డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అంతే శరీరం, మనస్సు గడగడా వణికిపోతాయి. అప్పుడు నా కళ్లు పొరలు కమ్మిపోయాయి. ఏకాఫిర్ (ముస్లిం కానివాడు) కాదు, ఏ హిందూ కాదు, హిందుస్తానీ సైనికుడు కాదు, స్వతంత్ర కాశ్మీర్, అజాద్ కాశ్మీర్ అంటూ కేకలేస్తూ మమ్మల్ని నమ్మించి మోసం చేసే ఈ రాక్షసులు, నా మానాన్ని దోచుకున్నారు. నన్ను నాశనం చేశారు. ఇప్పుడు కళ్లు తెరిచాను. ఆజాద్ కాశ్మీర్, మానవత్వం మంట కలవకుండా రక్షించడం రెండూ భ్రమే. మోసమే. ఈ రాక్షసులు ఆడదాని మానాన్ని కాపాడలేని రాక్షస సంతానం మతాన్ని రక్షిస్తారా? ఆడదాన్ని హీనాతిహీనంగా చూసే వీళ్లా, ఆడదాన్ని బలాత్కారం చేసే వీళ్లా మతాన్ని రక్షించేది? చచ్చిన తర్వాత వెళ్లే పైలోకం గురించి మతంలో పవిత్రతల గురించి చెప్పి జమీల్‌భాయి లాంటి అమాయకులని మభ్యపెట్టి, మోసం చేసి రక్కసులు వీళ్లా మతాన్ని రక్షించేది? అభం శుభం ఎరుగని అమాయకులు ఉగ్రవాదులుగా తయారు కాకపోయినా నరకయాతన పెడతారు. ఉగ్రవాదులుగా మారితే ఇంకా రౌరవ నరకం. కాశ్మీరులో ఈ రక్కసులే అసలైన నేరస్థులు. అసలు పైలోకాన్ని ఎవరు చూస్తారు. తెలియని ఆ పరలోకం కోసం మన అందమైన ఈ లోకాన్ని నరకంలోకి తోయడంలో అసలు అర్థం ఉందా?
సందీప్! ఒకప్పుడు మిలిటెన్సీ పవిత్రమైన ఉద్దేశం కోసమే ఏర్పడ్డదేమో. కాని ఇప్పుడు మాత్రం జిహాదులు, పీర్లు, మాలవీలు, ఉగ్రవాదులు మొదలైనవారి రెండు ముఖాలు కనిపిస్తున్నాయి. వాళ్ల అసలు రంగు బయట పడుతోంది. ఈనాడు ఉగ్రవాదం, డబ్బు, అధికారం పొందడానికి ఒక మార్గం అయింది. జమీల్‌భాయి కూడా ఇదే ఉద్దేశంతో గన్ ఎత్తి ఉంటాడు. హమీద్ ఇంట్లో అండర్‌గ్రౌండ్ గది కట్టినపుడు చాలా రోజులు నేను ప్రాగ్ కొండలలో, అడవులలో తల దాచుకున్నాను. అక్కడ పోలీసులు మిలిటెంట్లతో చేతులు కలిపి అడవులలో దేవదారు చెట్లను కొట్టేస్తుంటే నేను చూశాను. అడవుల సంరక్షణ కోసం ఏర్పాటుచేయబడ్డ వారు ఎక్కడైతే చెట్లు నరుకుతున్నారో అక్కడికి రానే రారు.
