డైలీ సీరియల్

యమహాపురి 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డుకి అవతలివైపునుంచి ఓ పెద్ద కుక్క ఇటుగా వాళ్లవైపు వచ్చింది.
యువకుడు కంగారు పడ్డాడు కానీ, పెద్దాయనలో ఏ మాత్రం చలనం లేదు.
కుక్క వాళ్ల ముందుకొచ్చింది. ఒకసారి ఆ యువకుణ్ణి ఎగాదిగా చూసింది. తర్వాత వాళ్లెటు వెడుతున్నారో- అటే తనూ ముందుకు వెళ్లింది. చూసేవాళ్లకి వాళ్ళిద్దరూ ఆ కుక్కని అనుసరిస్తున్నారా అనిపిస్తుంది.
‘‘కుక్కని చూసి భయపడ్డావా?’’ అన్నాడు పెద్దయన కొంచెం హేళనగా.
‘‘అది కుక్కా? సింహంలా వుంది, భయమేయదా?’’ అన్నాడు యువకుడు.
‘‘వీధి కుక్కలకి భయపడేవాళ్లు, ఇండియాలో కాలినడకన తిరక్కూడదు’’ నవ్వాడు పెద్దాయన.
అది వీధి కుక్కని తెలియగానే యువకుడాశ్చర్యపడ్డాడు. ‘‘అది నిజమే! మా వీధి కుక్కలకైతే నేనూ భయపడను’’ అన్నాడు బింకంగా.
‘‘నీ వ్యవహారం తమాషాగా ఉందే! సింహంలా ఉందని నువ్వే అన్నావు. నేననగానే- అది వీధి కుక్కని నమ్మేశావు..’’ అన్నాడు పెద్దాయన.
‘‘నీ వ్యవహారమే తమాషాగా ఉంది. లేకపోతే అపరిచితుడితో ఈ వేళాకోళాలేమిటి?’’ అని మనసులో అనుకుని, ‘‘నాకది వీధి కుక్కలా అనిపించలేదు. కానీ జాతి కుక్కయితే అలా ఒంటరిగా వదిలెయ్యరు కదా! దగ్గిర్లోనే దాని యజమాని ఉండాలి. మిమ్మల్ని చూస్తే అలాంటి జాతికుక్కల్ని మెయింటైన్ చేసే టైపులా అనిపించలేదు. దాని యజమాని పక్కన లేడనే నాకు భయమేసింది’’ అంటూ ఆయనమీద ఓ విసురు వేశాడు.
‘‘దాని యజమాని పక్కన లేకపోతేనేం- నేనున్నానుగా! అనవసరంగా భయపడ్డావు. అది మా కాలనీవాళ్లనే కాదు కాలనీవాళ్లు పక్కనుంటే బయటివాళ్లనూ ఏమీ చెయ్యదు. ఎటొచ్చీ కొత్తవాళ్లొచ్చినపుడు ఓసారి నఖ శిఖ పర్యంతం చూస్తుందనుకో’’ నవ్వాడు పెద్దాయన.
‘‘ఆ విషయం మీకు ముందే తెలుసు. నాకు ఇప్పుడు తెలిసింది. కానీ దానికి తెలుసో తెలియదో, తెలిసినా, అన్ని వేళలా గుర్తుంటుందో ఉండదో! అందుకే వీధి కుక్కల్ని ఎప్పటికప్పుడు మునిసిపాలిటీ వాళ్లకి పట్టించెయ్యాలి. ఇలా స్వేచ్ఛగా వదిలిస్తే- అపరిచితులకి ప్రమాదం’’ అన్నాడు యువకుడు.
ప్రమాదాన్ని అతడింకా ఫీలౌతున్నాడనడానికి సూచనగా- ఇంకా అతడి గొంతులో కొంత వణుకుంది.
‘‘ఏమో అనుకున్నా- జోక్సెయ్యడంలో నాకు నువ్వు సరిజోడులా ఉన్నావే! మనిద్దరం జోక్సుకి ఓ సెషన్ పెట్టుకోవాలి’’ అన్నాడు పెద్దాయన.
‘‘ముందు నాకు భయంకర్‌గారి ఇల్లు చూపించండి సార్! తర్వాత తప్పకుండా జోక్స్ సెషన్ పెట్టుకుందాం’’ అన్నాడు యువకుడు విసుగ్గా.
