కూడా ఇందులోనే ఉంది. సమయానికి పూర్వం రహస్యంపైనుండి పరదా లేవకూడదు. ‘జవాబు చెప్పన్నయ్యా!’ ‘ఒరేయ్ తమ్ముడూ! జీవితంలో ఎన్నో సమస్యలకు ఎప్పటికి సమాధానాలు దొరకవురా! నీ కంపెనీ లాభాల కోసం దేశంలోని స్థానీయ చిన్న చిన్న వ్యాపారస్థుల పొట్టలమీద కొడుతుందని తెలిస్తే నీవు జాయిన్ అయ్యేవాడివా? నాకనిపిస్తుంది. మనం అందరం మనకి ఇష్టం లేకుండా మనకి తెలియకుండా వలలో చిక్కుకున్న మనుష్యులం. అసలు మనం మనదారులను తెలుసుకునేలోపల, మనలని మనం పూర్తిగా అర్థం చేసుకునే లోపల, మన స్వభావాన్ని, ప్రకృతిని తెలుసుకునేలోపల జీవితం చేజారిపోతుంది. మనం ఎన్నో ముందడుగులు వేసేస్తాం. మన కోరికల కోయిలలు ఎగరిపోతాయి. జీవితంలోని ఆటుపోట్లను తట్టుకుంటూ అలసి సొలసిపోతాం. ఒక జీవితం నుండి మరో జీవితంలోకి వెళ్లిపోవాలన్నా అసలు ఇక మన దగ్గర పిసరంత శక్తి కూడా మిగలదు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత