డైలీ సీరియల్

బడబాగ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిరిపడుతున్న మనసును అదుపు చేసుకుంటూ వడివడిగా నడిచాడు.. సన్నగా మొదలైన వాన మెల్లి మెల్లిగా జోరందుకుంటూంది, చుట్టూ చిమ్మ చీకటి.. ఈ అనే్వష్‌కి బుద్ధి లేదు.. ఎప్పుడు చూసినా అడ్వెంచర్ పేరుతో ఏదో ఒక వెధవ పనిచేస్తుంటాడు. అయినా బుద్ధిలేనిది వాడికి కాదు.. వాడు రమ్మనగానే తగుదునమ్మా అని అర్ధరాత్రి బయలుదేరిన తనది.. చలితో.. భయంతో సన్నగా వణుకు బయలుదేరింది. ఆ భయాన్ని మరింత పెంచుతూ మారుమోగుతున్న కీచురాళ్ళ ధ్వని.. అడుగులు తడబడుతున్నాయి. అతనికి.
అసలు అంత రాత్రివేళ భయపడుతూ భయపడుతూ అమర్ ఎక్కడికి వెడుతున్నాడో తెలుసుకోవాలంటే..
నిన్న అంటే శనివారం రాత్రి ఐ.పి.యస్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్‌లోశిక్షణ పొందుతున్నవాళ్లలో నలుగురు స్నేహితులు.. ఎక్కడో ఆంధ్రా నుంచి సెలెక్ట్ అయి డెహ్రాడూన్‌లో డ్రైనింగ్ అవుతున్నారు. ఆ రోజు శిక్షణ పూర్తయి రాత్రి భోజనాల సమయంలో కబుర్లు చెప్పుకుంటూండగా సడెన్‌గా అనే్వష్ అన్నాడు.
‘‘అరే.. మనం కాబోయే పోలీస్ ఆఫీసర్లు.. ఇంక పది రోజుల్లో నా శిక్షణ పూర్తయి అంతా తలో చోటా అయిపోతాం.. చూస్తూండగా అప్పుడే ఏడాది అయిపోవచ్చింది.. మనకి కాస్త థ్రిల్లింగ్‌గానూ వుంటుంది.. మనకి ఏపాటి ధైర్యసాహసాలు ఉన్నాయో మనకీ తెలుస్తుంది.. మీరు సరే అంటే ఒక చిన్న టెస్ట్ మందరికీ..’’ ఉత్సాహంగా.
‘‘అరె బాబు.. ఈ పది రోజులూ ప్రశాంతంగా, ఆనందంగా బతకనీయరా.. తర్వాత అంతా ఎలాగా టెన్షన్ జీవితాంతం తప్పదు..’’ విసుగ్గా అన్నాడు అమర్.
‘‘అసలు సంగతి చెప్పరా నాన్నా.. నీకు భయం అని.. అయినా సరే నువ్వు హాయిగా ఏ సాఫ్ట్‌వేరో చూసుకోక ఈ పోలీస్ జాబ్‌కే ఎందుకొచ్చావురా బాబూ.. పోనీలే.. నువ్వు హాయిగా వెచ్చగా బజ్జో.. అంత భయం అయితే...’’ వెక్కిరింతగా అన్నాడు అనే్వష్.
‘‘నాకేం భయం లేదు..’’ ఉక్రోషంగా అన్నాడు అమర్...
‘‘అబ్బా.. ఏమిటిరా చిన్న పిల్లల్లా.. నువ్వు అసలు సంగతి చెప్పరా అనే్వష్’’ ఉత్సాహంగా అడిగాడు అజిత్. అనే్వష్ పెట్టే పరీక్షలంటే గొప్ప ఇష్టం అజిత్‌కి.
ఈ రోజు రాత్రి.. ఆహా వద్దులే.. సోమవారం ఎటూ సెలవేగా.. కాబట్టి రేపు రాత్రి.. అంటే అమావాస్య, ఆదివారం అర్థరాత్రి బయలుదేరి ఇక్కడికి ఐదు మైళ్ళ అవతల వున్న అడవిలోకి వెళ్లాలి.. మనలో ఇద్దరు ముందు వెళ్లి అక్కడ ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో రూం తీసి.. సోమవారం అక్కడ కులాసాగా గడపడానికి కావలసిన ఏర్పాట్లు చూద్దాం.. రాత్రి ఎవరు వెడతారు.. అన్నదానికి చీటీలు రాద్దాం.. రెండు చీట్లు తీసి ఎవరి పేరు వస్తే వాళ్ళిద్దరూ రాత్రి వెళ్లాలి.. ఓ.కె?’’ హుషారుగా అన్నాడు అనే్వష్.
‘‘నే రెడీ.. ఇంకొకరెవరో.. మీ మూడు పేర్లు రాసి సెలెక్ట్ చెయ్యండి..’’ మళ్లీ తనే ఉత్సాహంగా అన్నాడు అనే్వష్.
‘‘ఏంటి.. అంత హుషారు.. నమితతో స్పెండ్ వేయడానికి ప్లాన్ వేసావా’’ టీజింగ్‌గా అన్నాడు అరుణ్.
‘‘చట్... నోరు ముయ్యరా..’’ సిగ్గుపడిపోయాడు అనే్వష్.
‘‘సరే, ఇదిగో నేను పది చీటీలలో మన ముగ్గురి పేర్లూ రాసా.. నువ్వే తియ్యరా అనే్వష్ నీ పార్ట్‌నర్ ఎవరో..’’
‘‘అదేంట్రా? మనం వున్నది ముగ్గురయితే ఇన్ని చీట్లు దేనికి..’’ ఆశ్చర్యంగా అన్నాడు అమర్.
‘‘రాసింది నేనేగా మరీ మూడే రాస్తే చీటీ విప్పకుండానే తెలిసింది.. ఎవరి పేరో.. అదే కొంచెం ఎక్కువ స్లిప్స్ వుంటే కొంచెం కష్టం..’’ అన్నాడు అజిత్.
‘‘ఏడిశావ్.. వెధవ లాజిక్కు నువ్వూను..’’ నవ్వుతూ చీటీ తీసాడు అనే్వష్..
‘‘ఒరే అమర్ నువ్వేరా నేటి హీరో.. ఓకేనా...?’’
‘‘డబుల్ ఓకే.. ఇంక అడగడాలు లేవమ్మా.. వెళ్లాల్సిందే..’’ ఫైనల్ చేసేశాడు అజిత్.
‘‘మనం కాబోయే పోలీస్ ఆఫీసర్లం. మన ధైర్య సాహసాలు ఏపాటివో మనకు తెలియాలి. ఒరే అమర్ నువ్వూ, అనే్వష్‌గాడూ ఈ రాత్రి.. కాదు కాదు రేపు రాత్రి సరిగ్గా పనె్నండు గంటలకి ఇక్కడ బయలుదేరి.. చౌరస్తా దాకా కలిసి వెళ్లండి.. అక్కడనుంచి విడివిడిగా బయలుదేరాలి.. చేతిలో టార్చ్ కూడా ఉండకూడదు. అలా రాగలిగినవాడికి నూటికి నూరుపాళ్ళూ ధైర్యం ఉన్నట్టే, ఓకే’’
‘‘ఒరే అజిత్.. నేను రెడీ.. ఏరా అమర్ ఓకేనా.. నీకసలే బోలెడు భయం.. ఆ భయం పోతేనే నువ్వు ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ అయ్యేది..’’ వెక్కిరింతగా అన్నాడు అనే్వష్.

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్