‘‘సింహంలా ఉందని కుక్కకే భయపడ్డావు. సింహంలాంటి మనిషి- ఆ ఇన్స్‌పెక్టర్‌కి భయపడవా? ఎందుకు లేవయ్యా- నువ్వాయన్ని కలుసుకోకపోవడమే మంచిది’’ అన్నాడు పెద్దాయన.
‘‘కుక్కకీ మనిషికీ పోలికేమిటి సార్! సింహంలా ఉన్నా మనిషి మనిషి! భయముండదు’’
‘‘పోలిక గురించి అన్నావు కాబట్టి చెబుతున్నా! ఈ కాలనీకి ఆ ఇన్స్‌పెక్టరొచ్చి నాలుగు నెల్లయింది. ఈ కుక్క కూడా కాలనీకి అప్పుడే వచ్చింది. ఆ కుక్కని ఆయనే తీసుకొచ్చాడని కాలనీలో చాలామందికి అనుమానం. కానీ ఆయన ఒప్పుకోడు’’.
యువకుడి ముఖంలో కుతూహలం. ‘‘మీ అనుమానానికి కారణం?’’
‘‘చాలా సింపుల్. ఇదేమో వీధి కుక్కలా లేదు. జాతిక్కులా ఉంది. ఆయనొచ్చినరోజే కాలనీకొచ్చింది. తిరగడం వీధిలోనే అయినా ఏదో వేళకి ఆయనింటికెళ్లి ఆరగింపులు చేస్తుంది. సంరక్షణ చేయించుకుంటుంది. అదేమంటే- జీవకారుణ్యం అంటాడాయన. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా అంటే- అది నా పెంపుడు కుక్క కాదు కదా అంటాడు’’ అన్నాడు పెద్దాయన.
‘‘ఆయన చెప్పేది నిజమేనేమో- పెంపుడు కుక్కయితే చెప్పుకోవడానికి ఏమభ్యంతరం?’’
‘‘ఆయన ఇలాంటలాంటి పోలీసు కాదంటారు. ఏం చేసినా ఏదో ఆలోచన ఉంటుందంటారు. ఈ కుక్క విషయంలోనూ అలాంటిదేదో ఉండే ఉండాలి. నువ్వే చూశావుగా, ఇది ట్రయిన్డ్ డాగ్ అని చూడగానే తెలిసిపోవడం లేదూ?’’ అన్నాడు పెద్దాయన.
‘‘ట్రయిన్డ్ డాగ్ ఐతే- ఇంట్లో ఉంచుకోకపోవడానికి కారణమేమంటారు?’’ అన్నాడు యువకుడు.
‘‘ఈయనేమో పెద్ద పుడింగుగా మా కాలనీకొచ్చాడు. ఈయనుండగా ఇక్కడ నేరాలు జరుగవని అంతా నమ్ముతున్నారు. కానీ పోలీసు స్టేషన్లోనే దొంగతనాలు జరుగుతున్న రోజులివి. వెయ్యిళ్ల కాంపస్ ఇది. ఇంత పెద్ద కాలనీలో నేరాలాపడం ఆయనవల్లనౌతుందా? అందుకని ఓ ట్రయిన్డ్ డాగ్ కాలనీలో వదిలిపెట్టాడని నా అనుమానం. ఇది మా కాలనీకి కాపలా అన్నమాట! కాలనీ బాధ్యత దానికొదిలి- ఆయన నిశ్చితంగా తన డ్యూటీ చేసుకోవచ్చు. ఏమంటావ్?’’ అన్నాడు పెద్దాయన.
‘‘గ్రేట్ సార్! తన ఉద్యోగ ధర్మంతోపాటు తనుండే కాలనీ గురించి కూడా పట్టించుకునే ఆయన నిజంగానే ఒక ఆదర్శ వ్యక్తి. అందుకే సార్, నేను భయంకర్‌గారి అభిమానిని’’ అన్నాడు యువకుడు.
‘‘అబ్బా! ఎన్నిసార్లు చెప్పాలయ్యా! నీకాయనమీద అభిమానముంటే- అది మనసులోనే ఉంచుకో. వెళ్లి కలుసుకుని మాట్లాడావో- అభిమానం మాటటుంచి, ఏకంగా నువ్వే ఉండకపోవచ్చు. అసలే ఆయన నేరస్థులకి సింహస్వప్నం!’’ అన్నాడు పెద్దాయన.

ఇంకా ఉంది

వసుంధర