చూస్తూ చూస్తూ వుంటే కాశ్మీర్ మారిపోయింది. కాశ్మీర్‌లోకి ధనం దస్కం బాగా వచ్చాయి. కాని ఆ ధనం దేనికోసం? ఆట పాటలు లేవు, పొలాలలో రైతులు లేరు. స్కూళ్లల్లో పిల్లలు లేరు, ఇళ్లల్లో దీపాలు లేవు. నలువైపులా కన్నీరు కారుస్తున్న స్ర్తీలే. ప్రతి ఇంటి వెనక ఒక సమాధి. రోజుకో సమాధి. నవ్వుతూ- తుళ్లుతూ ఆడుతూ పాడుతూ వుండే కాశ్మీరు స్ర్తిలు ఇప్పుడు ఎక్కడా కనిపించరు. ఇప్పుడు రాత్రి చీకటిలో దొంగతనంగా తలుపులు తట్టే రాక్షసులే కనిపిస్తారు. లేకపోతే పగలు ఎ.కె.47 చేత బట్టిన వారు. ఎటు చూసినా సమాధులు, హింస, ద్వేషం. రక్తసిక్తం అయిన పునాదులమీద నిలబడ్డ ఆజాద్ కాశ్మీర్ వస్తే ఎంత రాకపోతే ఎంత? ఆజాద్ కాశ్మీర్ అంటే వల్లకాడా! అసలు ఇది సభ్య సమాజమా! కాశ్మీర్ ఈనాడు బాహాటంగా పశువులు మేసే ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడ తమ తమ స్వార్థాల కోసం ఇక్కడికి వచ్చినవారు మేకలను మేయడానికి వదిలివేసారు. అందుకే ప్రతి వస్తువు అమ్ముడుపోతోంది. ఉగ్రవాదం వల్లనే ఇదంతా! ఒకడు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫీజు తీసుకుంటే మరొకడు వాడితో కలపడానికి, మరొకడు వాడిని ఇంట్లో ఉంచుకోవడానికి. ఈ అపవిత్రమైన డబ్బుకి హమీద్ దాసోహం అన్నాడు. కాబట్టే, వాడి బుద్ధి భ్రష్టుపట్టింది. కాబట్టే ఇవాళ నేను ఈ జైలులో ఉన్నాను.
ఇక ఇప్పుడు పొగ మంచు వీడిపోయింది. కళ్ల పొరలు విప్పుకున్నాయి. నీవు నాకు ఆలోచించడం నేర్పావు సందీప్! జీవితాన్ని ఎట్లా జీవించాలో నేర్పావు. అందుకే తెలుసుకున్నాను. ఈ ధర్మం మా పేదవాళ్లకోసమే. ఈ మజహబ్ (్ధర్మం) బరువుని మేం మోస్తున్నాం. మా అమ్మ నన్ను ఒక ఫొటో తీయించుకోనీయలేదు. ఎందుకంటే ఇట్లా చేయడం మతానికి వ్యతిరేకం. మా మతాచారం ఒప్పుకోదు. నువ్వు నాకొకసారి చెప్పావు. పీర్లు, ముల్లాలు, నేతలు చెప్పేది వినడంతో పాటు వాళ్లని లోతుగా చూడు. ఎన్నో రహస్యాలు, సత్యాలు తెలుస్తాయని చెప్పావు. కాని అప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా! నీవు మా మత ధర్మానికి వ్యతిరేకంగా నన్ను ప్రేరేపిస్తున్నావని అనుకున్నాను. కాని నేను ఇపుడు కళ్లు తెరిచాను. ఫొటోలు తీసుకోకూడదనే ధర్మం చెప్పేవారు రాజకీయ నాయకులతో ఫొటోలు దిగుతారు. ఉత్త ఫొటోలు తీసుకోవడమే కాదు గొప్ప కోసం పేపర్లలో వేయించుకుంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్‌ని ‘ఆలా ఏక్ శైతాన్’ (యంత్రం ఒక సైతాన్) అంటూ వ్యతిరేకించేవారు. లౌడ్ స్పీకర్‌లో మాట్లాడకూడదు అన్న మత పెద్దలు స్పీకర్లలో పెద్దగా మాట్లాడుతారు. వాళ్ల కంఠం నాలుగు వైపులా మారుమోగుతుంది. వీళ్లందరు చెప్పేదొకటి, చేసేదొకటి. వీళ్లు రక్తదానాన్ని, సర్జరీని మతం వ్యతిరేకం అని నిర్ణయించారు. బ్యాంక్‌ల వడ్డీ, జీవిత భీమాలు ఇచ్చే అదనపు డబ్బు తీసుకోవడం మతధర్మానికి వ్యతిరేకంఅని చెప్పారు. కాని మతపెద్దలందరికీ నేతలందరికి బ్యాంక్‌లలో ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కనువిప్పయింది. నేను మతాన్ని కాదు మనిషిని ప్రేమిస్తాను. మాకు కావలసింది మానవత్వం. మతం అంటే మనిషి . మనిషి అంటే మానవత్వం.
మంచి నడవడికను ప్రోత్సహించి, సత్యాన్ని ప్రతిపాదించి, నలువైపులా సుగంధాన్ని వెదజల్లే ఈ మతాన్ని కొందరు స్వార్థపరులు మతపిచ్చి పట్టి, ఎంతో కాంతివంతమైన ఈ ధర్మాన్ని కాంతిహీనంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాని సూర్యకాంతిని ఎవరైనా ఆపగలుగుతారా?

- ఇంకా ఉంది

టి.సి.వసంత